Rupaayi Paapaayi

" రూపాయి - పాపాయి "

రావూరి వెంకట సత్యనారాయణరావు

ధర పెరిగిన తర్వాత... డబ్బు విలువా, దానితో మనుష్యుల విలువా కూడా తగ్గింది. ఏదైనా కొనాలంటే, ఎక్కువ ధర పెట్టడమొక్కటే కాదు. అమ్మే వాళ్ళ చేట అనేక మాటలు పడాల్సి వస్తోంది.

ఇదివరలో ఎవరైనా బేరానికి వస్తే " అయ్యా...బాబు..దయచేయ్యండి. తమరికేం కావాలి.పెద్దలు మీరు మళ్ళీ మా కొట్టుకు రావద్దూ ? ” అంటూ వుండేవారు.

ఇప్పుడీ మాటలెక్కడా వినిపించడం లేదు. " ఏమిటయ్యా నీకేం కావాలి ? ”.

“ తొందరాగా వుంటే వెళ్ళు "

“ అంతకు తక్కువ రాదు. వెళ్ళు వెళ్ళు "

“ ధర తగ్గించాలా !కొన్నాళ్ళుపోయిన తర్వాతరా..”

“నువ్వు రాకపోతే వందమంది వస్తారు.” ఇలాంటి పదజాలం దొర్లుతుంది.

సంసారభారం నెత్తిన పెట్టుకొన్నందుకు ఇవన్నీ భరించి ఆ దుకాన దారుని సింహాసనం మీద కూర్చున్న ఒక మహారాజుగా భావించి,చేతనైతే సీసపద్యం చదివో లేకపోతే వచనంలో పోగిడో, ఆ వస్తువు చేత పట్టుకురావడం తప్పడ లేదు.

కూరల దుకాణాల వద్దకు వెళితే -ఎంత నమ్రత ప్రకటించాలి !కూరలు ఏరుదామంటే " అదేం పనికిరాదు.కావలిస్తే ఇంటికి పట్టుకెళ్ళి ఏరుకో. అక్కరలేకపోతే వెళ్ళిపో " అంటాడు దుకాణదారు.

మొన్న ఒకసారి వంకాయలు కొంటున్నాను.తూచి ఇవ్వబోతున్నాడు.

“రాళ్ళు సరిగా వున్నాయా ? ” అన్నాను.

తక్కెట్లో వంకాయలు గభాలున గ్రుమ్మరించి "తనిఖి వచ్చారా తమరు.అసలు మీకు అమ్మను వెళ్ళు " అంటూ మొదలు పెట్టాడు.ధరల గురించి మాట్లాడకూడదు.సరిగదా -రాళ్ళ విషయం అడక్కూడదు.త్రాసులో వారుంటే అడక్కూడదు. తూకం కొంచెం నిలబెట్టమని అంతకన్నా అడక్కూడదు. పేరుకి మాత్రం -కొందరీళ్ళలో భర్తలున్నట్టు, ఒక పళ్ళెంలో ముఖాలు మారీ,శిఖాలుచెరిగీ అలాపడి వుంటాయి రాళ్ళు.వాటిని గురించి ఆలోచించక్కరలేదు.

రెండో పళ్ళెంలో కూరల్ని కుంచెంతో కొలిచినట్లు కోలుస్తాడు గాని, తూచడం కనబడదు. వ్యక్తుల కడగళ్లకు తోడు ఈ రాళ్ళు ఒకటి ! మా యింటి వద్దకు ఒక ముసలమ్మ కాయగూరలు తెచ్చేది.ఆవిడ దగ్గర ఒకరోజు వున్నా రాళ్ళు మర్నాడు వుండేవికావు.ప్రతిరోజూ మారుస్తుంటే ఎక్కడ అడిగేది !

ఒక రోజైతే పోట్లాడటానికి అవకాశం వుంటుంది గాని. ఆ రాళ్ళు చాలా విచిత్రంగా వుండేవి. శనివారం అన్నీశివలింగాల రూపంలో వుండేవి. ఆదివారం అన్నీ-త్రోక్కుడు బిళ్ళ ఆటలో పిల్లల ఆడే రాళ్ళలాగా గుండ్రంగా వుండేవి.

ఒకనాడు అన్నీ నలచదరం, ఒకరోజున మాత్రం ఒక రాతి ముక్క, ఒక ఇనుపముక్కా వేసుకుని వచ్చింది. శివలింగాలు తెచ్చిననాడు కూరకొనుక్కొని, డబ్బులిచ్చి వాటిని కళ్ళకు అద్దుకు రావడం మావంతు అయ్యేది.

