TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
తాతా ధిత్తై తరిగిణతోం 48
జీడిగుంట రామచంద్రమూర్తి
"బలేగా అడిగారు సిన్నమ్మగారు దానికి జవాబునే సెప్తా ఇనండి ఆ రోజుల్లో మొగుడు ఇంట్లో తిరుగుతావుంటే పెళ్లాం అసలు వంటింటి గడపదాటి బయటకు వచ్చేది కాదంట. అయ్యగారు సెప్తూంటారు, కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి తల్లీ ఈ రోజుల్లో పెళ్లాలు, మొగుళ్ళని కొంగున ముడేసి తిప్పుకుంటున్నారు ఏకంగా పేరెట్టి పిలుస్తున్నారు అమెరికాలో అయితే మొగుణ్ణి అరే, ఒరే అని కూడా అంటారంట. మొన్నామద్దెన ఓ 'టీవీ సీరియల్' లో చూశా కనుక అయ్యగారి చాదస్తం మాటల్ని పట్టించుకోమాకండి. ఓ మంచిరోజు చూసుకుని అబ్బాయిగారు, తమరూ హనీమూన్ కి ఎల్లిపొండి" అన్నాడు.
ఆ మాటలు విన్న పార్వతమ్మకు అరికాలిమంటనెత్తికెక్కింది.
"ఒరేయ్ నారిగా నువ్ నోర్ముయ్. నువ్వు కూడా సలహాలివ్వటమేనా? వెనకటికి నీలాంటివాడే, చనువిస్తే చంకనెక్కి కూచున్నాట్ట. నా ముందు వాగావ్ కనక సరిపోయింది నీ మాటలు అయ్యగారు వినివుంటే నాలిక తెగ్గోసేవారు." అంటూ విసుక్కుంది.
"అయ్యగారు లేరు కనుకే మనసులో మాట సెప్పానమ్మగారూ. ఆరు ఇంట్లో వుంటే నేనీ సాయలకు వచ్చే వోణ్ణా ఏంటి అయినా ఎవరో ఈదిన పోయే సోములారెవరో వచ్చి ఏదో నోటికొచ్చింది చెప్తే నమ్మేయటమేనా? అసలు ఇదివరకోసారి అయ్యగారి చేతిలో గీతలు చూసిన ఓ కోయదొర ఏం చెప్పాడో తమరికి గుర్తులేదా?" అడిగాడు నారాయణ.
"ఏం చెప్పాడయ్యా?" అంతవరకూ అతని మాటలు ఆసక్తిగా విన్న అశ్విని ప్రశ్నించింది. అబ్బాయి గారి సదువు పూర్తయిన వెంటనే ఆరికి పెళ్ళయి పోతుందని చెప్పాడు. మరి అట్టాగే అయిపోయింది కదా. పెళ్ళయిన ఏడాదికల్లా , మా ఈరభద్రం అయ్యగారు మానవణ్ణి ఎత్తుకుంటారని కూడా చెప్పాడు ఆ దొర. మరి అది కూడా జరిగిపోవాలి కదా?"
అశ్విని కళ్ళు ఆనందంతో మెరిశాయి ఇంతలో నారాయణ మరో అడుగు ముందుకొచ్చాడు.
"అసలు ఆ 'బెమ్మరాత' ను కరెక్టుగా ఎవ్వరూ సెప్పలేరమ్మా! జాతకాలెప్పుడూ నిజం కావంటా! అట్టా నిజం కూకూడదని, సాక్షాత్తూ ఆ పార్వతీదేవి శాపం ఇచ్చినాదంట.కనక, పెద్దాయన మాటలు పెట్టించుకొమాకండి." అంటూనే తన దారిన తాను పెరట్లోకి వెళ్ళిపోయాడు.
'పని వాళ్లను నెత్తికెక్కించుకుంటే పనికిరాని సలహాలు ఇలాగే ఇస్తారు' అనుకుంటూ పార్వతమ్మ వంటింటివైపు నడిచింది.
హాల్లో వున్న సోఫాలో ఆలోచిస్తూ కూలబడిపోయింది అశ్విని నారాయణ మాటలు ఆమె చెవుల్లో మోగుతున్నాయి.
* * *
తన ఆఫీసురూంలో కూర్చుని పేపరు తిరగేస్తున్నాడు విష్ణుమూర్తి. అంతలో టేబుల్ మీది టెలిఫోన్ రింగైంది రిసీవర్ తీసుకుని 'హాలో' అన్నాడు.
