వెరీ సింపుల్

వెరీ సింపుల్


- వి. నాగరత్న

రామచంద్రం ఈమధ్య ఆఫీసుకు ఆలస్యంగా వస్తున్నాడు.

ఆఫీసరు రెండు మూడుసార్లు మందలించినా లాభం లేకపోయింది. దాంతో ఆయనకు చిరాకేసి "మీ వరసెం బాలేదు. ఎందుకు లేటైందో ఎక్స్ ప్లనేషన్ రాసివ్వాలి'' అన్నాడు.

రామచంద్రం బేలగా, జాలిగా చూసినా ఆఫేసరేం మెత్తబడలేదు. ఏ విషయమైనా అంత తేలిగ్గా రిటన్ గా కమిట్ అవ్వకూడదు మరి. అందుకే "తప్పదా సార్?" అన్నాడు రామచంద్రం.

"ఏంటి తప్పేది? ముందు ఎక్స్ ప్లనేషన్ రాసి, ఆనక పని చేసుకోండి" అన్నాడు ఆఫీసరు కర్ణకఠోరంగా. ఆయనగారి చూపులు క్రూరంగా, హీనంగా, చీత్కారంగా ఉన్నాయి.

ఇక రామచంద్రానికి ఉక్రోషం ముంచుకొచ్చింది. బర్రున డెస్కు లాగి పెన్నూ, పేపరూ అందుకున్నాడు. ముందూ వెనుకా ఆలోచించకుండా బరబరా రాయసాగాడు. 

"సార్! ఏం చెప్పమంటారండీ నా కష్టాల్?" అని రాసి సీలింగ్ వంక తదేకంగా చూశాడు.

ఫానుకున్న దుమ్ము చూస్తే రాసేది కూడా పోతుందని గబుక్కున చూపు దించేశాడు. అబద్ధాలు రాయాలనిపించలేదు. ఉన్నదున్నట్టు రాస్తే, ఆ మహానుభావుడే అర్ధం చేసుకుంటాడు అని అడ్డంగా, నిలువుగా తనకు తనే తల పంకించుకున్నాడు. ఇక కామాలు, ఫుల్ స్టాపులు లేకుండా కలం జెట్టు స్పీడుతో ముందుకు సాగింది.

"...మా ఇంటిగలాయన ఈమధ్యే రిటైర్ అయ్యాడు. మహానుభావుడు.. పగలంతా గుర్రుపెట్టి నిద్దరోతాడు. రాత్రులు నిద్రపట్టి చావక నన్ను చంపుకు తింటాడు. ఒట్టేసి చెప్తున్నానండీ, ఒంటిగంటైనా నన్నొదల్డు. నేను ఆవిలిస్తున్నా, కళ్ళమీదికి కునుకుపాట్లు ముంచుకొస్తున్నా పట్టించుకోకుండా బుర్ర తింటూనే ఉంటాడు.

అక్కడికీ ''పగలు నిద్ర పోకండి మాస్టారూ'' - అని ఎన్నిసార్లు చెప్పానో! ఆయనగారు వింటేగా.. నా వినయ విధేయతలు తగలెయ్యా. ''ఫో, ఫోవయ్యా, నన్ను పడుకోనీ'' అని ముఖాన చెప్పలేను, చావలేను. బొత్తిగా సంస్కారం లేదనుకుంటాడని ఒక భయం. ఇల్లెక్కడ ఖాళీ చేయమంటాడో అని ఇంకో భయం.

సరే, ఆ నిశాచరుణ్ణి ఎలాగోలా వదిలించుకుని ఇంట్లోకొద్దును కదా, ఇంటావిడ నస మొదలవుతుంది. మా ఆవిడ చిర్రుబుర్రులు.. ''నాకంటే ఆయనే ముఖ్యమా?'' అంటూ ప్రాణం తీస్తుంది. రాద్ధాంతం చేస్తుంది.

అట్లా అర్ధరాత్రి దాకా జాగారం చేస్తే ఇక తెల్లారింతర్వాత ఏం మెలకువ వస్తుంది చెప్పండి? లేవలేను, చావలేను. అక్కడికీ అలారం పెట్టుకుంటాను. మా ఆవిడకి ఒళ్ళు మండిపోయి, గడియారం పీక నొక్కి పడుకుంటోంది.

ఈ వరసన చెప్పుకుంటూ పొతే పుస్తకం అయ్యేట్టుంది. ఏదేమైనా మీరు అర్ధం చేసుకోవాల్సింది ఒకటుంది. సార్, నేను ఆఫీసుకు ఆలస్యంగా వస్తున్నాను అంటే అది నిర్లక్ష్యమో, ఒళ్ళు పొగరో కానే కాదు. కేవలం గత్యంతరం లేకనే.

ఇదంతా ఎందుక్కానీండీ, అటు నా బాధ తీరి, ఇటు మీ చిరాకు పోయే మార్గం ఒకటి చెప్పాలనిపిస్తోంది.

ఏం లేదు సార్, వెరీ సింపుల్. మా ఇంటోనరు బాధ తీరేది కాదుగానీ మీరు గానీ మనాఫీసు టెర్రస్ మీద ఓ టెంట్ వేసిచ్చినా సరే తిన్నగా టైమే కి వస్తానని, ఇంకా మాట్లాడ్తే అరగంట ముందుగానే సీట్లో ఉంటాననీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.

యువర్స్ ట్రూలీ, అండ్ సిన్సియర్లీ,

సి.హెచ్. రామచంద్రం, బి,ఎ.''

అంటూ ఏకబిగిన రాసిపారేసి పెన్ను కాప్ పెట్టేసి, మా చెడ్డ చిరాగ్గా డెస్కులో పడేశాడు.

అత్యంత నిజాయితీగా రాసిన ఆ ఎక్స్ ప్లనేషన్ లెటర్ ను యమా సీర్యస్ గా పాత సినిమాల్లో రమణారెడ్డిలా నిటారుగా నడుస్తూ గంభీరంగా సెక్షన్ ఆఫీసర్ చేతిలో పెట్టి, అంతే సీరియస్ గా వచ్చి తన సీట్లో కూర్చుని పని చేసుకోసాగాడు, రామచంద్రం ది మోస్ట్ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ ఎంప్లాయ్.