TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
నేనూ - దొంగాడూ - 4
- మల్లిక్
కెవ్వున అరిచాడు రాంలు. వాడి ముఖం అంతా చెమట కమ్మేసింది నిలువెల్లా వణికిపోసాగాడు. మిగతా వాళ్ళందరూ అటు చూడలేక తమలో తాము గుసగుసగా మాట్లాడుకొంటూ ఛలోక్తులు వేసుకుంటూ నిలుచున్నారు.
అయిదు నిమిషాలు గడిచాయి.
రాంలు హఠాత్తుగా ఏడవడం మొదలుపెట్టాడు.
"నన్నిడిసి పెట్రూండి, దొరా ... ఇంకెప్పుడూ దొంగతనం చెయ్యను'' అన్నాడు వాడి కళ్ళమ్మట నీళ్ళు కారుతున్నాయి.
నేను చంచల్రావు వంక చూశాను.
"ఊహు ... అంత త్వరగా లాభం లేదు ... ఇంకా మనసుని మధించాలి. దొంగతనానికి వచ్చినందుకు పశ్చాత్తాపం కలగాలి'' అన్నాడు వాడు.
మరో పావుగంట గడిచింది.
రాంలు మందుతిన్న ఎలకలా గిలగిల తన్నుకోసాగాడు.
ఆ దృశ్యం చూడలేక కొందరు గది బయటికి వెళ్ళిపోయారు.
ఒక్కసారి హృదయ విదారకంగా అరిచి మూర్చపోయాడు రాంలు. నేను స్విచ్ ఆఫ్ చేశాను.
"ఇంక చాలు ...'' అన్నారు జనం.
"అప్పుడేనా'' అన్నాడు చంచల్రావు.
"ఒక మనిషిని ఇంట హింసించడం మేం సహించం'' అన్నాడో మానవతావాది.
"మేము వాడికి మేలు చేయాలనే చేస్తున్నాం. వాడిచేత దొంగతనం మాన్పించి వాడిని మంచి మార్గంలో పెట్టాలని మా ఆలోచన. అంతేగానీ వాడిమీద మాకేమీ ద్వేషంగానీ, పగగానీ లేదు'' అన్నాడు చంచల్రావు.
"వీల్లేదు ... వాడిని వదిలెయ్యాల్సిందే ...''
రాంలు కళ్ళు మూసుకొన్నాడు. చంచల్రావు వాడిని హడలగొట్టి కళ్ళు తెరిపించాడు.
మాకూ, జనానికి పావుగంట పాటు వాదన జరిగిన తరువాత జనం మాదారికి వచ్చారు. రాంలు ముఖంమీద నీళ్ళు జల్లి లేపాము.
నేను స్విచ్ ఆన్ చేశాను.
రాంలు పెడబొబ్బలు పెడ్తూ ఏడవ సాగాడు.
మరో అరగంట గడిచింది.
భళ్ళున వాంతి చేసుకున్నాడు రాంలు.
నేను స్విచ్ ఆఫ్ చేసి, మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాను. రాంలు ఒక్క గుక్కలో నీళ్ళన్నీ త్రాగేశాడు.
"మీ కాల్మొక్తా ... నన్నొదులు దొరా'' అన్నాడు జాలిగా.
వాడుపడే బాధకు ఒక ప్రక్క కన్నీళ్ళు కారుస్తూనే, నేను మళ్ళీ స్విచ్ ఆన్ చేశాను. మా అందరికీ తెలుసు అది పోలీసులు ఉపయోగించే థర్డ్ డిగ్రీ మెథడ్ కంటే ఘోరమైనదని. కానీ ఒక దొంగని మార్చాలంటే అంతకన్నా తప్పదు.
గదిలో వాళ్ళందరూ కన్నీళ్ళు తుడుచుకోసాగారు, రాంలు అనుభవిస్తున్న నరకయాతన చూస్తూ.
నిముషాలు గడుస్తున్నాయి.
రాంలు ముఖం పూర్తిగా పాలిపోయింది.
చంచల్రావు రాంలు నొసలుమీద చెయ్యేసి చూశాడు.
"ఓహ్ ... జ్వరం వచ్చేసింది ... ఒళ్ళు కాలిపోతూంది'' అన్నాడు.
అప్పుడు సరిగ్గా తొమ్మిది గంటలయింది.
నేను స్విచ్ ఆఫ్ చేశాను.
రాంలు కట్లు విప్పెశాము. వాడు మా కాళ్ళమీద పది భోరున ఏడ్చాడు.
వాడిని లేవనెత్తాము.
"ఇంకెప్పుడయినా దొంగతనం చేస్తావా?'' అని అడిగాను నేను.
"లేదు దొరా ... బుద్దొచ్చింది''అంటూ చెంపలేసుకున్నాడు.
రాంలుని వదిలేశాము. వాడు అందరికీ నమస్కారం పెట్టి నీరసంగా గదిలోంచి వెళ్ళిపోయాడు.
ఇంతకీ రాంలుకి మేమిచ్చిన ట్రీట్ మెంట్ ఏమిటని ఆలోచిస్తున్నారా? చంచల్రావు ఇంటినుండి మేము తెచ్చింది మరేమిటో కాదు. ఓ టి.వి.సెట్టు తెచ్చాం. రాంలుని కుర్చీకి కట్టేసి ఏడు గంటలనుంచి తొమ్మిదిదాకా వచ్చే కార్యక్రమాలన్నీ చూపించాం. చెవిలో మైక్రో స్పీకర్లు పెట్టాం. ఆ దెబ్బకి మారాడు వాడు.
మాకు టి.వి. అలవాటు అయింది కాబట్టి అంత బాధ అనుభవించలేదు. వాడు ఎప్పుడూ చూడని కారణంగా హఠాత్తుగా రెండుగంటల సేపు ఆ బాధభరించలేక గిలగిలలాడాడు.
ఒకవారం తరువాత రోడ్డుమీద కూరగాయాలబండి తోసుకువస్తూ ఎదురయ్యాడు రాంలు.
"మీ దయవల్ల గిప్పుడు కూరగాయలు అందజేస్తూ షరాఫత్ గా బత్కుతున్నా సాబ్'' అన్నాడు రెండుచేతులు జోడిస్తూ.
నేను తృప్తిగా నవ్వుకున్నాను.
--- అయిపొయింది ---
|