తాతా ధిత్తై తరిగిణతోం 25

తాతా ధిత్తై తరిగిణతోం 25

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

 

"కానీ ఆ బాబా ఎవరో మనకి అయ్ మీస్ అదే, నాకు తాయెత్తు ఇస్తారంటావా?"

"ఓ యస్! తప్పకుండా ఇస్తారు...మన అదృష్టం బావుండి వందేళ్ళు పైబడినా ఆయనింకా బ్రతికేవున్నారు నువ్వు ''ఉ'' అన్నావంటే ఇప్పుడే నిన్ను ఆయన దగ్గరకు తీసుకెడతాను" చెప్పింది అశ్విని ఉత్సాహంగా.

"సరే 'ఉ' అంటున్నాను! నీ ఇష్టం" అన్నాడు శ్రీరామ్.

"హుర్రే" అంటే కారులోనే ఎగిరి గంతేసి తర్వాత కారు రివర్స్ చేసి మశీదువైపు వేగంగా పోనిచ్చింది అశ్విని.

*          *            *        * 

ఇరుకు సందులోకి నెమ్మదిగా వచ్చిన కారు శిధిలావస్థలో వున్న ఓ చిన్న పెంకుటింటి ముందు ఆగింది. పక్కనే వున్న మశీదు లోంచి 'నమాజు' విన్పిస్తోంది. ఆ ఇంటి గుమ్మం ముందు బక్కచిక్కిన రెండు కుక్కపిల్లలు సరసాలాడుకుంటున్నాయి.

అశ్వినీ...శ్రీరామ్ లు కారుదిగి గుమ్మం దగ్గర కొచ్చారు. వాళ్ళిద్దర్నీ చూసిన కుక్కపిల్లలు, తమ సరసాలాపి సీరియస్ గా మొరగటం ప్రారంభించాయి శ్రీరామ్ భయాపడి ఓ అడుగు వెనక్కి వేశాడు....అశ్విని మాత్రం నిర్భయంగా ముందుకు నడిచి గుమ్మానికి వేలాడుతున్న 'గోనె బరకం' లాంటి తెర తొలగించి లోపలకు చూస్తూ 'బాబా' అని పిలిచింది.

"కౌన్? అందర్ ఆయీయే!" లోపల్నుంచి బాబా గొంతు వినిపించింది.

"బాబా ఇంట్లోనే వున్నారు. కమాన్ అంటూ శ్రీరామ్ చేయి పట్టుకుని లోపలకు తీసుకెళ్ళింది.

కుక్కలు రెండూ...మొరగటం మానేసి బుద్ధిగా దారిచ్చాయి.

"ఇది కూడా తావీజు మహిమే కాబోలు" అనుకునాడు శ్రీరామ్ లోపలి గదిలో ఓ కుక్కిమంచం మీద కూర్చుని 'హుక్కా' పీలుస్తున్నాడు రసూల్ బాబా...మంచం ముందు ఓ ముక్కాలి పీట....పక్కనే కొన్ని పింగాణీ పాత్రలూ మంచినీళ్ళకూజా వున్నాయి గోడమీద వానకు తడిసిపోయి నట్టున్న 'మక్కామసీదు' కేలండరు ఆగిపోయిన గడియారం కనిపిస్తున్నాయి. గది మధ్యగా కుట్టిన దండెం మీద రంగుల వెలిసిపోయిన లాల్చీలు వేలాడుతున్నాయి.

"కౌన్ హై?" చేయి నుదిటికి అడ్డం పెట్టుకుని తల ముందుకు సాచి భూతద్దాల కళ్ళజోడు లోంచి చూస్తూ అడిగాడు బాబా.

"నేను బాబా! విష్ణుమూర్తి గారి అమ్మాయిని!"

"నువ్వాబెటీ? బావున్నావా? మీ నాయన కులాసాయేనా?" అడిగాడు.

అతను అచ్చతెలుగులో మాట్లాడటం చూసి ముచ్చట పడ్డాడు శ్రీరామ్ బాబా అడిగిన కుశల ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పింతర్వాత, అతనికి శ్రీరామ్ ని పరిచయం చేసింది తర్వాత చెప్పింది.

"ఇతనికి ఓ తాయెత్తు కావాలి బాబా!"

"దేనికి?"

"అదే అప్పుడెప్పుడో ఓసారి నాకోసం మా డాడీ అడిగితే, నువ్వు మంత్రించిన తాయెత్తు ఇచ్చావు కదా. అలాంటిదే ఇతనికీ కావాలి!"

"ఈ మధ్య నేను తావీజులు ఇవ్వటం మానేశాను బేటీ! పైగా చాలా మందికి వాటిలో నమ్మకం తగ్గిపోయింది. ఎవరూ రావటం లేదు."

