తాతా ధిత్తై తరిగిణతోం 47

తాతా ధిత్తై తరిగిణతోం 47

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials Taataadhithai tadiginatom, telugu serial comics and latest jokes online

 

రోజులు ఎప్పటిలాగానే గడుస్తున్నాయి. శ్రీరామ్, అశ్వినిలకు మాత్రం చాలా దుర్భలంగా గడుస్తున్నాయి. ఆకలి దంచేస్తుంటే, అన్నానికి ఆహ్వానించి అరిటాకులో అన్నీ వడ్డించి తినటానికి వీల్లేదంటూ కళ్ళకు గంతలు కడితే ఎలా వుంటుంది?.

రవీంద్రభారతిలో జరుగుతున్న బాల మురళీకృష్ణ కచేరికి తీసుకెళ్లి వినటానికి వీల్లేదు పొమ్మంటూ చెవుల్లో సీసం కరిగించి పోస్తే ఎలా వుంటుందీ? సరిగ్గా వాళ్ళిద్దరి పరిస్థితీ అలాగే వుంటోంది.

పెళ్లయి మూడు నెలలు గడిచిపోతున్నా ఆ 'మూడురాత్రుల ముచ్చట' ఇంకా తీరక పోయేసరికి వాళ్ళింకా 'కొత్త దంపతుల్లాగానే మిగిలిపోయారు. .మూడ్' వచ్చినప్పుడు భార్యను ముద్దు పెట్టుకునేందుకైనా వీలు కల్పించుకుండా శ్రీరామ్ ని హద్దుల్లో వుంచే ప్రయత్నాలు చేస్తున్నాడు వీరభద్రం.

'వాసం' ఒక్కటే అయినా సహవాసానికి ఆస్కారం లేకుండా ఇద్దరికీ వేర్వేరు గదుల్లో నివాసాలు ఏర్పాటు చేశాడు. దాంతో వాళ్లు 'వియోగబాధ' ను భరించలేక విలవిల్లాడి పోతున్నారు.

'విరహంలో సుఖం వుందని' చెప్పిన 'కవివాక్కును' అందని పళ్ళు పులుపు' అనే సామెతను ముడిపెట్టి విరహంలో కేవలం విషాదం మాత్రమే వుంటుందని బాత్ రూంలో స్నానం చేస్తున్నప్పుడల్లా బయటెక్కడో వున్న అశ్వినికి వినిపించేలా పాడుకుంటున్నాడు శ్రీరామ్.

'అంతా భ్రాంతియేనా పెళ్ళంటే ఏడాది ఎడబాటేనా ఆశా నిరాశేనా మిగిలిందీ ఒంటరి పడకేనా?' అంటూ అశ్విని కూడా ప్రతిరాత్రీ తన 'బెడ్రూం'లో సింగిల్ కాట్ మీద పడుకుంటూ, హాల్లో వుండే శ్రీరామ్ కి వినిపించేలా వరసకట్టి పాడే ప్రయత్నం చేస్తోంది. పాటలో పశ్రుతులు ధ్వనించినా అందులో భావానికి శ్రీరామ్ ఆవేశపడిపోయి, అప్పటికప్పుడు అశ్విని దగ్గరకు వెళ్ళిపోయి ఆమె కౌగిలిలో వాలిపోయి సేదతీరాలనుకునేవాడు. కానీ 'సెన్సార్ ఆఫీసరు' లాగా పక్కనే తండ్రి కనిపించేసరికి తన 'అడ్డల్ట్' ఆలోచనలకి' 'యు' సర్టిఫికెట్ ఇచ్చేసుకుని తండ్రి మూర్ఖత్వాన్ని తన అసమర్థతనీ జాయింటుగా తిట్టుకుంటూ నిద్రలోకి జారుకునేవాడు.

వాళ్ళ దురవస్థను గమనించిన పార్వతమ్మ కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకి కోపం' అనే తరహాలో, అటు భర్తకు నచ్చచెప్పలేక ఇటు నూతన దంపతుల విరహవేదన చూడలేక దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది.

ఆఖరికి ఆ ఇంట్లో పనిచేస్తున్న నారాయణ కూడా శ్రీరామ్ పరిస్థితిని చూసి జాలిపడేవారు. ఏడాదికాలంపాటు ఎప్పుడు పూర్తవుతుందా, భార్యాభర్తల మధ్య ఆంక్షలు ఎప్పుడు తొలిగిపోతాయా, వీరభద్రం ఎప్పుడు తాతవుతాడా, మనవడు పుట్టుకొచ్చి 'ధిత్తై తధిగిణి తోం' అంటూ తాతగారి వీపుమీద ఎప్పుడు మోతమోగిస్తాడా అనుకుంటూ అసహనంగా ఆలోచిస్తున్నాడు.

ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలవేళ రేడియోలో, 'హలో ఎఫ్.ఎమ్.' కార్యక్రమాన్ని వింటోంది అశ్విని. అందులో ఎవరో శ్రోతలు కోరిన మీదట అనౌన్సర్లు 'ఒంటరిగా వున్నావంటే ఒంటికి మంచిది కాదు' అనే పాట వినిపిస్తున్నారు.

