Rating:             Avg Rating:       840 Ratings (Avg 2.98)

Dongala Rajyamandi Babu

Dongala Rajyamandi Babu


దొంగల రాజ్యామండీ బాబూ


యస్. నర్సింగరావు

అబ్బో ఇది దొంగల రాజ్యమండీ బాబూ. చిల్లర దొంగల దగ్గర్నుంచీ ఘరానా చోరుల వరకూ, పది రూపాయలకి కక్కుర్తి పడే పిక్ పాకెటర్ మొదలు కుంభకోణాల భోజ్యుల దాకా, డూప్లికేట్ పాస్పోర్ట్ లతో జనాల్ని రవాణా చేయడం దగ్గర్నించీ నకిలీ నోట్ల తయారీదార్ల వరకూ ఎన్నెన్ని మోసాలు చూట్టంలేదూ?!

ఇలాంటివి వెలుగు చూసినప్పుడల్లా ఓసారి బుగ్గలు నొక్కేసుకుంటాం. అదే మొదలు, అదే చివరా కాదని తెలిసినా సరే, ''అవ్వ, అవ్వ ఏమిటీ ఘోరం.. ఎంత దుర్మార్గం.. కలికారం మహిమ.. పెరుగుట విరుగుట కొరకేనని ఊరికే అన్నారా?! - లాంటి ఆశ్చర్యార్థకాలతో తెగ మాట్లాడేస్తాం..

బస్ ఎక్కుతామా, టికెట్ తీసుకోబోతే పర్సుండదు. కండక్టర్లో కూసింత జాలీదయా లాంటి పదార్ధాలు ఏమైనా ఉండి అఘోరిస్తే 'ఆమాత్రం జాగ్రత్త లేకపోతే ఎలా.. సర్లే, ఇక్కడ దిగిపోండి.. చెకింగోడు వస్తే నా దుంప తెగుద్ది, నేను బుక్కవుతా'' అంటాడు.

ఆమాత్రం కనికరం లేనివాడైతే చూస్కోండి, పురుగును దులపరించినట్లు విదిలించి పారేస్తాడు. "పర్సు పోయిందా.. ఈ నాటకాలు నా దగ్గర కాదు..నీ లాంటోళ్ళని వెయ్యిమందిని చూశా..'' టైపులో వాగుతుంటే, ఇక పర్సు పోగొట్టుకున్న వ్యక్తీ పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? ''డబ్బూ పోయే, శనీ పట్టే'' చందమేగా.

రైలన్నాక రాత్రి ప్రయాణంలో నిద్ర పోవడం సహజం. ఆ కుదుపులకి హాయిగా గాఢ నిద్ర పడుతుంది. ఇక చోరశిఖామణులు సూట్కేసులు చేతబట్టుకుని ఉదాయించేస్తారు. పొద్దున్నే లేచి లబోదిబోమంటూ రైల్వే పోలీసులకు కంప్లెయింట్ ఇస్తున్నప్పుడు చూడండి, సొమ్ము పోయిన బాధకు పోలీసోళ్ళ కామెంట్లు పుండు మీద కారం జల్లినట్టు ఉంటాయి. ''నిజంగా అందులో అంత డబ్బుందా? అన్ని నగలు ఉన్నాయా? అవన్నీ ఎందుకు మోసుకు వెళ్తున్నట్టు? కనీసం అంత విలువైన వస్తువులు ఉన్నప్పుడు చైనేసి లాక్ చేయాలన్న జ్ఞానం కూడా లేదా? తమరా వరసన్ నిమ్మకు నీరెత్తినట్టు నిద్దరోతుంటే దొంగోడి తప్పేం ఉంది? మాకు పనులు పెంచడానికి, మా దుంపలు తెంచడానికి కాకపోతే.." లాంటి మాటల ఈటెలతో పొడుస్తుంటే, బూటుకాలితో తన్నాలనిపించే మాట నిజం. అలాగని అంత పని చేశారో, ఆనక జీవితాంతం ఊచలు లెక్కబెట్టాల్సి ఉంటుంది.

ఇంకో రకం దొంగలు.. ఉద్యోగం ఇప్పిస్తానని వేలూ, లక్షలూ కాజేసే బాపతు. మోసగాళ్ళే కాదు, మోసగత్తెలూ కలరు. నైజానికి స్త్రీ పురుష తేడా లేదు. మగ దొంగల కంటే ఆడ దొంగలు మరీ డేంజర్. వీళ్ళు అవసరమైతే ఎంతకైనా దిగజారిపోతారు.

 రియల్ ఎస్టేట్ దొంగలు మరో రకం. ఇళ్ళ స్థలాలు కబ్జా చేసి పారేయగల గూండాలు. ఒక స్థలాన్ని నలుగురికి అమ్మి రిజిస్టర్ చేయగల దిట్టలు. ఇంకా మాట్లాడితే భూమ్మీద లేని ప్లాటును కూడా కాగితాల్లో అమ్మగల ప్రపంచ ముదుర్లు.

ఫలానా చోటికి వెళ్తున్నామంటే, అక్కడ దొరికే వస్తువేదో కాస్త తెచ్చిపెట్టమని అడగడం సహజం. అందులో కూడా కమీషన్ వేసుకునే చిరు దొంగలు కొందరుంటారు. అదేం కక్కుర్తో, చవకబారుతనమో అంతుపట్టదు. దొంగబుద్ధి బయట పెట్టుకోవడం కాకపోతే దానితోనే బతికేస్తారా?
ఈ చిన్నా పెద్దా చోరీలు ఎప్పుడో ఒకప్పుడు అనుభవమే. పొతే, బందిపోటు దొంగలు, స్కాం లు, ముఠా దోపిడీల గురించి పేపర్లలో చదివి గుండెలు అవిసేలా రోదించకపోయినా, ప్రపంచం ఏమైపోతోంది అంటూ ఇదేం ఘోరం అంటూ చెవులు కొరుక్కుంటాం.

