Taataadhitai Tadigibatom - 9

Episode-9
తాతా ధిత్తై తధిగిణతోం......


                            జీడిగుంట రామచంద్రమూర్తి


అప్పలస్వామి మళ్లీ ఊదటం ప్రారంభించాడు. డ్యాన్సు కూడా చేశాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.

గుమ్మాలకు చామంతిపూల దండలు కట్టే ప్రయత్నంలో వున్న నారాయణ ఈ తతంగమంతా గమనించాడు.

"తమరోసారి అట్టా లోపలకు ఎల్లండి బాబూ!" వీరభద్రం దగ్గరగావచ్చి నెమ్మదిగా చెప్పాడు....

"ఎందుకనీ ?" కోపంగా చూశాడు వీరభద్రం.
"సెప్తాకదా! ఓసారి ఎల్లుండి!"
తీవ్రంగా చూస్తూనే లోపలకు వెళ్లాడు.

వెంటనే సన్నాయి వాయిద్యానికి అనుగుణంగా గంగిరెద్దు చిందులు వేయటం ప్రారంభించింది.....అప్పుడు నారాయణ అరుగుమీది కుర్చీని తీసుకెళ్ళి లోపల తలుపు పక్కగా వేశాడు. గంగిరెద్దుకి కనిపించకుండా వీరభద్రం కుర్చీలో కూర్చుని ఆట చూశాడు....ఆ తర్వాత పార్వతమ్మ చేట నిండా బియ్యం తెచ్చి అప్పలస్వామి 'జోలె'లో పోసింది.....వీరభద్రానికి దణ్డంపెట్టి వెళ్లిపోయాడు అప్పలస్వామి.

అదే సమయంలో రోడ్డు చివర్నించి సైకిలు రిక్షా వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది...అందులోంచి గీతా, రాజేంద్రా దిగారు. పార్వతమ్మ ఉత్సాహంగా వాళ్ళను ఆహ్వానించింది....రిక్షాలోవున్న పెట్టె, సంచీ లోపలకు తీసుకెళ్ళాడు లక్ష్మణమూర్తి.

కాళ్లు కడుక్కునేందుకు నీళ్లు తెచ్చి రాజేంద్రకు అందించాడు నారాయణ.

"రండి అల్లుడుగారూ!.....కుశలమే గదా?" అల్లుణ్ణి పలకరించాడు వీరభద్రం.

ముందు ఉత్సాహంగానే బదులు చెప్పాలనుకున్న రాజేంద్ర వీరభద్రాన్ని చూసి అదోలా మారిపోయి చెప్పాడు.

"కు....లాసాయేనండీ!"

పార్వతమ్మ మంచినీళ్లు తెచ్చిచ్చింది.

"అల్లుడుగారూ!....తమరొక్క అయిదు నిమిషాలు ముందుగా వచ్చివుంటే వృషభవినోదమును తిలకించి వుండేవారు!....మీ భాగ్యనగరంలో అటువంటి సంబరములు అరుదుగదా?" సంబరంగా చూస్తూ అన్నాడు వీరభద్రం.

రాజేంద్ర పళ్ళు కొరుక్కుంటూ మావని మనసులోనే తిట్టుకున్నాడు. 

"హు!....అయిదునిమిషాలు ముందొస్తే 'వృషభవినోదం' అరగంట ముందొస్తే 'అడ్డగాడిద వినోదం' అంటాడే తప్ప 'పండకొచ్చావ్ నీ కట్నం బాకీ తీర్చేస్తాన్లే' అంటాడా?...అనడు!....పైగా బోడి అర్థం కాని భాషోకటి!....వృషభ వినోదమట.....వృషభ వినోదం!"అంతలో గీత మంచినీళ్లు తాగుతూంటే పార్వతమ్మ ఆమెవైపు చూస్తూ అడిగింది.