గుండ్రంగా ఉన్న రాళ్ళు తెచ్చిననాడు -ఇవ్వాళ మనపని సున్నా అని లోలోపల పాడుకొంటూ ఇంట్లోకి పోవడం జరిగేది. ఆవిడ దగ్గర భూగర్భ పరిశోధకులకు పనికి వచ్చే రకాలు కూడా కొన్ని వున్నాయేమోనని పిస్తుంది.ఏ రాతితో తూచిన వొప్పుకోవవలసిందే ! సరిగా లేవు అంటే..." కూర తూచి యిస్తా...మీ ఇష్టం వొచ్చిన చోటికి పోయి తూయించుకురండి " అని సవాల్ చేసేది.

మొన్న మా మిత్రుడొకడు కూరల దుకాణానికి వెళ్లి " ఏమిటయ్యా పొట్లకాయ నిండా ఇలా పొడలున్నాయి ? ” అన్నాడట.

“ మనుష్యులకే వున్నాయి.పొట్టకాయకు వుండవా ?అయినా అవన్నీ దోమకాట్లు.మనం దుప్పటి కప్పుకుంటే దూరి కుడుతున్నాయి.దొడ్లల్లో వుండే కాయల్ని కుట్టడం ఆశ్చర్యమేమిటి " అని దబాయించాడట వాడు. మొన్న వేసవి కాలంలో మామిడిపళ్ళు కొంటూ ఒకాయన " డజను కొన్నాగా,పదమూడో పండేది ? ” అన్నాడట.

“ పదమూడో పండు తలపండే " నని ఆ బేరగాడు తట్ట ఎత్తుకుని దబదబా వెళ్లిపోయాడట. మొన్న ఒకావిడ బజారునుంచి వస్తూ పోనీ పిల్లలకేమైనా కొనుక్కుపోదామని మిఠాయి దుకాణానికి వెళ్లి " ఒక బేడ చేగోడిలియ్యి నాయనా " అందట.

ఆ అంగడిదారుడు " బేడకయితే జీడీలు కొనుక్కోవమ్మా " అని ఇచ్చి వేశాడట. ఎక్కడికిపోయినా అణాబేరాలు, బేడా బేరాలు వుండటం లేదసలు.పావలా తక్కువ అయితే ఎవరూ పలకరించరు సరికదా- పైగా విసుక్కుంటారు.వారినేదో అవమానించినట్లుగా. మొన్న ఒకరోజున మా ఇంటికొచ్చిన బంధువుల పిల్లలు బఠానీలు అమ్మే ఆయన్నిమేడమీదకి పిలిచి " ఒక అణా మరమరాలివ్వ " మన్నారట. అక్కడితో ఆయనకెక్కడలేని కోపం వచ్చింది.

“ అణా కోసం ఇన్ని మెట్లేక్కిస్తారా ? పావలా బేరమన్నాలేదే ఎందుకు పిలవాలి ?” అని పోట్లాడాడు. “ మరమరాలి క్కూడా పావలా లెక్కడ పెడతామయ్యా.పిల్లలు అణాణి కొనుక్కుంటారు.అంటే కంటే ఎక్కువదేనికీ ? ” అని ఆ పిల్లల తల్లి వెళ్లి కల్పించుకు చెప్పింది.

“ అణా బేరమని క్రిందవుండగానే చెప్పాలి.లేకపోతే దిగి రావాలి.అంతేగాని, దొరలల్లె కూర్చుని నౌకర్లను పిలిచినట్లు ! ” అని కేకలు పెడుతూ దిగిపోయాడు.అణా బేరాల పరువు అలా వుంది.వస్తువురాకపోగా, కుస్తీలకు తయారవుతున్నారు. అందుకని ఏ బేరానికి వెళ్ళినా, ఎవరిని పిలిచినా భయ వేస్తోంది.ధరలు తగ్గవు.గృహస్థుల దగ్గిర డబ్బులు పెరగవు.ఈ అసందర్భ పరిస్థితుల్లో పడి, కొట్టుకు పోవలసిందే గాని, నెట్టుకు తిగిరే అవకాశం లేదు.

మొన్న ఒకరింట్లో పెళ్లి కొడుకు యాపిల్ కావాలన్నాడట. మామాగారు సణుక్కుంటూనే సైకిలిచ్చి కొడుకుని బజారు పంపాడు.అతడు తిరిగొచ్చి "యాపిల్ రూపాయి చిన్నరకంది " అని చెప్పాడట

ఆ గృహస్థు " బాబోయి రూపాయే "అని ఉలిక్కిపడ్డాడట. కొనితెకపోతే అల్లుడికి కోపం వస్తోంది.ఒక రోజు కొంటె ప్రతిరోజూ అడుగుతాడేమో !ఇలా బాధపడి చివరకు ఒకటి తెప్పించాడట.

ఆయన పెళ్ళాన్ని పాపాయి అని పిలుస్తాడు.ఆ రోజంతా పావుగంట కొకసారి పాపాయి అని ఆవిణ్ణి పిలిచి రూపాయి అంటూ కూర్చున్నాడు.ఈ పాపాయి -రూపాయి గొడవ, అల్లుడి మూడు నిద్రలయ్యే దాకా సాగుతూనే వుంది.