"నాకు మాత్రం నువ్విచ్చిన తావీజు మీద గొప్పనమ్మకం వుంది బాబా...ఇదిగో దాన్నినా లాకెట్లో వేసుకున్నాను." మెడలో గొలుసుకున్న లాకెట్టు తీసి చూపించింది.

ఓసారి 'హుక్కా' గొట్టం నోట్లో పెట్టుకుని ఏదో ఆలోచించినట్టుగా రెండు క్షణాలు శూన్యంలోకి చూసి చెప్పాడు బాబా.

"అచ్ఛా ! రేపు శుక్రవారం కదా! నమాజ్ చేసి తావీజు మంత్రించి ఇస్తాను."

"సరే!" సంతోషంగా చూసింది అశ్విని.

"కానీ నేను ఇవాళే మా ఊరు వెళ్ళి పోవాలనుకుంటున్నానే?" శ్రీరామ్ చెప్పాడు.

"ఇవాల్టీకి రేపటికి కొన్ని గంటలేగా తేడా? రేపు బస్ స్టాండుకి వెళ్లేటప్పుడు 'ఆటో' ఇక్కడ ఆపుకుని తాయెత్తు తీసుకో" సలహా ఇచ్చింది.

"అయిసా కరో బేటా!" అన్నాడు బాబా. ఇద్దరూ ఆయన దగ్గర శలవు తీసుకుని బయటకొచ్చి మళ్లీ కారెక్కారు. కార్లో కూర్చోగానే 'డాష్ బోర్డ్' ఓపెన్ చేసి, అందులోంచి ఓ సెల్ఫోనూ, ఓ పెద్ద పుస్తకం తీసి అతనికిచ్చింది అశ్విని.

"మీ ఇంట్లో ఫోన్ లేదుగా?" అందుకే 'సెల్ ఫోన్' కొన్నాను నీకోసం నా సెల్ నెంబరు ఇందులో 'సేవ్' చేశాను ప్రతిరోజూ నాతో మాట్లాడాలి." శ్రీరామ్ రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తున్నాడు.

ఆమె మళ్లీ చెప్పింది

"ఇక ఆ పుస్తకం" విజయానికి అయిదు మెట్లు"! మీ ఊరు వెళ్లగానే ఆ పుస్తకంలో నేను మడతపెట్టి వుంచి 'చాప్టరు' ముందుగా చదవాలి!"

*          *       *

కుడి చేత్తో 'కీచైన్' తిప్పుకుంటూ పరుగులాంటి నడకతో హుషారుగా లోపలకు వచ్చిన అశ్విని తలక్రిందులుగా పేపరు పట్టుకుని 'గుప్పు గుప్పు'న పైప్ పీలుస్తూ సోఫాలో కూర్చునివున్న తండ్రిని చూసి సడెన్ గా ఆగిపోయింది.

"డాడీ'' అనుమానంగా చూస్తూ పిలిచింది విష్ణుమూర్తి ఇంకా అదే పోజులో వున్నాడు. అదేమిటి డాడీ! పేపరు తలక్రిందులుగా చూస్తూన్నారేమిటి?"  పక్కనే కూర్చుంటూ అడిగింది.

"అవును బేబీ! నా ఆశలు తల్లక్రిందులయ్యాయి?" చెప్పాడు.

అందుకు అశ్విని పెద్దగా 'రియాక్ట్' కాలేదు కాకపోగా ఎంతో ఉత్సాహంగా చెప్పింది.

"కానీ నా ఆశలు ఫలించాయి డాడీ! మీకు ఆ శుభవార్త చెప్పాలనీ, ఎనభై మిల్ల స్పీడులో వచ్చాను."

"నేను చెప్పబోయే ఆశుభవార్త' విన్నావంటే నీకు నూట నాలుగు డిగ్రీలు జ్వరం వస్తుంది."

"ఆశుభవార్త? ఏమిటదీ?"

"ముందు నీ శుభవార్తేమిటో నువ్వు చెప్పు ఆ తర్వాత నేను చెప్తాను!"

"నన్ను పెళ్ళిచేసుకోవటానికి శ్రీరామ్ ఒప్పుకున్నాడు డాడీ. అతన్ని నా దారికి తెచ్చుకున్నాను!" చెప్పింది అశ్విని గర్వంగా.

"కానీ, నిన్ను కోడలుగా చేసుకునేందుకు వాళ్ళ 'బాబు' ఒప్పుకోలేదు.వాడొప్పుకున్నా నేను ఒప్పుకోను. అదే నేను నీకు చెప్పదలచుకున్నఅశుభవార్త." చేతిలోని పేపర్ని టీపాయ్ మీదకు విసిరేస్తూ చెప్పాడు కోపంగా.

 

(ఇంకావుంది)
(హాసం వారి సౌజన్యంతో)