మొత్తానికి డైరెక్టుగా దోచుకునే దొంగలు, గజదొంగలదో పద్ధతి అయితే, బూటకాలు, నాటకాలతో, మోసం, నయవంచనతో దోచుకోవడం ఇంకో పద్ధతి. కోట్లు దండుకుని పరారైన కృషీ బ్యాంకు బాపతు కేడీలు రెండోరకానికి చెందుతారు. ఇక రషీదులు, షకీళ్ళ వెనకాల రాజకీయ నాయకులూ ఉంటారు. చోటా సైజు గల్లీ గూండాలు ఉంటారు. ఏ రకంగా అయితేనేం, చేసేది మట్టుకు దండుకోవడం, దోచుకోవడం. వాళ్ళు కష్టపడరు. చెమటోడ్చరు. కానీ సుఖసౌఖ్యాలు కావాలి. కోట్ల ఖరీదు చేసే కార్లు, పోష్ ఏరియాల్లో ఇళ్ళు, ఫారిన్ ట్రిప్పులు.. ఇవన్నీ కావాలంటే కొల్లగొట్టాల్సిందే తప్పదు.

ఓ గుమాస్తా తన కనీస అవసరాలు తీర్చుకుని కష్టపడి, కూడబెడితే రిటైర్ అయ్యేనాటికి ఓ ఇల్లో, ఫ్లాటో కొనుక్కోగలడు. ఆఫీసరో, ప్రొఫెషనలో అయితే ఘనమైన కొంపా, ఖరీదైన కారూ కొనుక్కోగలడు. అంతే.

కానీ, ఇలా నెలంతా కష్టపడే వృత్తులు, ఉద్యోగాలు కాకుండా దోచుకోవడం, కొల్లగొట్టడం అనే బిజినెస్ అయితే ఆర్నెల్లకో అందమైన సౌధాన్ని సొంతం చేసుకోవచ్చు. యమా జల్సాగా లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు. అందుకే, అంటారు... ''వండుకున్న అమ్మకి ఒకటే కూర, అడుక్కున్న అమ్మకి అరవై కూరలు''- అని.

అలూకాస్ దొంగోడు తన విలాసాల కోసం రోజుకు లక్షలు ఖర్చు పెడతానని, సినీ నటులతో, మోడల్స్ తో గడుపుతానని చెప్పాడు. అంతేలే, మరి.. నిజాయితీగా సంపాదించిన వాడు ఆ వరసన ఖర్చు పెట్టగలడా?

సరే, ఈ దుర్మార్గాలు, దోపిడీల సంగతలా ఉంచి ఇంకో టైపు ఉంటారు. అప్పులోళ్ళు. నీతిగా తీసుకుని, నిజాయితీగా తీర్చేవాళ్ళ సంగతి కాదులెండి. కొందరికి అసలు అప్పు తీసుకునేటప్పుడే తీర్చే ఉద్దేశం ఉండదు. భారీ రుణాలు చేసి, ఐపీ పెట్టేసే వాళ్ళనీ, వేలూ లక్షలూ ఎగ్గొట్టేవాళ్ళనీ ఎందర్ని చూట్టంలేదు? కొందరు సత్తెకాలపువాళ్ళు ''అన్యాయపు సొమ్ము వంటబడ్తుండా?" అనడం వింటుంటాం. మన పిచ్చి కాకపొతే, వంటబట్టకేం చేస్తుంది? ఒకవేళ అరక్కపోతే డైజిన్ వేసుకుంటారు. అంతేగా!

ఇకపోతే అంత మొత్తం కాకున్నా ''ఓ యాభై ఇవ్వు, వందివ్వు..'' అని అడుగుతుంటారు. ఇవ్వక చస్తామా? కానీ ఆ మొత్తాలు తిరిగొచ్చే సమస్యే లేదు.ఇలాంటివి ఎన్ని అనుభవాలు ఉన్నా మరో శాల్తీ, ఇంకో శాల్తీ తగుల్తూనే ఉంటారు. ఇవ్వాల్సి వస్తూనే ఉంటుంది. వీళ్ళకి ఇచ్చే బదులు, అడుక్కునేవారికి ఇస్తే పుణ్యమైనా దక్కేది - అనిపిస్తుంది కూడా. పుణ్యాలూ గట్రా నాన్సెన్స్ అనుకున్నా నిజంగా నిస్సహాయులైనవారిని ఆదుకోవడంలో అర్ధం ఉంది. ఇంకొకరి నెత్తిన చేయి పెట్టాలనుకునేవారికి ఇవ్వడం శుద్ధ దండక్కాదూ?!

మార్గాలు వేరు కావచ్చు. మనుషులు వేరవ్వచ్చు. కానీ, దొంగలందరిదీ ఒకటే కులం. ''పెద్ద చేప చిన్న చేపను మింగును'' తరహాలో కడుపు పెద్దదైన కొద్దీ మరింత భారీ చోరీకి పాల్పడ్డమే తప్ప తేడా లేదు. అందరూ అందరే.

మొత్తానికి మోసపోయిన వాళ్ళకు, ఈ దొంగలమీద వచ్చే పిచ్చి కోపానికి ఎడార్లో పడేసి, చుట్టూ ప్రహరీ కట్టించేయాలి అనిపిస్తుంది. గోడ ఎక్కి దూకే వీల్లేకుండా షాక్ కొట్టే ఏర్పాటు కూడా చేయగలరు!