TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
తాతా ధిత్తై తరిగిణతోం 29
జీడిగుంట రామచంద్రమూర్తి
"సరెలెండి. కట్న కానుకలు వదిలేద్దాం. కనీసం పెళ్ళయ్యాకైనా ఓ అచ్చటా ముచ్చటా తీర్చగాలడా మీ బావమరిది? ఎంత సేపూ నాటకాల ధ్యాసే తప్ప
ఇంటిగురించీ, పెళ్ళికేదిగిన కూతురు గురించీ, అతనికి ఆలోచన కొంచెమైనా వుందంటారా? హు. ఆ నాటకాల పిచ్చిలో పడి వ్యసనాలక్కూడా బానిసయ్యాడు.
ఆనాడు రోగమొచ్చి మంచాన పడ్డ మీ చెల్లెలికి మందూ, మాకూ ఇప్పించకపోగా, కనీసం తిండీ తిప్పలూ కూడా సరిగ్గా చూడలేక పోయాడు ఆమె చావుకు తనే
కారణమయ్యాడు."
భార్య వైపు చూస్తూనే, ఆమె మాటలు వింటూనే ఆలోచిస్తున్నాడు వీరభద్రం.
"ఎందుకిలా జరుగుతోందీ?" తనలో తనే ప్రశ్నించుకున్నాడు.
తన ముఖంలోకి కన్నెత్తి కూడా చూడలేని కన్నకొడుకు మూడు రోజులక్రితం తన కళ్ళముందే తాచుపాములా బుసలు కొట్టాడు. తన ప్రశ్నలకు 'టూకీ' గా
సమాధానాలు తప్పుకునే ఇల్లాలు. ఇప్పుడు తననే నిలదీసి ప్రశ్నిస్తోంది. అంటే. తనలో పవరు తగ్గిపోయిందా? లేక చిదంబరం చెప్పినట్టు నిజంగానే కాలం
మారిపోయిందా?
తన భర్త మౌనాన్ని అలుసుగా తీసుకున్న పార్వతమ్మ మళ్ళీ అంది "తోడ బుట్టిన ఆడపిల్ల కదా అనే ఆదరణతో మానవత్వం వున్న మనిషిగా ఆవిడగారి
ఆఖరినిమిషంలో మీరు వెళ్ళి ఆ మాట కాస్తా ఇచ్చి వచ్చారు. కానీ, కన్నకొడుకు ముద్దూ ముచ్చట తీర్చవలసిన బాధ్యత కూడా మీకు వుంటుందిగా? చదువూ,
సంధ్యా నేర్చుకుని, మీ అంతటివాడైన మీ పెద్ద కొడుకు మాటను గౌరవించవలసి అవసరం మీకుండదా? పీటల మీది పెళ్ళిళ్ళే ఆగిపోతున్న ఈ రోజుల్లో ఎప్పుడో
ఇరవై ఏళ్లక్రితం ఇచ్చిన మాటకు కట్టబడి, వాడిచేత ఇష్టంలేని పిల్ల మెడలో బలవంతంగా తాళికట్టించడం అవసరమా?"
"అయినా నీకో సంగతి చెప్పాల్రా భద్రుడూ." అంతలో చిదంబరం కల్పించుకుంటూ అన్నాడు.
"లాయర్ గా నేను ఎన్నో కేసులు చూశాను. ఇష్టంలేని వాళ్ళతో, పెద్దవాళ్ళు, బలవంతంగా జరిపించే పెళ్ళిళ్ళు అనేకం విఫలమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో
అయితే, ఆత్మహత్యలకూ, హత్యలకూ కూడా కారణమావుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో, పసుపూ పారాణి ఆరకుండానే విడాకులకు దారి తీస్తున్నాయి.
అంచేత, నా మాట విను. నీ మనసుకి నచ్చజెప్పుకుని, మీ వాడి మనసుకు నచ్చిన ఆ పిల్లతో లక్షణంగా పెళ్ళిచేసి, అక్షింతలు జల్లి ఆశీర్వదించు. నీ పెద్దరికాన్ని
నిలబెట్టుకో" చెప్పాడు చిదంబరం.
