Undile munche kaalam Mundu mundunaa

ఉందిలే ముంచే కాలం ముందు ముందునా …...

రచన - సూరేపల్లి విజయ

2010వ సంవత్సరం

ట్రింగ్... ట్రింగ్ మాంఛి నిద్రలోవున్నా గోపాలకృష్ణకు ఒళ్ళు మండింది.

మళ్ళీ " ట్రింగ్... ట్రింగ్ "

“ హేవండీ.. బయటెవడో గన్నాయ్ గాడు కాలింగ్ బెల్ నొక్కి నా నిద్ర చెడగొడుతున్నాడండీ... కాస్త చూడరా!? ” గోముగా అడిగింది నీరజ.

“ ఖర్మ.... ఆడవాళ్ళయితే ఇదో అడ్వాంటేజి... అర్ధరాత్రి తలుపు తీసే డ్యూటీ నుంచి తప్పించుకోవచ్చు....! హుఁ దేనికైనా పెట్టి పుట్టాలి " అనుకుంటూ లేచి వెళ్లి తలుపు తీశాడు గోపాలకృష్ణ.

ఎదురుగా ప్రసాదబాబు. తన భార్యకు స్వయాన అన్నయ్య, ఆ వెనకే అతగాడి భార్య.

“ నువ్వా బావ ? ” అన్నాడు గోపాలకృష్ణ ఏ ఎక్స్ ప్రెషనూ మొహం మీద కనిపించకుండా జాగ్రత్త పడుతూ.

“ అదేంటి బావా ముఖంలో ఆ ఫీలింగేంటి!? నేను కాకుండా బందిపోటు దొంగలెవరైనా వస్తారని ఎక్స్ పెక్ట్ చేసావా ? లేకుంటే నేనే బందిపోటు దొంగలా కనిపించానా ??? ”

“ ఛ... ఛ... అవేం మాటలు బావా... రారా " అన్నాడు గుమ్మానికి అడ్డంగా నిలబడే.

“ నువ్వు గుమ్మానికి అడ్డంగా నిలబడి పిలుస్తున్నావు బావా ? ” ప్రసాదబాబు గుర్తు చేయడంతో పక్కకు తప్పుకుని వాళ్లకు దారి యిచ్చి వాళ్లకు ఓ గది చూపించి మళ్ళీ తన పడగ్గదిలోకి వెళ్లాడు గోపాలకృష్ణ.

** ** **

భర్త అడుగుల శబ్దం విని కళ్ళు తెరవకుండానే " ఏ గన్నాయ్ గాడు డియర్ ? ” అని అడిగింది నీరజ.

“ గన్నాయ్ కి స్త్రీ లింగం ఏంటి ? ” భార్యని అడిగాడు గోపాలకృష్ణ.

“ ఇప్పుడా ప్రశ్న అంత అవసరమా డియర్... గన్నాయిని అనుకుంటా " అప్పుడెప్పుడో తన తరపు వాళ్ళు వస్తే తన భార్య చేసిన సత్కారం గుర్తొచ్చి

" వచ్చింది అన్నయ్య గన్నాయ్ గాడు, మీ వదిన గన్నాయిని " అన్నాడు గోపాలకృష్ణ అక్కసుగా. వెంటనే దుప్పటి గిరాటేసి, మొహాన్ని ఫ్లోరోసెంటు బల్బులా చేసుకుని " నిజమా " అంది నీరజ గెస్ట్ రూంలోకి పరుగెడుతూ.

** ** **

కుశల ప్రశ్నలయ్యాక “ ఏంటీ బావా... ఏంటీ విశేషాలు ? ” అడిగాడు గోపాలకృష్ణ

. “ అంటే ఎందుకొచ్చారనేగా!? ” బుంగమూతి పెట్టి అడిగి - తనే చెప్పాడు ప్రసాదబాబు

" టాంక్ బండ్... చార్మినార్... బిర్లామందిర్ చూద్దామని ." “ హుఁ.... సిటీకొచ్చి యిన్నేళ్ళయినా నేనే చూడ్లేదు. ” మనస్సులో అనుకొని పైకి మాత్రం " అలాగే బావా రేపుదయాన్నే చూద్దాం " అన్నాడు గోపాలకృష్ణ.

