Pellillu Swargamlonaa

పెళ్ళిళ్ళు స్వర్గంలోనా !

- కన్నోజు లక్ష్మీకాంతం

" మమ్మీ! డాడీతో పాటూ నేనూ స్విమ్మింగ్ కెల్తా మమ్మీ...” గారాబంగా అడుగుతున్నాడు లడ్డు.

“ వద్దు బాబూ ! నీకు స్విమ్మింగ్ రాదుకదా ! చాలా డేంజరంటా ! ” అని భయం గలిగేలా చెప్పింది వాళ్ళా మమ్మీ.

“ మరి నాన్నకు కూడా రాదుగా...” అమాయకంగా అడిగాడు లడ్డూ.

“ డాడీకి ఇన్సూరెన్సుందిగా , ఈత రాకున్నా ఫరవా లేదు బాబూ....”

అదేదో తెలియకున్నా "అవునా "! అంటునే అక్కడి నుండి వెళ్ళిపోయాడు లడ్డూ.

“ ఏమిటోయ్, ఇన్సూ రెన్సుంది కాబట్టి ఈత రాకున్నా ఫరవాలేదంటావు...” బ్రహ్మానందం టైపులో మొహం పెట్టి అడిగాడు లద్దూగాడి డాడి అనబడే శాల్తి.

ఇలా సంభోదించడం సమంజసంగా వుండదు కాబట్టి 'లడ్డూ ' గాడి పేరు రాకేష్ అనీ, వాళ్ళమ్మ పేరు లావణ్య, ఉరఫ్ 'లావూ' అని, డాడీ పేరు వ్యాఘ్రేశ్వరరావు ఉరఫ్ 'పులి 'గా పిలుచుకుందాం కాసేపు.

హాస్పటల్లో రిసెప్షనిస్ట్ గా పరిచయమై ప్రెండ్ గా మారి, ప్రియురాలై ఆ తర్వాత పెళ్ళాంగా ఇల్లు చేరిన లావణ్యను ఆవిడకు ఇష్టం లేకున్నా ముద్దుగా 'లావూ 'అని పిలుచుకుంటాడు పులి.

వ్యాఘ్రేశ్వరరావు పులిలా వుంటే బావుణ్ణు గానీ ఎలుగ్గొడ్డులా వుంటాడు కాబట్టి ససేమిరా పెళ్లి కొప్పుకోలేదు లావణ్య తరపువాళ్ళు. కానీ టి వి సీరియల్లా సాగిన వాళ్ళ పరిచయ ప్రేమలో 'లావే ' గెలిచింది. అందుకే అన్ని విషయాలల్లోను 'లావు' డే పై చేయిగా వుంటుంది.

మొదట్లో మనసోప్పకోకపోయినా తర్వాత్తర్వాత రాజీ కొచ్చాడతడు. మిత్రులు బనాయిస్తూ బయట పోజులు కొడుతుంటారు గానీ ఇంటి దగ్గర చాలా మంది 'దేవదాసు' లే అని తెలిసి అప్పుడప్పుడు మాత్రం వేడి వేడి జిలేబి తిన్నంత తృప్తి పడుతుంటాడు మన పులి అనబడే వ్యాఘ్రేశ్వరరావు గారు.

" మమ్మీ, ఫేస్ కు ఫౌడరెందుకేసుకుంటారు మమ్మీ...” అని టి వీ లో వస్తున్నా ప్రకటనను చూస్తూ అమాయకంగా అడిగాడు లడ్డూ.

ఏదేమైనా ప్రకటనల ప్రభావం పెద్ద వాళ్ళ కన్నా పిల్ల మీద ఎక్కువ పడుతుంది కాబట్టి కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్ చేస్తుంటారు. ఏమిటో గానీ ఎంత గింజుకున్నా అర్థం గానివి కొన్నైతే, అట్టే బుర్రలో కూచుండే ప్రకటనలు మరికొన్ని.

" అందంగా కనబడ్డానికీ బాబూ ! ” అంది వాడిని దగ్గరగా తీసుకుంటూనే.

“ మరి, డాడీని వాడుకోమని చెప్పొచ్చు గద మమ్మీ " అంటూనే అర్జంటు పనున్నట్లు అక్కడ్నుంచి తుర్రుమన్నాడు వాడు.

తల తీసి ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు పులికి.

' తను అందంగా లేడా...!'అని చాలా సార్లు అనుమానమొచ్చి అద్దంలో చూసుకున్నాడు గానీ ధైర్యం చేసి లావణ్య నడగాలని పించలేదు.

