Sorry.memiddaram ishtapaddam

" సారీ...మేమిద్దరం ఇష్టపడ్డాం ! ”

రాజా

గురువు కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటూ ఉంటాడు.

చేతిలో గరిటె పట్టుకును శిష్యుడు గురువు దగ్గరికి వస్తాడు.

" గురువుగారూ...గురువుగారు..." అంటూ చేతిలో గరిటె పట్టుకున్న ఒక శిష్యుడు గురువు దగ్గరికి వస్తాడు. గురువు గారు ధ్యానంలో ఉండటం చూసి వెనక్కి తిరిగి వెళ్లిపోబోతూ ఉండగా, కళ్ళు తెరిచినా గురువుగారు " చెప్పు నాయనా..” అంటాడు.

" ఓహ్...క్షమించండి గురుదేవా...మీరు ధ్యానంలో ఉన్నారని తెలియక...”

“ లేదు నాయనా...మేం ధ్యానంలో లేం "

“ మరి ?”

“ పరధ్యానంలో ఉన్నాం "

“ అదేమిటి గురుదేవా...” ఆశ్చర్యంగా అడిగాడు శిష్యుడు.

“ ఈ రోజు మాకేవో అపశకునములు గోచరించుచున్నవి.మా మనసు వికలమగుచున్నది. పూజ అంతయు అస్తవ్యస్తముగా సాగినది. “ అందుకే గురుదేవా...నేనో నిర్ణయానికి వచ్చితిని "

“ ఏమది "

“ నా మదే గురుదేవా! నా మదే...నాకా సలహా ఇచ్చింది.పెళ్లి చేసుకోమంటుంది.”

“ తప్పు నాయనా...మగవాడిలో గల మహిమాన్విత శక్తులకు క్షణంలో మట్టి కరిపించగల శక్తి ఒక్క మహిళకే ఉంది.అందుచేత ఆడవారికి ఆ ఆలోచనలకు ఆమడ దూరంలో ఉండటం ఎంతైనా మంచిది నయానా" అన్నాడు గురువు.

“ లేదు గురుదేవా...నేను పెళ్లి చేసుకుని నా భార్యతో సహా మీ సేవలు చేసుకుని తరిస్తాను " చెప్పాడు శిష్యుడు.

“ పిచ్చివాడా...పెళ్లి చేసుకుంటే నీ సమయం అంతా నీ భార్య సేవలకే సరిపోతుంది.అప్పుడు నీవు తరించవు నాయనా...అంతరిస్తావు.” చెప్పాడు గురువు.

“ కాదు గురుదేవా...నేను పెళ్లి చేసుకుంటే మనిద్దరికీ చెయ్యి కాల్చుకునే బాధ తప్పుతుంది "చెప్పాడు శిష్యుడు.

“ కానీ బ్రతుకు కాలిపోతుంది నాయనా...మగనికి వంట చేయుట వచ్చునని తెలిసిన ఏ మగువా వంటింటిలోనికి అడుగు పెట్టదురా !” రవ్వంత ఓపిక నశించి చెప్పాడు.

“ ఏమిటి గురుదేవా...మీరు మరీనూ...”

“ అవును నాయనా...వివాహము అయిన నాటి నుంచి శ్రీవారి మతి పోగొట్టును కనుక పెండ్లి అయిన ఆడుదానిని 'శ్రీమతి 'అని అందురు " అన్నాడు గురువు.

“ మీ నిర్వచనములు ఎందుకో నమ్మ బుద్ధియగుట లేదు గురుదేవా !పూజకొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నారు పెద్దలు.కానీ ఖర్మ కొద్ది పెళ్ళాం అని ఎవ్వరూ అనలేదు కదా..అందుచేత నాకు అనుమతీయండి గురుదేవా "

“ పిచ్చివాడా " “ మళ్ళీనా గురుదేవా ?”

“ అవునురా...పెళ్లిమాట ఎత్తినప్పుడల్లా నీవు పిచ్చివాని వలెనే నాకు కనిపించెదవు.ఈ ఆడువారు పేరుకు మాత్రమే ఆడువారు.వారు మన కిష్టమైన రీతిలో ఆడువారు కాదు.మనలను ఆడించువారు " చెప్పాడు గురుగుగారు.

“ ప్రేమించినా అంతేనా గురుదేవా...?” అమాయకంగా అడిగాడు శిష్యుడు.