దుబాయ్ నుంచి పదేళ్ళ తర్వాత హైదరాబాద్ కు వచ్చారా దంపతులు.

** ** **

“ ఓరే అన్నయ్యా... త్వరగా ఒళ్ళు తుడుచుకో, బయల్దేరాలి. ”

“ ఒళ్ళు తుడుచుకోవడమేంటి ? ” అయోమయంగా అడిగి

" కొంపదీసి తెలుగుభాష మరిచిపోయావా? ” అన్నాడు.

“ నేను కరెక్టే అన్నాను. ముందు పళ్ళు తుడుచుకో టిఫెన్ చేద్దావుగానీ ఆ తర్వాత, ఒళ్ళు తుడుచుకో.... అలా ప్రేష్షప్పయి బయటకు వెళ్ళొచ్చు".

“ అదేంటి బ్రష్ చేసుకోకుండా పళ్ళు తుడుచుకోవడం ఏంటి అసయ్యంగా... త్వరగా నీళ్ళు సిద్ధం చెయ్... ”

“ బ్రష్ చేసుకోవడమా.... !? నీళ్ళు సిద్ధం చెయ్యాలా....!? ” అంటూ నవ్వడం ప్రారంభించింది నీరజ. చెల్లెలుకు పిచ్చిగానీ ఎక్కిందేమోనని డౌటొచ్చింది ప్రసాదబాబుకి.

అలా నవ్వి నవ్వి ఏడ్చేసిందామె. వెంటనే గోపాలకృష్ణ గదిలోనుంచి బయటకు వచ్చి కంగారుగా తన భార్య భుజాలు కుదిపి " రిలాక్స్... రిలాక్స్... నీరూ... కాదు, కాదు... నీరజా " అంటూ తన బావ వైపు కోపంగా చూసి

" ఎంత పన్జేసావ్ బావా " అన్నాడు.

“ నేనేం చేసాను బావా " అయోమయంగా అడిగాడు ప్రసాదబాబు.

“ ఏం చేసానని మెల్లగా అడుగుతున్నావా? పెళ్ళయిన దగ్గర్నుంచీ ముద్దుగా పిలుచుకునే ' నీరూ ' అనే పిలుపు మానేసి, నీరజా అని పుల్లు పేరుతో పిలుస్తున్నానే ! ఆ మాత్రం అర్థం చేసుకోలేవా

బావా ? ”

" ఎప్పుడో మరిచిపోయిన విషయాన్ని గుర్తు చేశావు " “ మరిచిపోయిన విషయమేమిటి... నేను గుర్తు చేయడమేంటి ? ”

“ నీళ్ళు... అని గుర్తు చేయలేదా!? ”

“ నీళ్ళంటే... తప్పేంటి? ”

“ పదేళ్లుగా నీళ్ళకు మేమెంత మొహం వాచి వున్నామో, దుబాయ్ లో వుండి యివ్వాళ్ళోచ్చిన నీకేం తెలుస్తుందిలే. ”

"అదేంటి... పదేళ్ళ క్రితం నేను యిక్కడికి వచ్చినప్పుడు బాగానే వుందిగా ".

“ అప్పుడు వేరు... వేరుతో సహా చెట్లను నరికేసారు. నీళ్ళని ధారాళంగా వృధా చేశారు. నీటి నిల్వలు తగ్గిపోయాయి. రెండ్రోజులకోసారి మంచి నీళ్ళు వదిలే అలవాటుని మెల్లమెల్లగా నాల్రోజులు చేశారు... తర్వాత వారం రోజులు... యిప్పుడు నెలరోజులకోసారి వదులుతున్నారు నీళ్ళు.”

