Idle Curiosity

ఐడిల్ క్యూరియాసిటీ

- డి.వి.నరసరాజు

ఒక మిత్రుని అనుభవం !

మా మిత్రుడొకాయన విమాన ప్రయాణం నిమిత్తం విమానాశ్రయానికి వెళ్లాడు. సరిగ్గా రిపోర్టింగ్ టైంకే వెళ్లాడు. బోర్డింగ్ కార్డు తీసుకున్నాడు.

విమానం బయలుదేరడానికి యింకా గంట టైం వుంది.ఏం చేయాలి ?చుట్టూ చూశాడు.తెలిసిన వాళ్ళెవరూ కనబడలేదు. అటు యిటూ పచార్లు ప్రారంభించాడు.

దూరంగా ఒక వెయింగ్ మెషిన్ యంత్రం కనిపించింది. బరువు చూసుకుందామని వెళ్లాడు.పర్స్ లో నుంచి కాయిన్ తీశాడు.మెషిన్ లో వేశాడు.రైల్వే టికెట్ లాంటి కార్డు ఒకటి బయటికి వచ్చింది.చూసుకున్నాడు.తన బరువు సరిగానే ఉంది.

రెండో పక్క ఏవో సలహాలు సందేహాలు వుంటాయ్ గదా ఇంగ్లీషులో... “ యూ ఆర్ గల్లిబుల్ ! బి కేర్ పుల్ ఇన్ చూజింగ్ యువర్ ప్రెండ్స్ " అని వుంది. నిజమే ! తాను నమ్మి యిద్దరు ముగ్గురు స్నేహితులకి అప్పులిచ్చి నష్టపోయాడు!

మరొక ప్రయాణీకుడు వచ్చాడు. కాయిన్ వేశాడు. కార్డు వచ్చింది. చూసుకున్నాడు.

మా మిత్రుడు అడిగాడు " మీకు ఏమని వచ్చిందండి " అని. ఆయన కార్డు యిచ్చాడు.

మా మిత్రుడు చదివాడు. ' యూ ఆర్ వెరీ కైండ్ హార్టెడ్ !యూ కెన్ నాట్ సీ అదర్స్ సఫరింగ్ " అని వుంది.

“నిజమేనా ? ”

“ నిజమే ! ”

“ మీరు ఏం చేస్తుంటారు ? ”

“ ఒక అనాథాశ్రమం నడుపుతున్నాను "

“ ఇంకేం ? జ్యోతిష్యం చెప్పినట్టే వుంది ".

మా మిత్రుడికి ఒక అనుమానం వచ్చింది. ' మా యిద్దరికి వచ్చినవే మరికొందరికీ కూడా రిపీట్ అవుతాయా ? ' చూద్దామనుకున్నాడు.

దూరగా కూర్చున్న ఒక ప్రయాణీకుణ్ని అడిగాడు " మీరు వెయిట్ చూసుకోండి " అని.

“ నా దగ్గర కాయిన్స్ లేవు"

“ నేనిస్తాను " అని మా మిత్రుడు ఆయనకి ఒక కాయిన్ యిచ్చాడు.

ఆయనకు వచ్చిన కార్డు మీద వేరే సందేశం వుంది ! ఈ మెషిన్ లో కొన్ని వందల కార్డులుంటాయి గదా ! రిపీట్ కాకుండా యిన్ని వందల సందేశాలు ఎలా సాధ్యం ! మరొక ప్రయాణీకుడికి కాయిన్ యిచ్చి వేయించాడు.'సందేశం వేరుగా వుంది.

యిలా కుతూహలం కొద్దీ పది పదిహేనుమందికి తాను కాయిన్స్ యిచ్చి సందేశాలు పరీక్షించాడు. తన వద్ద కాయిన్స్ అయిపోయినై. క్యాంటీన్ కి వెళ్లాడు.వూరికే కాయిన్స్ యివ్వమంటే వాడు యివ్వడు !కప్ కాఫీ తాగాడు. చిల్లర కాయిన్స్ గా తీసుకున్నాడు. అవిగూడ యితరుల కిచ్చి వెయింగ్ మెషిన్ లో వేయించి 'సందేశాలు ' చూశాడు. ఆ కాయిన్స్ అయిపోతే బుక్ షాప్ కి వెళ్లి న్యూస్ పేపర్ కొన్నాడు. మళ్ళీ కాయిన్స్ తీసుకున్నాడు.

యిలా దాదాపుగా 40 – 50 మంది చేత కాయిన్ యిచ్చి మెషిన్ లో వేయించాడు. ఏ యిద్దరికీ ఒకే సందేశం రిపీట్ కాలేదు ! ఆశ్చర్యం ! తాను దిగబోయే విమానాశ్రమంలో కూడా యిటువంటి వెయింగ్ మెషిన్ వుంటుంది కదా ! అక్కడ కూడా ఒక పాతిక, ముప్పయి మందిచేత వేయించి టెస్ట్ చేయాలనుకున్నాడు.

వెంటనే ప్లాష్ లాగా మరో ఐడియా !

నేనే మళ్ళీ కాయిన్ వేసి తీస్తే ఈ ' సందేశం 'వస్తుందా ! లేక దీనికి పూర్తిభిన్నంగా.

“ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ ! నో బడి కెన్ చీట్ యూ " లాంటిది వస్తుందా ! 'చూద్దాం !' అని మరో కాయిన్ వేశాడు. కార్డు వచ్చింది ! చదివాడు !

“ ది ప్లెయింగ్ బై విచ్ యూ వాంటెడ్ టు ట్రావెల్, హాజ్ ఆల్ రెడీ లిస్ట్ ! ”

“ ఆఁ ! ” ఆ లేదు ! ఊ లేదు ? అదిపోయి అరగంటవుతోందని చెప్పారు.