తాతా ధిత్తై తరిగిణతోం 38

తాతా ధిత్తై తరిగిణతోం 38

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials Taataadhithai tadiginatom, telugu serial comics and latest jokes online

 

"మీ మావయ్య అశ్వినితో నీ పెళ్లి జరిపించనన్నాడే తప్ప ఈ ఇంట్లోంచి మనల్ని 'గెటౌట్' అన్లేదుగా?"

అర్థం కానట్టు చూశాడు గోపాలం నువ్ తనకు అల్లుడివి కాకపోయినా మేనల్లుడి వేనని మెచ్చుకున్నాడు తన కంపెనీ వ్యవహారాలూ చూడవచ్చునన్నాడు. అలా చూస్తూ చూస్తూ నువ్వు 'నీ' వ్యవహారం నడపచ్చు కంపెనీకి 'కంచె'లా నిలబడి చేనంతా మేసెయ్యచ్చు. వ్యాపారంలో నష్టాలు చూపించి నువ్వు లాభాలు చేసుకోవచ్చు."

తండ్రి మాటలు గోపాలానికి అంతగా రుచించలేదు. ఒక్క ఉదుటున సోఫాలోంచి లేచాడు. మందు ప్రభావంతో తన మనసులో మాట చెప్పాడు.

"అదంతా లాంగ్ రూటు వ్యవహారం. నాదంతా షార్ట్ కట్ పద్ధతి. అందుకే ఓ 'ప్లాన్' వేశాను"

"ప్లానా? ఏమిటీ?" ఆత్రంగా అడిగాడు హనుమంతు.

"మనం హైదరాబాద్ జైల్లో వున్నప్పుడు 'బాషా' అనే రౌడీషీటర్ తో పరిచయమైంది. గుర్తుందా?"

గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు హనుమంతు ఇంతలో మళ్ళీ గోపాలం చెప్పాడు.

"మనకంటే ఆర్నెల్ల ముందే జైల్లోంచి రిలీజైపోయాడు. హైదరాబాదులో అతడికో పెద్ద అడ్డా వుంది నాకు అడ్రసిచ్చాడు. ఫోన్ నంబరు కూడా రాసిచ్చాడు."

"అయితే?"

"అతనికి ఫోన్ చేసి పిలిపిస్తాను"

"ఎందుకూ?"

"అశ్వినిని పెళ్లి చేసుకోబోయే ఆ శ్రీరామ్ గాడి అడ్రస్సు చెరిపెయ్యటానికి." అంటూ గ్లాసు తీసి మరో పెగ్గు పోసుకున్నాడు గోపాలం.

హనుమంతు గాభరాగా చూశాడు.

"వద్దులే ఇన్నాళ్లూ ఇలాంటి షార్ట్ కట్లు ప్లాన్లే వేసి అష్టకష్టాలు  అనుభవించాం జైల్లో చిప్పకూడు తిని బతికాం ఇప్పుడు రోజులు బాగుండి పెద్ద మనుషుల్లాగా మీ మావయ్య బంగాళాలో ఆశ్రయం సంపాదించుకున్నాం. కొద్ది రోజుల్లో అశ్విని పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతుంది. కంపెనీ వ్యవహాలు ఎలాగా నీ చేతికోస్తాయి అప్పుడు దర్జాగా బ్రతికేయచ్చు. నా మాట విని అంటూ ఏదో చెప్పబోతున్న తండ్రిని పక్కకు తోసేసి టెలిఫోన్ వైపు నడిచాడు గోపాలం.

*      *     *

సరిగ్గా అదే సమయంలో విష్ణుమూర్తి బంగళా ముందు టాక్సీ ఆగింది.

అందులోంచి వీరభద్రం చిదంబరం దిగి లోపలకు ప్రవేశిస్తున్నారు.