“ నెలరోజులకోసారా !? ” ఆశ్చర్యంగా అడిగాడు ప్రసాదబాబు.

“ అవును బావా... కడుపు చించుకుంటే.... నీళ్ళ మీద... సారీ కాళ్ళ మీద పడుతుందని...”

“ హైదరాబాదుకి కృష్ణానది నుండి నీళ్ళు తేవాలా, గోదావరి నుండి తేవాలా అని వాదించుకునే వారు... ఇదివరకు. ఇప్పడా గొడవ లేమీ లేవులే. కృష్ణలోనూ నీళ్ళు లేవు. గోదావరిలోనూ లేవు. సముద్రాలలో కాస్త మిగిలి వుంటే, జనాలంతా అక్కడికి వలసపోయి నీళ్ళు చూసి తృప్తి పడుతున్నారు. డబ్బున్న వాళ్ళు వాటర్ ఫాల్స్ ఆయిల్ పెయింటింగ్స్ గోడల మీద వేయించుకుని రోజూ కాస్సేపు వాటికింద కూచున్నట్టు ఫీలవుతున్నారు ".

“ మరి మీరు స్నానం.... వగైరా... వగైరా... !? ” “ స్నానమా... అదెలా చేస్తారు !? ” విరక్తిగా అడిగాడు గోపాలకృష్ణ.

అప్పుడు గమనించాడు ప్రసాదబాబు.

గోపాలకృష్ణ తలంతా పాయలు పాయలుగా అట్టలు కట్టి వుండడాన్ని! వెంటనే కెవ్వున కేకవేయబోయి, ఆపుకొని చెల్లెల్ని చూసాడు. యించుమించు ఆమె పొజిషన్ కూడా అంతే!

“ ఇన్నిరోజులుగా స్నానం చేయకున్నాఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు బావా? ” అడిగాడు ప్రసాదబాబు యింకా షాక్ లో నుంచి తేరుకోకుండానే. “ ఇలా... ” అంటూ ఓ షెల్ప్ దగ్గరికి తీసుకెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూపించాడు గోపాలకృష్ణ.

లోపల రకరకాల పెర్ ప్యూమ్స్ వున్నాయి. “ రోజుకో స్ర్పే బాటిల్ కొట్టుకుంటాం " నీరజ కిలకిలా నవ్వుతూ " నేను నీళ్లోసుకుని మూడు నెలలవుతుందోచ్ " అంది. ఈసారి వామ్టింగ్ సెన్సేషన్ ప్రసాదబాబుకు వచ్చింది

. “ నెలకోసారి పంపులో నీళ్ళు వచ్చినప్పుడు తడిగుడ్డతో వళ్ళంతా తుడుచుకుంటాం

" నవ్వుతూ చెప్పాడు గోపాలకృష్ణ. “హ్హేవండీ... మనమిప్పుడు స్నానం చేయడమెలా ? ” భయంగా అడిగింది ప్రసాదబాబుని అతని భార్య.

“ అసలు పళ్ళు తోమికోవాడం ఎలా అని నేను ఆలోచిస్తుంటే నీ సొదేంటి ? మనం ఇండియా వస్తున్న హడావిడిలో ఏమీ గమనించలేదు. అసలు ప్రజల అవతారం ఎలా వుందో చూడాల్సిందే " అన్నాడు ప్రసాదబాబు,

అతనికి కొత్త విషయాలు కనుగొనడమంటే బోల్డు సరదా. పేస్ట్ తో పళ్ళ మీద రాసుకొని, ఆ తర్వాత ఓ గుడ్డతో పళ్ళని తుడుచుకొని, బ్రషింగ్ అయిపోయిందనిపించాడు.

పెరట్లో ఎలుకలు చచ్చిన కంపుకొడితే ఏంటా అని చూసేడు.

