TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
పిచ్చి కు(ము)దిరిందోచ్ !
కన్నోజు లక్ష్మీకాంతం
“ ఏమిటో డాక్టర్ గారూ...ఈ మధ్య కొంతకాలంగా యిదే పరిస్థితి.దయ్యం పట్టిందేమోనని మంత్రాలూ, యంత్రాలు కూడా చేయించినం.బాబాలూ, స్వాముల వద్దకు తీసుకువెళ్ళాం.కానీ ఫలితం కనబడలేదు.అమ్మాయికి పిచ్చి ముదురుతోంది కాబట్టి బొట్టూ బోనమనే పిచ్చి పనులు చేయకుండా వెంబడే పిచ్చి డాక్టర్ కు చూపించమని ఆ ఆయన తమ్ముడు అంటే... మా మరిది పిచ్చి అని చెప్పినందుకు ఇక్కడికి తీసుకొచ్చాను డాక్టరూ...అయితే...” అని ఇంకేదో ఆవిడ చెప్పబోతుండగా...మధ్యలో డాక్టర్ కల్పించుకున్నాడు.
“ అమ్మా...ఒక్క నిమిషం నువ్వు చెప్పడం ఆపితే నేను పేషెంట్ తో మాట్లాడుతాను మరి " అన్నాడు డాక్టర్. ఫింగరావ్ అప్సని పిల్లలకు చూపించినట్టుగా కాసేపు నోరు మూయమని సైగ చేశాడు భర్త.
“ మీరు నన్నిలా నోరు మూయించబట్టే రోగం ముదిరి యింతదాక వచ్చింది.ఇదేదో ఈ బోనాల పండుగప్పుడే చేసుంటే బిడ్డ ఎప్పుడో మంచిదైపోతుండే ! ” రుసరుసలాడింది భార్య.
“ ఆలస్యమైనా మంచి డాక్టర్ దగ్గరికి వచ్చాం కదా !ఇంకేం ఫికర్ లేదు మరి !” మంచి అనే పడ్డానని నొక్కి మాట్లాడుతున్నాడావిడ భర్త. “అదేమరి. ఇంటి సంగతులు ఏ రోజన్నపట్టించుకుంటే... యింత పరేషాన్ నాకు ఉండేది కాదుగా "
“ ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోతున్నాం కదా ! రోగం ముదరకముందు ఈ పని చేసి వుంటే బాగుండేది. ఇప్పుడు ఏం అనుకుంటే ఏం లాభం ? ”
“ ఒక్క నిమిషం ఆగితే...”
“ ఆగకపోతే నేమన్న రోడ్డు పట్టుకుని ఉరుక్కుతున్నానా !”
“ కాసేపు మాట్లాడకు "
“ అమ్మా... తల్లి...మీలో ఎవర్ని పరీక్ష చేయాలో అర్థంకాక నాకు పిచ్చేక్కేట్టుగా వుంది.” రెండు చేతుల్తో తలను పట్టుకుని గట్టిగా పిక్కున్నాడు డాక్టర్.
అదే పనిగా సాగే తెలుగు సీరియల్లో లాగ...ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు అందరూ.
“ డాక్టర్ గారూ...” పిలిచింది ఎవరబ్బా అని మళ్ళీ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. కానీ పరద వెనకాల నుండి పిలిచినట్టు అనిపించి అటుగా చూస్తూ పరదా వెనక్కి వెళ్లాడు డాక్టర్.
“ అయ్యయ్యో !మన మాటల్లో మనముంటే, అమ్మాయీ ఎప్పుడో వెనక్కి పోయిందండీ " అంటూ గుండెలు బాదుకుంది అతని భార్య.
“ అవునా...సరే సరే...డాక్టర్ కూడా వెళ్లాడు కదా ! ” ఆరువందల అరవై సెకండ్ల వరకు అమ్మాయిని పరీక్ష చేసి,ఆమెను బయటికి రమ్మని చెప్పి తనూ బయటికి వచ్చి సీట్లో కూర్చున్నాడు డాక్టర్. అమాయి కూడా బయటికి వచ్చి, డాక్టర్ కి ఎదురుగా కూర్చుంది.
“ చూడండీ...బేసిగ్గా చేసిన పరీక్షల వల్ల మీ అమ్మాయికి ఎలాంటి జబ్బు లేనట్టనిపిస్తుంది. అయితే...చిన్నప్పుడేమైనా పై నుండి, అంటే మెట్ల మీది పడిపోవడం కానీ, లేదా...తల గోడకేసి కొట్టుకోవడం కానీ, ఒకవేళ అలాంటిదేమైనా జరిగివుంటే ఎందుకైనా మంచిది ఒకసారి న్యూరో సర్జన్ కు చూపిద్దాం " అని చెప్పి వాళ్ళని చూశాడు డాక్టర్. ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు భార్యాభర్తలు.