“ శిష్యా...ప్రేరేపించి మత్తులో పడవేయటం జరుగును కనుక ఆ చర్యను 'ప్రే -మ 'అని అన్నారు నాయనా.అంతియే గాని ప్రేమ అనునది ఏదీ ప్రత్యేకముగా లేదు నాయనా..పైగా వెంటబడిన వారిని ఆడువారు వెకిలి చేయుదురు "

“ ఛా...నిజమా గురుదేవా ! కానీ నాకు వేస్తోంది...గురుగారూ.”

“ పెళ్లి వేయటమా...ఏమది ?”

“ అదే గురుగారు...కడుపుకి ఆకలి వేసినట్టు ఒంటికి చలేసినట్టు మనసుకి పెళ్లి వేస్తోంది గురుగారూ " చెప్పాడు శిష్యుడు.

“ మరి బ్రహ్మచర్యము నేమి చేతువురా ?”

“ సరస్వతిదేవిని ఆ బ్రహ్మ పెండ్లి చేసికోనినట్టు ఆ బ్రహ్మచర్యనే పాటించి ఈ బ్రహ్మ చర్యమునకు నీళ్ళువదిలెద " అన్నాడు శిష్యుడు.

“ హు...ఎవరి ఖర్మము నెవరు తప్పించగలరు ?మొదట నువ్వు నీ దుస్తులను మార్చుకొని రా నాయనా...విహహెచ్చు జనించిన తరువాత కాషాయము ధరించరాదు " చెప్పాడు గురువు.

“ ఇదొక్కటి నమ్మబుద్దేస్తోంది.గురువుగారూ...అందుకే పొద్దున్నుంచి ఈ కాషాయం కషాయంలా ఉంటోంది నాకు " నమ్మినట్టుగా చెప్పాడు శిష్యుడు.

గబగబా లోపలికి వెళ్లి దుస్తులు మార్చుకుని సంతోషంగా వచ్చాడు గురువు దగ్గరికి.

“ ఇప్పుడు చెప్పండి గురుజీ " అన్నాడు ఉషారుగా.

“ ఇంతకూ నీవు వివాహమాడదలచిన ఆ కన్య ఎవ్వరై ఉండనోవు "

“ గురుజీ...ఒక్క చిన్న రిక్వెస్ట్...అండ్ డౌట్...మీరీ సన్యాసాశ్రమం స్వీకరించకముందు ఇదే బాష మాట్లాడేవారా...”

“ లేదు నాయనా...అందరి వలెనే మాట్లాడేవాడను.ఆంగ్లము అభ్యసించితిని "

“ మరైతే ఇంకేం గురుజీ...దయచేసి మాట్లాడండి "

“ ఈ వస్త్ర ధారణలో మామూలు భాష మాట్లాడిన ఎబ్బెట్టుగా ఉండును నాయనా " చెప్పాడు గురువుగారు.

“ మరి బెట్టు చెయ్యకండి గురుజీ...నాకు మీ భాష ఆ కాషాయం గెటప్పులో ఉంటే కొంతైన అర్థం అయ్యేది.రైల్వేస్టేషన్ లో అనౌన్స్ మెంట్ లా బొత్తిగా అర్థమై చావట్లేదిప్పుడు "

“ సరే...అలాగే కానీ...ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు ?”

“ ఎలాగైనా నా లవర్ కి నేను ప్రేమిస్తున్న సంగతి తెలియచెయ్యాలి...దానికో ఉపాయం చెప్పండి గురూజీ...” బతిమాలింపుగా అన్నాడు శిష్యుడు.

“ నేరుగా చెప్పెయ్...దానికంత సంకోచం ఎందుకూ.”

“ దవడ పగుల్తుందేమోనని భయం...అంచేత ఏదైనా ట్రిక్కు చెప్తే...”

“ అంటే...” అర్థం కానట్టుగా అడిగాడు గురూజీ.

“ నాకా అమ్మాయితో అస్సలు పరిచయం లేదు గురూజీ...పరిచయం ఉంటేనే కదానేనడిగిన ప్రశ్నలకు ఆ అమ్మాయి సమాధానం ఇస్తుంది.అందుకే ఓ లవ్ లెటర్ ఇద్దామనుకుంటున్నాం "

“ ప్రేమలేఖా...సరే అలాగే కానీ...”

