మై డియర్ రోమియో - 5

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 5

 

స్వప్న కంఠంనేని

 

ఇంతలో వున్నట్లుండి క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ అంతా లేచి బిలబిలమంటూ అటూ ఇటూ పరుగెత్తసాగారు.
క్షణాల మీద క్లాస్ రూమ్ ఖాళీ అయిపొయింది.
ఏంటో అర్థం కాకపోయినా వైభవ్ కూడా అయోమయంగా బయటికి పరిగెత్తాడు.
బయటికి వెళ్ళాక తన క్లాస్ మేట్ సురేష్ అనే అతన్ని అడిగాడు.
"బాంబ్ పెట్టారన్న ఇన్ ఫర్మేషన్ ఏదైనా వచ్చిందా?
సురేష్ కంగారుపడ్డాడు.
"బాంబేంటి? ఏ బాంబు? అక్కడా? ఎందుకు?'' అన్నాడు తికమకగా.
ఏసారి విస్తుపోవడం వైభవ్ వంతయింది.
"మరి ఎందుకంతా అలా పరిగెత్తుకుంటూ బయటకొచ్చారు? అడిగాడు.
గొల్లున నవ్వాడు సురేష్.
అలా నవ్వుతూనే క్లాసందరినీ పిలిచి వైభవ్ సందేహాన్ని గురించి చెప్పాడు.
మొత్తం అందరూ పగలబడి నవ్వసాగారు.
వాళ్ళెందుకలా నవ్వుతున్నారో వైభవ్ కి అర్థంకాలేదు.
మొహం చిట్లించాడు.
చిరాగ్గా పెట్టిన అతని మొహాన్ని చూసి వలలు అతి కష్టం మీద నవ్వాపుకుని చెప్పారతనికి.
"మేమెందుకు బయటకొచ్చేశామంటే సైన్స్ అండ్ సివిలైజేషన్ లెక్చరర్ క్లాస్ లోకి రాబోతున్నాడు కాబట్టి''
"అర్థం అయ్యేట్టు చెప్పవచ్చు కదా. సైన్స్ అండ్ సివిలైజేషన్ లెక్చరర్ క్లాస్ లోకి వస్తే ఏమైందట?'' విసుగ్గా అన్నాడు వైభవ్.
"అంటే సైన్స్ అండ్ సివిలైజేషన్ క్లాస్ కి కూడా అటెండ్ అవుదామనేనా?'' ఆశ్చర్యంగా అడిగారు వాళ్ళు.
"అటెండ్ అయితే ఏం?'' అన్నాడు వైభవ్.
"ఆ సబ్జెక్ట్ లో వట్టిగా పాసయితే చాలు తెలుసా? ఆ మార్క్స్ పర్సెంటేజీలో కలపరు'' అన్నాడొకడు.
పైగా వెళ్తూ వెళ్తూ "ఇంకా నయం మా దగ్గరంటే అన్నావుగానీ ఇంకెక్కడా ఈ కూత కూయకు. నీ పరువు గంగలో కలుస్తుంది'' కిసుక్కున నవ్వుతూ అన్నాడు సురేష్.
"ఈ సిటీ ఏంటో? ఈ చదువులేమిటో? వీళ్ళు మిగతా క్లాసెస్ కి మాత్రం సరిగ్గా అటెండ్ అయితే కదా ఈ క్లాస్ కి అటెండ్ అవకపోవడానికి. ఈ సబ్జెక్ట్ లో పాసయితే చాలట. అక్కడికి మిగతా సబ్జెక్ట్స్ లో వీళ్ళకేదో తొంభైశాతం మార్కులోస్టున్నట్టు'' అనుకున్నాడు వైభవ్.
మళ్ళీ అంతలోనే తనలో తను రహస్యంగా అనుకున్నాడు "ఇంకా నయం! హానిత, మీనాలు నా మాటలు వినలేదు. విన్నారంటే జీవితాంతం నన్ను ఆట పట్టించేవారు. అవునూ ఇంతకూ వీళ్ళేరి?''
ఈలోగా ఎదురుగా వస్తున్న హానిత. మీనా, రాజాలని చూసి కావాలని మొహం గంటు పెట్టుకుని తల దించుకుని అవతలికి నడిచాడు.
హానిత వైభవ్ ని చూసి విజిలేసింది.
వైభవ్ మొహం కోపంతో ఎరుపెక్కింది.
వెళ్ళి మెట్ల పక్కనున్న లాన్ లో కూర్చుని హానిత వాళ్ళకెళా బుద్ధిచెప్పాలా? అని సీరియస్ గా ఆలోచించసాగాడు.
