TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
తాతా ధిత్తై తరిగిణతోం 61
జీడిగుంట రామచంద్రమూర్తి
అశ్విని, శ్రీరామ్ లు వీరభద్రం వుంటున్న నర్సింగ్ హోంకి చేరుకున్నారు అప్పటికీ అందరూ అక్కడే వున్నారు వాళ్లందరితో పాటూ మేనమామ శేషగిరి కూడా కనిపించే సరికి శ్రీరామ్ కొంచెం ఆశ్చర్యపడిపోయాడు.
"ఇంతకీ మీరెప్పుడు వచ్చారు మావయ్యా! అంతలో శ్రీరామ్ కల్పించుకుంటూ అడిగాడు.
"నిన్ననే రవీంద్ర భారతిలో నాటక పోటీలకై మా ట్రూపుని తీసుకొచ్చాను మా అమ్మాయింటికెళితే మొగుడితో పోట్లాడి ఆత్మహత్యాప్రయత్నం చేసిందని తెలిసింది ఈ నర్సింగ్ హోమ్ లో చేర్చారని తెలిసి ఇలా వస్తే మనవాళ్లు కనబడ్డారు మీ నాన్నను చూడబోతే"
"శ్యామ కాపురం అలా ఎందుకయ్యింది మావయ్యా?" అడిగాడు శ్రీరామ్.
"నేను చేసిన తప్పుకు భగవంతుడు విధించిన శిక్ష బాబూ నా కూతుర్ని చేసుకోవాల్సిన శ్రీరామ్ వేరే అమ్మాయి మెడలో తాళికడుతున్నాడని తెలిసి ఓర్వలేక పోయాను...కనీసం, నా కూతురికి వేరొకరితో పెళ్ళయ్యే వరకైనా, శ్రీరామ్ మనశ్శాంతిగా వుండకూడదనీ తన భార్యతో సుఖపడకూడదనీ పిచ్చి ఆలోచన చేశాను." చెప్పటం ఆపి తలదించుకున్నాడు శేషగిరి.
"మైగాడ్!... అందుకని ఏం చేశావయ్యా?" అతని భుజాలు పట్టుకుని కుదిపేస్తూ అడిగాడు చిదంబరం.
"చాలా నీచమైన పనే చేశాను లాయరుగారూ! వీరభద్రానికి జాతకాలపట్ల అపారమైన నమ్మకం వుంది కదా! ఆ బలహీనత ఆసరాగా తీసుకుని చిన్ననాటకం ఆడాను."
"నాటకమా?"
"అవును! మా నాటక సమాజాల్లో వేషాలు వేసే ఓ 'ఆర్టిస్టు' ని స్వామీజీ వేషంలో రాజుపాలెం వెళ్లి ఏడాది లోపల తను 'తాత' అయితే 'మారకం' తప్పదని హెచ్చరించేలా చేశాను."
"దుర్మార్గుడా! ఎంతటి దారుణమునకు తలపడితివీ?" అంటూ మంచం మీదనించి హఠాత్తుగా లేచివచ్చి శేషగిరి చొక్కాకాలరు పట్టుకున్నాడు వీరభద్రం.
"అవునయ్యా! దారుణమే చేసిన పాపం చెప్తే పోతుందంటారు. మీరందరూ క్షమిస్తే నా బిడ్డ బతుకుతుంది."
అందరికంటే ముందుగా మాట్లాడినది అశ్వినియే. "పోనీలెండి, బాబయ్యగారూ మీ అమ్మాయి కోలుకుని కాపురం సరిగ్గా చేసుకుంటే అంతకంటే ఏం కావాలి?" అంది.
