Nagaram lo Garam Garam

Nagaram lo Garam Garam

నగరంలో గరం గరం

రావు కృష్ణారావు

జంయ్...మని వచ్చేస్తున్నాడు సుబ్బారావు.విజిల్ వేసి ఆగమంటూ సైగ చేశాడు పోలీసు కానిస్టేబులు.రోడ్డు కిరువైపులా స్కూటర్లు,మోటారు సైకిళ్ళు పార్కు చేసి ఉన్నాయి.ఒక చోట జనం చాలామంది గూమికూడి ఉన్నారు.

“ లైసెన్సు, సీ బుక్కూ అన్నీ ఎస్.ఐ. గారికి చూపించండి " అన్నాడు కానిస్టేబులు.

“ ఓరి దేవుడోయ్ !ఇదో అరగంట పడుతుంది.” అనుకుంటూ స్కూటరు స్టాండు వేసి " సార్..సార్...డా..ఏవీరావు గారి అప్పాయింటుమెంటుకి టైమైపోతోంది.అన్నీ ఉన్నాయి. ఒక్కసారి మీరు చూసేయండి ప్లీజ్ ! ” అని బతిమాలాడు సుబ్బారావు.

“ అలా కుదరదు.వాళ్ళందరికి పనిలేక అక్కడ నిలుచున్నారా ? అయినా ఎస్.ఐ. గారుండగా అని నేను చూడకూడదు రూల్సోప్పుకోవు. గాడిద పని గాడిదే చేయాలి " అన్నాడు కానిస్టేబులు.

జనం గుమికూడి వున్న వైపు పరిగెట్టాడు సుబ్బారావు.ఎస్.ఐ.కనిపించడం లేదు. అభిమాన్యుడ్ని తలుచుకొని మధ్యకు దూసుకుపోయాడు. కనుబొమ్మలు పైకెత్తి కళ్ళెర్ర చేశాడు ఎస్.ఐ.

“ సారీ...సర్ !మూడు నెల్లక్రితం ఫిక్స్ చేసుకున్న డా.. ఏ.వీ.రావు గారి అప్పాయింటుమెంటు ఆరు గంటలకుంది.ఈ ఛాన్సు మిస్సయితే మళ్ళీ మూడు నెల్ల వరకూ దొరకదు.నా లైసెన్సూ అవీ చూసి పంపించేయండి సార్ ! ” చాలా దీనంగా బతిమాలాడు సుబ్బారావు.

“ ఏమిటి ప్రాబ్లమ్ ?” అడిగాడు ఎస్.ఐ.

“ కడుపునొప్పి సార్ ! మా మిసెస్ కి !” చెప్పాడు సుబ్బారావు.

“ మూడు నెల్ల నుండి తగ్గలేదా ? ”ఎలా భరించదయ్యా ఆ మహాతల్లి ? ” చేతులు జోడిస్తూ అన్నాడు ఎస్.ఐ.

“ అబ్బే...అప్పుడే తగ్గిపోయింది సార్ !” చెప్పాడు సుబ్బారావు.

“ మరెందుకు ? ” కొంత ఆశ్చర్యబోతూ అడిగాడు ఎస్.ఐ.

“ మళ్ళీ వస్తే ఏం చెయ్యాలో...రాకుండా ఏం చెయ్యాలో...అయినా దొరక్కదొరికిన ఏవీ రావు గారప్పాయింటుమెంటెలా వదిలేసుకుంటాం సార్ ! ” అన్నాడు సుబ్బారావు.

“ సరే...ఇలా ఇయ్యి...ఏమిటివి ? జిరాక్స్ కాపీలా ? రూల్సోప్పుకోవు ! ఒరిజినల్సుండాలి " విసుగ్గా అన్నాడు ఎస్.ఐ.

“ అవీ ఉన్నాయి సార్ ! ” అంటూ అందించాడు సుబ్బారావు.

“ ఒరిజినల్సుంచుకొని కాపీలు చూపిస్తావా ? ఏం తమాషాగా ఉందా ? లేక ఏదైనా మతలబుందా ? ” కళ్ళెర్ర చేస్తూ అడిగాడు ఎస్.ఐ.

