నేనూ - వచన కవిత్వం - 2

Mallik Audio Telugu Short Stories: Latest Collection of  Telugu Short Stories Comedy Three in One by Teluguone

 

- మల్లిక్

 

నేనూ - వచన కవిత్వం - 2

 

తీరా వాడిని చూశాక నవ్వాగలేదు నాకు. నా బిగి కౌగిలికి వాడి చొక్కా మొత్తం ఊడొచ్చి వట్టి కాలర్ మాత్రం వాడి మేడలో ఉంది.
ఆ కాలరుకున్న బటన్ తీసి దూరంగా విసిరికొట్టి రుసరుస లాడుతూ లోపలికి వెళ్ళి వేరే చొక్కా తొడుక్కొని వచ్చాడు చంచల్రావు.
"ఇప్పుడు చెప్పు. ఏమిటి నీ సమస్య?''
"నేను పేరు సంపాదించాలి ... ఎలాగైనా పదిమందికీ నా పేరు తెలియాలి''
"అసలు నీకీ ఆలోచన ఎలా వచ్చింది?''
"నేను చెప్పను''
"భలే చిక్కు సమస్య తెచ్చావే ...'' బుర్రగోక్కున్నాడు చంచల్రావు.
"అమ్మమ్మ ... అలా అనకు. నీ కాళ్ళు పట్టుకుంటా' వాడివైపు రెండడుగులు వేశాను.
"ఏం? ఈసారి నా ప్యాంటు చింపుదామనా?'' కోరగా చూస్తూ వెనక్కు రెండడుగులు వేశాడు చంచల్రావు.
నేను లెంపలేసుకున్నాను.
"నన్ను కాస్త ఆలోచించనీ ...''
రెండు చేతులూ వెనక్కు పెట్టుకుని అటూ ఇటూ తిరగసాగాడు చంచల్రావు.
"పోనీ నేను సంగీతం నేర్చుకుని మంచి సంగీత విద్వాంసుడిగా పేరు సంపాదించనా? ...ఆ? ... హిహిహి'' చేతులు నలుపుకుంటూ అడిగాను.
"వద్దు .. ఈ వయసులో నువ్వు సంగీతం ఎప్పుడు నేర్చుకుంటావ్? ఎప్పుడు పేరు సంపాదిస్తావ్? దానికి చాలా సంవత్సరాలు పడ్తుంది''
"పోనీ డాన్సు నేర్చుకుంటేనో? ఇంచక్కా గోపీకృష్ణలానో ... కనీసం కమల హాసన్ లానో ...''"షటప్ ... నీ కాళ్ళు పొడవు. నువ్వు డాన్సు చేస్తే ఎక్కువ చేపలు తిన్న సంతోషంతో గెంతే కొంగలా ఉంటుంది''
వాడి కామెంట్ కి నాకు చచ్చేంత ఒళ్ళుమండింది. కానీ నా కోపాన్ని అణుచుకున్నాను. అవసరం నాది మరి.
"నటుడిగా? ...'' మళ్ళీ ఏమంటాడోనని నసిగాను.
"ఊహు ... నీకడీ లాభంలేదు. ఆ టాలెంట్ నీలో కాస్త సహజంగా ఉండాలి. కాస్త తలనొప్పి నటించి మీ ఆఫీసరు దగ్గర పర్మిషను సంపాదించలేవు నువ్వు'' విసుక్కున్నాడు.
"నవలల్రాస్తే?! ...''
చంచల్రావు కెవ్వున కేకేసి నన్ను గట్టిగా పట్టుకున్నాడు.
"ఫర్ ర్ ర్ ...''
ఆ శబ్దానికి భయపడి నన్ను వదిలేసి నా వంక చూశాడు.
"అబ్బే నీ చొక్కా చిరగలేదా!! ...'' తనవైపు చూసుకుని బేర్ మని జుట్టు పీక్కున్నాడు.
"నిన్ను కౌగిలించుకున్నా నా చ్కోక్కానే చిరిగింది''
"జరిగిందేదో జరిగింది. ఇంకెప్పుడూ అలా కౌగిలించుకొమాకు'' వాడి చొక్కా పైకెత్తి వాడి కళ్ళు తుడిచాను.
"ఇంతకీ ఎందుకిలా కెవ్వుమన్నావు?''
"నువ్వు నవల వ్రాయడం అన్నావు కదా? అది నీకు పనికిరానిదేగానీ, అదే రంగానికి చెందిన మరొకటి ఉంది''
"ఏమిటి? నాటకాలు రాయడమా?''
"ఛ ... కాదు. కవిత్వం! ... నీకు అఆలు వచ్చా?''"ఓ ... అఆ,ఇఈ, ఉఊ ...''
"ఛస్ నోర్ముయ్, వచ్చా రాదా అని అడిగాను. అప్పజెప్పమానలేదు''
"వచ్చు'' అన్నాను.
"హుర్రే ...'' చంచల్రావు రెండు చేతులూ చాపి నా దగ్గరికి రాబోయి తన చొక్కా చూసుకుని ఆ ప్రయత్నం మానుకుని "అలాగయితే కవిత్వం రాయడం మొదలుబెట్టు కవిత్వం అంటే ఏ కవిత్వం అనుకున్నావ్? వచనకవిత్వం. అది చాలా తేలిక. ఈ రోజుల్లో రోడ్డుమీద ఎక్కడ చూసినా వీళ్ళే. అందుచేత వచనకవిత్వం రాసి కవిగా పేరు సంపాదించు ... నీకు  గైడెన్స్ కోసం నిన్ను నాకు తెలిసిన వచన కవి పిచ్చుమణి దగ్గరికి పంపుతాను. ఓ ఉత్తరం రాసిస్తాను. ఆయనకు చూపించు నీకు కవిత్వంలోని మెలుకువలన్నీ తెలుపుతాడు.''
"యాహు ...'' సంతోషం పట్టలేక గట్టిగా అరిచి చెంచిని కౌగిలించుకున్నాను.
"ఫ ర్ ర్ ర్ ర్ ''
మళ్ళీ వాడి చొక్కా చిరిగింది.
వాడిని వదిలి దూరంగా జరిగి వాడివంక చూశాను. చొక్కా పీలికలై క్రిందపడి ఉంది. మేడలో మాత్రం చొక్కా కాలరు మిగిలి ఉంది.
$$$$$$$$$$$$$$$$$$$$$$$