"రాజు పాలెంనించి 'కాల్ సార్! మీ 'డాటర్' లైన్ లో వున్నారు మాట్లాడండి.' ఇంటర్ కమ్ లో చెప్పింది స్టెనో.
వెంటనే పేపరు పక్కన పారేసి ఉత్సాహంగా 'హలో బేబీ' అనీ ఫోన్లోనే పిలిచాడు విష్ణుమూర్తి.
"బాగున్నారా డాడీ?" అవతల్నించి అశ్విని అడిగింది.
"నేను క్వయిట్ బేబీ! నువ్వెలా వున్నావ్? బానే వున్నాను."
ఆమె గొంతులో ఏదో అసంతృప్తి ధ్వనించినట్టుగా అనిపించింది విష్ణుమూర్తికి. "బా...'నే' వున్నానూ అంటే నాకేదో అనుమానంగా వుంది. నిజం చెప్పు తల్లీ అక్కడ నీకు అన్నీ సౌకర్యంగా వుంటున్నాయా? శ్రీరామ్ నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడా?"
"ఎలా చూసుకునేందుకైనా మావయ్యగారు, ఆయన కసలు అవకాశం ఇస్తేనేకదా."
"అంటే!" ఆదుర్దాగా అడిగాడు విష్ణుమూర్తి.
"రోజురోజుకీ మా మధ్య మావయ్య గారి ఆంక్షలు ఎక్కువైపోతున్నాయి డాడీ!"
"ఆంక్షలా! అంటే ఏం చేస్తున్నారూ?" అడిగాడు విష్ణుమూర్తి.
"మేమిద్దరం కనీసం ఒకరినొకరు చూసుకునేందుకు కూడా వీల్లేకుండా కట్టడి చేస్తున్నారు. శ్రీరామ్ కి వాళ్ల స్కూల్లోనే ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చారు రోజూ పొద్దునే వెళ్లి సాయంత్రం దాకా రావటానికి వీల్లేకుండా చేశారు.
'ఉద్యోగం ఇవ్వటం ఏమిటీ అల్లుణ్ణి మన కంపెనీ ఎమ్ డి ని చేసి బిజినెస్ వ్యవహారాలన్నీ అప్పగించాలనుకున్నాం కదా?"
"ఆ మాటే నేను శ్రీరామ్ కి చెప్పాను డాడీ?"
"ఎవన్నాడూ"?
"ఎప్పుడూ మానాన్నముందు నిలబడి ఆయన వైపు సూటిగా చూసి మాట్లాడలేనివాణ్ణి ఏకంగా నిన్ను పెళ్ళిచేసుకున్నాను కదా మళ్లీ మరోసారి ఎదిరిస్తే ఆయన బాధపడతారూ అన్నాడు పైగా మావయ్యగారు గుండెజబ్బు మనిషిట. అందుకని శ్రీరామ్ భయపడుతున్నాడు."
"పోనీ నువ్ మనూర్ వచ్చేయకూడదూ? ఆ మూర్ఖశిఖామణి, అదే మీ మావగారు పెట్టిన గడువు తీరేదాకా ఇక్కడే వుందువుగాని."
"లాభం లేదు డాడీ! మొన్న రాత్రి ఆ ప్రస్తావన కూడా తేవటం జరిగింది" అంటూ అశ్విని జరిగిన విషయాన్ని ఫోన్లో వివరిస్తూంటే ఆ దృశ్యం విష్ణుమూర్తికి కళ్ళముందే కదుల్తోంది ప్లాష్ బ్యాక్.
"కలిసి కాపురం చేసే అవకాశం ఇప్పట్లో ఎలాగా లేకుండా పోయింది కనీసం కళ్ళముందు కూడా నువ్వు కనిపించకపోతే ఇక ఈ పల్లెటూళ్లో నాకేం తోస్తుందీ? మా ఊరెళ్ళిపోతాను శ్రీరామ్." ఆరాత్రి భోజనం చేశాక టీవీ ముందు కూర్చుని, నా మొగుడు నాకే సొంతం." సీరియల్ చూస్తున్న శ్రీరామ్ దగ్గర కొచ్చి కూర్చుంటూ చెప్పింది అశ్విని. ఆమె వైపు శ్రీరామ్ దిగ్భ్రాంతిగా చూశాడు.
|