Taataadhitai Tadigibatom - 2

Episode 2

తాతా ధిత్తై తధిగిణతోం......

జీడిగుంట రామచంద్రమూర్తి

"హు ఆ దాసుకంటేనూ మేము తీసిపోయితిమి వారికి బిచ్చం వేయుటలో వున్న శ్రద్ధ కట్టుకున్న భర్తగారికింత కాఫీ ఇచ్చుటలో లేకపోయినది.

"ఇప్పటిదాకా మీరు పూజలో వున్నారు కదా అని ఇవ్వలేదు క్షణంలో తేస్తానుండండీ" అంటూ పార్వతమ్మ వంటింట్లోకి నడిచింది.

ఈ లోగా పక్కనే వున్న అద్దాల బీరువాలోంచి బట్టలు తీసుకున్నాడు వీరభద్రం. పొందూరు ఖద్దరు పంచె కట్టుకుని దానిమీద తెల్లని చొక్కా వేసుకున్నాడు ఆ చొక్కా మీద చేతులులేని కోటు తొడుక్కున్నాడు గొలుసు గడియారానికి 'కీ' ఇచ్చుకుని కోటు జేబులో వేసుకున్నాడు బంగారం ఫ్రేం కళ్ళద్దాలు పెట్టుకున్నాడు.

అంతలో పార్వతమ్మ వెండిలోటా గ్లాసుతో కాఫీ తెచ్చి భర్తకు అందించింది. "ఏడీ? సుగ్రీవుడు కనిపించడే? 'నిద్ర బెడ్డు' మీద నుంచి ఇంకా లేవలేదా?" కాఫీ తాగుతూ ప్రశ్నించాడు వీరభద్రం. నుదిటిమీద చేత్తో కొట్టుకుని అడిగింది పార్వతమ్మ.

"మీరెంత ఉభయభాషా ప్రవీణులైనా అలా తెలుగూ ఇంగ్లీషూ కలిపి మాట్లాడక్కర్లేదు అర్థం చేసుకోలేక ఛస్తున్నాను కాస్త మామూలు భాషలో అడక్కూడదూ?"

'ఊ సుగ్రీవుడింకా 'నిద్రమంచం' దిగలేదా అని ప్రశ్నించితిమి ఇందులో అర్థంకానిదేమున్నదీ?' చిరుకోపం ప్రదర్శించాడు వీరభద్రం.

"లేచాడు"

"మరి కనిపించడేల? "

"వంటింట్లో కూర్చుని కాఫీ తాగుతున్నాడు"

"ఆ ఘోరింపేదో ఇక్కడ హాలునందు కూర్చుని అఘోరించవచ్చునుగా?" విసుక్కుంటూ అడిగాడు వీరభద్రం.

వంటింట్లో తలుపు పక్కనే కూర్చుని కాఫీ తాగుతున్న లక్ష్మణమూర్తికి తండ్రి మాటలు వినిపించాయి తాగుతున్న కాఫీ గుటక పడక పొలమారింది తలుపు చాటునించే నెమ్మదిగా హాల్లోకి చూశాడు. పార్వతమ్మ చేటలో బియ్యం పోసుకుంటూ చెప్తోంది.

"మీరు ఇంట్లోవుంటే పిల్లలు ఎప్పుడైనా దైర్యంగా తిరగ్గలరా? దాక్కోవల్సిందే"

"ఏం? ఎందువలన?" ఖాళీ గ్లాసు భార్యకు ఇచ్చేస్తూ అడిగాడు.

"ఏమో? అందరికీ మీరంటే భయమేగా?"

"నిజముగా భయమున్నవారైనా ఇట్లు విచ్చలవిడిగా ఎందుకు ఆఘోరించెదరు? వాడు మేధమేటిక్సునందు మహాదరిద్రముగా వున్నాడట వల్లభరావు మేష్టారు చెప్పినారు" పట్టుకండువా తీసి మెడచుట్టూ వేసుకుంటూ చెప్పాడు వీరభద్రం వంటిన్లో కాఫీ తాగుతున్న లక్ష్మణమూర్తికి మళ్లీ పొలమారింది తండ్రి మాటలు అతనికింకా వినిపిస్తూనే వున్నాయి.

