నేనూ - ఇంపోర్టెడ్ కెమేరా

Listen Audio File :

 

- మల్లిక్

పార్ట్ - 6




 ఫోటోలు బిల్లు పే చేసి మేము స్టేషనుకి వెళ్ళాం. నే నిచ్చిన ఫొటోలన్నీ చూశాడు శివరాం.

    "ఫోటోలు  బాగా రాలేదని బాధ పడకోయ్. మళ్ళీ ఓ రీలు కొని ట్రైచెయ్. రేపు కెమెరా తీస్కుని రా" అన్నాడు.

    మళ్ళీ నూటడెబ్బై రూపాయలు క్షౌరం!     

     "అలాగే" అని చెప్పి నీరసంగా బయట పడ్డాను.

    "ఒరేయ్ అన్నట్టు చెప్పడం మరిచాను.వచ్చేవారం మా చెల్లెలు పుట్టిన రోజు. ఆ రోజు మా ఇంటికి వచ్చి కొన్ని స్నాప్స్ తియ్యాలి నువ్వు" అని నా బుజం తట్టి వెళ్ళిపోయాడు చంచల్రావు.

    నేను గదికి వచ్చేసరికి నా కోసం ఇంటి యజమాని ఎదురు చూస్తున్నాడు.

    "మాజీతాలు ఎల్లుండి కదండీ" అన్నాను నేను ఆశ్చర్యంగా.

    "భలేవాడివోయ్. నేను ఇంటి అద్దెకోసం రాలేదు. నీ దగ్గర ఇంపోర్టెడ్ కెమెరా ఏదో ఉందటగా. కాస్త సర్దాగా మా అందర్నీ ఫోటో తియ్యకూడదూ?" అన్నాడు బట్టతలని బ్రహ్మానందంగా నిమురుకుంటూ.

    "కానీ ఫిల్ముకీ, డెవలపింగ్ కీ, ప్రింట్స్ కీ చాలా ఖర్చు అవుతుంది కదండీ" అన్నాను నీరసంగా.

    "సరేకానీ అబ్బాయ్! వచ్చే నెల్లో మా తమ్ముడు కొడుకొకడు హైదరాబాదులో కాలేజీలో చేర్దామనుకుంటున్నాడు. వాడొస్తే వాడికి గాడి ఇవ్వాలి. ఈ మహానగరంలో అద్దెకు దొరకడం కష్టమే. మరి నీకు ఎలానో ఏంటో పాపం ప్చ్." అన్నాడు.

    "అవును గానీ, ఈ వల సాయంత్రం అందరూ ఇంట్లోనే ఉంటారుగా, ఫోటోలు తీస్తాను" అన్నాను పిడికిళ్ళు బిగించి పళ్ళు కొరుకుతూ.

    "ఉంటాం బాబూ! అయినా నువ్వేం వర్రీ కాకు. వాడిని మరోచోట ఎక్కడైనా అద్దెకి ఉండమని చెప్తాలే" అన్నాడు.

    ఆఫీసుకెళ్ళగానే మా ఆఫీసరుగారు నాకు కబురు పెట్టాడు. ఆఫీసరు గదిలోనికి వెళ్ళాను. అతనుకూడా అదే కూత.

    "నీ దగ్గర ఇంపోర్టెడ్ కెమెరా ఉందని విన్నాను. రేపు నా మనవడికి బారసాల జరుపుతున్నాం. నువ్వొచ్చి ఫోటోలు తియ్యాలోయ్" అన్నాడు.

    నేను ఇబ్బందిగా మొహం పెట్టి చేతులు నలుపుకుంటూ,"హిహిహి" అన్నాను.

    "నీకు వచ్చే నెల ఇంక్రిమెంటు డ్యూ అనుకుంటాను?" అన్నాడు అతను కొంటెగా నన్ను చూస్తూ.

    "రేపే కదండీ వస్తాను. అలాగే హిహిహి. అలాగలాగే" అన్నాను.

    సీట్లో కూలబడి టేబులు కేసి నా తల కసిదీరా బాదుకున్నాను.
                             
    ఆ రోజు రాత్రి ఎవరో తలుపు తడితే లేచి తలుపు తీశాను.

    ఒకతను తిన్నగా గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.

    "ఏంటిది?" అన్నాను గుడ్లు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ.

నా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా "నా డ్రెస్సెలాఉందండీ?" అని నన్ను ఎదురు ప్రశ్న వేశాడు.

    చిలకాకు పచ్చరంగు పంట్లాం మీదికి ఎర్రచొక్కా వేసుకుని ఉన్నాడతను.

    "ఏడ్చినట్లే ఉంది" అన్నాను నేను.

    "కానీ కలర్ ఫోటోకి ఇలా రంగుల బట్ట లేస్కుంటేనే బాగుంటుంది కదండీ" అన్నాడతను.

    "కలర్ ఫోటోనా? అసలింతకీ నువ్వెవరు?" అన్నాను నేను గజగజ వణికి పొతూ.

    "మీ ఇంట్లో ఇంపోర్టెడ్ కెమెరా ఉందని తెలిసి నాలుగైదు ఫోటోలు తీయించుకుందామని వచ్చాను" అన్నాడు.