TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
తాతా ధిత్తై తరిగిణతోం 59
జీడిగుంట రామచంద్రమూర్తి
అల్లుడికి తను బాకీ పడిన మాట వాస్తవమే అప్పట్లో పంటలు దెబ్బతినటం వల్ల అనుకున్న మొత్తాన్ని ఇవ్వలేక పోయాడు కానీ ఇప్పుడు ఆ బాకీ తీర్చగల స్తోమత తనకుంది.
అయితే, అంతరాత్మ అందుకు అడ్డం పడుతోంది. తను మండల స్థాయి నించి జిల్లాస్థాయి మావల సంఘానికి అధ్యక్షుడిగా ఎదిగాడు 'వరకట్న' నిషేధానికి నడుం బిగించాడు. వారానికోసారి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి ఉపాన్యాసాలిస్తున్నాడు ఉద్యమస్థాయిలో కృషి చేస్తున్నాడు వరకట్నం నిషేధపు బిల్లును పటిష్టంగా అమలు జరిపేలా చూడవలసిన బాధ్యత గురించి తమ ఎజెండాలో ఒక అంశంగా చేర్చమంటూ ఆ మధ్య ప్రభుత్వంతో చర్చలు జరపటానికొచ్చిన 'వార్' ప్రతినిధులకు ఒక లేఖ ద్వారా తెలియజేశాడు. ఆనాడు వీరేశలింగం పంతులు, వితంతు వివాహాలు జరిపించినట్టుగా ఈనాడు కట్నం కానుకలు లేని ఆదర్శ వివాహాలు చేయిస్తున్నాడని తను పేరు తెచ్చుకున్నాడు.
అలాంటప్పుడు తనే, ఇప్పుడు అల్లుడికి దాసోహమైపోయి కట్నం డబ్బు అతనికి చేతిలోపెడితే రేపెప్పుడైనా ఈ విషయం ఎవరికైనా తెలిస్తే తనను అందరూ హేళన చేస్తారు. అధ్యక్ష పదవి పోయినా ఫరవాలేదు 'రావుబహద్దర్ల వంశప్రతిష్ట మంట కలిసిపోతుంది.
అందుకే ఆరునూరైనా నూరు ఆరైనా అల్లుడికి తలవంచకూడదని నిర్ణయించుకున్నాడు.
అంతకుముందు ఓ సందర్భంలో చిదంబరం చెప్పిన సలహాను పాటించి, 'అల్లుడి గండం' నించి బయట పడాలని నిశ్చయించుకున్నాడు వీరభద్రం.
ఆరోజు స్కూల్ కి వెళ్ళాడన్నమాటేగానీ క్లాసులేవీ తీసుకోకుండా, తన గదిలోనే కూచుని కార్యాచరణ పథకాన్ని ఎలా అమలు చేయాలో ఆలోచిస్తూండి పోయాడు.
సాయంత్రం స్కూలు వదిలింతర్వాత బంట్రోతు వీరయ్య క్లాసు గదులు తలుపులన్నింటికీ తాళాలు వేసి వచ్చాడు.
"అయ్యా! తమరు బయల్దేరితే ఈ రూమ్ కి తాళం వేస్తాను." అన్నాడు.
"ఎక్కడికి బయల్దేరాలీ?" అడిగాడు వీరభద్రం అతనివైపు అయోమయంగా చూస్తూ అదేంటి బాబూ? స్కూలు ఇడిసిపెట్టేశారుగా తమరు ఇంటికెళ్ళరా?"
"ఎవరింటికీ?"
ఆ ప్రశ్నవినగానే వీరయ్య త్రుళ్ళిపడ్డాడు.
"ఎవరింటికేంటి బాబూ? తమరింటికే అబ్బాయిగారు వచ్చారంట కదా. ఇద్దరూ కల్సి టౌనుకెళ్లీ బట్టలు కొనుకుంటారంటా చెప్పాడు.
"అబ్బాయెవరు? అల్లుడు ఎవరు?" అర్థం కానివాడిలా చూస్తూ అడిగాడు వీరభద్రం.
"అమ్మాయిగారూ, అల్లుడూ వచ్చారని తమరు నిన్న చెప్పారుగా?"
"అమ్మాయా? అమ్మాయెవరు?"
"ఓర్నాయనో తమరికి ఏదో అయిపోయింది." గాభరాపడిపోయి గుండెలు బాదుకుంటూ అటుగా వెళుతున్న రంగారావు మేస్టార్ని పిలిచాడు వీరయ్య.
"ఏమైంది వీరయ్యా?" ఖంగారుపడుతూ వచ్చాడు రంగారావు.
"మన హెడ్ మాస్టరయ్యగారికి ఏదో అయిపోయింది చూడండి బాబు" చెప్పాడు దిగులుగా ఆయనకు అర్థం కాలేదు.
"ఏమైంది సార్?" చేతిలోవున్న ముక్కుపొడుం డబ్బాని లాల్చీ జేబులో వేసుకుంటూ అడిగాడు.
"నాకేం కాలేదు మాములుగానే వున్నాను. ఇంతకీ తమరెవరో తెలుసుకోవచ్చునా?" ఆయనవైపు వింతగా చూస్తూ ప్రశ్నించాడు వీరభద్రం.
ఇప్పుడు రంగారావు కూడా త్రుళ్ళిపడ్డాడు. "నేనండీ రంగారావుని" చెప్పాడు. మీరు రంగారావా మీరు చనిపోయి చాలా సంవత్సరములైందిగా."