"వీడి సంగతి అటుంచుము అసలు ఆ వాలిగాడికి బుద్దీ జ్ఞానములున్నవా? నేను ఉత్తరము రాసి ఇరువది రోజులైనది రిప్లయ్ రాసినాడా ?" తీవ్ర స్వరంతో అడిగాడు వీరభద్రం.

"ఏమో ఫ్రీ ఫైనలున్నాయట కదా! తీరికలేదేమో బిడ్డకి! అయినా నిక్షేపంలా శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణమూర్తీ అని బారసాలనాడు నామకరణాలు చేసుకుని వాళ్ళనలా 'వాలీ - సుగ్రీవుడూ' అని పిలుస్తారెందుకూ?" "నా ఛిల్డ్రను నా ఇష్టము! వాలీ సుగ్రీవుడు అని కాకున్నా 'జాంబవంతుడూ - హనుమంతుడూ' అని 'కాల్' చు కుంటాను లేదా 'జార్జి వాహింగ్ టన్నూ అబ్రహాంలింకన్నూ' అని 'కాల్' చుకుంటాను. ఇంకెప్పుడూ నా 'కాల్' పులకు అడ్డం పడకు"అంటూ విసురుగా పక్క గదిలోకి నడిచాడు. అంతవరకూ పాలచెంబూ. పలుపుతాడూ పట్టుకుని దూరంగా నిలబడి చూస్తున్న పాలేరు నారాయణ నెమ్మదిగా పార్వతమ్మను సమీపించాడు.

"అమ్మగారూ ! అదేంటండీ? అయ్యగారు అలా 'కాల్పులూ కాల్చుకుంటా' అంటారేంటీ?" అడిగాడు.

"అంతేలే నాయనా! 'పిలుపులూ పిల్చుకుంటానూ' అనటానికి ఇంగ్లీషులో వచ్చిన తిప్పలవి! మధ్యన నన్ను కాల్చుకు తింటున్నారు. ఛస్తున్నా ఇంగ్లీషు నేర్చుకోలేక!" నిట్టూరుస్తూ లోపలకు వెళ్ళిపోయిందామె.

"బలేబావుందే? కాల్చుకోవటం అంటే పిల్చుకోటం అన్నమాట! అయితే ఇప్పుడు నేను నా సీతాల్ని కాల్చుకోవాలిగా" అనుకుంటూ ఆ ఇంటిని ఆనుకునివున్న గొడ్లపాకవైపు నడిచాడు నారాయణ.

ఆ పాకలో గేదె గడ్డిమేస్తోంది. ఆ గేదెని నారాయణ 'సీతాలూ' అని ముద్దుగా పిలుచుకుంటూంటాడు. 'సీతాలు సింగారం,మాలచ్చి బంగారం' అని పాడుతూ పాలచెంబుతో దాని దగ్గరకు వచ్చాడు చెంబులో వున్న నీళ్ళతో పొదుగు శుభ్రం చేసి పాలు పితికటం ప్రారంభించాడు. 'చుయ్, చుయ్' మని శబ్దం చేస్తూ చెంబులోకి పాలు వస్తున్నాయి. అలా అయిదారు సార్లు శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఆగిపోయింది.

నారాయణ పాట ఆపేసి విస్తుపోయాడు. మరోసారి పితికాడు...ఇంకోసారి పితికాడు...అయినా పాలు రావటం లేదు ఖంగారు పడిపోయాడు.

"రోజూ మూడు లీటర్ల పాలిచ్చే దానివి ఇయ్యాల గలాసుడు కూడా ఇవ్వలేదంటే సీతాలూ?.. ఏమైందే నీకియాల? అంటూ ధీనంగా గేదెవైపు చూశాడు. గేదె రోడ్డు మీదకు చూస్తోంది నారాయణ కూడా అటువైపు తన దృష్టి సారించాడు. ఇంటి మెట్లు దిగి రోడ్డు మీదకు నడుస్తున్న వీరభద్రం కనిపించాడు. విషయం బోధపడింది.