ఈలోగా అతని దృష్టి మెట్లమీద కూర్చుని చదువుకుంటున్న ఒకమ్మాయి మీద పడింది.
ముక్కు మీదకు జారిన కళ్ళజోడుతో ఆ అమ్మాయి పారిజాత పుష్పంలా స్వచ్చంగా అందంగా వుంది.
చదువుకోడానికే పుట్టినట్లుగా వుందా అమ్మాయి.
ఆమె అలా పుస్తకంలో లీనమై బుద్ధిగా చదువుకుంటుంటే వైభవ్ కి ముచ్చటేసింది.
ఆ అమ్మాయిని చూస్తూ 'ఆ హానిత వాళ్ళు కూడా ఈ అమ్మాయిలా ప్రవర్తించోచ్చు కదా! ఎప్పుడూ పిచ్చి జోకులు పిచ్చి గోల ఛీ ... ఛీ'' అనుకున్నాడు.
"గురుడు లేడీస్ కి సైట్ కూడా కొడ్తున్నాడేవ్?'' అన్న గొంతు వినిపించేసరికి గిరుక్కున వెనక్కి తిరిగి చూసాడు.
ఎప్పుడొచ్చారో ఏమో లాన్ లో తన వెనకే రెండడుగుల దూరంలో కూర్చుని వున్నారు హానిత, రాజా, మీనాలు.
వాళ్ళని చూసి చటుక్కున లేచి నిలబడి పైకి వెళ్ళడానికి మెట్లెక్కసాగాడు వైభవ్.
మెట్లెక్కుతూ మెట్లమీద కూర్చున్న అమ్మాయి ఏం బుక్ చదువుతోందా అనుకుంటూ ఆసక్తిగా పుస్తకంలోకి తొంగి చూసాడు.
ఆమె చదువుతోంది క్లాస్ బుక్ కాడు.
క్లాస్ బుక్స్ మధ్యన అమీర్ ఖాన్ ఫోటో పెట్టుకుని తదేకంగా దాన్నే చూస్తోందా అమ్మాయి.
"హా!'' నిట్టూర్చాడు వైభవ్.
"కాలేజీలో కనీఎసం ఒక్కసారికైనా చదువు మీద ఇంటరెస్టు వుందనుకున్నాను. చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతె పోయిందిగానీ మరీ ఇంత సినిమాల పిచ్చేంట్రా బాబూ'' తనలో తను అనుకున్నాడు.
ఈలోగా వైభవ్ నిట్టూర్పు శబ్దం విని తలెత్తి చూసిందా అమ్మాయి.
గభాల్న కళ్ళజోడు తీసి కన్నుకొట్టి "ఏంటి గురూ''
గతుక్కుమన్నాడు వైభవ్.
ఎవరో తరుముతున్నట్టుగా మెట్లెక్కి కాలేజీ లైబ్రరీలోకి దూరాడు. లైబ్రరీలో కెళ్ళి కూర్చున్నాక అనుకున్నాడు.
"ఈ కాలేజీ ఏమిటో నాకే అర్థం కావడంలేదు. క్లాసెస్ కి అటెండ్ అవకపోయినా ఫర్వాలేదు. కానీ టైంకి రావాలి. టైంకి వెళ్ళాలి. ఇంక ఫోర్ అయ్యేదాకా గేట్లు తెరవరు ఏమిటో ఖర్మ ...''
ఎదురుగా బుక్స్ కనిపించేసరికి వైభవ్ లేచి వెళ్ళి ఫిజిక్స్ కి సంబంధించిన బుక్ ఒకటి తెచ్చుకుని కూర్చున్నాడు.
బుక్ లో లీనమైన వైభవ్ కి టైమే తెలీలేదు.
నాలుగైందనీ, బెల్ మోగిందనీ, లైబ్రరియన్ వచ్చి చెప్పాక బుక్ మూసేసి లేచి నిలబడ్డాడు.
నెమ్మదిగా మెట్లు దిగి తన బైక్ దగ్గరికి వెళ్లాడు.
బైక్ స్టార్ట్ చేయబోతూ టైర్స్ కేసి చూసి హతాశుడయ్యాడు.
రెండు టైర్స్ లోనూ గాలి పూర్తిగా తీసేసి వుంది.
ఆ పని ఎవరు చేసి వుంటారో అతనికి తేలిగ్గానే అర్థమైంది.
పొద్దున్న మీనా తనకోసం ఆగింది తన బైక్ ని చూసి గుర్తుంచుకోవడానికేనని కూడా అతనికి అర్థమైపోయింది.
చేసేది లేక బైక్ ని తోసుకుంటూ బయటకు నడిచాడు.