TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
తాతా ధిత్తై తరిగిణతోం 58
జీడిగుంట రామచంద్రమూర్తి
తమ్ముడి పెళ్ళి జరిగిన తర్వాత మళ్లీ ఆర్నెల్లకు దసరా పండుగ వంకతో హైదరాబాదు నించి, గీత పుట్టింటికి వచ్చింది.
ఈ పండక్కయినా ఎలాగో అలా మావగారి దగ్గర్నించి తనకు, రావాల్సిన కట్నం డబ్బు రాబట్టుకోవాలన్న పట్టుదలతో ఆమె వెంట రాజేంద్ర కూడా దిగపడ్డాడు.
పండుగ నాలుగురోజులూ ఆడపడుచుతో బాగా కాలక్షేపం చెయ్యవచ్చునని ఆనందించింది అశ్విని బావగారితో టౌను కెళ్లి కొత్త సినీమాలు చూడచ్చునని ముచ్చటపడ్డాడు లక్ష్మణమూర్తి.
ఆరోజు పొద్దున్న తొమ్మిది గంటలవేళ ఉయ్యాలబల్ల మీద కూర్చుని పేపర్లో వారఫలాలు చూసుకుంటున్న వీరభద్రం దగ్గరకు వచ్చాడు రాజేంద్ర.
"మీతో కొంచెం మాట్లాడాలి మావయ్యగారూ."
"ఏదైనా రహస్యమా?" పేపర్లోంచి తలెత్తి అల్లుడివైపు సూటిగా చూస్తూ అడిగాడు వీరభద్రం.
అదేక్షణంలో గ్లాసుతో మజ్జిగ తెచ్చి భర్తకు అందించింది పార్వతమ్మ.
"అ అబ్బే రహస్యం కాదండి మీరు ముందు మజ్జిగ పుచ్చుకోండి తర్వాత మాట్లాడతాను." తడపడుతూ చెప్పాడు రాజేంద్ర
మజ్జిగ తాగేసి ఖాళీగ్లాసు భార్యకిచ్చాడు వీరభద్రం.
ఆవిడ వంటింట్లోకి వెళ్లిపోయాక ఉయ్యాలబల్ల దిగి రాజేంద్ర దగ్గరకు వచ్చి 'క్లోజప్' లో చూస్తూ అన్నాడు వీరభద్రం.
"అల్లుడూ కడు స్వతంత్రుడు కనుక మీరు నిర్భయముగా మాట్లాడవచ్చు.'
"మాట్లాడట్టం అంటే అదీ అసలూ అదే నేనామధ్య సంక్రాంతి పండక్కి ఇక్కడకు వచ్చాను కదా."
"అవును అటుపిమ్మట మీ బావమరిది వివాహమునకు కూడ విచ్చేసితిరి."
"వచ్చాననుకొండీ కానీ అప్పుడు అడగలేకపోయాను."
"అడగలేకపోయారూ? ఏమిటీ? ఇప్పుడడగండీ." రాజేంద్రకు ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ అన్నాడు వీరభద్రం.
ఆయనగారి ముఖంలోకి చూస్తూ అడగటానికి తటపటాయిస్తున్నాడు రాజేంద్ర. కొబ్బరినూనె సీసాతో అప్పుడే అక్కడకు వచ్చిన నారాయణ, రాజేంద్ర పడుతున్న అవస్థను గమనించాడు.
"తమరిలా ఎదురుగా కూర్చుని సూటిగా సూత్తే అల్లుడు గారు ఇంకేం అడుగుతారండి?" అన్నాడు వీరభద్రం తలకు నూనె పట్టిస్తూ.
"మీరు నోరుముయ్యండి." మండి పడ్డాడు వీరభద్రం. అయినా నారాయణ ఊరుకోలేదు రాజేంద్రవైపు చూసి, ముసుముసిగా నవ్వుతూ చెప్పాడు.