"వార్నీ ! ఈరబద్రం మేస్టార్ని సూత్తే నీకూ బయమేనేంటే సీతాలూ?" అన్నాడు నారాయణ నవ్వుకుంటూ. సీతాలు గడ్డి నెమరువేయటం మాని ఇంకా అటే చూస్తోంది.

"అవున్లే! మనుసులం మేమే ఆర్ని చూసి జడుసుకుంటాం అట్టాంటిది మూగ జీవానివి నువ్ బిగుసుకుపోవటంలో ఇడ్డూరం ఏవుంటదీ?" అని మళ్లీ తనకు తనే సమాధానం చెప్పుకున్నాడు. వీరభద్రం కనుచూపుకి అందనంత దూరం వెళ్ళిపోయాక నారాయణ మళ్లీ పాలు పితకటం ప్రారంభించాడు.

'చుయ్ చుయ్. మని శబ్దం చేస్తూ చెంబునిండా పాలొచ్చాయి. వీరభద్రం ఆ వీధి మలుపు తిరిగి మరో సందులోంచి నడుస్తున్నాడు. ఆ సందులో ఎక్కువగా పేద కుటుంబాలే నివసిస్తున్నాయి.

ఓ తాటాకు పాకలాంటి ఇంట్లో పొయ్యిమీద పాలు పొంగుతున్నాయి అదే సమయంలో పక్కనే వున్న 'చీర' ఊయల 'లో చంటిబిడ్డ గుక్కపట్టి ఏడుస్తున్నాడు. అప్పుడే నీళ్ళ కడవతో బయట్నించి లోపలకొచ్చిన ఆ ఇంటి ఇల్లాలు కడవ గోడవారన పెట్టి గబగబా పొయ్యి దగ్గరకు వెళ్లింది.

"ఏడవకు నాన్నా ! వచ్చేస్తున్నా!" అంటూ ఓ వైపు బిడ్డను ఓదారుస్తూనె మరోవైపు పొయ్యి మీద నుంచి పాలగిన్నె దింపి ఇంకో గిన్నెలో నీళ్లు పోసి పెట్టింది. పిల్లవాడు ఏడుపు ఆపలేదు సరికదా మరింత శృతి పెంచాడు.

"నోరు మూసుకుపడుకుంటావా? ఈరబద్రం మేస్టార్ని పిలవమంటావా?" నీళ్ళగిన్నెలో నూకలుపోస్తూ పొయ్యి దగ్గరే వుండి విసురుకుంది ఆ ఇల్లాలు అంతే. పిల్లవాడు ఠక్కున ఏడుపు ఆపేశాడు. అయితే ఆ మరుక్షణంలోనే ఆమెకు ఓ గొంతు వినిపించింది.

"ఎవరదీ? మమ్మల్ని తలుచుకుంటున్న వారెవరు?" ఆమె ఉలికిపాటుతో వెనక్కి తిరిగి చూసింది వీధి గుమ్మం దగ్గర గొడుగు వేసుకుని నిలబడి వున్న వీరభద్రం కనిపించాడు.

ఖంగారుగా లేచి పైటను భుజం మీదుగా లాక్కుని నేలచూపులు చూస్తూ భయం భయంగా చెప్పింది.

"మి. మీరా మాస్టారూ? మా చంటి వెధవ గుక్కపట్టి ఏడుస్తుంటే భయపెడదామనీ ఉరికే అలా అన్నాను అంతే !"

"ఊ. మంచిది. ఇంకా అట్లే ఏడిస్తే డొక్క చీల్చెదనని చెప్పండి మీ కుంకకి! పెద్దయిన పిదప నా పాఠశాలలో 'సీటు' కూడా ఇవ్వబడదని చెప్పండి" అంటూ హెచ్చరించి మళ్లీ రోడ్డు మీదకు వచ్చి స్కూలు వైపు నడక సాగించాడు. ఆ ఇల్లాలు అటువైపే చూస్తూ నిలబడిపోయింది.

(ఇంకావుంది)

(హాసం వారి సౌజన్యంతో)