Current Meter

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

కరెంటు మీటర్

బచ్చువీర్రాజు

ఉదయం ఏడుగంటలయ్యింది.

అప్పుడే వచ్చిన పేపర్ అందుకుంటూ ఓసారి హాల్లోని కరెంటు మీటర్ వంక చూసాను.నిన్నటికీ ఈ రోజుకీ ఆరు యూనిట్లు కాలినట్లుగా చూపిస్తోంది.

గుండె గుభేలుమంది.

యింట్లో కూలర్ గాని,ఫ్రిజ్ గాని,గీజర్ గాని లేకపోయినా,కరెంటు అంత దారుణంగా ఎలా కాలిపోతోందో అర్థం గావడం లేదు. కోడలు పురిటికెళ్ళింది.అబ్బాయి బిజినెస్ రీత్యా సరిగ్గా యింట్లోనే వుండడు.యిక వుంటున్నది నేనూ, నా శ్రీమతి మాత్రమే.సుమారు నేలకు రెండువందల యూనిట్లు కాలుతూ,నా పెన్షన్ డబ్బులు అతి దారుణంగా మింగేస్తున్న మా కరెంటు మీటర్ వంక కసిగా చూశాను.

యింతలో శ్రీమతి టీ తో వచ్చింది.

“ఇదిగో...నేనింట్లో లేనప్పుడు మన కరెంటు ఎవరికైనా అమ్మేస్తున్నావా ?”కంఠం పెద్దది చేసి అడిగాడు టీ కప్పు అందుకుంటూ.

“ఛా...వూరుకొండీ.అవేం మాటలు?నేను కరెంటు అమ్ముకోవడమేంటీ ?”శ్రీమతి కూడా గట్టిగానే సమాధానం చెప్పింది.

“కాకపోతే మన పెరటి వైపున్న మీ బాబాయ్ కొడుకు పెట్టిన సా మిల్లుకు గానీ,ఆ పక్కనే వేలు విడిచిన నీ మేనత్త కొడుకు నడిపే సినిమా థియేటర్ కు గానీ,వాళ్ళ కరెంటు పోయినప్పుడల్లా మన ఇంట్లోంచి కరెంటు లాక్కోమని లైసెన్సు యిచ్చేశావా ?”ఇంకాస్త గట్టిగా అడిగాను.

“అంత సీనేం లేదు.ఊరికే ఎందుకు కారాలూ మిరియాలూ నూర్తారూ "అంది శ్రీమతి కళ్ళ నీళ్ళతో.

“లేకపోతే మనం యిద్దరమేవున్న యీ కొంపలో కరెంటు ఎందుకంత దారుణంగా కాలిపోతుంది మరి "కాస్త నెమ్మదిగా అడిగాను ఈసారి.

“నా చేత్తో నేను,ఆ టీవీ కూడా పెట్టుకోను తెలుసా మీకు ?”అంటూ ప్రకటించింది శ్రీమతి రుసరుసలాడుతూ.

“అయితే ఈ మీటరు ఏదో బకాసుర్ కంపెనీకి చెందిందంటావా ?ఊళ్ళోవాళ్ళు కాల్చిన కరెంటునంతా లాగేసుకుని రీడింగ్ పేరుతొ నా కొంప ముంచేస్తుంది ?”నాలోనేనే గొణుక్కున్నాను.

“ఏమోమరి !కంప్లైంట్ ఇవ్వమంటే యివ్వరాయే.అందుకు అనుభవించక తప్పుతుందా ?”అంది శ్రీమతి నా వంక గుచ్చి చూస్తూ.

“అవును.అదీ పాయింటే"అంటూ వెంటనే తెల్ల కాగితం,పెన్నూ అందుకున్నాను.

*****

శ్రీ ఎలక్ట్రికల్ యింజనీర్ గార్కి.

అయ్యా... సర్వీస్ కనెక్షన్ నెంబరు 36710తాలుకూ కరెంటు మీటర్,అతి ఘోరంగా తిరిగిపోతూ.మమ్ముల్ని రంపపు కోతకు గురి చేస్తున్నది.కేవలం ఇద్దరమే వుంటున్న మా మధ్య తరగతి కుటుంబం కరెంటు బిల్లుల దెబ్బకు తట్టుకోలేక అల్లల్లాడిపోతున్నాం.దయచేసి బకాసురుని అంశతో వెలసిన యీ కరెంటు మీటరును మార్చి మమ్ముల్ని ఆదుకోగలరు.”అంటూ కంప్లైంట్ ను రాసి పోస్ట్ చేశాను.

