Rating:             Avg Rating:       848 Ratings (Avg 2.98)

నేనూ - ఇంటాయన 2

Listen Audio File :

Mallik Audio Telugu Short Stories: Latest Collection of  Telugu Short Stories Comedy Three in One by Teluguone

 

నేనూ - ఇంటాయన - 2

 

- మల్లిక్

 

గది సర్దడం పూర్తయింది.
ఇంతలో ఇంటాయన వరదరాజులు చెవికి ట్రాన్సిస్టర్ ఆనించుకుని లోపలికి వచ్చాడు. ట్రాన్సిస్టరులో వెస్ట్రన్ మ్యూజిక్ వస్తుంది.
జించిక్  జించిక్  జించిక్ ... టక్ టక్ ... దడదడ ... జించిక్ ...''
"ఎవబ్బాయ్. గది సర్దడం పూర్తయిందా?''
పూర్తయిందన్నట్టు తల ఊపాను.
"ఇక్కడ సౌఖ్యంగానే ఉంది కదూ?''
"సౌఖ్యంగానే ఉందండీ ...''
"ఏవంటున్నావో తెలీడంలేదబ్బాయ్ ... కాస్త గట్టిగా చెప్పు''
"ఆ దిక్కుమాలిన ట్రాన్సిస్టరు చెవిలో పెట్టుకుంటే ఎలా వినబడుతుంది?'' అప్పుడే గదిలోకి వచ్చిన ఇంటావిడ వరదరాజులు చేతిలోని ట్రాన్సిస్టరు లాక్కుని కట్టేసింది.
"ఆయనకీ సంగీతం అంటే వల్లమాలిన ప్రేమ అబ్బాయ్'' అంది ఆవిడా నాతో.
మరుక్షణం ఆవిడ చూపులు చంచల్రావు మీద పడ్డాయి.
ఆవిడ ముక్కుపుటాలు అడరడం మొదలు పెట్టాయి. పెదాలు వణకసాగాయి. కళ్ళలో నీలు తిరగసాగాయి.
"వదలండి ... వదలండి ... ఛీ ... ఏమిటిదీ?'
చంచల్రావు ఓ నిముషంపాటు గింజుకుని ఆవిడ పట్టునుండి వదిలించుకోగలిగాడు.
"పాపం ఆవిడను మరోలా అనుకోకురా, మన వయస్సున్న కుర్రాళ్ళని ఎవర్ని చూసినా ఆవిడకి వాళ్ళబ్బాయే గుర్తుకు వస్తాడట!'' అని నచ్చ చెప్పాను చంచల్రావుకి.
"అవును బాబూ ... ప్రస్తుతం మా అబ్బాయి మిలిట్రీలో వున్నాడు'' అన్నాడు వరదరాజులు!
"ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు?'' కళ్ళు తుడుచుకుంటూ అడిగింది ఆవిడ.
"ఇతను నా స్నేహితుడండీ ... పేరు చంచల్రావు. ఈయన మా యింటాయన వరదరాజులుగారు, ఆవిడేమో ఏమేవ్ గారూ''
పరస్పరం పరిచయం చేశాను.
"ఉండండి బాబూ ... టిఫిన్ తెస్తాను ...'' అంది ఆవిడ వెనక్కు తిరుగుతూ.
"అబ్బే ఇప్పుడెందుకండీ టిఫిన్లూ గట్రా ...'' చంచల్రావు మొగమాటపడ్తూ అన్నాడు."మా వాడూ అంతేబాబూ ... నేలాగే మొగమాట పడేవాడు ...''
ఆవిడ చంచల్రావును చూస్తూ అంది. ఆవిడ ముక్కుపుటాలు అదురుతున్నాయ్.
నేను రాబోయే ప్రమాదం పసిగట్టాను. చటుక్కున రెండుచేతులు బారచాపి చంచల్రావుకి అడ్డుగా నిలబడుతూ "అబ్బే వాడలాగే అంటాడు ... మీరు వెళ్ళండి త్వరగా టిఫిన్ తీసుకురండి ఏమేవ్ గారూ'' అన్నాను.
ఆవిడ భారంగా కదిలి వెళ్ళింది.
"నువ్వు చాలా అదృష్టవంతుడివి సుమా!'' అన్నట్లు చూశాడు చంచల్రావు. మరేమనుకున్నావ్ అన్నట్టు గర్వంగా తలపంకించాను నేను.
రోజులు గడుస్తున్నాయ్.
చంచల్రావు నా గదికి అప్పుడప్పుడూ వచ్చిపోతున్నాడు. మా ఇంటావిడ నాకు టిఫిన్లూ, కాఫీలూ ఇస్తుంది. అప్పుడప్పుడు భోజనం కూడా పెడ్తుంది. చంచల్రావు ఉంటే నాతోబాటు వాడికీ సకల మర్యాదలు జరుగుతున్నాయ్.
అంతా బాగానే ఉందిగానీ ఎటొచ్చీ ఆవిడకి మిలట్రీలో ఉన్న వాళ్ళబ్బాయి గుర్తుకొచ్చినప్పుడే నాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది.
ఆరోజు మా ఆఫీసులో డిపార్టుమెంటల్ ఎగ్జామ్ కి సంబంధించిన సర్క్యులర్ వచ్చింది. ఆ పరీక్షకి కూర్చుని పాసవుతే ప్రేమోషను వస్తుంది.