పెళ్ళికి ముందు చాలాసార్లు, చాలా రకాలుగా మాట్లాడుకున్నారు గాని మీ ' అందం ' ప్రసక్తే రాలేదు. అయినా అందమైన లావణ్య అందం లేకున్నా నన్నెలా ప్రేమించి పెళ్లి చేసుకుందనే విషయం చాలాసార్లు ఆలోచించి బుర్రంతా గోక్కుని, జుట్టంతా పీక్కున్నందుకు ఫలితం బట్టతలే తప్ప సరైన ఆన్సర్ రాలేదు.

మంచి ఉద్యోగంతో పాటు చేతి నిండా సంపాదనుంది తనకు.అధిక సంతానమేం ఖర్మ అసలు సంతానమే లేక దత్తతగా వచ్చిన తనకు మస్తు ప్రాపర్టీ గూడా వుంది. అందానిగ్గాకుండా లావణ్య ఆస్తికి మార్కులేసి పాసైందేమో ననుకున్నాడు.

“ఊహూ...” పెళ్లిగాక ముందు ప్రేమించినప్పుడూ పెళ్ళైనాక ప్రేమిస్తున్నప్పుడు గూడా 'లావణ్య 'అలాంటిది కాదూ...' అని ఖచ్చితంగా తెలిసిందనడానిక్కారణం ఏ రోజూ తన ప్రాపర్టీ గురించి గానీ, ఉద్యోగం గురించి గాని టాపిక్ తీసుకురాలేదు. “

' మరి ' ఇప్పుడెందుకీ మనసు పీకులాట అని ఊరట చెంది " మ్యారేజేస్స్ ఆర్ మేడిన్ హెవెన్ " లో తనకు తానే గర్వపడుతున్నాడు.

“ ఏమండీ! మన మ్యారేజీ డే వస్తోంది గదా. అలా షాపింగ్ చేసి బట్టలు తెచ్చుకుందామండి...." అని పొద్దున్నే చెప్పి ఆఫీస్ నుండి రాగానే కుటుంబమంతా (ముగ్గురే) కలిసి బయల్దేరింది.

“ మన మ్యారేజి డే కి మనం కొత్త బట్టలు కొనుక్కోవాలి గాని మన లడ్డూ గాడికేందుకే! వాడి బర్త్ డే కి వాడిక్కొందాం. అయినా...పెళ్ళయ్యాక నాలుగేళ్ళు కష్టపడీ గుళ్ళూ గోపురాలు తిరిగీ, చెట్టూ పుట్టకు మొక్కి, సముద్ర స్నానాలవీ చేసి, బాబాలూ, స్వాములనూ కలిసీ, ఆ తర్వాత డాక్టర్లూ, హాస్పటల్లూ, ఫెర్టిలిటీ సౌకర్యాలన్నీ పొందింతర్వాతే కదా వాడు పుట్టింది....అదీ... నా కలర్ తో....”

“ అబ్బబ్బా... ఉర్కోండి. ఎవరైనా వింటే నవ్వుతారు.” చీమ కుట్టినట్టు చిటుక్కున చేతిని గిల్లిందావిడ.

అలా గిల్లిందంటే కరెంటు పాసవుతుంది పులిగారికి.

అయినా... లావణ్య మాట ఎప్పుడూ కాదనడు.

ఏదైనా ఆలోచించి మాట్లాడుతుందని తెలుసు. లడ్డూగాడితో సహా అందరూ మాంచి ఖరీదైనా బట్టలుకొని ఆ తర్వాత హోటల్ కెళ్ళి భోజనం చేసి ఇంటికి బయల్దేరారు.

“ ఈ హోటల్లో వన్నీ ఇంట్లో వున్నట్టుంటాయి గదండీ! ”

“ నీ మొహం. ఇంట్లో వున్నట్టుంటే అన్ని డబ్బులు తగలేసి ఇక్కడెందుకు తినడమంటా ! ”

“ అంటే.... ఇంట్లో బావుండయనా...!''

“ అని నేనన్నానా...! ”

“ సర్లే, మీకో జోక్ తెలుసా...? ”

“ ఏంటో చెప్పూ "?

“ ఏమిటోయ్...బిచ్చగాడికలా కోరి కోరి వడ్డిస్తున్నావు. ఎంటి సంగతి...? ”అన్నాడట భర్త.

“ ఆ... ఏం లేదండీ... నేను వండిందేది పెట్టినా మీలా వంక పెట్టకుండా తింటాడని...” అందిట భార్య.

“ అంటే... ఏమిటోయ్ నీ వుద్దేశ్యం... పత్రికలు చదివి నా మీదే ప్రయోగిస్తున్నావంటే వచ్చే నేల నుండి పత్రికలన్నీ మానేస్తాను మరి".