“ లేద్సార్...ఓ సారి బ్రేకిన్సపెక్టరుకు ఒరినజల్సు చూపిస్తే ' బండ్లో ఒరిజిన్సలేందుకు ? పాడయితే మళ్ళీ డూప్లికేట్స్ కావాలంటూ మమ్ముల్ని చంపడానికా !కాపీలుంచుకొ చాలు ' అని తిట్టాడు సార్ !అందుకని పోలీసుల కోసం ఒరిజనల్స్, బ్రేకిన్సపెక్టర్ కోసం జిరాక్స్ కాఫీలు రెండూ ఉంచుతున్నాను.కంగారులో మీకు కాపీలందించాను అంతే " చెప్పాడు సుబ్బారావు.

“ కాపీలు చాలన్న వెధవనిలా రమ్మను.బూటుకాలితో తంతాను...సరే ! వెళ్ళు " అన్నాడు. ఎస్.ఐ. సుబ్బారావు ఆగమేఘాల మీదింటికి, అక్కడ్నుంచి సరితను తీసుకుని డా...ఏ.వీ.రావు గారి క్లినిక్కి పరిగెట్టించాడు స్కూటర్ని.

“ సారీ ! యువార్ వెరీ లేట్ !” అంది రిసెప్షనిస్టు.

“ టైముకే వచ్చాం కదా మేడమ్ ?” అన్నాడు సుబ్బారావు.

“ మీ అప్పాయింట్ మెంటు ఆరుగంటలా ఒక్క నిమిషానికి. మీరు తొంబై సెకన్లు ఆలస్యంగా వచ్చారు.” చెప్పిందావిడ.

“ సారీ ! మేడమ్... ఏదోలా చూడండి. ప్లీజ్ " బతిమాలాడు సుబ్బారావు.

“ వీల్లేదండీ !..రూలు ప్రకారం పది నిమిషాలు ముందే మీరిక్కడుండాలి.అయినా ముప్పై సెకండ్ల వరకు ఆలస్యాన్ని పర్మిట్ చేస్తున్నాం. ఆ తర్వాత మా చేతుల్లో లేదు.రూల్సోప్పుకోవు. నెక్స్ టైమ్ అప్పాయింట్ మెంటు ఆరునెల్ల తర్వాతుంది ఇవ్వమంటారా ?” అడిగింది రిసెప్షనిస్టు.

“ వద్దులెండి " అనేసింది సరిత.

హాలంతా ఖాళీగా ఉండటం గమనించిన సుబ్బారావు " పేషెంట్లేవ్వరూ లేరు కదా !లోపలున్న వాళ్ళు వచ్చింతర్వాతైనా పంపండి ప్లీజ్ !” బతిమాలుతున్నట్టు అన్నాడు సుబ్బారావు.

“ లోపలెవరూ లేరు. మీరే ఆఖరి పేషంటీ రోజుకి. డాక్టరు గారు కూడా స్టెత్ గిల్లుకుంటూ కూర్చున్నారు.” చెప్పిందావిడ.

“ మరింకేం మమ్ముల్ని పంపొచ్చు కదా !” ఆశగా అడిగాడు సుబ్బారావు.

“ రూల్సోప్పుకోవు.ముప్ఫై సెకండ్లు దాటి ఒక్క సెకను లేటయినా పంపం " చెప్పిందావిడ. “ మరయితే డాక్టరు గారు వెళ్ళిపోవచ్చు కదా !” ఎడుపూ, కోపం కలగలపిన గొంతుతో అడిగాడు సుబ్బారావు.

“ అన్నీ టైము ప్రకారం జరగాలి.ఆరు గంటలా ముప్ఫై తొమ్మిది నిమిషాలకే డాక్టరు గారు రూమ్ లో నుండి బయటికి వస్తారు.ఆరు గంటలా నలబైయ్యెదు నిమిషాలకు 'జలూక 'నర్సింగ్ హోమ్ కి చేరతారు " అని ఒక నిమిషమగి...“ మీ కంతగా అర్జెంటయితే మీరెళ్ళి ఆ నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ అయితే డాక్టరు గారు చూస్తారు " చెప్పింది రిసెప్షనిస్టు.

“ అడ్మిట్ అవ్వాలా ?” ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు.