"ఈసారి ఎలాగైనా పరీక్ష పాసవాలి!!''
వెంటనే అప్లికేషను ఇచ్చేశాను. ఆఫీసు నుడి చంచల్రావు యింటికి వెళ్ళి వాడికి విషయం చెప్పాను.
"ఇకనేం - ఈ రోజునుండీ చదవడం మొదలుబెట్టు. నువ్వు అలసిపోతే టీ చేసి పెట్టడానికి మీ మమ్మీ కూడా (మా యింటావిడ) ఉందిగా'' అన్నాడు వాడు.
కాస్సేపు వాడితో కాలక్షేపం చేసి నా గదికి వెళ్ళాను.
వరదరాజులు ఆదరాబాదరగా నాకు ఎదురు వచ్చాడు.
"రావయ్యా బాబూ ... ఏవిటీవేళ ఆఫీసునుండి ఇంతాలశ్యంగా వచ్చావ్?'' అన్నాడు ఆయాసపడ్తూ.
"ఏవండీ ... ఏవిటి సంగతి?'' అని అడిగాను.
"కూ ... కూ ...''
లోపలి గదిలోంచి శబ్దం వినబడింది.
"ఏమిటండీ అది?''
"దాని గురించే ... పద చెప్తా'' అంటూ యింట్లోకి లాక్కెళ్ళాడు వరదరాజులు. లోపల హాల్లో మధ్యపాపిడి తీసుకుని అడ్డనామాలు పెట్టుకుని ఉన్న మధ్య వయస్కుడయిన ఒకాయన ఫ్లూటు వాయించుకుంటున్నాడు.
"ఈయన పేరు పీతాంబరం. గొప్ప సంగీత విద్వాంసుడు. ఈ అబ్బాయి బుచ్చిబాబు. అద్దెకు ఉంటున్నాడు'' అంటూ పరిచయాలు చేశాడు వరదరాజులు.
"నమస్తే'' అన్నాను .
"కూ కూ కూ ...'' అతను ఫ్లూటు వాయించాడు.
అంటే నమస్తే అని అర్థం అన్నమాట ఒక్కొక్కప్పుడు ఆయన మాటలకి బదులుగా ఇలా ఫ్లూటునే ఉపయోగిస్తాడు. అందుకే ఆయనకీ "సంగీత వీరమణి'' అనే బిరుదును కూడా ఇచ్చారు.
పరీక్షలు సరిగ్గా నెలరోజుల్లో ఉన్నాయి. చదవడానికి ఆ రోజునుండే ముహూర్తం పెట్టుకున్నాను.
ఎకౌంటెన్సీ పుస్తకం తీశాను.
"కూ ...''
దగ్గర్లో రైలుస్టేషన్ లేదు. మరి ఈ కూ ఎక్కడికి? ....
"కూ .... కూ ... కుక్కుకూ ...''
నాకేదో అనుమానం వచ్చింది.
గబగబా వరదరాజులు పోర్షన్ లోనికి వెళ్ళి తొంగి చూశాను. వరదరాజులు గదిమధ్యలో బాసిపట్టు వేసుకుని కూర్చుని ఫ్లూటుతో అవస్థలు పడుతున్నాడు.
నన్ను చూడగానే సంతోషంగా గావు కేకపెట్టాడు.
"ఏమేవ్ ... నా మొదటి శ్రోత వచ్చేశాడు ...''
ఏమేవ్ వచ్చింది.
"రా బాబూ ... రా కూర్చో ...''
"అబ్బే ఏం లేదండీ ...'' అన్నాను.
"ఇంతకీ ఇది మీకు ఎక్కడిదండీ'' నీరసంగా అడిగాను నేను.
"ఈయన తెగ ముచ్చటపడుతుంటే మద్రాసెళ్ళే ముందు ఆయన ఇది ఇచ్చివేశారు బాబూ!''
నాకు చిర్రెత్తుకొచ్చింది.
"కదోయ్ ... కాస్త వచ్చింది కదూ?'' సంబరపడిపోతూ అడిగాడు.
నేను నీరసంగా అవునన్నట్టు తల ఊపాను.
"ఇప్పుడు చూడు ... కు కు కీకీ కూ''
నాకు ఎగ్జామ్స్ గుర్తుకు వచ్చి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
హారర్ ... నేను కరుణ రస రాగం వాయిస్తున్నానని నీకెలా తెల్సూ? చూశావే ... ఇతని కళ్ళలో నీళ్ళు తిరిగాయ్ ... త్వరలో నేనూ సంగీత విద్వాంసుణ్ణి అయిపోతా''
అలా నన్ను ఓ గంటసేపు చిత్రహింస పెట్టాడు వరదరాజులు.
కాకా కీకీ కూకూ అంటూ అతను ఫ్లూటు వాయిస్తుంటే"క'' గణితం లాగా ఉంది.
"ఇహ నే వస్తానండీ'' అంటూ లేచాను.
గదికి వెళ్ళి ఉదయం అయిదు గంటలకు అలారం పెట్టుకుని పడుకున్నాను.
ఉదయం అలారం మ్రోగగానే లేచి పుస్తకం పట్టుకున్నాను.
"కూ ...''
వరదరాజులు పోర్షన్లోంచి వినబడింది.
నా నవనాడులూ క్రుంగిపోయాయ్.
"కుకూ ... కుక్కూకూ ...''
పుస్తకం విసిరికొట్టి లైటార్పి పడుకున్నాను.