తాతా ధిత్తై తరిగిణతోం 57

తాతా ధిత్తై తరిగిణతోం 57

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials Taataadhithai tadiginatom, telugu serial comics and latest jokes online

 

"పిల్స్ వాడేవా? సర్ ప్రయిజింగ్. మరి ప్రెగ్నెన్సీ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయే" ఆశ్చర్యపోతూ అనుకుందామె.

"ఒకోసారి మనకళ్ళూ, చెవులూ కూడా మనల్ని మోసం చేస్తాయి డాక్టర్. అలాంటప్పుడు మీ 'డయోగ్నసిస్' లో పొరపాటు జరక్కూడదని ఎక్కడుందీ?"

"నో. జరగదు. హండ్రెడ్ పర్సెంట్ అయా మ్ రైట్. సర్వీసులో వేలమంది గర్భవతుల్ని పరీక్షించాను. వందల మందికి కాన్పులు చేశాను. ఎప్పుడూ ఎక్కడా అలాంటి పొరపాట్లు జరగలేదు." ధృడమైన స్వరంతో అశ్వినివైపు సూటిగా చూస్తూ చెప్పిందామె.

అశ్వినికి గుండెలు జారిపోయాయి. డాక్టరమ్మ వైపే అయోమయంగా చూస్తూ అచేతనంగా ఉండిపోయంది ఆమెను చూస్తూ డాక్టరు చెప్పింది.

'అఫ్ కోర్స్. ఒకోసారి 'పిల్స్' పనిచేయక పోవచ్చు అలాంటి సందర్భాలు నేను చాలా చూశాను ఒక్క 'పిల్స్' మాత్రమే కాదు ఆపరేషన్ ఫెయిలయిన కేసులు కూడా బోలెడున్నాయి అయినా పెళ్ళయిన ఆడపిల్లకి తను తల్లయినప్పుడే తనివి తీరుతుందంటారు. అలాంటిది నువ్వందుకు భిన్నంగా ఆలోచించటం విడ్డూరంగా వుంది."

"అదంతా మీకు తర్వాత చెప్తాను డాక్టర్. ముందు, మీరు నాకో సహాయం చెయ్యండి." ఆమె చేయిపట్టుకుని ఆర్థింపుగా చూస్తూ చెప్పింది అశ్విని.

"ఏం చెయ్యమంటావ్?"

"ఈ విషయాన్ని మా అత్తగారికి తెలియనివ్వకండి. ప్లీజ్."

"ఏం? ఎందుకనీ?? నువ్వు తల్లివి కావటం ఆవిడకు ఇష్టంలేదా?" ఆశ్చర్యపోతూ ప్రశ్నించిందామె.

"అదంతా తర్వాత చెప్తానన్నానుగా!"

"కానీ మీ అత్తగారు అమాయకురాలేం కాదు లోకజ్ఞానం కలిగిన మనిషి పైగా ముగ్గురుపిల్లల్ని కన్నతల్లి ఇప్పుడు డాక్టరుగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించలేకపోయినా రేపెప్పుడో రెండు మూడు నెలలు తర్వాత శారీరకంగా నీలో వచ్చే మార్పుల్ని చూసి ఆవిడ గ్రహించకపోదు అప్పుడు నా పరిస్థితితేమిటో ఆలోచించు."
 
"అంతవరకూ రానివ్వను ఆ పూచీ నాదీ. ప్రస్తుతానికి ఈ గండం గడిచేలా చూడండి. నేను మీ హెల్త్ సెంటరుకి వచ్చి త్వరలో అన్ని విషయాలూ మాట్లాడతాను." చెప్పింది అశ్విని.

ఆమె మాటను కాదనులేక పోయింది డాక్టరమ్మ.

"రాత్రి భోజనంలో ఏం తిందోకానీ సరిగ్గా అరగలేదు అందుకే కడుపులో తిప్పి వాంతిచేసుకుంది ఆనక ఆరోగ్యకేంద్రానికి పంపించండి. ట్యాబ్ లెట్స్ ఇస్తాను." అని పార్వతమ్మకు చెప్పి వెళ్లిపోయిందామె.

అప్పటికెలాగో గండం గడిచినందుకు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది అశ్విని ఆ రాత్రి శ్రీరామ్ భోజనం చేస్తూంటే పొద్దున్నే జరిగిన విషయమంతా అతనికి రహస్యంగా చెప్పింది.

అడివింటున్న శ్రీరామ్ కి తింటున్న అన్నం సహించకుండా పోయింది.

"అలా ఎలా  జరిగిందీ? దిగ్బ్రాంతిగా చూస్తూ అడిగాడు.

"నేను వాడిన పిల్స్ పనిచేయలేదని చెప్పిందా డాక్టరమ్మ. అయినా ఇక దాని గురించి చర్చించుకోవటం అనవసరం ఇప్పుడు జరగాల్సిందేమిటో ఆలోచించాలి."

ఆమె మనోగతాన్ని అర్థం చేసుకుంటూనే అన్నాడు శ్రీరామ్.

"కట్టుకున్న భార్య తనను తండ్రిని చేస్తోందన్న వార్త విన్నాక ఏ భర్తయినా, తన్మయత్వంతో తలమునకలవుతాడే తప్ప తలపట్టుకుని కూర్చోడు. కానీ మనింట్లో పరిస్థితి నీకు తెలుసుగా మా నాన్న అనలే చండశాసనుడు, మనం నాటకం ఆడి మోసం చేశామని తెలిస్తే ఆయనగారి అహం దెబ్బతింటుంది. ఆయనకి జాతకాలంటే మహాపిచ్చి. ఆఖరికి చిలకజ్యోస్యాన్ని కూడా గుడ్డిగా నమ్మేరకం. దానికితోడు హార్టు పేషెంటు. ఆ స్వామిజీ మాటల్లో యదార్థం ఎంతుందో మనకు తెలీదు కానీ ఇప్పుడు నీకిలా ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తే ఆయన గుండె ఆగిపోవటం ఖాయం అన్నాడు.

భర్త మాటలకు బదులు చెప్పలేక నిస్సహాయంగా చూసింది అశ్విని.

"ఓ పనిచెయ్యి." అంతలోనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అన్నాడతను మళ్లీ.

"ఏం చెయ్యాలో చెప్పు!" అడిగింది.

"మళ్ళీ ఏదో వంకన మీ ఊరెళ్ళి 'నర్సింగ్ హోం' లో అబార్షన్ చేయించుకో."

అతని వైపు దీక్షనంగా చూసింది అశ్విని.

"ఛస్తే చేయించుకోను. అయినా నాకు నెల తప్పితేనే మావయ్యగారి గుండె ఆగిపోతుందనీ అప్పుడిక అబార్షన్ చేయించుకున్న ప్రయోజనం వుండదనీ ఆ స్వామిజీ చెప్పాట్ట కదా.

అందుకే ఆ ఆలోచన అనవసరం ఏది ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుందని సరిపెట్టుకుందాం ప్రస్తుతానికి ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడదాం.

"కానీ ఇది దాచినా దాగని విషయం కదా అశ్వినీ."

"కావచ్చు ఈ సంగతి మీ వాళ్లు గ్రహించడానికి ఇంకా సమయం పడుతుందిగా అంతవరకూ బయట పడద్దంటున్నాను." చెప్పిందామె ఒక నిశ్చయానికి వచ్చినదానిలా.

*                    *                    *                  *