విడిచేసిన బట్టలు.... మళ్ళీ 'వాక్ ' అంటూ వామ్టింగ్ సెన్సేషన్ వచ్చేసింది.

“ అబ్బ ! ఇదేంటీ అయిదు నిమిషాలకోసారి నాకు... వాక్.... వామ్టింగ్ సెన్సేషన్ వస్తోంది " అంది ప్రసాదబాబు భార్య. ఈలోగా గోపాలకృష్ణ టిఫెన్ చేయమంటూ పిలిచాడు.

** ** **

డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేటులో ఉప్మాను చూసి... “ యిదేంటి యిలా వుంది ? ” అడిగాడు చెల్లెల్ని ప్రసాదబాబు ఉప్మా కన్నా ముందు, ఖంగుతింటూ

“ పాలతో ఉడికించాం... నీళ్ళు కరువుగా... హ్హిహ్హిహ్హి " అందామె. చట్నీ చూసి షాకయ్యాడు.

" పాల చట్నీ " అంది

మళ్ళీ ' హ్హిహ్హిహ్హి ' అని నవ్వి. “ భయపడకు. ప్యూర్ మిల్క్, కల్తీ చేయడానికి నీళ్ళు లేవుగా " అని హామీ కూడా ఇచ్చింది.

“ అన్నం కూడానా ? ” భయంగా అడిగాడు.

“ అన్నీను "

అతి కష్టమ్మీద ఉప్మాతిని... “దాహం " అన్నాడు.

వెంటనే గోపాలకృష్ణ లోపలికి పరుగెత్తి ఓ టాబ్లేటు తీస్కొచ్చి యిచ్చాడు

. “ యిదేంటి ? ” “ దాహం వేసినప్పుడు ఈ టాబ్లెట్ మింగితే, మంచి నీళ్ళు తాగిన ఎఫెక్ట్ యిస్తుంది.స్పెషల్ ఎఫెక్ట్ అన్నమాట.ఒక్కో టాబ్లెట్ రెండున్నర రూపాయలు. మాకు రేషన్ లో రూపాయి పావలాకు దొరుకుతుంది. ఆఫీస్ కు వాటర్ బాటిల్ కు బదులు ఈ టాబ్లెట్లు తీసుకెళ్తాం. "

“ అన్నయ్యా, లోభికి ఖర్చెక్కువ. దరిద్రుడికి ఆకలెక్కువాని మా ఆడపడుచు మొగుడు లేడూ ఆయనకు ఎక్కిళ్ళ రోగం. అవేం మాయ ఎక్కిళ్ళో నీళ్ళు తాగితేనే గానీ పోవు. పిసినారిలే. టాబ్లెట్లతో పోతుందేమోనని ఆశపడి ఐదారు మింగుతాడు. అబ్బే, అవీ మింగాలి. పైగా నీళ్ళు తాగాలి. గొల్లుమంటాడు. చూసి తీరాలి ఆయన ఏడుపు

" నీరజ పగలబడి నవ్వుతూ చెబుతోంది. కానీ ప్రసాదబాబు అవన్నీ వినేస్థితిలో లేడు. ఏం వినాలసివస్తుందోనని భయపడుతూనే చెల్లెల్ని అడిగేడు.

“ బట్టలెలా ఉతుక్కుంటారు ? ”

“ ఉతుక్కోవడమేంటి ? స్ర్పే చల్లి వేసుకుంటాం. మూడు నెలలకోసారి... ఉతుక్కుంటాం.”

మళ్ళీ " వాక్ " అనుకున్నాడు ప్రసాదబాబు.

ఆ రోజు హైదరాబాద్ అంతా చూపించాలని సెలవు పెట్టారు గోపాలకృష్ణ దంపతులు

** ** **

ఇదేంటి... యిక్కడ హుస్సేన్ సాగర్ వుండాలి... కనిపించదేం !? ” టాంక్ బండ్ దగ్గరికి వచ్చాక అడిగాడు ప్రసాదబాబు.