"అంత చిక్కిపోయావేమిటే తల్లీ?....అక్కడ నీళ్లు పడటం లేదా?"

"నీళ్లూ పడ్తున్నాయి ...పాలూ పడుతున్నాయ్...కానీ మీ అల్లుడిగారితోనే బొత్తిగా పడటం లేదమ్మా!"గీత మాటల్లోని ఛలోక్తిని అర్థం చేసుకున్న పార్వతమ్మ ముసుముసిగా నవ్వుకుంది.

"ఛ! ఊరుకో!.... బంగారం లాంటి అల్లుడిగారి మీద అపవాదులెయ్యకు! ఆయన నిన్ను నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటాట్టగా?....మొన్నామధ్య హైదరాబాదు నించి మీ స్నేహితురాలు శారద వచ్చినప్పుడు చెప్పింది" అంది.

"ఇటీజ్ టూమచ్ అత్తయ్యగారూ? నామీద అపవాదులు వెయ్యవద్దని మీ అమ్మాయికి చెప్పూ. ఆ అపవాదులు మీరు వేస్తున్నారు నామీద" అన్నాడు రాజేంద్ర చిరుకోపం నటిస్తూ.....పార్వతమ్మకి అర్థం కాలేదు.....

"నేనా?" అడిగింది అయోమయంగా చూస్తూ...

"అవును మీరే!...." మీ అమ్మాయిని నానెత్తిమీద పెట్టుకుని చూసుకుంటున్నానంటే ఏమిటర్థం? ఆ శివుడు గంగమ్మను నెత్తిమీద పెట్టుకుని పార్వతితో కాపురం చేస్తున్నాడనేగా? అక్కడికి నాకు వేరే, పార్వతి లాగా" అంటూ ఇంకా చెప్పబోతుంటే

"చాల్లే ఊరుకోండి అల్లుడుగారూ...మీగుణ గణాలు మాకు తెలియనివా?" అంటూ నవ్వేశాడు వీరభద్రం. గర్వంగా కాలరెగరేశాడు రాజేంద్ర. "రాముడు రాలేదా అమ్మా" కొన్ని క్షణాల తర్వాత అడిగింది గీత. "వాడికి ఈ పండక్కి శలవలు ఇవ్వలేదంటమ్మా!" రెండు రోజుల భాగ్యానికి ఎందుకులే' అనుకున్నాడు. పైగా ఫైనల్ పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి కదా...చదువుకోవాలట! నిన్ననే వాడి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది...నిన్నూ, అల్లుడు గార్నీ మరీ మరీ అడిగినట్టు చెప్పమన్నాడు."

"బహుశా మావయ్యగారు అతన్ని బెదరగొట్టేసి వుంటారు. పరీక్షల్లో 'ఫస్టుక్లాసు' రాకపోతే ఇంటికి రానివ్వనని!" వీరభద్రం వైపు కసిగా చూస్తూ అన్నాడు రాజేంద్ర. "అల్లుడు గారు మరీ విషయాన్ని సులువుగానే పసిగట్టేసారు. నా ఉత్తరం చూసి మా సుపుత్రుడు బెదిరిపోయే వుండాలి!" మీసాలు మెలివేసుకుంటూ చెప్పాడు వీరభద్రం.

*               *                *             *

ఆ రాత్రి హాస్టల్ గదిలో టేబుల్ ముందు కూర్చుని పుస్తకం చదువుతున్నాడు శ్రీరాం అయితే పుస్తకంలోని అక్షరాలపై అతని చూపు లగ్నం కావడంలేదు 'టేబుల్ మీద ఓ పక్కనవున్న' ఇన్ లాండ్ లెటర్ మీద వుంది వుండి అతని చూపులు నిలుస్తున్నాయి అలా చూస్తున్నప్పుడల్లా ఆ కవరు ఓ జెర్రిలాగా, ఓ తేలు లాగా కనిపిస్తోంది భయంతో దాన్ని క్రిందకు తోసేశాడు క్రిందపడిన ఇన్ లాండ్ లెటర్ గాలికి రెపరెప లాడుతూ తెరచుకుంది హఠాత్తుగా శ్రీరామ్ కి తండ్రి గొంతు వినిపించింది.