“ అలాగే కానిద్దును కానీ నాకు ప్రేమలేఖ రాయటంలో ఎక్స్ పీరియన్స్ బొత్తిగా నిల్లు గురూజీ ...చిన్నప్పుడిలాగే ఓసార్రాసి...”

“ ఏంటీ...చిన్నప్పుడే ప్రేమలేఖ రాశావా...? వార్నీ...ఈ లెక్కన నువ్వు పుట్టగానే పురుడు పోసిన నర్సుకే కన్నుకొట్టి ఉంటావ్ అవునా...”

“ అబ్బే...అంత గొప్పవాణ్ణి కాదు గురూజీ.ఆయామ్ ఎ ఫెయిల్యులర్..అంచేత ఇప్పటికీ ఇప్పటికీ ప్రేమలేఖ రాయాలంటే హైదరాబాద్ రోడ్డు మీద నడిచినంత భయం నాకు...”

“ మరేం చేస్తానంటావ్ ?”

“ నేనేం చెయ్యలేను గురూజీ...ఆ పుణ్యం ఏదో మీరే కట్టుకోవాలి "

“ అంటే...”

“ ఆ ప్రేమలేఖేదో మీరే రాసి...”

“ నేనా...శిష్యా...నన్ను మరీ మైలపరుస్తున్నావురా "

“ తప్పులేదు గురూజీ...మీరేగా చెప్పేరు... భావన మనసుకి అంటనప్పుడు మైలపడినట్టు కాదు అని.అంచేత మీరే రాసి నన్నో ఇంటి వాణ్ణి చెయ్యండి...ప్లీజ్...ఇన్నాళ్ళు మీకు సేవలు చేసేనే.నా గురించి ఆ మాత్రం చెయ్యలేరా గురూజీ...” బతిమాలింపుగా అన్నాడు శిష్యుడు.

“ హు...విధి విలాసం...ఎలా ఉంటే అలాగే జరుగుతుంది "అని ఒక లవ్ లెటర్ రాయడం మొదలు పెట్టాడు గురూజీ.ఆ లెటర్ పూర్తీ అయ్యేవరకు గురుజీనే చూస్తూ అక్కడే వున్నాడు శిష్యుడు.

గురూజీ, రాసిన లెటర్ యిస్తూ " ఊ...తీసుకో...వెళ్లి ఇచ్చిరా...శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు " అంటూ దీవించాడు గురూజీ.

“ మళ్ళీ ఏమైంది ?”

“ మా కుటుంబంలో ప్రేమలేఖలు రాసినా తీసుకెళ్ళి ఇచ్చినా ఇప్పటిదాకా అచ్చిరాలేదుట "

“ ఆశ్చర్యంగా ఉందే " ఆశ్చర్యంగా అన్నాడు గురూజీ.

“ నిజం గురూజీ...ఆ చిన్నాన్న చెప్పేడు "

“ అందుకని...”

“ ఈ లెటర్ కూడా మీరే వెళ్లి ఇచ్చి వస్తే...”

“ నేనా...శిష్యా...ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా నీకు "

“ తెలుసు గురూజీ...మీరైతే పెద్దవారు కనుక...”

“ ఆ పిల్ల చెంప పగల గొట్టదంటావ్ "

“ ఓ విధంగా అంతే అనుకోండి...”

“ ఆఁ...”

“ అహహహ అదికాదు గురూజీ...ఆ అమ్మాయి కాస్త రెస్పెక్టు ఇచ్చి వింటుంది మీరు వెళితే ! ఆ లెటర్ చదివి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందన్న నమ్మకం కూడా ఉంది.ఈ శిష్యుడు గురించి ఆ మాత్రం చేయలేరా గురూజీ...”

“ సెంటిమెంట్ పెట్టి నాచేత ఎటువంటి పనులు చేయిస్తున్నావు శిష్యా !?హు...ఏం చెప్పగలవు. విధి విలాసం...ఇంతకీ చెప్పు. ఎక్కడ ఆ అమ్మాయి విలాసం అండ్ నివాసం...” అని ఆ అమ్మాయి గురించి అడుగుతాడు.

***

కొంతకాలం తరువాత గురూజీ కొత్త బట్టలు వేసుకుని, కాషాయం బట్టలు మార్చి...అసలు గెటప్ చేంజ్ చేసుకుని శిష్యుని దగ్గరికి వస్తాడు.

