TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Battatala Brahmanandam
మల్లిక్
బ్రహ్మానందం అద్దంలో తన మొహం చూస్తున్నాడు.
వెంటనే అతని మొహం వివర్ణమైంది.
మరోసారి పరీక్షగా చూసుకున్నాడు. తన మోహంలో చాలా మార్పు వచ్చేసింది. తను తన వయసుకంటే పెద్దగా కనిపిస్తున్నాడు. కారణం తెలుసుకోగానే బ్రహ్మానందం డిస్టర్బ్ అయిపోయాడు.
" ఆ...హ్..." అంటూ జుట్టు పీక్కున్నాడు.
చేతిలోకి రెండు వెంట్రుకలు వచ్చాయి. వాటిని చూడగానే కెవ్వుమని అరిచాడు. ఆ అరుపుకు వంటింట్లోంచి అతని భార్య మంగతాయారు పరుగెత్తుకొచ్చింది.
" ఏంటి..ఏమైంది ?" కంగారుగా అడిగింది మంగతాయారు.
బ్రహ్మానందం చేతిలోని వెంట్రుకల్ని చూపించాడు.
" జుట్టు పీక్కున్నారా ?" అని అడిగింది మంగతాయారు.
అవును అన్నట్టుగా తలూపాడు బ్రహ్మానందం.
" అడ్డం చూసుకోవడం ఎందుకు...బాధపడి జుట్టు పీక్కోవడం ఎందుకు...పీక్కున్న జుట్టుని చూసి మళ్ళీ బాధపడటం ఎందుకు ? మీరిలా జుట్టు పీక్కుంటూ పొతే ఎప్పుడో వచ్చే బట్టతల ఇప్పుడే వచ్చేస్తుంది " అని అన్నది మంగతాయారు.
బ్రహ్మానందం అంతగా బాధపడటానికి కారణం అది. అతని జుట్టు ఈ మధ్య విపరీతంగా రాలోపోతుంది. ఆలోచించి ఆలోచించి అతను బుర్ర వేడెక్కిపోతూ ఉంది.
" బట్టతలా వస్తుందని మీరింతగా ఎందుకు బాధపడుతున్నారో నాకర్థం కావటం లేదు. బట్టతల వస్తే అంతా లాభమే కదా ?" అంది మంగతాయారు.
" లాభమా...! ఎలా...?" అని ఆశ్చర్యంగా భార్యవైపు చూశాడు బ్రహ్మానందం.
" తలకి రాసుకునే నూనె ఖర్చు తగ్గుతుంది. జుట్టు వత్తుగా ఉంటే దువ్వెనల పళ్ళూడి పోతాయి. అదే గనుక బట్టతల ఉంటే జీవితాంతం ఒక్క దువ్వెనే వాడచ్చు. ఆ విధంగా దువ్వెనల ఖర్చు తగ్గుతుంది. షాంపూ ఖర్చు కూడా తగ్గుతుంది. ఇప్పుడైతే నెలకోసారి క్రాపు చేయించుకుంటున్నారు. బట్టతల వస్తే రెండు మూడు నెలలకోసారి క్రాపు చేయించుకోవచ్చు. ఆ విధంగా క్రాపు చేయించుకునే ఖర్చు తగ్గుతుంది. చూశారా ఎంత ఆదానో..." అని అన్ని వివరించి చెప్పింది మంగతాయారు.
బ్రహ్మానందంకి ఒళ్ళు మండిపోయి మళ్ళీ జుట్టు పీక్కుకున్నాడు.
ఈసారి చేతిలోకి రెండున్నర డజన్ల వెంట్రుకలు వచ్చాయి. " కెవ్వు..." అని మళ్ళీ గట్టిగా అరిచాడు వాటిని చూసి.
" ఊ ఇంకా పీక్కోండి..త్వరగా బట్టతల వస్తే నే చేపిన లాభాలన్నీ త్వరగా పొందచ్చు " అని సంబరంగా అంది మంగతాయారు.
" బట్టతల వల్ల నష్టాలు నేను చెప్పనా ?" అని పళ్ళూ నూరుతూ అన్నాడు బ్రహ్మానందం
. " చెప్పండి " అని కుతూహలంగా అడిగింది మంగతాయారు.