"నీకు ఈ భగవంతుడే శిక్ష విధించినాడు పెద్దలు పాపాలు ఆచరిస్తే అవి పిన్నలకు శాపములై చుట్టుకొనునట! నీ కుమార్తె పరిస్థితిని గమనించితివిగా! అయినా నీ కక్ష నా కుమారునికి శిక్షగా పరిణమించినది. వివాహము జరిగి ఆరునెలలు గడిచినా విడివిడిగా శయనించవలసిన దుస్థితిని కల్పించావు ఆ నాటకముల మనిషిని మహాత్మునిగా భ్రమించి వాడు చెప్పిన మాటల్ని వేదవాక్కులవలె తలబోసిన మూర్ఖుడను నేను!" బాధనూ, కోపాన్నీ కలగలిపి అన్నాడు వీరభద్రం.
పది రోజుల్నించీ అప్పటివరకూ అయిన వాళ్ళను కూడా గుర్తుపట్టకుండా మతిభ్రమించిన వ్యక్తిలా ప్రవర్తించిన వీరభద్రం మళ్లీ మామూలు మనిషిలా మాట్లాడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
"నాన్నా మీరు మళ్లీ మీరు మామూలుగా మాట్లాడేస్తున్నారు. మా అందర్నీ గుర్తుపట్టేరా?" శ్రీరామ్ ఆనందంతో పొంగిపోతూ అడిగాడు.
"మీ నాన్న అప్పుడూ ఇప్పుడూ మామూలు మనిషేనయ్యా ఇన్నాళ్లూ ఆయనకేం మతి భ్రమించలేదు" చెప్పాడు చిదంబరం.
"మరి మమ్మల్నెవరో గుర్తుపట్టకపోవటం అదోలా మాట్లాడటం."
"అదంతా మీ నాన్న ఆడిన నాటకం." అంటూ అసలు విషయం చెప్పేశాడు చిదంబరం.
చెప్పి, "ఒరేయ్ భద్రుడూ మావలసంఘం అధ్యక్షపదవితో బాటు నీ స్కూల్లో హెడ్ మాస్టరు పదవికి కూడా రాజీనామా చేసేయ్ 'తాతా' హోదా అందుకుని హాయిగా మనవడితో ఆడుకుందువు గాని!" చిదంబరం సలహా ఇచ్చాడు.
"చూద్దాం! నాకు 'తాతా' పాత్ర లభించాలి కదా! మూఢనమ్మకాలను పట్టుకు ప్రాకులాడి, జాతకాలన్నీ యదార్థములవుతాయని భ్రమించి ఆ 'నాటకాలస్వామిజీ' మాటకు విలువ ఇచ్చాను భార్య, భర్తల్ని వేరుచేసి, వాళ్ళమనసు క్షోభపెట్టాను లేకున్నచో ఆ పాటికి నా కోడలుకు సీమంతం జరిగి వుండేది." నిట్టూర్పు విడిచాడు వీరభద్రం.
"నువ్వేం బాధపడకు నాన్నా....త్వరలోనే మంచిరోజు చూసి అశ్వినికి సీమంతం జరిపిద్దాం. గొప్పగా చెప్పాడు శ్రీరామ్.
వీరభద్రానికి అర్థం కాలేదు...
"అంటే ! ఏమిట్రా నువ్వంటున్నదీ?" అడిగాడు అయోమయంగా చూస్తూ.
"అశ్విని. అదే నీ కోడలు ఇప్పుడు మనిషి కాదునాన్నా! తనకిప్పుడు అయిదోనెల." బోలెడంత సిగ్గుపడిపోతూ చెపాడు.
వీరభద్రంతో పాటు, అందరూ ఉలిక్కిపడి చూశారు.
"శోభనం కాకుండా అయిదో నెల ఏమిట్రా అప్రాచ్యుడా! కొంపదీసి మీరిద్దరూ..." అంటూ తెల్లబోయి చూస్తూన్న వీరభద్రం మాటకు మధ్యలోనే అడ్డుపడుతూ చిదంబరం రహస్యం చెప్పేశాడు.
అందరూ గొల్లువ నవ్వుతూండగా డాక్టరు వచ్చి శ్యామ కోలుకుందని చెప్పాడు హమ్మయ్య అని అంటూండగానే అశ్విని సెల్ ఫోన్ మోగింది. అవతల మంగమ్మ!
* * * *
|