“ అవును.నర్సింగ్ హోమ్ లో అవుట్ పేషంట్స్ చూడరు.రూల్సోప్పుకోవు.” చెప్పిందావిడ . “ అడ్మిషనంటే చాలా తతంగం కదా !రూము, బెడ్లూ, టెస్ట్ లు...” నసిగాడు సుబ్బారావు. “ మీరొట్టి అమాయకుల్లా ఉన్నారే...రూలు ప్రకారం ఇన్ పేషంట్లను మాత్రమే చూడాలి.కాబట్టి అడ్మిషను పేపరు మీదే చూపిస్తారు. దానికి రెండొందలు అదనంగా కట్టాలి.అంతేగాని రూమూలూ, బెడ్లూ ఏమీ అక్కర్లేదు " నవ్వుతూ చెప్పిందావిడ.

“ మీ రూల్సు మండిపోనూ...” సన్నగా దీర్ఘం తీసింది సరిత.

“ వా....ట్ ?” కోపంగా గర్జించింది రిసెప్షనిస్టు.

“ ఏమీ లేదు " అంటూ సరిత జబ్బపుచ్చుకొని బయటకు లాక్కొచ్చాడు సుబ్బారావు.

“ ఎలాగూ వచ్చాం. 'ప్రియా బ్రదర్స్ 'ఇక్కడికి దగ్గరే కదా ! వెళ్లి చీరలు చూద్దామండీ " అంది సరిత. “ సరే పద " అన్నాడు సుబ్బారావు.

ప్రియా బ్రదర్స్ షాపుకి అర కిలోమీటరు దూరంలో పార్కింగ్ ప్లేస్ దొరికింది.స్కూటరు పార్కు చేసి నడుచుకుంటూ షాపు దగ్గరికు చేరారు.పెద్ద క్యూలో చివర్న నుంచున్నారు.అరగంట తర్వాత గేటు దగ్గరకు చేరుకున్నారు.ఒకావిడెవరో బయటకు వచ్చింది.

“ ఒకరు వెళ్ళండి " అన్నాడు గేట్ మన్.

“ మేం ఇద్దరం వెళ్ళాలి " అన్నాడు సుబ్బారావు.

“ ఇంకో మనిషి బయటకొస్తే గాని మీ ఇద్దర్నీ పంపను. రూల్సోప్పుకోవు.” అన్నాడు గేట్ మన్.

“ భార్యాభర్తలోచ్చినప్పుడు ఒకర్నే పంపుతానంటే ఎలా ?” కోపంగా అడిగాడు సుబ్బారావు. “ లోపల వెయ్యిమంది కంటే ఒక్కరూ కూడా ఎక్కువుండటానికి వీల్లేదు.ఊపిరాడక చస్తారు ". మరొకావిడ బయటకొచ్చింది. సుబ్బారావు, సరిత లోపలికి వెళ్లారు. చాలా పెద్ద హాలు.రకరకాల విభాగాలున్నాయి.అన్ని చోట్ల జనం గుమిగూడి ఉన్నారు.'అబ్బ ఎంత జనం 'అనుకున్నాడు సుబ్బారావు. హాలులో ఓ మూల పెన్సింగుంది.లోపల ఇసకేస్తే రాలనంత మందున్నారు. కుతూహలంగా అటు వెళ్ళబోయారిద్దరూ ! మగవాళ్ళు వెళ్ళ కూడదంటూ అడ్డుపడ్డాడో సైంధవుడు.

“ ఈ మందలో తప్పిపోతే వెతికి పట్టుకోవడానికి గంట పడుతుంది.” సాలోచనగా అన్నాడు సుబ్బారావు.

అప్పుడే సుందరమ్మ గారు చేతిలో సంచితో వగర్చుతూ ఫెన్సింగ్ లోపలి నుండి బయటికొచ్చారు.

“ ఏమిటండీ విశేషం ?” అనడిగింది సరిత.

“ ఒకటికొంటే నాలుగు ఫ్రీ. శనిప్రియ స్క్రీము కింద ప్రతి శనివారం ఉంటుంది ఆఫర్. నేను పత్రి శనివారం వస్తాను.తోసుకొనెళ్ళి ఇవి తీసుకునే సరికి ప్రాణం పోయినంత పనైంది " ఆయాస పడుతూ చెప్పిందావిడ. అయినా ఆవిడ మోహంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపోస్తోంది. “ ఇంతకీ ఏమేం ఉన్నాయి ?” అడిగింది సరిత.

