Dr Avathaaram Comedy

"డాక్టర్ అవతారం "

యస్.కిరణ్ కుమార్

ఎవరికి..? ఎక్కడ..? ఎప్పుడు...? ఎలా...?పిచ్చిపట్టిన...ఇక్కడ,ఇప్పుడు,ఇలా..అంటూ ఆ పిచ్చి ఎంత పెద్దదైన,మరెంత బాగా ముదిరిన...డాక్టర్ అవతారం,చిటికెలోఆ పిచ్చిని నయం చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు డాక్టర్ అవతారం.

ఒకరోజున తన హాస్పటల్ కి " నేనే దేవుణ్ణి "అంటూ ఒక పిచ్చివాడిని తీసుకుని బంధువులు వచ్చారు.

ఆ పిచ్చి పట్టిన అతను " నేనే దేవుణ్ణి...నేనే దేవుణ్ణి...”అంటూ బాగా అల్లరి చేస్తుండగా, అది చూసిన డాక్టర్ అవతారం "నేను ఎవరిని ?” అడిగాడు వాళ్ళని చూస్తూ.

“ మీరు డాక్టర్ గారండి "

“ నేను డాక్టర్ అని నాకు తెలుసు '

“ తెలిసి ఎందుకు అడిగారు బాబు ?”

“ నాకు ఎలాంటి పిచ్చి లేదని మీకు తెలియడానికి "

“ తెలిసింది బాబు "

“ మీ వాడికి పట్టిన పిచ్చి గురించా ..?"

" మీకు ఎలాంటి పిచ్చి లేదని " అనగానే కొంచం కోపంగా చూసి" ఏమిటి ప్రాబ్లం ?” అడిగాడు.

“ పిచ్చి పట్టిందండి "

“ అది చూస్తేనే తెలుస్తుంది.”

“ తెలిసి మళ్ళీ ఎందుకు అడిగారయ్యా ?”

“ సరే...మీరందరూ బయటికి వెళ్ళండి.నేను ఆ పిచ్చి ఏ పిచ్చో తెలుసుకుని నయం చేస్తాను " అన్నాడు డాక్టర్ అవతారం.

“ వద్దు బాబు.మేము ఇక్కడే వుంటాం ?”

“ ఎందుకు...నేను మీ వాడిని ఏమైనా చేస్తానని భయపడుతున్నారా..?” చిన్నగా నవ్వుతూ గర్వంగా అన్నాడు డాక్టర్ అవతారం.

“ అందుకు బాబు.మా వాడు మిమ్ముల్ని ఏమైనా చేస్తాడేమోనని భయం తో "

“ నేను నా సర్వీసులో ఇలాంటి పిచ్చి వాళ్ళని,ఇంతకూ మించిన పిచ్చి వాళ్ళని చూశాను.నాకేమి కాదు.మీరు బయటికి వెళ్ళండి.”

“ ఆ తరువాత ఏమైనా మళ్ళీ మీరు మమ్ముల్ని అనొద్దు " అన్నారు బంధువులు.

“ సరే " అన్నాడు డాక్టర్ అవతారం. ఆ బంధువులు పిచ్చివాడిని అక్కడ వదిలిపెట్టి,అక్కడి నుండి వెళ్ళిపోయారు.

“ నేనే దేవుణ్ణి... నేనే దేవుణ్ణి..” అంటూ అల్లరి చేస్తుంటాడు ఆ పిచ్చివాడు.

ఆ పిచ్చివాడిని చూస్తూ...వాడి తల మీద రెండు చేతులు వేస్తాడు డాక్టర్ అవతారం.ఆ పిచ్చివాడు అయోమయంగా చూస్తూ ఉండగా " నీకు ఎలాంటి భయం లేదు.ఎప్పుడు నీకు నిద్ర వస్తుంది.నువ్వు పడుకుంటున్నావు " అంటుండగా..ఆ పిచ్చివాడు నెమ్మదిగా కళ్ళు మూసి పడుకుంటాడు.

అది చూసి గర్వంగా నవ్వుకుని..తనని తను " గుడ్ మిస్టర్ అవతారం "అని మెచ్చుకుని, ఆ పిచ్చివాడి పక్కన కూర్చుంటాడు. “ మిమ్ముల్ని మీరు దేవుణ్ణనుకునే ఈ పిచ్చి మీకు పోవాలంటే...మీ చిన్నితనం అంటే...మీరు పుట్టి పెరిగిన వాతావరణం...అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ రండి " చెప్పాడు డాక్టర్ అవతారం.

“ యస్ డాక్టర్...మీరంటుంటే ఒక్కొక్కటీ గుర్తొస్తున్నాయి "

“ గుడ్...ఏ మాత్రం డిస్టర్బ్ కాకుండా అలాగే గుర్తు చేసుకుంటూ రండి...కమాన్...” అన్నాడు డాక్టర్ అవతారం.

“ అలాగే డాక్టర్.అన్ని గుర్తు చేసుకుంటూ వస్తాను.”

“ ఇప్పుడు నీకు ఏం గుర్తుకు వచ్చిందో చెప్పు "అన్నాడు డాక్టర్ అవతారం.

“ ఓ మహా సముద్రం కనిపిస్తోంది డాక్టర్ " “ వెరీ గుడ్...ఆపద్దు...కంటిన్యూ చేయ్...”

“ ఆ మహా సముద్రంపై ఓ మర్రి ఆకు...”

“ గుడ్ గుడ్...ఆ తరువాత...” ఉత్సాహంగా అన్నాడు డాక్టర్ అవతారం.

“ ఆ ఆకుపై నేనే...” “ ఆఁ...అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు ?చెప్పు...తొందరగా చెప్పు..ఇంకా ఇంకా గుర్తు తెచ్చుకో...” మరింత ఉత్సాహంగా అన్నాడు డాక్టర్ అవతారం.

“ ఆ ఆకుపైన నేను...కాలి బొటన వేలు చీక్కుంటూ...”

“ అదేంటీ...” ఆశ్చర్యంగా అన్నాడు డాక్టర్ అవతారం. “ అదంతే.నేపథ్యం నుంచి 'వటపత్ర శాయికి వరహాల లాలి 'అనే పాట వినిపిస్తోంది "

“ ఇప్పుడు అర్థమయింది ..”

“ అయింది కదా..గుడ్...అప్పుడేం జరిగిందంటే ముందు విశ్వాన్ని సృష్టించానన్నమాట.”

“ ఆ తరువాత..”

“ నన్ను చెప్పనీయండి...ఆ విశ్వంగారు శంకరాభరణం,సాగరసంగమం తీశారు.ఆ తర్వాత స్వాతిముత్యం తీద్దామని ఇళయరాజాకి, సి.నారాయణ రెడ్డీకి,సుశీలకి కబురు పెట్టారు..”

“ ఎందుకూ..?”

“ ఎందుకు అంటే...?నేపథ్యంలోంచి మీకు వినబడ్డానికి 'వటపత్ర శాయికి వరహాల లాలి 'పాటని తయారు చెయ్యేద్దూ మరి...” అని ఆ పిచ్చివాడు చెప్పగానే...అది విన్న డాక్టర్ అవతారం కింద పడిపోయి గిలగిల కొట్టుకుంటూవుంటాడు.