ఎందుకలా చూసుకుంటున్నారో అర్థం కాక, బుర్ర గీక్కున్న డాక్టర్ " అలాంటిదేమి లేదని మీరు ఖచ్చితంగా చెబితే,నేనామెను కొన్ని ప్రశ్నలడిగి,ఆ తర్వాత మందులు రాసిస్తాను. వాటిని కొంతకాలం వాడి చూద్దాం మరి. సరేనా …! ” నెమ్మదిగా చెప్పాడు డాక్టర్.
“ ఎవర్ని అడిగినా ఏం లేదనే చెబుతున్నారు కానీ, ఇదిగో ఈ రోగమని ఎవరూ చెప్పటం లేదు డాక్టర్ " అంది భార్య.
“ నేనూ అదే అంటున్నాను కదమ్మా ! ఏ జబ్బూ లేదు. కానీ ఆవిడ పిచ్చిగా ప్రవర్తిస్తోంది అంతే కదా...తగ్గిద్దాం " అన్నాడు డాక్టర్.
“ మీరే చూస్తున్నారు కదా డాక్టర్.లోపల్లోపల ఏదో గొణుక్కుంటూ...వేళ్ళూ,చేతులూ,ఆ మెడా -ఎలా తిప్పుతుందో చూడండి. నవ్వు రాకున్నా మధ్య మధ్య నవ్వుతూ గాలిలో అలా చేతులు తిప్పడం, కొంకర్లు పోతున్నట్టు చేయడం చూస్తుంటే...” భయంగా అంది భార్య.
“ చాలా కంగారు పడ్డాం డాక్టర్.”
“ ఓకే ఓకే చూడు పాపా...నీ పేరు " ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు డాక్టర్. వినరానట్టు తన లోకంలో తనుంది ఆ అమ్మాయి.
“ చూడమ్మాయి...నీ పేరు చెబుతావా... " ప్రిస్కిప్షన్ రాస్తున్నట్లుగా పేపర్లోకి చూస్తూ అడిగాడు డాక్టర్.
“ సుగాత్రి...మరి నీ పేరు చెబుతావా...! ” అడిగింది అమ్మాయి.
ఎదురు ప్రశ్నతో స్టన్నయిపోయిన డాక్టర్, తదేకంగా ఆమె కళ్ళలోకి చూస్తూండిపోయాడు.
“ నా పేరా... !బయట బోర్డు మీద చూసుండొచ్చు కదా ! లేకుంటే, యీ చీటీ మీదుంటుంది. తర్వాత చూడు ఓకే...” ఏదో వెతుకుతున్నట్టుగా మళ్ళీ ఆమె కళ్ళలోకే చూస్తూండిపోయాడు.
“ మీ పేరు డాక్టర్ కదా ! రోజూ ఉదయం, సాయంత్రం పేషంట్లను చూస్తూ లేట్ గా ఇంటికిపోతే మీ ఆవిడేమనదా...! ” చేతులు వంకర్లు తిప్పుతూ ఆనందంగా అడుగుతోంది ఆ అమ్మాయి.
డాక్టర్ బుర్రలో ఏదో వెలిగినట్టనిపించింది. “ మా ఆవిడతో అప్పుడప్పుడు గొడవలవుతూనే వుంటాయిలెండి "
“ అవునా...పాపం ! మరి ఆవిడను కూల్ చేయడానికి మీరేం చేస్తుంటారు " కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అడిగింది ఆ అమ్మాయి.
“ నా సంగతి చెబుతాగాని, ముందు నీ సంగతి చెప్పమ్మా. ' సుగాత్రీ ' అని అంత చక్కని పేరున్నందుకు గొంతు కూడా బాగుండాలి కదా ! మరి నువ్వు అలా ముక్కుతోటి మాట్లాడుతున్నావేంటి... జలుబు చేసిందా...లేక, కావాలనా....! ” బుజ్జగింపుగా అడిగాడు డాక్టర్.
“ నో...” అదోరకంగా భుజాలెగరేసి " జలుబేం లేదు డాక్టర్ " అంటూ స్టయిల్ గా చెప్పింది.
“ గొంతు ప్రాబ్లమేమన్నావుంటే ఇ.ఎన్.టి స్పెషలిస్ట్ కి చూపిద్దామని "
“ అదేం లేదు డాక్టర్...! మాట జీరబోయినట్టుండాలని ముక్కుతోటి మాట్లాడుతున్నానంతే...”
