నేనూ - వచన కవిత్వం - 1

Listen Audio File :

Mallik Audio Telugu Short Stories: Latest Collection of  Telugu Short Stories Comedy Three in One by Teluguone

 

- మల్లిక్

 

నేనూ - వచన కవిత్వం - 1

 

ఈవేళ ఆఫీసంతా ఒకటే గోల, ఎవరి నోటవిన్నా ఒకటే మాట.
"వెంకట్రావు చచ్చిపోయాడు''
"దేశానికి తీరనిలోటు అతను చనిపోవడం''
వెంకట్రావు చనిపోయినందుకు ఇంతమంది బాధపడ్తుంటే నాకనిపించింది, అతను నిజంగా ధన్యజీవి.
ఈ ఆలోచన నాకు రాత్రంతా నిద్రలేకుండా చేసింది.
అవును ... నేను చస్తే అసలు బాధపడేవాళ్ళు ఎవరైనా ఉంటారా? బాధపడడం మాట ఎలా ఉన్నా మా యింటి యజమాని సంతోషిస్తాడు. మరో పదో పాతికో అద్దె పెంచి మరొకరికి నా గది అద్దెకివ్వొచ్చని.
ఆఫీసులో నాతో పని చేసేవాల్లీ "అయ్యో! పాపం బుచ్చిబాబు పోయాడట!'' అని కాస్సేపు విచారిస్తారు.
నా స్నేహితుడు చంచల్రావు మాత్రం కాస్త ఎక్కువగా బాధపడవచ్చునేమో!!...
అదే పేరున్న ఏ రచయితో, సంగీత కళాకారుడో, కవో, డాన్సరో, నటుడో, ఎవరయినా పొతే దేశం యావత్తు బాధ పడతారు. అదీ జన్మంటే.
తినడం, ఆఫీసుకు వెళ్లడం, మళ్ళీ ఇంటికి వచ్చి తినడం నిద్రపోవడం. ఏమైనా అర్థం వుందా ఈ జీవితానికి?
నాలాంటి వాడు బ్రతికినా ఎవరికీ లెక్కలేదు, చచ్చినా ఎవరికీ లెక్కలేదు. ఏం బ్రతుకు ఇది "థూ ...''
"ఏయ్ మిస్టర్''
ఎవరో గట్టిగా అరిస్తే ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాను. నేను కూర్చునివున్న కిటికీ దగ్గర ముఖం జేబురుమాలుతో తుడుచుకుంటూ కిటికీలోంచి ఎర్రగా చూస్తున్నాడు అతను.
నేను రెప్పలు పైకి ఎగరేశాను ఏమిటన్నట్లు.
"దారినపోయే జనాన్ని చూసుకోకుండా అలా ఉమ్మేస్తే ఎలా?'' గట్టిగా అరిచాడు అతను.
అతని అరుపులకి నాగదిలో తగిలించిన నా డిగ్రీ పటం టప్పున క్రిందపడింది.
నా పొరపాటు అర్థమయింది.
"సారీ ... వెరివెరీ సారీ'' అని కిటికీ తలుపులు మూసేశాను. మళ్ళీ అతను అరిస్తే ఇంకా ఏం పడిపోతాయోనన్న భయంతో.
మళ్ళీ రచయిత గుర్తుకొచ్చాడు.
"ఎందుకొచ్చిన బ్రతుకు ... థూ''
"గదినిండా ఇలా ఉమ్ములేస్తే ఊశావ్ గానీ కాస్త రెండ్రోజులకోసారి పనిమనిషితో కడిగించు'' 
నా గది గుమ్మంముందు నిలబడి కోపంగా చూస్తూ అంటున్నాడు ఇంటి యజమాని.
$$$$$$$$$$$
మర్నాడు ఆదివారం కావడంతో కాస్త ఆలస్యంగా లేచి కాఫీ పెట్టుకుని త్రాగి స్నానం చేసి చెంచల్రావు దగ్గరికి బయలుదేరాను.
"ఏమిటోయ్ కళ్ళంతా ఎర్రగా ఉబ్బి ఉన్నాయ్?'' అని అడిగాడు నన్ను చూస్తూనే చెంచల్రావు.
"రాత్రంతా నిద్రలేదు''
"ఏం? మళ్ళీ ఎవరినైనా ప్రేమించావా లేకపోతే ఇంటాయనతో ఏదయినా త్రాబులా?''
"అదేంకాదు'' అంటూ దీర్ఘంగా నిట్టూర్చాను. ఆ గాలికి గోడకున్న క్యాలెండరు రెపరెప కొట్టుకుంది. చెంచల్రావు క్రాపురేగింది.
"చూస్తుంటే పెద్దగొడవలానే ఉంది'' అన్నాడు క్రాపు సర్దుకుంటూ.
"అవును ... పెద్ద సనస్యే. రాత్రంతా ఆలోచించాను గానీ పరిష్కారమే కనబడలేదు. నువ్వే మార్గం చూపించాలి.'' వాడిని పట్టుకుని గట్టిగా కుదుపుతూ అన్నాను.
"సర్లే సర్లే ... వాదులు''
నేను వాడిని వదిలేసి దూరంగా జరిగాను. వాడివైపు చూసిన నాకు ఆశ్చర్యం వేసింది.
"ఓరి చెంచిగా! మ్యాజిక్కు లెప్పుడు నేర్చుకున్నావ్ రా?''
"ఏం?'' చెంచల్రావు నాకంటే ఎక్కువగా ఆశ్చర్యంగా చూశాడు.
"ఇందాక నేనొచ్చినప్పుడు నీ చొక్కా బాగుంది. ఇప్పుడు ఒంటిమీద ఉన్నది ఉన్నట్టుగానే మొత్తం చిరిగిపోయి ఉందేమిటి!''
చెంచల్రావు ఓసారి తన చొక్కావైపు చూసుకుని గట్టిగా రంకెవేశాడు.
"మ్యాజిక్కులా నా బొందా? ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకుని గట్టిగా కుదిపినప్పుడు చిరిగిపోయి ఉంటుంది. అసలే పట్టుతప్పిన పాతచొక్కా కదా?''
వాడి చొక్కా చిరిగినందుకు నాకు బాధ కలిగింది. నా ముక్కు పొంగింది.
"నన్ను క్షమించరా'' గభాలున వాడిని గట్టిగా కౌగిలించుకున్నాను.
"ఫర్ ర్ ర్ ...''
"ముందు నన్నొదల్రా'' గట్టిగా అరిచాడు చెంచల్రావు.
ఆ అరుపుకి గుండెలవిసిపోయి వాడిని వదిలేశాను.