Swargam Narakam

స్వర్గం - నరకం

అనిరుద్దేశ్వరరావు ఓ పైన్ ఈవినింగ్ టపా కట్టేశాడు.

పైకి వెళ్ళగానే అతన్ని సాక్షాత్తూ యముడే రిసీవ్ చేసుకున్నాడు - పూల దండ వేసి.

తనకి ప్రత్యేకంగా ఎందుకింత గౌరవం ఇస్తున్నారని అనిరుద్దేశ్వరరావు అడిగితే యముడు జవాబు చెప్పాడు.

“ స్వర్గానికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు వచ్చి చాలా కాలం అయింది... అందుకని ".

“ సరే. పదండి స్వర్గానికి పోదాం " చెప్పాడు అనిరుద్దేశ్వరరావు హుషారుగా.

“ నిన్ను తీసుకెళ్ళాలనే నాకూ వుంది. కానీ హైకమాండ్ ఆర్డర్స్ మరోలా వున్నాయి. నిన్ను ఓ రోజు నరకంలో, మరో రోజు స్వర్గంలో వుంచి, తర్వాత నువ్వు ఎక్కడ వుండాలని కోరుకుంటే , అక్కడ వుండనివ్వమని బ్రహ్మగారి ఆజ్ఞ. అందుకే ఈ డ్యూటీ స్పెషల్ గా నాకు పడింది. ” అని చెప్పాడు యముడు.

“ ఎవరైనా స్వర్గంలో వుండాలనే కోరుకుంటారు కదండి. నాకు అదే ఇష్టం " చెప్పాడు అనిరుద్దేశ్వరరావు.

“ సారీ! పై వారి మాటని జవదాటకూడదు. ముందు స్వర్గం చూసి రండి.” అని యముడు అనిరుద్దేశ్వరరావు లిప్ట్ లోకి ఎక్కించి బటన్ నొక్కగానే అది ఒక చోట ఆగింది.లిప్ట్ తలుపులు తెరుచుకోగానే బయటకు నడిచాడతను.

ఎదురుగా విశాలమైన పార్కు. అందులో ఓ సర్కస్ టెంట్, రెండు సినిమా హాళ్ళు ( ఇక దాంట్లో కలర్, మరో దాంట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు). బాబాయ్ హోటల్ నుంచి పైవ్ స్టార్ హోటళ్ళు దాకా అన్ని రకాల హోటళ్ళు ఫాస్ట్ పుడ్ సెంటర్లు కనిపించాయి. విశేషం ఏమిటంటే, దేంట్లోనూ టికెట్లు కొనడం గానీ, బిల్లు చెల్లించడం కానీ లేదు. అంతా ఉచితం.

మరణించిన తన బంధు మిత్రులు, అనేకమంది బిల్డర్స్ కనిపించారు. అంతా దగ్గరికి వచ్చి ఆనందంగా కరచాలనం చేసి అతను ' ఎప్పుడూ చచ్చావ్, ఎలా చచ్చావ్ ' లాంటి ప్రశ్నలు వేసారు.

“ నరకంలో అన్నీ కష్టాలు కన్నీళ్లు అంటారు. అదేమిటి ఉషారుగా వున్నారు. ” వాళ్ళ మొహల్లోని చిరునవ్వుని చూసి ప్రశ్నించాడు అనిరుద్దేశ్వరరావు.

“ అదంతా అబద్ధం. ఇక్కడ కష్టాలుండవు " చెప్పారు వాళ్ళు.

చిన్నప్పుడు ప్రేమించి తన దగ్గర అప్పుడంత డబ్బులేదని తెలిసి మరో డబ్బున్న వాణ్ణి చేసుకున్న సువర్చల కనిపించింది. అద్భుతమైన అందంగా వుందామె. వాళ్ళిద్దరి మధ్య కొంత సంభాషణ నడిచాక సువర్చలకి తన మీద ఇంకా ప్రేమ వుందని గ్రహించాడు.

మర్నాడు ఉదయం అనిరుద్దేశ్వరరావుని యమ భటులు లిప్ట్ లో స్వర్గానికి తీసుకెళ్ళారు. అక్కడతను రంభ, ఊర్వశి, మేనకల నృత్యాలు చూస్తూ, సురాపానం చేస్తూ ఆనందంగా గడిపాడు. మర్నాడు యముడు అడిగాడు.

“ ఓ రోజు నరకంలో, ఓ రోజు స్వర్గంలో గడిపావు. ఇప్పుడు చెప్పు. నీకు ఎక్కడ వుండాలని వుంది? ” “ స్వర్గం బానే వుంది. కాని నరకమే బెటర్ " చెప్పాడు.

యముడు మళ్ళీ లిప్ట్ లోకి పంపి బటన్ నొక్కగానే నరకానికి చేరుకున్నాడు అనిరుద్దేశ్వరరావు. లిప్ట్ తలుపు తెరుచుకోగానే చూస్తే బండరాళ్ళు, ఆకులు వేసి ఎండిపోయిన చెట్లు గల బురద నేల! అక్కడి మనుషులు చినిగిన బట్టల్లో ఒంటినిండా చెమటతో సుత్తులతో కొండ రాళ్ళని పగలకొడుతూ కనిపించాడు. మాసిపోయిన, కంపుకొట్టే బట్టల్లో వున్నా సువర్చల వచ్చి అతన్ని రివీస్ చేసుకుంది.

“ ఇదేమిటి ? నిన్న ఇక్కడో పార్కు, అందమైన హోటళ్ళు , అప్సరసలా నువ్వు ! ఇవాళ బురదనేల, అసహ్యంగా కనిపించే నువ్వు. ఏమిటీ మాయ ? ” బిత్తరబోతూ ప్రశ్నించాడు అనిరుద్దేశ్వరరావు. సువర్చల సన్నగా నవ్వి సమాధానం చెప్పింది.

“ నువ్వు ప్లాట్స్ అమ్మ బోయే ముందు అక్కడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు వస్తుందని, ఇలా ఎన్నో అబద్దాలాడి, వాటిని అంటగాడతావుగా. నిన్నటిదంతా నీకు ఈ నరకం అంటగట్టడానికే నీవు చేసే.... ” ఓ యమభటుడు కొరడా ఝుళిపిస్తూ అనిరుద్దేశ్వరరావు చేతికొక పెద్ద సుత్తి నిచ్చి చెప్పాడు.

“ మాటలు తర్వాత, ముందు పన్లోకి దిగు" అని.

- మల్లాది వెంకట కృష్ణమూర్తి .