“ అదేంటమ్మా...గొంతు బాలేకపోతే బాధపడుతూ ట్రీట్ మెంట్ తీసుకుంటారు గాని, నువ్వేంటి... మంచి గొంతునలా మార్చేస్తున్నావు "
“ నేనీమధ్య టీవీ యాంకర్ కావాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను డాక్టర్.”
“ ఓహో...అసలు సంగతి యిప్పుడార్ధమైంది తల్లీ. పుండోకటి అయితే మందోకటి పెడ్తున్నామన్నమాట. ”
“ మా వాళ్లకు చెబితే వద్దంటారు డాక్టర్. అందుకే, బయట ట్రైనింగ్ తీసుకోకుండా, ఇంట్లోనే టీవీ ఛానళ్ళు మార్చి మార్చి చూస్తూ నేర్చుకుంటున్నాను ".
“ మార్చి చూస్తున్నావో, ఏప్రిల్ చూస్తున్నావో గాని చాలా మంచి పని చేస్తున్నావు బేబీ. ఇప్పటికైనా అసలు సంగతి చెప్పి పుణ్యం కట్టుకున్నావు. లేకపోతే...నా మందులు పనిచేయడం లేదని రకరకాల ప్రయోగాలు చేయాల్సివచ్చేది. ” అంటూ విరగబడి నవ్వుతూ అన్నాడు డాక్టర్.
“ యాంకర్ గా నేను కొంత పనికొస్తానంటారా డాక్టర్ " మళ్ళీ కళ్ళూ చేతూలూ తిప్పుతూ అరువు తెచ్చుకున్న నవ్వుతో అడిగింది ఆ అమ్మాయి.
“ తప్పకుండా తల్లీ. అయితే...భాషని కొంచెం ఖూనీ చేయాలి. ఉన్నచోట్ల వత్తులు తీసేసి లేనిచోట్ల తగిలించాలి. ఏం ప్రశ్నలడుగుతారో, ఎందుకడుగుతారో అర్థం కాకూడదు.” అలాగే అన్నట్టుగా అటూ ఇటూ తల ఊపింది ఆ అమ్మాయి.
“ రోజూ పళ్ళు తోముకునే ముఖం కడుక్కుంటారా...అని అడగాలి.నిన్న ఉదయం వండిన పప్పు మిగిలిందనుకొండీ...మాటల్లో పెట్టి మీ వారికి వడ్డిస్తారా... లేక ఏం చేస్తారూ...లాంటి వింత వింత ప్రశ్నలు స్పాంటేనియస్ గా రావాలి " చెప్పాడు డాక్టర్.
“ థాంక్యూ డాక్టర్...”
“ ఇంకా...కీళ్ళ వ్యాధితో వెళ్ళు వంకర్లు పోయినట్టుగా వుండాలి. స్ర్పింగ్ డాల్ లాగా ఒళ్ళంతా తిప్పుతూ ఉండాలి. ఫోన్ బిల్లు వాళ్ళదే కాబట్టి పనికిరాని కబుర్లన్నీ అడగటం నేర్చుకోవాలి. మీ మమ్మీ డాడి అప్పుడప్పుడు తిట్టుకుంటూ, తన్నుకుంటున్నారనుకో...మీరక్కడే వుంటారా...లేక టీవీ పెట్టుకుని చూస్తుంటారా లాంటి తమాషా ప్రశ్నలు కూడా అడుగుతు వుండాలి. మీస్వంతం గాకుండా,ఎక్కడైనా కొంత ట్రైనింగ్ కూడా తీసుకుంటే తప్పకుండా పనికోస్తావు సుగాత్రీ. అలాగే వేసుకునే డ్రెస్ విషయంలో కూడా రాజీపడాలి మరి. ఎనీ హౌ...ఆల్ ది బెస్ట్...ఓకే...” పెద్ద సమస్య తీరిపోయినట్టుగా సుదీర్గమైనా శ్వాసను రిలాక్స్ డ్ గా తీశాడు డాక్టర్.
అంతవరకూ ఆరంగుళాల నోరు తెరచి వింటున్న తల్లికి ఏం మాట్లాడాలో నోటమాట రావడం లేదు. బట్టతల మీదున్న ఆ నాలుగు వెంట్రుకల్ని బరబరా పీక్కున్నాడు ఆవిడ భర్త.
“ థాంక్యూ డాక్టర్...థాంక్స్ లాట్ " ముక్కుతో చెప్పి "బై బై...సీ యూ " అంటూ ప్లయింగ్ కిస్ ఇస్తున్నట్టు గాలిలో చేయూపుతూ అక్కడి నుండి లేచింది ఆ అమ్మాయి. ( యాంకరింగ్ బాగుండాలనే తపన తప్ప, దయచేసి ఎవరినీ విమర్చించడం కాదని మనవి)
|