TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
పద్మశ్రీ
కంగారు, కంగారుగా డాక్టర్ దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు... కాంపౌండర్ ‘సార్...సార్....సార్... మన హాస్పిటల్ లో ఉన్న పేషంట్స్ ఎవరూ కనిపించడంలేదు సార్....’ అన్నాడు అయోమయంగా.
డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఉన్నపళంగా వీళ్ళంతా ఎక్కడికెళ్ళారబ్బా... అనుకున్నాడు.
మెంటల్ హాస్పిటల్స్ నుండి మెంటల్ పేషంట్స్ అందరూ రోడ్డెక్కేశారు... తమ పిచ్చి చేష్టలతో జనాలని భయభ్రాంతులకి గురిచేస్తున్నారు.
జనాలు బెంబేలు పడిపోయి తోచిన వైపుకి పరుగులు తీస్తున్నారు..... ఆ ప్రాంతం మొత్తం పిచ్చివాళ్ళ పిచ్చి చేష్టలతో నిండిపోయింది..... అసలా పిచ్చివాళ్ళు బుద్దిగా పిచ్చి ఆసుపత్రిలో ఉండడం మాని ఇలా రోడ్డెక్కేసి నానా రభస ఎందుకు చేస్తున్నారో అర్ధం కాలేదు ఎవరికీ....
ఆ పిచ్చివాళ్ళం దరికీ పెదపిచ్చయ్య నాయకుడు... ఆయన మొహం ఆగ్రహంతో ఊగిపోతూంది. తన తోటి పిచ్చి వాళ్ళందరినీ పిచ్చి పిచ్చి పనులు చేయడం మానమని ఆర్డర్ పాస్ చేశాడు....
ఎంతైనా పెదపిచ్చయ్య తమ నాయకుడు కాబట్టి ఆయన మాటలకి కొంతమేరకు పిచ్చి చేష్టలని తగ్గించారు....
మీడియా హుటాహుటిన పిచ్చివాళ్ళ నాయకుడైన పెద పిచ్చయ్య వద్దకు పరుగుతీసింది...
పెద పిచ్చయ్య కోపంతో ఊగిపోతున్నాడు.... ‘అయ్యా... పెద పిచ్చయ్యగారూ... ఇంతకీ మీరు మీ పిచ్చివాళ్ళందరినీ వెనకేసుకుని ఇలా రోడ్డెందుకెక్కారో సెలవిస్తారా....’ అని అడిగారు మీడియావాళ్ళు.. ఎంత నాయకుడైనా పెదపిచ్చయ్య కూడా పిచ్చివాడే కదా... తమడిగిన ప్రశ్నకి కోపంతో రెచ్చిపోయి తమనేమయినా చేస్తాడేమోనని భయంతో తమ జాగ్రత్తలో తాము ఉన్నారు.
పెద పిచ్చయ్య... ఒక్కసారిగా పెద్దగా గాండ్రించాడు.... తన మొహంలో ముప్పైఆరు రకాల ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ... అన్నాడు.
‘అసలే మమ్మల్ని ఏమనుకుంటున్నారు... పిచ్చివాళ్ళంటే అంత చులకనగా ఉందా.... మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళంటే అంత లోకువగా ఉందా.... ఖబడ్దార్... మాకు కోపమొస్తే... మేమేం చేస్తామో మాకే తెలియదని మీకు తెలుసుకదా... అలా చేసిన కూడా పిచ్చివాళ్ళ ముందు వెర్రి వేషాలు వేస్తారా... అసలేమనుకుంటున్నారు...’ కోపంతో ఊగిపోతూ అన్నాడు పెద పిచ్చయ్య... మీడియా వారికి ఆయన చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు... ‘అయ్యా... తమరు చెప్పింది ఒక్క ముక్కా అర్ధం కాలేదు.... అసలు మీరు ఎవరి మీదికి రంకెలు వేస్తున్నారో, మిమ్మల్ని ఇంతగా రెచ్చగొట్టిన వాళ్ళెవరో కాస్త వివరంగా చెప్తారా....?’ అడిగారు మీడియా వాళ్ళు....
“ఇంకెవరు.... ఈ రాజకీయనాయకులే...’ కోపంతో ఊగిపోతూ అన్నాడు పెద పిచ్చయ్య....
“ఆ! రాజకీయనాయకులా... ఎలా....?’
“ఇలానా... ఓ పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళని తిడుతున్నారు.... బాగానే ఉంది కానీ... ఈ పార్టీ వారికి మతిస్థిమితంలేదు అందుకే అలా మాట్లాడుతున్నారని వాళ్ళంటే, కాదు కాదు మీరే పిచ్చోళ్ళు, మీరే మెంటలోళ్ళు... అని ఆ పార్టీ వారంటున్నారు... అంటే మెంటలోళ్ళమంటే అంత చులకనగా కనిపిస్తున్నామా...?’ కోపంతో ఊగిపోతూ అన్నాడు పెద పిచ్చయ్య....
మీడియా వాళ్ళకి కూడా అతని వాదన కరెక్టే అనిపించింది... ఎంత రాజకీయ నాయకులైతే మాత్రం ఇలా మీరే పిచ్చోళ్ళంటే మీరు పిచ్చోళ్ళని రంకెలు వేస్తే ఇలా నిజమైన పిచ్చోళ్ళకి కోపం రావడంలో ఆశ్చర్యమేముంది... మీరే చెప్పండి....!
|