"బాబూ అయ్యగారి ముకంలోకి చూస్తే ఇట్టాగే నోరు పడిపోతుందని చెప్పాలనుకున్న విషయం చెప్పలేక దిక్కులు సూత్తారండి ఒకేల, ధైర్యం చేసి చెప్పాలనుకున్నా రాముడి పెళ్లాం పేరు శూర్పనక చెప్తారండి. అందుకనీ తమరో పని చెయ్యండి అయ్యాగారి ముకంలో సూడకుండా అటెపు తిరిగేసీ మీరు సెప్పదల్చుకున్నది సెప్పెయ్యండి." నారాయణ ఇచ్చిన సలహా రాజేంద్రకు నచ్చింది క్షణం ఆలస్యం చేయకుండా ఆచరణలో పెట్టేశాడు.
"మావయ్యగారూ! మాపెళ్లయి మూడేళ్లయిపోయింది అయినా నాకు రావల్సినకట్నం బాకీ, మీరింకా తీర్చలేదు ఎప్పుడూ అడిగినా, ఏదో వంక చెప్పి విషయాన్ని దాటేస్తున్నారు. ఈసారి తాడోపేడో తేల్చుకోవాలని మీరు పిలవకపోయినా వచ్చాను. ఈ పండక్కి నా బాకీ తీరిస్తేనే మీ అమ్మాయి నాతో తిరిగివస్తుంది లేదంటే మీ ఇంట్లోనే వుండిపోతుంది ఆలోచించుకోండి శలవు." పక్కకు తిరిగి పారం వప్పగించినట్టు చెప్పేసి పక్కగదిలోకి పారిపోయాడు.
అల్లుడు సంబంధించిన 'శపథాస్త్రం' సూటిగా వచ్చి వీరభద్రం గుండెకు గుచ్చుకున్నట్టయింది ఏం చేయాలో తోచలేదు.
'అయ్యగారూ. తమరు నాకు ఉరిశిక్ష ఎయ్యనంటే ఓ సిన్న మాట సెప్తానండి." తలపై నూనె మర్దన చేస్తున్న నారాయణ అన్నాడు.
"చెప్పి అఘోరించు."
"ఈ రోజుల్లో కట్నాలు కానుకలూ తీసుకురాలేదని పెళ్లాల మీద పెట్రోలు పోసి తగలపెడుతున్న మొగుళ్లు ఎంతో మందున్నారండి నిన్న రాత్రి, టీవిలో కూడా అదేదో నేరాలు గోరాలు' కార్యక్రమంలో సూపించారు కూడానండి. కానీ అల్లుడు గారు మంచోడు కనుక మూడేళ్లు ఓపికపట్టారండి. ఇప్పుడు కూడా మర్యాదగానే అడిగాడు కదండీ? వారికివ్వాల్సిన ఆ కట్నం డబ్బు ఇచ్చేస్తే తమరికీ మర్యాదగా వుంటుందండీ ఏవంటారండీ?"
"తమర్ని నోరు మూసుకోమంటాను. పనివాడివి, పనివాడిలాగా ప్రవర్తించక పనికిమాలిన సలహాలిస్తే పనిలోంచి తొలగిస్తానంటాను.' నారాయణవైపు కళ్ళెర్ర చేసి చూస్తూ చెప్పాడు వీరభద్రం.
"సిత్తం. నేను పనివాణ్ణే అయినా పాతికేళ్ల నుండీ తమరు నన్ను ఈ ఇంట్లో మనిషిలాగా చూసుకుంటున్నారు ఆ చనువుతోనే చెప్పానయ్యా అయినా మీరు పరాయివాళ్లకేం ఇవ్వటంలేదుగా సాక్షాత్తూ మీ అల్లుడి గారికే అల్లుడికి డబ్బు ఇస్తే అమ్మాయిగారు కూడా ఆనందపడిపోతారు. అందుకే చెప్పాను ఆపైన తమరిట్టం." అంటూ పెరట్లోకి వెళ్లిపోయాడు నారాయణ.
వీరభద్రం ఆలోచనలో పడ్డాడు.
|