"ఒరేయ్ శుంరా! నీ ఉత్తరం చేరింది." ఉలిక్కిపడి అటు చూశాడు శ్రీరామ్ రెపరెప లాడుతూ తెరుచుకున్న ఆ 'ఇన్ లాండ్ లెటర్లో' తన తండ్రి రూపమే కనిపిస్తోంది చటుక్కున దాన్ని తీసి మూసేసి బల్లమీద పెట్టి గాలికి మళ్లీ తెరచుకోకుండా పుస్తకం బరువు పెట్టాడు పుస్తకం తెరచి మళ్లీ చదవటం ప్రారంభించాడు రెండు క్షణాలు కూడా దృష్టి పుస్తకంలో నిలవలేదు భయంగా ఇన్ లాండ్ కవరు తీసి తెరిచాడు మళ్లీ తండ్రి రూపం ప్రత్యక్షమైంది. "తమరు ఈ పండుగకు విచ్చేసి మమ్మల్ని ఉద్దరించనవసరం లేదు శ్రద్ధగా చదివేడ్చి ఫస్టుక్లాసున డిగ్రీ వచ్చు ప్రయత్నము గావింపుడు అట్లురాకున్న నేనే "టౌనుకి విచ్చేసి తమకు పూర్తిగా 'కేశఖండన' గావింపజేసి గార్ధభంపై ఊరేగింపుగా ఊరికి గొనితేచ్చి మన పాఠశాలలోనే బంట్రోతుగా నియమించెదను."ఉత్తరంలోని మేటరంతా సాక్షాత్తూ తన తండ్రే చదివినట్టుగా భ్రమ కలిగినట్లయింది.

హడలిపోయి కవరు మూసేశాడు శ్రీరామ్ ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుని మళ్ళీ పుస్తకం తెరిచాడు ఇప్పుడు పుస్తకంలోనే ఓ దృశ్యం ప్రత్యక్ష్యమైంది.

ఆ దృశ్యంలో శ్రీరామ్ తన గుండు మీద రుమాలు కప్పుకుని నక్కుతూ, నక్కుతూ వెళ్ళి స్కూలుగంట మోగిస్తున్నాడు అయినా కొంతమంది టీచర్లు అతన్ని చూసి హేళన చేస్తున్నట్టుగా నవ్వుతున్నారు.ఆ దృశ్యాన్ని చూడలేక 'వామ్మో' అనుకుంటూ తటాల్న పుస్తకం మూసేశాడు శ్రీరామ్.

అక్కణ్ణించి లేచివెళ్ళి కూజాలోని మంచినీళ్ళు తాగి, మళ్లీ వచ్చి కూర్చున్నాడు అలాగే ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తున్న అతని చూపులు అప్రయత్నంగా పక్కనున్న కిటికీవైపు మళ్ళాయి.

కిటికీలోంచి 'జీన్స్ ప్యాంట్' తొడిగిన ఓ 'కాలు' లోపలకు వస్తోంది దిగ్భ్రాంతిగా అతను అటే చూశాడు మరుక్షణంలో మరోకాలు కూడా లోపలకు వచ్చింది ఆ వెంటనే టోటల్ గా 'బాడీ' మొత్తం దభీమని పడింది.

శ్రీరామ్ కుర్చీలోంచి లేచి ఓ అడుగు వెనక్కివెళ్ళి భయంతో అటు చూశాడు ముఖంపై పడిన జుట్టుని అలవోకగా 'స్లోమోషన్' లో పైకి నెట్టుకుంటూ శ్రీరామ్ వైపు చూసి కన్నుకొట్టింది అలా లోపలకు దూకిన అశ్విని శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు "నువ్వా" అన్నాడు  

"ఏం?" నమ్మకం లేదా? కావాలంటే గిల్లుకో!" అంటూ ముందుకు వచ్చి తన బుగ్గను చూపించింది.