*****

వారం రోజులు గడిచాయి. ఏ విధమైన రెస్పాన్స్ రాలేదు.కరెంటు డిపార్ట్ మెంట్ మీద విసుక్కుంటూ... అయ్యా...నేను మా కరెంటు మీటరు అతి దారుణంగా తిరిగిపోతూ,హెచ్చు రీడింగులతో నా కొంప గుల్ల చేస్తున్నదనీ,దానిని మార్చి మరో కొత్త మీటరు వెయ్యగలందులకు లోగడ మీకు విన్నవించడం జరిగింది.అయితే మీరు యింత వరకు ఏ చర్యా తీసుకోలేదు.దయచేసి నా యీ విన్నపమును మన్నించి ఆ మీటరు స్థానంలో మరో కొత్త మీటరు వేయించి పుణ్యం కట్టుకోగలరు.అంటూ తిరిగి మరో కంప్లైంట్ రాసి పోస్ట్ చేశాను.

*****

మరో పది రోజులు గడిచాయి.ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ నుంచి ఉలుకూలేదూ పలుకూ లేదూ.నాకు పిచ్చెక్కడం మొదలు పెట్టింది. ఓ రోజు ఈజీ చైరులో కూర్చుని పేపరు చదువుతుంటే ఎవరో వచ్చినట్లు అలికిడైతే తలెత్తి గుమ్మం వైపు చూశాను.

కరెంటు రీడింగ్ వాళ్ళు గేటు తీసుకుని వస్తున్నారు.నేను లేచి వీధి తలుపు తీశాను.యింతలో నా బుర్రలో తళుక్కున ఓ ఆలోచన మెరిసింది.దానిని ఆచారంలో పెట్టాలనుకున్నాను.ఆ వచ్చిన ఇద్దరిలోనూ ఓ వ్యక్తి మధ్య వయస్సులో వుంటే మరొకతను ఇరవై ఏళ్ళ కుర్రాడు.మధ్యవయస్సు గల వ్యక్తి రీడింగ్ చూడబోతుంటే నేను నెమ్మదిగా అతని భుజం తట్టాను.ఆ వ్యక్తి నా వంక చూశాడు.

“బాబూ!పెన్షన్ మీద బతుకున్న వాణ్ణి.వచ్చే నెల ,మా బందువులు తాలూకూ యిళ్ళలో చాలా పెళ్ళిళ్ళు వున్నాయి.ప్రయాణపు ఖర్చులూ బహుమతుల ఖర్చులూ తట్టుకోవాలి.వాటి నుంచి తప్పించుకోవడానికి కాస్త యీ నెల ఓ యాభై యూనిట్లు ఎక్కువ వేసి పుణ్యం కట్టుకో నాయనా!” అన్నాను అతనిని బ్రతిమాలుతూ.

“సార్ రీడింగ్ ఎక్కువైతే ఫరువాలేదు.తక్కువ వెయ్యమంటేనే రిస్క్.అంచేత దానికి అంతగా బ్రతిమాలనవసరం లేదు.యాభై యూనిట్లు ఎక్కువ కాల్చినట్లు రీడింగు నోట్ చేస్తున్నాను " అన్నాడావ్యక్తి చిరునవ్వుతో.

నా జేబులోంచి ఓ పదిరూపాయల నోటు తీసి నెమ్మదిగా అతని షర్ట్ జేబులో కుక్కాను.దానికావ్యక్తి హుషారుగా ఆ నోటు వంక చూసి,బయటకు దారి తీశాడు.అతని వెంట వచ్చిన కుర్రాడు కూడా బయటకు నడిచాడు. ఆ మధ్య వయస్సు వ్యక్తి వెళ్ళిపోయే ముందు తన చంకలో పెట్టుకొన్న తాను నోట్ చేసిన రీడింగు పుస్తకాన్ని ఓసారి నాకు చూపించి మరీ వెళ్లాడు.ఆ వ్యక్తి నా మాట మన్నించి యాభై యూనిట్లు ఎక్కువ వేసినట్లు,ఓసారి మీటరు వంక చూసి నిర్ధారించుకున్నాను.

ఈ తతంగం ముగిసిన ఓ గంట తరువాత,మా బావమరిది కొడుకు సతీష్ అమలాపురం నుంచి ఆదరాబాదరాగా మా యింట్లోకి ప్రవేశించాడు. వస్తూనే "మావయ్యాగారూ...మా చెల్లాయి ఉషకి అబ్బాయి పుట్టాడు.మిమ్ముల్నీ,అత్తయ్యనీ వెంటనే తోడు పెట్టుకుని రమ్మని అమ్మానాన్నా పంపించారు "అన్నాడు ఒగురుస్తూ.

యింతలో శ్రీమతి వంటింట్లోంచి హాల్లోకి వస్తూ "సరేరా...అలాగేవస్తాం.ముందు భోజనానికి లే " అంటూ లోపలకు తీసుకు వెళ్ళింది. యిలా ఇల్లు వదిలి వెళ్లడం నూడా నా పథకానికి ఒక విధంగా మంచిదే అని అనుకున్నాను మనసులో.

