TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ఎన్నికల ప్రచారం
మల్లాది వెంకటకృష్ణమూర్తి
మునిసిపల్ కార్పోరేషన్ ఎలక్షన్లు జోరుగా సాగుతున్నాయి.మేయర్ పదవికి బిజెపి,కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఏర్పడింది.ఇరుపక్షాల వారు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం కుదరదు కాబట్టి,తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయమని ఓ పార్టీ అభ్యర్థి సంతకం గల వుత్తరాలని జంట నగర వాసుల ఇళ్ళకి కార్యకర్తలు తీసుకెళ్ళి ఇచ్చారు.
ఈ సంగతి తెలిసి వి యస్ ఎన్ ఎల్ లో రిజిస్టరైన వారి ఇ-మెయిల్ అడ్రస్ లకు తమ అభ్యర్థికే ఓటు వేయమని ఇంకో పార్టీ అభ్యర్థి ఇ-మెయిల్స్ పంపాడు. ఇలా మేయర్ పదవికి పోటీ చేసే ఇద్దరూ అభ్యర్థులు పోటాపోటీలు పడి ఒకరు ఏ మాధ్యమం ప్రచారానికి తీసుకుంటే,రెండో వారు కూడా దానికన్నా మెరుగైన దాన్ని వెంటనే ఉపయోగించు కోసాగారు.
కేబుల్ టి.వి.లో రకరకాల ప్రకటనలని తయారుచేసి,ప్రజల మీదకి వదిలారు.ఎలక్షన్ రోజు దగ్గర పడే కొద్దీ ఇరువైపులా టెన్షన్ పెరిగిపోసాగింది.
ఆ రోజుతో ప్రచారం ఆఖరు. ప్రచారం పూర్తయ్యాక ఇద్దరూ అభ్యర్థులకి తీరిగ్గా ఊపిరి తీసుకునే అవకాశం వచ్చింది. ఎలక్షన్ రోజున ఆ ఇద్దరూ అభ్యర్థులు ఉదయమే ఎలక్షన్ బూత్ కి వచ్చారు.ఒకరినొకరి ఎదురు పడే అరుదైన సన్నివేశం జరిగింది.ఇద్దరూ ఒకర్నొకరు చూసి చిరునవ్వులు నవ్వుకున్నారు.'గుడ్ మార్నింగ్ 'లు చెప్పుకున్నారు. వాళ్ళ మధ్య సంభాషణ ప్రచారం మీదకి సాగింది. కాంగ్రెస్ అభ్యర్థి చెప్పాడు.
“ఎన్నికల ప్రచారానికి ఎటువంటి చిన్న అవకాశం వచ్చినా నేను వదల లేదు.ఉదాహరణకి నేనెక్కిన ఆటో డ్రైవర్ కి,లేదా నేను వెళ్ళిన హోటల్ లోని సర్వర్స్ కి పెద్ద మొత్తం టిప్పు యిచ్చి 'కాంగ్రెస్ కే ఓటు చేయండి నరోత్తమరావుకే ఓటు వేయండి.' అని చెప్పేవాణ్ణి.
బిజెపి అభ్యర్థి సన్నగా నవ్వి చెప్పాడు.
“నేనూ ఎన్నికల ప్రచారానికి ఎలాంటి చిన్న అవకాశాన్నీ జార విడుచుకోలేదు.కాకపొతే,నేను ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా ఇంకాస్త ఎఫేక్టివ్ గా ప్రచారం సాగించాను.ఉదాహరణకి నేను ఎక్కిన ఆటో డ్రైవరుకి,లేదా నేను ఫేమిలీతో వెళ్ళిన హోటల్ లోని సర్వర్స్ కి,బయట గూర్ఖాకి పైసా కూడా టిప్ ఇచ్చేవాడ్ని కాను.'కాంగ్రెస్ కే ఓటు వేయండి.నరోత్తమరావుకే మీ ఓటు వేయండి' అనే వాడ్ని.
|