శ్రీరామ్ ఇంకో రెండడుగులు వెనక్కివేశాడు అశ్విని చిరాగ్గా చూసింది. బుద్ధావతారం మీ నాన్నగారు నీకు 'రాముడి' పేరెట్టి నాకు ద్రోహం  చేశారు ఎంచక్కా ఏ 'కృష్ణమూర్తో' అని పెట్టుంటే ఇలాంటప్పుడు కొంచమైనా అడ్వాన్స్  అయ్యేవాడివి!" అంది శ్రీరామ్ ఒళ్ళు మండిపోయింది. "చాల్లే! జోకులెయ్యకు ఇది కాలేజీ క్యాంపస్ కాదు ! హాస్టలు! అందులోనూ బాయ్స్ హాస్టలు ! పైగా అర్దరాత్రి సమయం!' కోపంగా చూశాడు.

'అయితే ఏం? ఆడపిల్ల, అర్దరాత్రి పూట ఒంటరిగా, నిర్భయంగా నడిరోడ్డు మీద నడవగలిగినప్పుడే మనకి స్వతంత్రం వచ్చినట్టు అవుతుందన్నారు గాంధీజీ" గర్వంగా చూస్తూ చెప్పిందామె.

'కావచ్చు కానీ ఇలా పెళ్ళికాని ఆడపిల్ల అర్దరాత్రి బరితెగించి ఒంటరిగా వుంటున్న ఓ మగాడి గదిలోకి వచ్చి బుగ్గ గిల్లుకో, ముద్దు పెట్టుకో అంటే అది స్వతంత్రం వచ్చినట్టు కాదు ఆ పిల్లకి పిచ్చి ముదిరినట్టు! అయినా ఇలా గోడ దూకి రావటానికి సిగ్గులేదూ? అడిగాడు శ్రీరామ్  కొంచెం ఆవేశం తెచ్చుకుని "ప్రేమించిన వాళ్లకి సిగ్గులూ, భయాలూ వుండకూడదని శాస్త్రం చెప్తోంది నిజానికి ఈ పని నువ్ చేసుండాలి! ఏం చేస్తాం? మనది మొదట్నుంచీ రివర్స్ కేసేకదా?" నిట్టూర్చింది అశ్విని.

"సర్లే పద నిన్ను మీ ఇంటిదగ్గర దిగాబెదతాను!" ఆమె చేయి పట్టుకున్నాడు శ్రీరామ్ చేయి విదిలించుకుందామె "అఖ్ఖర్లేదు!" నువ్వురమ్మంటే వచ్చానా దిగబెడతానంటే దిగి రావడానికి? అయినా ఒంటరిగా వచ్చినప్పుడు లేని భయం తిరిగి వెళ్ళటానికి మాత్రం ఎందుకుంటుంది?"

ఆమెలోని మొండితనం చూసిన శ్రీరామ్ హతాశుడయ్యాడు ''అబ్బా! ఏమిటి అశ్వినీ? ఈ పళంగా మా 'వార్డెన్' మనల్ని చూస్తే ఏమవుతుందో తెలుసా?" అడిగాడు నిస్సహాయంగా చూస్తూ "ఏమవుతుందీ?" చేతులు కట్టుకొని మొండిగా చూస్తూ ప్రశ్నించింది. "నా భవిష్యత్తు సర్వనాశన మవుతుంది అప్పుడు నేను గుండుతో" అంటూ అంతకు ముందు చదివిన ఉత్తరంలోని విషయాన్ని చెప్పబోతూ నాలిక కరుచుకున్నాడు.


ఇంకావుంది
హాసం వారి సౌజన్యంతో