భోజనాలయ్యాక అంతా అమలాపురం బస్ ఎక్కాం.

*****

మా బావమరది పట్టుపట్టడం వల్ల అక్కడే ఓ వారం రోజులు వుండిపోక తప్పలేదు.ఎనిమిదో రోజున యింటికి రాగానే,పక్కింటి వాళ్ళబ్బాయి కరెంటు బిల్లు తీసుకువచ్చి నాకందించాడు.స్పాట్ బిల్లింగ్ పద్దతి యింకా మావూరు రానందున యిల్లు తాళం వేసి వుండటంతో మా కరెంటు బిల్లు పక్కింటి వాళ్ళకిచ్చినట్లు తెలిసింది.

ఓసారి బిల్లు వంక చూశాను.రీడింగ్ యాబై యూనిట్లు ఎక్కువపడి దానికి తగ్గట్టుగానే చార్జీల మొత్తం చూపించారు.యింక నా పథకం ఆచరణలో పెట్టాలనుకుని ఓ కాగితం పెన్నూ తీస్కున్నాను.

*****

ఎలక్ట్రికల్ యింజనీర్ గార్కి. అయ్యా...లోగడ నా కరెంటు మీటరు చాలా స్పీడుగా తిరుగుతూ నన్ను బిల్లుల మోతతో యిల్లు అమ్ముకునే పరిస్థితికి లోనేయ్యేటట్లు చేస్తుందనీ దానిని మార్చి కొత్త మీటరు వేయించమనీ రెండు కంప్లైంట్లు యిచ్చి వున్నాను.

తమరు వాటిని లెక్కచెయ్యలేదు.ప్రస్తుతానికి మీరు కొత్త మీటరు వెయ్యనవసరం లేదు.ఎందుకంటే ఈ మధ్య మా మీటరు నా పాలిటి బంగారపు గని గా మారింది. క్రిందటి వారం తీసిన రీడింగుతో ఈ రీడింగు పోల్చి చూస్తే,ఓ యాబై యూనిట్లు వెనక్కి తిరుగుతున్నట్టుగా రీడింగ్ చూపిస్తుంది.గనుక దయ వుంచి నా యిదివరకటి కంప్లైంట్స్ రద్దు పరుస్తూ యీ మీటర్ నే వుంచ ప్రార్థన.

*****

ఆ మర్నాడు మధ్యాహ్నం మూడు గంటలయ్యింది.మా యింటిముందు ఓ జీవు,వ్యానూ ఆగినట్లు శబ్దం అయ్యింది.అందులోంచి ఓ పదిమంది మనుషులు దిగి,మా యింట్లోకి రావడం మొదలు పెట్టారు. నేను గబగబాలేచి వీధి తలుపు తీశాను.నన్ను త్రోసుకుంటూ అంతా మీటరు వైపు నడిచారు.

ఒకాయన తన చేతిలోని ఫైలు తిరగేస్తూ ఓసారి మీటరు వంక చూసి "వాట్ రెండువేల నూట యాబై రెండు యూనిట్లు రికార్డ్ అయితే యిప్పుడు రెండువేల నూట నాలుగు యూనిట్లు చూపిస్తుంది.నలబై ఏనిమిది యూనిట్లు బ్యాక్ రన్నింగ్.కమాన్.చేంజ్ దిస్ బ్లడీ మీటర్ "అంటూ మీటర్ సీళ్లు చెక్ చేస్తూ,తన సిబ్బందికి హుకుం జారీ చేశాడు.

అంతే పది నిమిషాల్లో పాత మీటరు లాగి పారేసి ఓ అట్టపెట్టెలో ప్యాక్ చేసివున్న కొత్త మీటరును తీసి ఆ స్థానంలో బిగించేశారు.ఓ వ్యక్తి ఓ పుస్తకం తెరచి అందులో నన్ను సంతకం పెట్టమన్నాడు.నేను ఏమీ మాట్లాడకుండా సంతకం పెట్టాను.నన్ను ఏ ఒక్కరూ ఏమీ అడగలేదు. మరి కొన్ని క్షణాల్లో ఎలా వచ్చిన వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు.

“ఏఁ వోయ్...సాయంత్రం ఫస్ట్ షో కి ఓ రెండు టికేట్లుంచమని మీ మేనత్త కొడుకుకు చెప్పు.సిన్మాకి వెళ్దాం.”అంటూ మా ఆవిడకు వినబడేలా కేకేశాను విజయగర్వంతో హుషారుగా.

(హాసం సౌజన్యంతో)