“ ఈ వారం మిడీలు, జీన్స్ పెట్టారు.ఒక్కోవారం ఒక్కోరకం పెడతారీ స్కీముల్లో "

“ అవి మీకెందుకు ? మీ ఇంట్లో పిల్లల్లేరు కదా ?” అడిగింది సరిత.

“ ఒకటికి నాలుగు ఫ్రీ అంటే మాటాలా ?” సంతోషంగా చెప్పింది సుందరమ్మ గారు.

ఇక చాలు పదమన్నట్టు సరితను మోచేయితో పొడిచాడు సుబ్బారావు. ఒక చోట చీరలు ఓ కొండలా పోసున్నాయి. దాని చుట్టూ జనం. ఓ చీరందుకని దాని పైన స్లిప్ చూసి కళ్ళు తిరిగినట్టయ్యి పక్కావిడ మీద పడబోయాడు సుబ్బారావు. సరిత అతని చెయ్యి పట్టి పడకుండా ఆపి " ఏమిటి ? ఏమయింది ?” అనడిగింది.

" ఈ చీర ఖరీదు ఇరవై వేలట" ఆశ్చర్యంగానూ, నీరసంగానూ చెప్పాడు సుబ్బారావు.

" కంగారు పడకండి. నైంటీనైన్ పెర్సెంటు డిస్కౌంట్ అంటే ఆ చీరను మనకు రెండొందల కొస్తుంది." భర్త అమాయకత్వానికి అందరూ నవ్వుతారేమోనని అటు ఇటూ చూస్తూ నెమ్మదిగా చెప్పింది సరిత.

కాని ఎవరూ వీళ్ళని పట్టించుకొనే స్థితిలో లేరు. సుబ్బారావు సిగ్గుపడిపోయి ఒకడుగు వెనక్కు వేసి దిక్కులు చూడసాగాడు ఓ మూల పెద్ద బేనరు కట్టుంది.దానికింద చాలా మంది మగవాళ్ళున్నారు.ఆ బేనరు మీద యాపొ జీన్స్ ముష్టి మూడు వేలకే అని రాసింది. ఆశ్చర్యంగా నోరు తెరుచుకొని ఉండిపోయాడు సుబ్బారావు.

" అవి మీకు బాగుంటాయేమో చూస్తారా ? ” అడిగింది సరిత.

సుబ్బారావు ఉలిక్కిపడ్డాడు.వెంటనే కోపంగా " ఏం వేళాకోళామా " అన్నాడు. అతనికి ఎందుకు కోపం వచ్చిందో ముందు సరితకి అర్థం కాలేదు.తర్వాత అర్థమయి " సారీ నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదు " అంది.

“ ఇంకే ఉద్దేశ్యంలో అన్నావు ? నేను జీన్సు ఎప్పుడైనా తొడిగానా ?” కోపంగా ప్రశ్నించాడు. సరిత మొహం చిన్నబోయింది.

“ అది కాదండీ...మీకు ఖరీదయిన బట్టలు లేవు కదా అని అన్నాను. అంతే ! నన్ను నమ్మండి " అంది. ఆమె మొహం చూసి సుబ్బారావు కోపం తగ్గింది.

" నీక్కావలసినవి త్వరగా తీసుకో...వెళ్దాం " అన్నాడు. ఇద్దరూ బయటపడి స్కూటరు వేపు నడుస్తున్నారు.కూల్ డ్రింకుల షాపు దగ్గరకు రాగానే " దాహం వేస్తోంది కూల్ డ్రింక్ తాగుదాం " అంటూ షాపు దగ్గరాగి జిప్సి డ్రింకు లిమ్మన్నాడు సుబ్బారావు.

అవి లేవన్నాడు షాపువాడు. షాపు దగ్గర నిలబడి 'హాండ్సప్ డ్రింకులు తాగుతున్న నలుగురు యువకులలో ఒకడు " అది చిన్న పిల్లల డ్రింకు బుజ్జీ !చిల్డ్రన్స్ పార్కు దగ్గర అమ్ముతారు వెళ్ళు " అన్నాడు. మిగతా ముగ్గురూ గొల్లున నవ్వారు. సుబ్బారావుకి కోపం వచ్చింది. ఏదో అనబోయెంతలో సరిత " వెళ్దాం పదండి " అంటూ లాక్కుపోసాగింది.