వీరభద్రం ఇంకా అలాగే ఆలోచిస్తూ మౌనంగా వుండిపోయాడు అదే అదననుకున్న పార్వతమ్మ భర్తకు బత్తాయి రసం అందిస్తూ చెప్పింది మళ్ళీ "అయినా
మనవాడు ఏ కులం తక్కువ పిల్లనో, గుణం లేని పిల్లనో మనువాడతానని మంకుపట్టు పట్టటం లేదుగా? సంతోషించండి. అయినింటి పిల్ల ఆస్తీ ఐశ్వర్యం వున్న
పిల్ల. పైగా, మర్యాదగా తమ పెళ్ళి చెయ్యకపోతే రిజిస్ట్రారాఫీసుకీ వెళ్ళి చేసుకుంటానంటూ, మీకెదురు నిలిచి మరీ చెప్పేటంత ధైర్యం వాడిలో కలిగిందంటే వాడు ఆ
పిల్లని ఎంత గాఢంగా ప్రేమించాడో, అర్థం చేసుకోండి. అంచేత మీ పంతాలూ, పట్టింపులూ పక్కన పెట్టి పంతులుగార్ని పిలిచి ముహూర్తం పెట్టించండి."
ఆ మాటలు వింటూనే, ఆమె అందించిన బత్తాయిరసం తాగేసరికి వీరభద్రంలో అంతవరకూ పెల్లుబకిన ఆవేశం చల్లబడింది. కావాల్సిన మిత్రుడూ, కట్టుకున్న
ఇల్లాలు, అలా ఎడాపెడా కూర్చుని బుర్రలోకి ఎక్కించేసరికి తలవంచక తప్పలేదు.
"సర్లే. అట్లే కానిద్దాం." అన్నాడు తేలిగ్గా నిట్టూర్చి.
"ఇప్పుడు నువ్వు నాకు నచ్చావురా భద్రుడా" అతని భుజం తట్టి మరీ మెచ్చుకున్నాడు చిదంబరం.
* * *
పోర్టికోలో కారాగిన చప్పుడు విని పేపరు చదువుతున్న విష్ణుమూర్తి, వీధి గుమ్మంవైపు చూశాడు.
తాక్సీలోంచి అప్పటికే ఇద్దరు వ్యక్తులు కిందకు దిగి లోపలకు రావటం కనిపించిందతనికి. ఒకరు లావుగా పొట్టిగా, కాస్త వయసు పైబడిన వాడిలా కనిపిస్తే రెండవ
వ్యక్తి ఆధునిక దుస్తుల్లో అందమైన యువకుడిలాగే వున్నాడు.
ఆ ఇద్దరూ లోపలకు వచ్చారు.
వాళ్ళెవరో వెంటనే పోల్చుకోలేక వింతగా చూస్తూండిపోయాడు విష్ణుమూర్తి. అప్రయత్నంగానే అతనితో చేతులు కలుపుతూ ప్రశ్నార్థకంగా చూశాడు విష్ణుమూర్తి.
"గుర్తుపట్టలేదా బావా? నేను హనుమంతుని" సోఫాలో కూలబడుతూ, తనను తాను పరిచయం చేసుకున్నాడతను.
విష్ణుమూర్తి కళ్ళు అప్పుడే ఆనందంతో మెరిశాయి.
"ఓర్ని నువ్వటోయ్ బావమర్దీ అసలు పోల్చుకోలేనంతగా మారిపోయావ్ సుమా." హుషారుగా లేచి వచ్చి పక్కనే కూర్చుని అతని భుజం మీద చరిచాడు.
"అవున్లే....ఎలా పోల్చుకుంటావ్? మీ పెళ్ళయ్యిన ఆర్నెల్లకే నేను అమెరికా వెళ్లిపోయానుగా."
"అదిసరే...ఇంతకీ ఇండియా ఎప్పుడొచ్చావు?' అడిగాడు విష్ణుమూర్తి ఆతృతగా.
|