“ మానేయండి సార్! టి వి పెట్టుకుని ఏ ఛానల్ చూసినా బ్రహ్మాండమైన జోకులోస్తాయి అంతకన్నా ఇంకేం కావాలి ? ”

“ అన్నీ బూతు జోకులు....”

“ మమ్మీ... ఐస్ క్రీం తినొద్దా....” బోర్డు వైపు చూపిస్తూ అడిగాడు లడ్డూ.

“ వెధవది, పితృస్వామ్య దేశమని గొప్పపేరే, అయినా పత్రి బుడుతా 'మమ్మీ ' అనే పిలుస్తాడు, తప్పా 'డాడీ ' అనరు. అని గొణుగుతున్నా బయటికొచ్చింది మాట. దార్లో వున్నామన్న ధ్యాస గూడా లేకుండా ఓ నిమిషం పాటు గలగలా నవ్వింది లావణ్య

. “ ఏయ్ లావూ... ఏంటా నవ్వూ" అలా నవ్వితే మత్తింజక్షన్ తీసుకున్నట్టుగా వుంటుంది పులికి.

“ లావూ... లావని సన్నగున్న దాన్ని లావు జేస్తున్నారు గదండీ...లావేంటి లావు...”

“ అవునా... నాకు తెలియదే...!” “ మీకు తెలియనవి చాలా చెపుతుంటాను లెండి. ఇందాక డాడీ అనడని గొణిగారు గద! కనిపించేవాళ్ళు మమ్మీలుగాబట్టి 'మమ్మీ'లనే పిలుస్తారండీ....”

“అవునవును...కనిపించే వాళ్ళు మీరైతే డబ్బు విషయంలో కనిపించే వాళ్ళం మేము ".

“ కొట్లాటేందుకుగ్గానీ వాడికి ఐస్ క్రీమంట తీసుకుందాం పదండి ...”

“ నమస్తే మేడం " అంటూనే తన్ను భరించువాడిని(భర్త) పరిచయం చేస్తూ " మీవారా...” అంటూనే నమస్కారమండీ ' అంది. అప్పుడే ఐస్ క్రీం కొనుక్కొని ఆ మంద లోంచి బయటికొస్తున్న వాల్లాయనతో వున్నా వాల్లావిడ.

“ మీవారా...! ఏంటి వెధవక్వశ్చన్. ఇంకేవరుంటారని....!” సన్నగా గొణుక్కుంటూనే పరిచయాలు జరిగింతర్వాత 'ఒకసారికింటికి రావే....' లాంటి మాటలు కాగానే ఎవరితోవ వారిదైంది.

“ నా ఊసేత్తగ్గానీ మీ ప్రెండేమిటోయ్... అంత గ్యారంటీ కలర్ తో కలర్ పొతే డబ్బు వాపసన్నట్లుగా వుంటే... పాపం... ఆయనేమో మాంచి హ్యాండ్సమ్ క్రీం వాడుతున్నట్టుగా వున్నాడు మరి.”

“ అంటే... ముందుకాళ్ళ బంధమన్నమాట. మీ ఊసెత్తకూడదు గానీ వాళ్ళ సంగతి చెప్పారు అబ్బబ్బ...ఏం మాట్లాడుతారండీ...పోనీ వాళ్ళ పెళ్లి గూడా స్వర్గంలోనే జరిగిందనుకోవచ్చు గదా ! ”

“ చెప్పాలనిపిస్తేనే చెప్పండి సార్...”

“ మీరేమో కట్నం లేకుండా చేసుకున్నారూ. అతడేమో పుల్లుగా కట్నం తీసుకునీ, ఆపై ఆమెకుద్యోగముందని చేసుకున్నాడు " ఐస్ క్రీం చప్పరిస్తూనే అదోలా కళ్ళలోంచి చూస్తూ అంది

లావు. 'సునామీ ' వచ్చినట్లనిపించినా స్పోర్టివ్ గా తీసుకున్నాడు పులి.

“ అదంతే లెండి. ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానమని వూరికే అన్నారా ! ”

“ అవునోయ్, ఎవరికంపు వారికింపుగానే వుంటుందట మరి "

. “ఛీఛీ...” అంటూనే తనివితీరా నవ్వుతున్న వాళ్ళ దగ్గరికి రెండో ఐస్ క్రీం గురించొచ్చిన లడ్డూ గాడికి డబ్బులిచ్చి పంపేసి మళ్ళీ క్లోజప్ యాడ్ లా నవ్వడంతో మునిగిపోయారిద్దరూను.