వెనుక నుండి ఒకడు " ఎన్నాళ్ళిలా ! చిన్నపిల్లాడిలా " అని కేకేశాడు. సుబ్బారావు వెనక్కి చూశాడు. మరొకడు హాండ్సప్ డ్రింకు బాటిలు చూపిస్తూ " నీకిది తాగేంత దమ్ముందా బుజ్జీ " అన్నాడు.

మళ్ళీ అందరూ వెకిలిగా నవ్వారు. సరిత వదలకుండా లాక్కుపోయింది సుబ్బారావుని. స్కూటరు పార్కు చేసిన దగ్గరికి వెళ్ళే సరికి సాయంత్రం సుబ్బారావు స్కూటరును ఆపిన కానిస్టేబులు నవ్వుతూ స్కూటర్ పక్కనే నుంచుని ఉన్నాడు. " ఏ.వీ. రావుగారి అప్పాయింటుమెంట్ అయిపోయిందా ? ” వెటకారంగా అడిగాడు పోలీసతను .

“ లేదు తొంబై సెకండ్లు ఆలస్యమయిందని పోమ్మందా రాక్షసి " చెప్పాడు సుబ్బారావు.

“ నిజంగా ?” అన్నాడు పోలీసు. సరిత తన బ్యాగ్ లోంచి స్లిప్ తీసి చూపించింది.

" ఆవిడెవరో మా అక్కలాగుందే ఓసారి వెళ్లి చూడాలి. సరే గాని...డబ్బులేమైనా మిగిలాయా ? ” అడిగాడు పోలీసు.

“ ఎందుకు ? తన స్కూటర్ పార్కింగు మార్జిను దాటలేదని కన్ ఫర్మ్ చేసుకొంటూ " అనుమానంగా అడిగాడు సుబ్బారావు.

“ పైను కట్టడానికి ! వంద చాలులే ! ” చిరునవ్వుతో అన్నాడు కానిస్టేబులు.

స్కూటర్ పార్కింగ్ మార్జినులోనే ఉంది కదా !పైనేందుకు ?” కోపంగా అడిగాడు సుబ్బారావు. “ స్కూటర్ మార్జినులోనే ఉంది.కాని స్కూటరు నీడ గీతదాటి రోడ్డు మీదికొచ్చింది.రూలు ప్రకారం స్కూటరుకు సంబందించినడి ఏది గీత దాటి బయటికి రాకూడదు.” అన్నాడు పోలీసు .

“ స్ట్రీట్ లైట్ కాంతిలో స్కూటరు నీడ గీత దాటితే దానికే పైనేమిటండి నాబొంద ! అలా చూడండి...పొడవంత కారు రోడ్డు మీదే పార్క్ చేశారు.వాళ్ళనేమీ చెయ్యరు.మేమే లోకువ !” ఉక్రోషంగా అన్నాడు సుబ్బారావు.

“ కారా " ఏదీ ? నాకు కనబడదేం ? అయినా మాకు కార్ బ్లయిండ్ నేన్సుంటుందిలే. నీ మంచి కోసమే చెబుతున్నా...నాతో మాట్లాడితే మాట్లాడవు కాని. ఎప్పుడూ అలా మాట్లాడకు. పోలీసులకు ఎదురు ప్రశ్నలేయకు !పోటా కింద ఆరెస్ట్ చేసేస్తారు.నేను మంచివాడిని కాబట్టి సరిపోయింది.నువ్వైనా చెప్పు చెల్లెమ్మా " అంటూ స్కూటర్ ఇంజన్ డోరు తీసే ప్రయత్నం చేయసాగాడు పోలీసతను.

“ అది తీయకండి " అంటూ వందనోటు అందిచ్చాడు సుబ్బారావు.

“ రేపోసారి స్టేషన్ కొచ్చి రశీదు తీసుకో !ఇక వెళ్ళండి.నేను ఈ స్కూటర్ వాళ్ళంతా వచ్చే వరకూ ఇక్కడే చావాలి " అన్నాడు పోలీసతను.

ఉస్సురంటూ స్కూటరు తీసి స్టార్ట్ చేశాడు సుబ్బారావు.