తాతా ధిత్తై తరిగిణతోం 36

తాతా ధిత్తై తరిగిణతోం 36

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

"అయినా వివాహాలు స్వర్గంలో జరుగుతాయని చెప్తూంటారు శేషగిరీ ఆ భగవంతుడు ఎవర్నీ ఎవరికి ముడువేసి వుంచునో మానవమాత్రులం మనకు తెలియదు కదా. పీటల వరకూ వచ్చిన వివాహములు సైతం ఆగిపోతున్న సందర్భములు నీకు తెలియనివి కావు పెళ్లి జరిగిన పిదప కూడా కొంతకాలము కాపురం చేసి, పిల్లల్ని కని, విడిసిపోవుచున్న జంటల గురించి మనం రోజూ పేపర్లో చదువుతున్నాం. కనుక అంటూ ఇంకా ఏదోచెప్పబోతున్న వీరభద్రం వైపు చురుక్కున చూసి ఇంకా ఆపమన్నట్టు చెయ్యి అడ్డు పెట్టాడు శేషగిరి.

"ఇంకేం చెప్పకండి. మీ వంశమూ, మీరు మాట కు కట్టుబడేవారన్న నమ్మకంతో నా కూతురికి వేరే సంబంధం చూడాలన్న ఆలోచనలే నా మనసులోకి రానీయలేదు. కట్నకానుకలు తీసుకునే వాడివి కాదు కదా అనే నమ్మకంతో దాని పెళ్ళికోసం నాలుగు డబ్బులు కూడా వెనకేసుకోకుండా ఉన్న ఆస్తినంతా కళాసేవ పేరుతో నాటకాల కోసం ధారపోసుకున్నాను. అందుకు తగిన శాస్తి నాకు జరిగింది." ఆవేదనా, ఆవేశం అతని మాటల్లో చలించాయి.

"విచారించకు శేషగిరి. మీ కుమార్తెకు ఏ లోటు కలుగదు. ఆమెకు అన్నివిధాలా యోగ్యుడైన వరుణ్ణి అన్వేషిద్దాం మా 'సంఘం' కట్టుబాట్లను అనుసరించి పైసా కట్నం లేకుండా ఆమె వివాహాన్ని నేను దగ్గరుండి జరిపిస్తాను.: దైర్యం చెప్పాడు వీరభద్రం.

తన భుజం మీద నున్న వీరభద్రం చేతిని విసురుగా లాగేసి రోషంతో ఊగిపోతూ చెప్పాడు శేషగిరి.

"ఆపండి మీ ఛాదస్తం. పార్లమెంటులో చేస్తున్న చట్టాలకే విలువవ్వని ప్రజలు ఈ పల్లెటూర్లో ఓ సంఘం విధించిన ఆంక్షల్ని లెక్క చేస్తారనుకోవటం మీ మూర్ఖత్వం మిమ్మల్ని నమ్ముకుని నా పిల్ల పెళ్ళికి ఎలాంటి ప్రయత్నాలు చేయక పోవం నా మూర్ఖత్వం ఇప్పటికైనా నాకళ్ళు తెరిపించారు."

వీరభద్రం అతన్ని చేరుకుంటూ ఏదో చెప్పాలని ప్రయత్నించాడు కానీ అప్పటికే శేషగిరి ఆఇంటి గడప దాటాడు.

*             *         *

రామభద్రం మెమోరియల్ పాఠశాల ఉదయం తొమ్మిది గంటల వేళ క్లాసు రూముల్లో మాస్టర్లంతా పిల్లలకు పాఠాలు చెప్పటంలో నిమగ్నమై వున్నారు.

వీరభద్రం తన గదిలో కూర్చుని అటెండెన్సు రిజిస్టరు పరిశీలిస్తున్నాడు. అందులో డ్రిల్లు మాస్టరు అనంతం సంతకం కంపించలేదు.

"డ్రిల్లు మాస్టారు ఇంకా రాలేదా? లేక శలవు పత్రము పంపినారా?" పక్కనే వున్న గురవయ్యను చూసి అడిగాడు.

"అలాంటిదేం రాలేదండీ.' గురవయ్య వినయంగా చెప్పాడు.

"మన అకౌంటెంట్ గారికి చెప్పి డ్రిల్లు మాస్టర్ కిచ్చే శాలరీలో ఒకరోజు వేతనం కటింగ్ చేయమను. అలాగే ఆలస్యానికి సంజాయిషీ కోరుతూ వారికి మేమో ఇవ్వమనండి."

సరిగ్గా అదే క్షణంలో అనంతం మాస్టారి గొంతు వినిపించింది.

"మన్నించండి మహాప్రభో నేను వచ్చేశాను." అటెండెన్సు రిజిస్టర్ మూసేస్తూ గుమ్మం వైపు చూశాడు వీరభద్రం. నమస్కారం చేస్తూ లోపలకు ప్రవేశించాడు అనంతం.

"ఇది పాఠశాల అనుకుంటున్నారా? లేక పాకశాల అనుకుంటున్నారా? ఇంత ఆలస్యమా?" మండిపడ్డాడు వీరభద్రం.

"చిత్తం నిన్న టౌనుకి వెళ్లానండి అక్కడ శుభలేఖలు ప్రింటింగు పూర్తయ్యేసరికి బాగా పోద్దుపోవటంతో లాస్టు బస్సు మిస్సయింది. అందుకని పొద్దున్న ఫస్టు బస్సులో బయల్దేరి వచ్చేసరికి ఈ వేళయింది ఇంటికి కూడా వెళ్ళకుండా ఎకాఎకి ఇక్కడికే పరుగెత్తు కొచ్చేశానండి."