" బట్టతల రావడం వల్ల మొహం వైశాల్యం పెరుగుతుంది. ఆ విధంగా మొహం కడుక్కోవడానికి ఎక్కువ సబ్బు పడుతుంది. మొహానికి స్నో, పౌడర్ లు ఎక్కువ ఖర్చు అవుతాయి. దువ్వెనదెం ఉంది. రూపాయి పారేస్తే వస్తుంది. కాని స్నో, పౌడర్లు ఎంత ఖరీదు ? చిన్న మొహానికి చిన్న చిన్న కర్చీఫులు చాలు..కానీ పెద్ద కర్చీఫు ఇరవై రూపాయలు పెట్టి కొనాలి. చలికాలంలో చిన్న మొహానికి కాస్త కోల్డు క్రీం రాస్తే సరిపోతుంది. బట్టతల వచ్చి మొహం పెద్దదయిపోతే ఎక్కువ కోల్డు క్రీం పడుతుంది. కోల్డు క్రీం ధర నీకు తెలుసుకదా! ఇవేకాక ఇంకో పెద్ద నష్టం ఉంది. అది నీకు సంబంధించింది " అని చెప్పాడు బ్రహ్మానందం.
" మీకు బట్టతల్ వస్తే నాకేం నష్టం ?" అని తెల్ల మొహం వేస్తూ అడిగింది మంగతాయారు.
" నాకు బట్టతల వచ్చిందనుకో.. నేను బాగా పెద్దవాడిలా కనిపిస్తాను. నువ్వేమో చిన్నదానిలా కనిపిస్తావు. అప్పుడు ఈ పేటలో అమ్మలక్కలంతా నువ్వు రెండో పెళ్లానివని అనుకుంటారు. రెండో పెళ్ళివాడిని చేస్కుందంటే ఈమెకి మొదటి పెళ్లివాడు దొరకలేదేమో...దొరక్క దొరక్క విసుగు పుట్టి ఎవడో ఒకడు దొరికితే అంతేచాలు అనుకుని నన్ను చేసుకున్నావని అనుకుంటారు. బుగ్గలు ఇట్టా..ఇట్టా నొక్కుంటారు " అని చెప్పాడు బ్రహ్మానందం.
ఆ మాట విని మంగతాయారు మొహం పాలిపోయింది.
" ఏది ఏమైనా మీరు బట్టతల రాకుండా చూసుకోండి " అని బ్రతిమాలింది మంగతాయారు.
" అదే కదా నేను ఆలోచిస్తున్నా...నేనెంత బాధపడుతుంటే ఈ జుట్టేమో అంతగా ఊడిపోతుంది. తలుచుకుంటే పిచ్చెక్కిపోతుంది. " అంటూ ఆవేశంగా గుప్పిళ్ళతో జుట్టు పీక్కున్నాడు బ్రహ్మానందం.
మంగతాయారు గబాలున అతని చేతులు పట్టుకుంది. " హమ్మో..హమ్మో మీరట్టా జుట్టు పీకేసుకుంటే త్వరగా బట్టతల వచ్చేస్తుంది. మీరట్టా జుట్టు పీక్కోకండి ప్లీజ్ " అంది కళ్ళనీళ్ళతో మంగతాయారు. బ్రహ్మానందం జుట్టుని వదిలి తన కళ్ళనీళ్ళు తుడుచుకుని భార్య కళ్ళనీళ్ళు కూడా తుడిచాడు.
తరువాత ముక్కు చీదాడు.మంగతాయారు తన ముక్కును ముందుకు చాచింది.
" నీ ముక్కు నువ్వే చీదుకో " అని కోపంగా అన్నాడు బ్రహ్మానందం.
" మరి నా కళ్ళు నేనే తుడుచుకునే దానినిగా..మీరెందుకు తుడిచారు " అంది మంగతాయారు.
" హబ్బా..నీతో వాదించడం చాలా తలనొప్పి " అంటూ మళ్ళీ జుట్టు పీక్కోబోయాడు బ్రహ్మానందం.
" హమ్మో..హమ్మో...అంతపని చెయ్యకండి. నా ముక్కు నేనే చీదుకుంటాన్లెండి " అంది చెంపలేసుకుంటూ మంగతాయారు. బ్రహ్మానందం జుట్టు ఊడకుండా ఉండటం కోసం రకరకాల హేరాయిల్స్ వాడసాగాడు. కానీ ఫలితం ఏమీ కనిపించడం లేదు.
" రోజూ శీర్షాసనం వేస్తె జుట్టు రాలడం ఆగుతుంది. అంతేకాక, జుట్టు ఎప్పుడూ నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. వెంట్రుకలు తెల్లబడవు " అంటూ అతని స్నేహితుడు ఒకడు సలహా ఇచ్చాడు.
