నేనూ - వచన కవిత్వం - 6

Listen Audio File :

నేనూ - వచన కవిత్వం - 6

- మల్లిక్

  పిచ్చుమణి దగ్గరికి వెళ్ళిన రోజునుండీ నేను అదే పనిగా కవిత్వం రాయడం మొదలుబెట్టాను.

    ఆఫీసులో లంచ్ టైంలో అందరూ తింటున్న సమయంలో గట్టిగా గొంతెత్తి నా కవిత్వం చదువుతూ వాళ్ళకి వినిపించేవాడిని.వాళ్ళు ఇప్పుడు నా గదిలోకాక ఎక్కడికో పోయి లంచ్ చేస్తున్నారు. నాకు పరిచయస్తులు కూడా నేను ఎదురుపడితే ఇదివరకు నవ్వి పలకరించేవారు. ఇప్పుడు ముఖం చాటేసి నన్ను చూడనట్టు వెళ్ళిపోతున్నారు. కొందరైతే కోపంగా కొరకొరా చూస్తున్నారు కూడా.

    ఆఖరికి చంచల్రావు కూడా అలా చేస్తాడని నేను అనుకోలేదు.

    ఆ రోజు-

    చంచల్రావు నా గదికి వచ్చాడు. ఓరెండు నిముషాలు మాట్లాడిన తరువాత "కొత్తగా ఈ వల ఉదయమే ఒక కవిత రాశానోయ్... వింటావా?" అన్నాను.

  మంచం మీదనుండి హఠాత్తుగా లేచి "విననుగాక వినను" అని చెప్పుల్లో కాళ్ళు దూర్చేశాడు.

    నేను వాడి గడ్డం పట్టుకుని బ్రతిమలాడాను.

    "నీకు గ్రీన్ క్యాట్ రెస్టారెంటులో బిర్యాని తినిపిస్తాను" అన్నాను.

    అప్పుడు శాంతించి మంచంమీద కూర్చుని "చిన్న కవితైతే వింటాను" అన్నాడు చంచల్రావు.

 నేను కెవ్వుమని కేకేశాను. ఆ అరుపుకి చంచల్రావు మంచంమీద నుండి దొర్లి క్రిందపడ్డాడు.

    బట్టలూ దులుపుకుని లేస్తూ "ఏంటా అరుపులు? నీ కవిత్వం భరించలేక నిన్ను నేను చంపుతున్నానని అనుకోగల్రు ఎవరైనా?" అని కోపగించుకున్నాడు.

    "ఏం లేదు... ఈ వారం రోజుల్లో నా కవిత్వం వింటానని అన్నది నువ్వొక్కడివే" అన్నాడు సిగ్గుపడుతూ.

    "సర్లే సర్లే... చదువు"

    "మన స్నేహం మీదే కవిత చదువుతా"

    "ఆహ మన స్నేహం

    లేదు మన ఇద్దరిలో ద్రోహం

    లేదు ఇద్దరికీ ఏ మాత్రం అహం

    మంచితనానికి దాసోహం

    అహాహా మన స్నేహం

    ఏదైనా మనం సహం సహం

    మనకి...

    హఠాత్తుగా నా నోరు మూసేశాడు చంచల్రావు.కోపంగా నావైపు చూశాడు. నా చొక్కా జేబు పట్టుకుని లాగాడు. జేబు సర్రున చిరిగి వాడిచేతిలోకి వచ్చింది.నా చెయ్యి పట్టుకుని "దీంతోనే కదూ నువ్వు కవిత్వం రాసేది?"అని చేతి బొటనవ్రేలు చిటుక్కున విరిచి, అ చేతిని వెనక్కి తిప్పి మెలిపెట్టాడు. నేను బాధతో బాబోయ్ అని అరిచాను. వాడు నా చెయ్యి వదిలి నా చేతిలోని కవిత్వం లాక్కుని పరపర చింపేసి గదిలోంచి సర్రున వెళ్ళిపోయాడు.

    ఆ మర్నాడు ఇంటి అద్దెకోసం ఇంటి యజమాని వచ్చాడు.ఆయనకి అద్దె చెల్లించి కుర్చీలో కూర్చోబెట్టి ఓ చిన్న కవిత వినిపించాను.

    "ఇలాగయితే లాభం లేదబ్బాయ్. నిన్ను గాడి ఖాళీ చేయించాల్సి ఉంటుంది" అన్నాడు కోపంగా.

వీళ్లందరికీ నేనంటే ఈర్ష్య... ఎక్కడ పేరు సంపాదించి గొప్పవాడిని అయిపోతానో అని...

    ఎవరు చూసినా నాకు దూరం దూరంగా ఉంటున్నారు. ఆఖరికి నా ప్రాణస్నేహితుడు చంచల్రావు కూడా నాకు దూరం అయిపోయాడు. నాలుగు రోజులైనా చంచల్రావు నాకు కనిపించలేదు.

    ఇలా వంటరిగా వచనకవిగా బ్రతకడం కంటే కవిత్వాన్ని వదిలి అందరికీ దగ్గరవుతూ బ్రతకడం మేలని అనిపించింది నాకు.

    ఆఫీసునుండి చంచల్రావు ఇంటికి బయలుదేరాను.

    కాలింగ్ బెల్ నొక్కాను.

    చంచల్రావు తలుపు తెరిచి నన్ను చూసి ధనేల్ మని తలుపు మూసేశాడు.

    "ఒరేయ్! నేను కవిత్వం రాయడం మానేశాన్రోయ్"గట్టిగా అరిచాను.

    "నిజంగా?" తలుపు తెరవకుండా లోపలినుండి అడిగాడు.

    "నిజంగా ... నీమీదొట్టు"

    నెమ్మదిగా తలుపులు తెరుచుకున్నాయి. నేను చంచల్రావుని కౌగిలించుకుని బావురుమన్నాను.

    "ఊర్కో...ఊర్కో..." చంచల్రావు నా వీపు నిమిరాడు.

    "నువ్వే కదరా నన్ను కవిత్వం రాయమన్నది" అన్నాను వాడిని మరీ గట్టిగా కౌగిలించుకుని.

    "అంటే అన్నానులే... ఇప్పుడొద్దని అంటున్నాగా... ఊరుకో... ఇంక కౌగిలించుకున్నది చాల్లే- వదులు."

    నేను వాడిని వదిలేసి చొక్కా ఎత్తి నా కళ్లు తుడుచుకుని చంచల్రావు వంక చూశాను. వాడు నావైపు కోపంగా చూస్తున్నాడు.

    వాడి చొక్కా మొత్తం ఊడి క్రిందపడి ఉంది. మెడలో మాత్రం వట్టి కాలరు ఉంది.