“ దేవుడా నా ప్రేమ ఫలించి పెళ్లి జరగాలి నీకు వంద కొబ్బరి కాయలు కొడతా...దేవుడా దేవుడా దేవుడా దేవుడా " అంటూ దేవుడిని వేడుకుంటాడు.

“ శిష్యా శిష్యా " పిలుస్తాడు గురూజీ.

తుళ్ళిపడిన శిష్యుడు " ఎవరు మీరు...అచ్చం మా గురువుగారిలాగే పిలిచారు.మిమిక్రీ వచ్చా మీకు " అడిగాడు శిష్యుడు.

“ లేదు శిష్యా.నేను నీ గురువుని " చెప్పాడు గురూజీ.

“ ఆఁ...! ఈ గెటప్ ఏంటి గురూజీ ?”

“ నీకు పూర్వజన్మ మీద నమ్మకం ఉందా ?”

“ ఇప్పుడు అదెందుకు గురూజీ ?”

“ అదే నాలో ఈ మార్పుకు కారణం.అదే నన్ను తిరిగి సంసార జీవితం వైపు పయనించెట్టు చేసింది " చెప్పాడు గురూజీ.

“ ఆ...మీరు పెళ్లి చేసుకోబోతున్నారా...ఎంత గొప్ప వార్త.నాకు చాలా ఆనందంగా ఉంది గురూజీ...చెప్పండి ఎలా జరిగింది " సంతోషంగా అడిగాడి శిష్యుడు.

“ ముందు నీ సంగతి మాట్లాడి తర్వాత నా సంగతి మాట్లాడితే బావుంటుంది శిష్యా " అన్నాడు గురూజీ.

“ లేదు గురూజీ...నేను ఆనందం పట్టలేక పోతున్నాను.మొదట మీ సంగతి చెప్పండి " ఆనందంగా అన్నాడు శిష్యుడు.

“ సరే..విధి విలాసం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది చెప్తా విను.పూర్వ జన్మలో నా భార్య నాకు కనిపించింది.”

' ఇది నేను నమ్మాలా ?”

“ నేను అచ్చం నీలాగే అన్నాను.కానీ ఆమె వినలేదు.మాది జన్మజన్మల బంధంట.క్రితం జన్మలో కూడా నేను నమ్మలేదట.అవన్నీ గుర్తు చేసింది.చివరకు నన్ను పెళ్ళికి ఒప్పించింది " చెప్పాడు గురూజీ.

“ ఇది చాలా విడ్డూరంగా ఉందే ?ఇంతకూ ఆవిడ ఎవరు గురూజీ ?” కొంచం ఆశ్చర్యంగా నమ్మలేనట్టుగా అడిగాడు శిష్యుడు.

“ ఇదిగో శిష్యా...ఇదే ఆవిడ విలాసం అండ్ నివాసం " అంటూ చెప్పాడు.

“ ఆ...నేనిచ్చిన ఆడ్రసే ...అంటే "

“ నువ్వు లవ్ చేసిన అమ్మాయే శిష్యా...పూర్వ జన్మలోనా భార్య"

“ మోసం...ద్రోహం...నువ్వు గురువ్వి కాదు.ద్రోణాచార్యుడిని మించిపోయిన ద్రోహాచార్యుడివి " కోపంగా అన్నాడు శిష్యుడు.

“ అంతా విధి విలాసం శిష్యా '”

“ ఉత్తరం తీసుకెళ్ళి ఇచ్చారు సరే...అది మీరే రాసింది అని ఆ అమ్మాయికి ఎలా తెలిసింది ?” రోషంతో రొప్పుతూ అడిగాడు శిష్య.

“ అదే శిష్యా...విధి విలాసం అంటే...ఉత్తరం రాసిన తరువాత నువ్వు సంతకం పెట్టడం మర్చి పోయావు.నా అలవాటు ప్రకారం నేను నా సంతకం పెట్టేశా " నెమ్మదిగా చెప్పాడు గురూజీ.

“ గురూ ద్రోహాచార్య...నిన్ను...ఉండు...ఇప్పుడే చెప్తా నీ పెళ్లి...” అని ఇద్దరూ పరుగేడుతుండగా ...

కట్