పది నిమిషాల సేపు పగలబడి నవ్వి " అటు చూడు... “ అంటూ చూపించాడు గోపాలకృష్ణ.

“ అర్రె... బుద్ధ విగ్రహం... హుస్సేన్ సాగర్ మధ్యలో కదా బుద్ధ విగ్రహం... యిదేంటి చుట్టూ కార్లు, బస్సులు, స్కూటర్లు వున్నాయి...!? మరింత ఆశ్చర్యంగా అన్నాడు ప్రసాదబాబు

. “ దుబాయ్ కి వెళ్ళొచ్చాక బావగారు చిలిపిగా తయారయ్యారు. హుస్సేన్ సాగర్ లో నీళ్ళు ఎప్పుడో యింకిపోయాయి. దాన్నిప్పుడు షాపింగ్ కాంప్లెక్సులుగా, స్కూటర్, కార్ల పార్కింగ్ ప్లేస్ గా మార్చారు.” సరిగ్గా అప్పుడే ముక్కుపుటాలు అదిరే దుర్గంధం మొదలైంది.

“ మరి ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగరు... ” “ ఆ సాగరాలలో గరంగరంలు తప్ప వేరేమీ లేవు.నెల్లాళ్ళకయినా నీళ్లివ్వాలని కాసిన్ని అట్టే పెట్టారు. దరిదాపులకు పోనీయరు.మైలు దూరం నుంచే సెక్యూరిటీ. చూడాలనుకుంటే గోల్కొండలో ఏర్పాటు చేసిన టెలిస్కోపు ద్వారా అక్కడి నీళ్ళు చూడవచ్చు.”

“ సరిగ్గా నేను పది సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు టాంక్ బండ్ దగ్గర హుస్సేన్ సాగర్ కంపు కొట్టినట్టే వుంది ఈ కంపు " అన్నాడు ప్రసాదబాబు. 

“ ఎగ్జాట్లీ... కాకపోతే చిన్నతేడా... అది హుస్సేన్ సాగర్ కంపు... యిది నీళ్ళు లేకపోవడం వల్ల జనాలు ఏ ఆరు నెలలకో ఓ సారి స్నానం చేయడం వల్ల వచ్చే కంపు.” అప్పుడు గమనించాడు ప్రసాదబాబు. మురికి బట్టలు, జడలు జడలుగా కట్టిన జుట్లు ఉన్నవాళ్ళు కొందరైతే, ఆ బాధ భరించలేక, ఆడా, మగా తేడా లేకుండా, గుండ్లు కొట్టించుకున్న వాళ్ళు వారు ఇంకొందరు.

** ** **

చార్మినార్ దగ్గరికి వెళ్లారు గోపాలకృష్ణ, ప్రసాదబాబు దంపతులు. పది నిమిషాలు గడిచాయ్ లేదో పెద్ద అరుపులు, జనం కకావికలై పరుగెడుతున్నారు.

ప్రసాదబాబుకు బి.పి, రెయిజైంది.

“ బావా... పరుగెత్తూ... పాతబస్తీ గొడవలేమో కర్ఫ్యూ పెడతారేమో " భయంగా పారిపోతూ అరిచాడు ప్రసాదబాబు. గోపాలకృష్ణ మరొకసారి కిలకిలా నవ్వాడు. ఆ నవ్వుతో శృతి కలిపింది నీరజ.

“ మతకల్లోలాలు... గొడవలు చూస్తుంటే మీకు నవ్వులాటగా వుందా ? ” అన్నాడు ప్రసాదబాబు ఆగి, మొహం చిన్నబుచ్చుకొని. “ అయ్యో బావా... హైదరాబాదులో మత కలహాలు ఎప్పుడో అంతరించాయి. యివి నీటి కలహాలు... ఈ మూడు నెలల తర్వాత యివ్వాళ ఈ ఏరియాలో నీళ్ళోస్తున్నాయి. ఈ నీళ్ళ గొడవలో ఓ పాతికమందైనా చస్తారు. యిది చాలా కామన్ " చెప్పాడు గోపాలకృష్ణ.

