TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
హమ్మా... సరదాపడతావా...?
-పద్మశ్రీ
సంక్రాంతి పండుగ రోజూ మా ఆవిడతో కలిసి సరదాగా అలా బయటికి వెళ్ళివద్దామనుకున్నాను. వంటపనిలో బిజీగా ఉన్న మా ఆవిడని కదిలించి ఎక్కడికైనా వెళదామా అని అడగడమే ఆలస్యం. ఎగిరి గంతేసంత పనిచేసి సినిమా కెళ్దాం అంది. బాగానే ఉంది. కానే పండుగరోజు సినిమా టికెట్టు సంపాదించడం కంటే పార్లమెంటులో సీటు సంపాదించడం ఈజీ అని స్ట్రాంగ్ ఫీలింగ్ లో ఉన్ననాకు మాంచి ఐడియా ఒకటి పారేసింది మా ఆవిడ వంట చేస్తూనే.
ఈసారి నేను ఎగిరి గంతేసి మా ఏరియాలో ఉన్న ఈజీ మూవీస్ కౌంటర్ ని పట్టేసి రెండు సినిమా టిక్కెట్స్ కొన్నాక ప్రపంచాన్ని జయించినంత ఆనందంతో ఇంటికెళ్ళాను. టిక్కెట్స్ ఉన్నాయి కాబట్టి షో స్టార్ట్ అయ్యే సమయానికి పది నిమిషాల ముందు వెళ్తే సరిపోతుంది కదాని హాయిగా భోం చేసి కాసేపు రెస్ట్ తీసుకుని సరిగ్గా ఒకటిన్నరకి ఇంట్లోనుండి బయలుదేరాం... సినిమా చూసిన తర్వాత సరదాగా ఏ లుంబినీ పార్క్ కో వెళదామనుకుని హ్యండీకామ్ ని వెంటతీసుకు వచ్చింది మా శ్రీమతిగారు.
ఆవిడ సరదను ఎందుకు కాదనడం.. ప్రొసీడ్ అనుకుని బైక్ స్టార్ట్ చేసి రోడ్డెక్కేసాను. మరో పది నిమిషాలలో సినిమా థియేటర్ చేరుకుంటాను అనుకుంటుండగా... సడెన్ గా ఓ పోలీసు రోడ్డుకి అడ్డంగా వచ్చేసి మా బైక్ ని ఆపేసాడు.
సినిమా స్టార్ట్ కావడానికి మరో పది నిమిషాల టైం మాత్రమే ఉంది. మధ్యలో ఇలా బ్రేకు... పోలీసులు నా బైకుని, నన్ను క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి ఓ పావుగంట పట్టింది, సినిమా స్టార్ట్ అవుతుందన్న కంగారు మొహంలో గోచరిస్తుండడంతో అనుమానం వచ్చి నా కంగారుకి కారణం అన్వేషించి ఆ తర్వాత నేను ఏ ఉగ్రవాదినో, తీవ్రవాదినో, గూండానో కాదని సాధారణ పౌరుడినని తేల్చడానికి మరో పది నిమిషాలు పట్టింది.
హడావిడిగా బైక్ స్టార్ట్ చేసి ఎలాగొలా థియేటర్ కి వెళ్ళాను. ఆల్రెడీ సినిమా స్టార్ట్ కావడంతో త్వరగా బైక్ ని పార్కింగ్ చేసి థియేటర్ లోనికి వెళ్ళగానే ఠక్కున ఆపేసారు ఓ సెక్యూరిటీ గార్డు. అతను నన్ను క్షుణ్ణంగా తనిఖీ చేసాడు.. ఓ లేడీ సెక్యూరిటీ గార్డు నా భార్యని చెక్ చేసాక మీరు సినిమా చూడ్డానికి అనర్హులని చెప్పేశాడు.
నేను బిక్కమొహం పెట్టి ఎందుకు అని అడిగితే... నీ చేతిలోని సెల్ ఫోను, నీ బ్యాగులోని హ్యండీకామ్ లోపలికి అనుమతించబడదు. అని తేల్చిపడేసారు. ఆ రెండు వస్తువులు వదిలితేనే గానీ మమ్మల్ని లోపలికి పంపనని ఖంరాకండిగా చెప్పేసారు.
అసలే సినిమా స్టార్ట్ అయిపోయిన కంగారు, పైగా ఈ వస్తువులని ఇంట్లో పెట్టి రావాలంటే సినిమా అయిపోతుంది.. అయినా లోపలికి అనుమతించని వస్తువులని భద్రపరచడానికి లాకర్ లు ఏర్పాటు చేసే బాధ్యత థియేటర్ యాజమాన్యానికి ఉంటుంది కదా అనే ఆలోచన రావడంతో మేనేజర్ దగ్గరికి పరుగుతీసి అదే విషయాన్ని అడిగాను.
మేనేజర్ నా మొర ఆలకించకుండానే బయట బోర్డు పెట్టాము కదా... అంతటితోనే మా బాధ్యత తీరిపోయింది. మీ వస్తువులని మీరే భద్రపరుచుకోవాలి. అదంతే... మనుషులు తప్ప మనీ పర్సులని కూడా ఇకనుండి లోనికి అనుమతించం అంతే... అని తెల్చిపడేసాడు.
అప్పటికే ముప్ఫావుగంట సినిమా అయిపోయింది. నాలో ఉత్సాహం కరిగిపోయింది. మా ఆవిడ మొహం ఆగ్రహంతో నిండిపోయింది. సంక్రాంతి పండుగ రోజు అలా గడిచిపోయింది. ఈ భద్రత సంగతేమిటో కానీ రాబోయే రోజుల్లో సినిమా హాళ్ళలో సినిమా చూడాలంటే ఒంటిమీద బట్టలు విప్పేసి మరీ లోనికి వెళ్ళాలేమో....ఇదేమి చిత్రమో....!
|