తాతా ధిత్తై తరిగిణతోం 42

తాతా ధిత్తై తరిగిణతోం 42

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials Taataadhithai tadiginatom, telugu serial comics and latest jokes online

 

విష్ణుమూర్తి గబగబా శ్రీరామ్ దగ్గరకు వచ్చాడు.

"నీకేం దెబ్బతగల్లేదు కదా మిస్టర్ శ్రీరామ్?" అడిగాడు ఆందోళనగా.

"ఏం కాలేదంకుల్ డోంట్ వర్రీ. పదండీ వెడదాం." అంటూ కారువైపు నడిచాడు.

"ఆళ్ళు నలుగురొచ్చారు బాబూ చేత్తుల్లో కత్తులు కూడా పట్టుకొచ్చారు. అల్లుడుగారు ఒక్కరే అయినా సినీమాలో సిన్న ఎన్టీఆర్ లాగా ఆళ్ళతో ఓ ఆట ఆడారు." చెప్పాడు డ్రైవర్ ఉత్సాహంగా.

విష్ణుమూర్తి శ్రీరామ్ వైపు గర్వంగా చూశాడు.

"సార్. రేపొద్దున్న మీరు ఓ రిపోర్టు రాసివ్వాలి. స్టేషన్ కి రండి." వాళ్ళకు దగ్గరగా వచ్చి చెప్పాడు పోలీస్ ఇన్స్పెక్టర్.

"పదిరోజుల్లో పెళ్లి పీటల మీద కూర్చోవలసిన మా అల్లుడు గారు పోలీస్ స్టేషన్ కి రావటమా? ఇంపాజిబుల్ కావాలంటే మా డ్రైవర్ని పంపిస్తాను...ఏం కావాలో రాయించుకోండి." అంటూ కారెక్కి కూచున్నాడు విష్ణుమూర్తి.

"ఒకే సార్." అంటూ సెల్యూట్ చేశాడు ఇన్ స్పెక్టర్.

అటు పోలీసు జీపూ ఇటు విష్ణుమూర్తి కారూ ఒకేసారి స్టార్టయ్యాయి.

సరిగ్గా అదే సమయంలో,

రాజుపలెంలో, వీరభద్రం ఇంట్లో ఉయ్యాలబల్లమీద తాంబూలం నముల్తూ కూచున్న వీరభద్రానికి ఒళ్ళు పడుతున్నా నారాయణ అంటున్నాడు.

"బాబుగారూ. అబ్బాయి గారి పెళ్లి ఇంక పది రోజుల్లోనే కదా. మరి ఏడాది తిరగేసరికి తమరు తాతగారై పోతారేమో?"

"ఔను మారావుబహద్దర్ల వంశమును ప్రకాశింప చేయుటకు మరో వారసుడు ఉదయిస్తాడు." అంటూ ఉత్సాహంగా మీసం మెలివేశాడు వీరభద్రం.

"అట్టా తమరింక మీసాలు మెలేస్ రోజులు సెల్లిపోతాయి లెండి బాబూ మనవడు గారు పుట్టారంటే తమరి ఈపెక్కి ఆ మీసాలు పట్టుకుని ఆడిస్తారు ఆప్పుడీ తాతగారు 'తధికిణ తోం' అంటూ డాన్సాడాల్సిందే." అంటూ గలగలా నవ్వేశాడు నారాయణ.

వంటపని ముగించుకుని గదిలోంచి బయటకు వచ్చిన పార్వతమ్మ ఆ మాటలు విని ముసిముసిగా నవ్వుకుంది.

*           *           *          *

ఎంతో అట్టహాసంగా, అత్యంత ఆర్భాటంగా పెళ్లి జరిగిపోయింది. అశ్వినీ, శ్రీరామ్ లు దంపతులైపోయారు. తన కూతురు చేతిని, శ్రీరామ్ చేతిలోపెట్టి అప్పగిస్తూ విష్ణుమూర్తి పసిపిల్లాడిలా ఏడ్చేశాడు.

"నా బిడ్డను నేను ఏనాడూ కష్టపెట్టలేదయ్యా. రేపెప్పుడైనా అమ్మాయి కలతపడినట్టు తెలిస్తే నా కాలూ చెయ్యీ ఆడదు. కన్నీరు పెట్టుకోవడం చూస్తే నా గుండె ఆగిపోతుంది. దీన్ని నువ్వు భర్తగా కాకుండా, బిడ్డగా చూసుకోవాలి." అన్నాడు గాద్గదిక స్వరంతో.

"బావగారూ బాగా శలవిచ్చారు. భర్త అనగా భరించు వాడగును కనుక భార్యను బిడ్డగా భావించుట తప్పుకాదు. అయినా, తమరిలా విచారించుట తగదు. మీ కుమార్తె ఇకనించీ మాకునూ కుమార్తెతో సమానమే. పైగా ఈనాటి ఆడపిల్లలు ఎందరో అమెరికా అబ్బాయిలు కోసం అర్రులు చాస్తూ ఫోనుపలకరింపులకే తప్ప కంటి చూపులకు అందనంత దూరతీరాలకు వెళ్లిపోతున్నారు. మీరునూ ఒకనాడు, అమ్మాయికి అమెరికా సంబంధమే చేయుటకు సిద్ధపడినారు కానీ భగవంతుడు మీకు మేలు చేసినాడు మీ అమ్మాయి కేవలం ఇండియాలోనే ఆదియునూ, రెండు మూడు గంటల వ్యవధి ప్రయాణానికి అందేతంతటి చేరువలో వుంటున్నది. కనుక మీరెప్పుడు కావలసినా రావచ్చును. అట్లే, మీ అమ్మాయికి మీపై ఎప్పడు బెంగపుట్టునా మా సుపుత్రుడు వెంట బెట్టుకుని వస్తాడు. మీరు నిశ్చంతగా వుండండి." అంటూ విష్ణుమూర్తి భుజం తట్టి ధైర్యం చెప్పాడు వీరభద్రం.

మావగారి భాషావేష విశేషాల్ని గమనిస్తూ అశ్విని తన మనోవేదన కొంతవరకు మర్చిపోయింది.