"నేను నేను చనిపోవటం ఏమిటండీ? చెట్టంత మనిషిని మీకెదురుగా వచ్చి నిలబడితే?" తన పాదాల క్రింద నెల కంపించినట్లవుతూంటే కలవరపడుతూ అడిగాడు.
"ఓ! నా ఎదుట నేవున్నారు కదూ. పొరబడితిని మీరు ఎస్వీరంగారావేమో అనుకొంటిని."
ఆయన ధోరణిని గమనించిన రంగారావు ఆయనకు మతిభ్రమణం కలిగిందనుకున్నాడు వీరయ్యను పక్కకు పిలిచి చెప్పాడు.
"మన హెచ్ ఎమ్ గారికి పైత్యం ప్రకోపించి వుండాలి, లేదా మతి భ్రమించి వుండాలి త్వరగా ఇంటికి తీసుకెళ్లి దిగబెట్టటం మంచిది."
"రండిబాబూ. ఇంటికెదాం." అంటూ వీరయ్య వీరభద్రం చేయి పట్టుకున్నాడు.
"ఎవరింటికీ?" అడిగాడు వీరభద్రం.
"తమరింటికే?"
"మా ఇల్లు ఎక్కడో నాకు గుర్తుకు రావటంలేదు మీకు తెలియునా?"
"మాకు తెలుసులెండి పదండి వెడదాం." అంటూ ఆయన్ని కుర్చీలోంచి లేపి, బయటకు తీసుకొచ్చి ఇంటివైపు నడిపించాడు రంగారావు.
ఇంటికొచ్చి భార్యనీ కూతుర్నీ చూసింతర్వాత కూడా వీరభద్రంలో మార్పు రాలేదు వీరయ్య ద్వారా భర్త ప్రవర్తన గురించి వివరంగా తెలుసుకున్న పార్వతమ్మ అవాక్కయిపోయింది.
"ముఖం కడుక్కుని రండీ టిఫిన్ తిందురుగానీ!" అని పిలిస్తే
"నీళ్ళ గది ఎక్కడున్నదీ?" అని ప్రశ్నించాడు వీరభద్రం.
ఓసారి గుడికివెళ్ళి దైవదర్శనం చేసుకునివస్తే భర్తపరిస్థితి చక్కబడుతుందన్న ఆలోచనతో గుడికి వెడదాం వస్తారా?" అని అడిగింది పార్వతమ్మ.
"ఈ ఊరిలో గుడి ఎక్కడున్నదీ? బాగా దూరమా?" అంటూ ప్రశ్నించాడు పక్క వీధిలోనే వున్న రాములవారి గుడికి తన భర్త ధర్మకర్తగా వుంటూ, వారానికి నాలుగురోజులు అక్కడకు వెడుతూ కూడా అలా అడిగాడంటే తప్పకుండా మతిభ్రమించే వుండాలనుకుందామె.
భోజనం అయిన తర్వాత పెందరాళే పడుకుని నిద్రపోండి" అంటే నాకో తుంగచాపా, దిండూ ఇప్పించండి మీ వీధి అరుగుపై విశ్రమిస్తాను. అన్నాడు.
భర్త ధోరణి గమనించిన పార్వతమ్మ ఆయనకు ఏ గాలైనా తగిలిందో, ఎవరైనా చేతబడే చేశారో అని భయపడి కూతుర్ని కౌగలించుకుని ఏడ్చేసింది. మరి కాసేపటికి టౌనించి తిరిగొచ్చిన కొడుక్కీ, అల్లుడికీ జరిగిన విషయమంతా చెప్పి మళ్ళీ బావురుమన్నది.
మర్నాడు పొద్దున్నే శ్రీరామ్, రాజేంద్రలు వీరభద్రాన్ని ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లి డాక్టరుకి చూపించాడు ఆయన ఏవేవో పరీక్షలు చేసి శారీరకంగా ఎలాంటి అనారోగ్యమూ లేదని తేల్చిచెప్పాడు. ఆ విధమైన మతిభ్రమణానికి, మానసిక రుగ్మత ఏదైనా కారణం కావచ్చుననీ హైదరాబాద్ తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో వుండే మానసిక వైద్యనిపుణుల చేత పరీక్ష చేయిస్తే మంచిదనీ సలహా ఇచ్చాడు.
* * *
ఆ మర్నాడే అందరూ కలిసి హైదరాబాద్ చేరుకుని రాజేంద్ర ఇంటికి వచ్చారు.
"ఇది ఎవరి గృహము?" టాక్సీ దిగి లోపలకు వస్తూ పక్కనున్న పార్వతమ్మను ప్రశ్నించాడు వీరభద్రం.
"అమ్మాయిగారిల్లు. దాని పెళ్లయ్యాక మనం ఇక్కడికి మూడుసార్లు వచ్చాం గుర్తులేదా?"
గుర్తుచేసుకున్న వాడిలా బుర్రగోక్కుంటూ వేర్రిచూపులు చూస్తూండిపోయాడు వీరభద్రం తాళికట్టిన భార్యనీ రక్తం పంచుకు పుట్టిన పిల్లల్నీ కూడా గుర్తుపట్టలేక పోతున్న వీరభద్రం పరిస్థితి గమనించిన రాజేంద్ర బేజారైపోయాడు.
"ఇంత మతిమాలిన మనిషి ఇక నా కట్నం బాకీ ఎలా తీరుస్తాడూ?" భార్యను పక్కకు పిలిచి రహస్యంగా అడిగాడు.
|