తర్వాత ఓ హోటల్ కు వెళ్తే పాలతో చేసిన ఇడ్లీ, చట్నీ పెట్టారు. మంచినీళ్ళకి బదులు కలరా వుండల టైపులో ఉన్న గోళీలు ప్లేట్లో పెట్టారు.

** ** **

అతి కష్టమ్మీద రెండ్రోజులు గడిచాయి. ప్రసాదబాబుకు, అతని భార్యకు పిచ్చెక్కింది. బట్టలన్నీ మాసిపోయాయి.

సరేనని కొత్తబట్టలు వేసుకున్నారు. పళ్ళు తోముకొని, కాగితాలతో తుడుచుకుంటున్నారు. మొహం కడుక్కోవాలంటే ఎండలో నిలబడి, చెమట పట్టాక సబ్బురాసి, కర్చీఫ్ తో తుడుచుకోవాలి . దాహం వేస్తే టాబ్లెట్ వేసుకోవాలి.పాలతో ఉడికించిన అన్నం, పాలతో  తయారు చేసిన టిఫిన్లు. ఇవన్నీ చాలనట్టు ఆ రాత్రి గోపాలకృష్ణ దంపతుల సంభాషణ వారి చెవిన పడింది.

“ ఇదేమిటి నీరజా... మీ వదిన ' ఏకాదశికి పూజ ' చేయాలి. తలంటు పోసుకుంటానంటుంది.గుళ్ళో శివుడికే అభిషేకాలు ఆపేశారు కదా. ఆ మాత్రం అర్ధం చేసుకోదేమిటి? ” అంటున్నాడు గోపాలకృష్ణ.

“ మీ చెల్లెలు మాత్రం తక్కువ తిందా ? ఇక్కడికి వచ్చినప్పుడు పుట్టిన రోజంటూ తలంటు పోసుకుంటానని గోల పెట్టలేదూ ? దుబాయ్ లో రెండు పూట్లా స్నానం చేసే అలవాటు మా వదినది....”

“ అంత అలవాటయితే సముద్ర తీరాన్న ఓ గెస్ట్ హవుస్ కట్టమను. మనమూ వెళ్లి హాయిగా వారానికోసారి స్నానం చేసి వద్దాం. ప్రస్తుతానికి మాత్రం మన వల్ల కావాడం లేదు.”

“ మీరేం చెప్పనక్కర లేదు. ఇంట్లో టాబ్లెట్లు అయిపోవడం వదిన గ్రహిస్తూనే ఉంది. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళే వెళ్ళిపోతారు. ”

** ** **

“ బావా... దుబాయ్ కి..... హ్హిహ్హిహ్హి... ఎప్పుడూ వెళ్తారు. ” అడిగాడు గోపాలకృష్ణ నిర్మొహమాటంగా.

“ అప్పుడే అంత చేదయ్యామా... సర్లే... బావా మేమే వెళ్దామనుకున్నాం " అన్నాడు ప్రసాదబాబు.

“ ఏమనుకోకు బావా... మా పరిస్థితి అలాంటిది " అన్నాడు గోపాలకృష్ణ.

అప్పటికే వాటర్ టాబ్లెట్స్ బోల్డ్ ఖర్చయ్యాయి.

** ** **

మర్నాడు దుబాయ్ కి ఫ్లయిట్ లో పోయారు ప్రసాదు దంపతులు. వాళ్ళు వెళ్ళిపోయాక బీరువాలో దాచుకున్న ఒకే ఒక వాటర్ బాటిల్ తీసి తనివి తీరా నాలుగు చుక్కల నీళ్ళు తాగారు గోపాలకృష్ణ దంపతులు.