ఖర్మం చాలక ఆ పాట వీరభద్రం చెవినకూడా పడింది. పనీపాటూ లేకుండా, శ్రీరామ్ ఇంట్లోనే ఒంటరిగా కూర్చుంటే అతని ఒంటిమీదున్న తుంటరి వయసు మనసును అల్లరి పెట్టి ఆలోచనల్ని అడ్డదారి పట్టిస్తాయోమోనన్న భయం కలిగింది. వెంటనే ఓ నిర్ణయానికొచ్చాడు.

స్కూలుకి వెళ్ళగానే 'మేనేజింగ్ కమితీనీ సమావేశపరిచాడు. తనకు వయసు పైబడిందని కనుక, వారసత్వపు హోదాలో, శ్రీరామ్ ని ఆ స్కూలుకి వెళ్ళగానే 'మేనేజింగ్ కమిటీనీ సమావేశపరిచాడు. తనకు వయసు పైబడిందని కనుక, వారసత్వపు హోదాలో, శ్రీరామ్  ని ఆ స్కూలుకి మేనేజరుగా  నియమిస్తూ, ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. కమిటీ సభ్యులంతా దాన్ని ఆమోదించారు. సాయంత్రం స్కూలు నించి ఇంటికి తిరిగిరాగానే 'అప్పాయింటుమెంటు ఆర్డరు' శ్రీరామ్ చేతికి అందించాడు.

"రేపటినించీ పాఠశాలకు వచ్చి అఘోరించండి. అక్కడి వ్యవహారాలన్నీ ఇకమీదట తమరే పర్యవేక్షించాలి." అన్నాడు. శ్రీరామ్ గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయింది. ఎదిరించి బదులు చెప్పే సందర్భం కాకపోవటంతో వచ్చిన కోపాన్ని అణుచుకునే మార్గంలేక కసిగా గోళ్ళు కొరుక్కున్నాడు. 'ఒంటి సుఖాన్ని' ఎలాగూ దూరం చేశాడు. ఇప్పుడు స్కూల్లో ఉద్యోగం ఇచ్చి, కంటిచూపు'కి కూడా దూరం చేసినందుకు తండ్రిని మనసులోనే కసిగా తిట్టుకున్నాడు.

మర్నాడు పొద్దున్న టవల్ అందించే వంకతో, పెరట్లో నుయ్యి దగ్గర స్నానం చేస్తున్న శ్రీరామ్ దగ్గరకు వెళ్లింది అశ్విని.

"పెళ్ళవగానే ఎంచక్కా నువ్వు టౌనుకొచ్చి మా ఇంట్లోనే వుంటూ, మా డాడీ బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకుంటావని నేనెంతో ఆశపడితే మావయ్యగారు ఇలా చేశారేమిటి శ్రీరామ్"? అంటూ దీనంగా అడిగింది.

"బాధపడకు అశ్వినీ. మా నాన్న సంగతి నీకు తెలుసు కదా. ఇప్పటికే ఆయన్ని ఎదిరించి నిన్ను పెళ్లిచేసుకున్నాను. ఇప్పుడు, ఈ పరిస్థితుల్లో ఆయన్ని మళ్లీ ఎదిరించి మకాం మారుస్తానంటే మండిపడతారు. ఆయనసలే గుండె జబ్బుమనిషి ఓపిక పట్టాలి తప్పదు." అన్నాడు శ్రీరామ్ గాఢంగా నిట్టూర్చి.

ఆ రోజునుంచీ తాను కూడా తండ్రితో పొద్దున్న స్కూలుకి వెళ్లి మళ్లీ సాయంత్రానికి తిరిగివస్తున్నాడు.

మావగారి పోకడల్ని చూస్తున్న అశ్వినికి ఒళ్లు మండిపోతోంది అయినా కొత్తకోడలుగా ఆయనకు ఎదురు చెప్పే సాహసం చేయలేక ఓసారి పార్వతమ్మ దగ్గర ఆ ప్రస్తావన తెచ్చింది.

"మావయ్యగారితో మీరెలా వేగుతున్నారో అర్థం కావటం లేదు" అంది.

"ఏం చేస్తాం తల్లీ? అలవాటైపోయింది. పెళ్ళయిన ఆర్నెల్లవరకూ నేనసలు పడగ్గదిలో తప్ప వేరే సమయాల్లో ఆయన కంటపడేందుకు భయపడిపోయేదాన్ని ఆ తర్వాత పిల్లలు పుట్టుకొచ్చాక వాళ్ల పెంపకం ధ్యాసలో పడి, ఆయనగార్ని పట్టించుకోవటం మానేశాను."

"పెళ్లయ్యాక, మిమ్మల్ని కూడా ఇలాగే ఏడాదో, రెండేళ్లో మావయ్యగారికి దూరంగా వుండమని ఆంక్షలు పెట్టుంటే మీరేం చేసుండేవారూ?" సూటిగా అడిగింది అశ్విని.

పార్వతమ్మ జవాబు చెప్పలేక తలవంచుకుంది.

అప్పుడే పొలం నించి ధ్యానం బస్తాలు తీసుకొచ్చిన నారాయణ అటు వెడుతూ ఆ మాటలు విన్నాడు.