ఆ మర్నాడు ఉదయానే స్నేహితుడి సలహా పాటించి తల కిందికి, కాళ్ళు పైకి పెట్టి శీర్షాసనం వేశాడు బ్రహ్మానందం. వేసిన వెంటనే " వామ్మెవ్...వామ్మెవ్ " అంటూ కేకులు పెట్టాడు. ఆ కేకలు విని " ఏమైందండీ ?" అంటూ కంగారుగా ప్రశ్నించింది మంగతాయారు.
బ్రహ్మానందం లేచి కాళ్ళమీద నిలబడి " వామ్మెవ్...వామ్మోవ్..." అన్నాడు మళ్ళీ.
" అదేంటి...మెడెందుకు అలా పక్కకి పెట్టి వింతగా చూస్తున్నారు " అని అడిగింది భర్తని.
" వింతగా చూడ్డమా నా బొందా ? నా మెడ ఇరుకు పట్టింది..వామ్మోవ్..వామ్మోవ్ " అంటూ బాధగా అరుస్తూ మెడ రుద్దుకున్నాడు బ్రహ్మనందం.
" ఆ దిక్కుమాలిన శీర్షాసనం మీరెందుకు వేశారు ? మెడ ఎముక విరిగిపోయిందో ఏంటో ! చాలా బాధపడుతున్నారు. డాక్టర్ కి చూపించుకోండి " అని కంగారుగా అంది మంగతాయారు.
బ్రహ్మానందం డాక్టర్ దగ్గరికి వెళ్లాడు.
" మీ మెడ ఆద్భుతంగా ఇరుకు పట్టింది. ఇంత అద్భుతంగా ఎలా జరిగింది ?" అని ఆశ్చర్యంగా అడిగాడు ఆ డాక్టర్.
" శీర్షాసనం వేశానండీ " అని నసుగుతూ చెప్పాడు బ్రహ్మానందం.
" శీర్షాసనం వేయాలనే అద్భుతమైన ఆలోచన మీకెందుకు వచ్చిందసలు ?" అని అడిగాడు డాక్టర్.
బ్రహ్మానందం వివరించి చెప్పాడు.
" హోస్ అంతేనా.. మీకో అద్భుతమైన మందు రాసిస్తాను. లోపలికి వేసుకుని తలకి రాస్కోండి. మీ జుట్టు ఊడదు " అంటూ చీటీ మీద మందులు రాసిచ్చాడు డాక్టర్.
బ్రహ్మానందం ఆ మందులు వాడాడు. కానీ ఆ మందులు వాడినప్పటి నుండి అతని జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోవటం మొదలుపెట్టింది. వెంటనే ఆ మందులు వాడత, ఆపేశాడు బ్రహ్మానందం.
ఎవరో చెప్పారు బ్రహ్మానందంకి కోయవాళ్ళ దగ్గర మూలికలు దొరుకుతాయనీ, వాటిని నీటిలో అరగదీసి నెత్తికి రాసుకుంటే పట్టుకుచ్చులా జుట్టు నిగనిగలాడుతూ ఉంటుందనీ. వెంటనే బ్రహ్మానందం పుట్ పాత్ మీద మూలికలు పరుచుకుని కూర్చున్న కోయదొర దగ్గరకు వెళ్లాడు.
" దీన్ని నీళ్ళలో అరగదీసి దాన్ని తలకు పట్టించు దొర. అప్పుడు నీ పెంటి నీ తల జూచి ముర్చిపోతుంది దొర " అన్నాడు కోయదొర రోంటిలో డబ్బులు దోపుకుంటూ.
కోయదొర చెప్పినట్టే బ్రహ్మానందంచేశాడు. జుట్టు రాలడం ఆగడం మాట అటుంచి ఇదివరకటి కంటే ఎక్కువ ఊడిపోసాగింది.దెబ్బకు నొసలు ఒక అంగుళం పైకి జరిగింది. ఘొల్లుమన్నాడు బ్రహ్మానందం.
రోజులు గడుస్తున్నాయి.
బ్రహ్మానందం తన ప్రయత్నాలూ చేస్తూ ఉన్నాడు. కానీ ఈ మధ్య అతను తన ప్రయత్నాలు పూర్తిగా మానుకున్నాడు. కారణం బ్రహ్మానందంకి ఆఫీసులో ప్రమోషన్ వచ్చి ఎగ్జిక్యూటివ్ అయ్యాడు.
ఆ కుర్చీలో బట్టతలతో కూర్చుని ఉంటేనే హుందాగా, నిండుతనంగా ఉంటుందని అతనికి అనిపించింది. ఇప్పుడు బ్రహ్మానందం తన సీట్లో కూర్చుని అప్పుడప్పుడూ తళతళలాడే తన బట్టతలను చిద్విలాసంగా నవ్వుకుంటూ నిమురుకుంటున్నాడు.
|