బాబూ, ఈయనే మీ నాన్న!

Listen Audio File :

 

- డాక్టర్ గురువా రెడ్డి

చాలా రోజుల క్రింద ‘బాబు’ కార్టూననుకుంటా – ఓ పదేళ్ళబ్బాయికి వాళ్ళమ్మ, ఓ ఫోటోలో వ్యక్తిని చూపిస్తూ “బాబూ ఈయనే మీ నాన్న, ఉదయం నువ్వు లేచే సరికి పనికెళ్తారు. రాత్రి నువ్వు పడుకున్న తర్వాత వస్తారు” అని చెప్తుంటుంది. పని ఒత్తిడి, తద్వారా, పెళ్ళాం పిల్లలతో గడిపే కాలం పల్చబడి పోవడం గురించి విసిరిన అద్బుతమైన వ్యగ్య బాణం ఇది. ఆ రోజుల్లో ‘మరీ అతిశయంలే’ అనుకున్నాను. కానీ ఇప్పుడు మా బోంట్ల బ్రతుకులు ఆ కార్టూన్ కి అద్దం పట్టినట్లు ఉన్నాయనిపిస్తుంది.

ఇలాంటి బిజీ లైఫ్ నేపధ్యంలో మా ఆవిడ కొన్ని డైలాగులు ఏర్చి, కూర్చి హ్యాండ్ బాగ్ లో భద్రంగా దాచి – ‘ఒరేయ్ మగడా – నీకు పెళ్ళాం, పిల్లలు – సంసార బాధ్యతలు ఉన్నాయిరా’ అని గుర్తు చేయడానికి రోజుకొకటి విసురుతూ ఉంటుంది. “ఏవండీ, పిల్లల స్కూల్ లో అన్ని ఫంక్షన్స్ కి నేనొక్కదాన్నే వెళ్తున్నాను. అందరూ తెగ సానుభూతి చూపిస్తున్నారు – నా మీద, నా పిల్లల మీద, సింగిల్ పేరెంట్ చిల్డ్రన్’ అని ఒకరోజు, ‘మొన్న మీ కూతురు స్కూలు అప్లికేషన్ లో ఫాదర్ పేరు దగ్గర మిస్సింగ్ అని రాసిందండీ’ అని ఇంకోరోజు – ఇలా ఈ రకమైన భార్యా (ధా) భరితమైన వ్యంగ్యోక్తులకు నేను చలించడం లేదని – చివరకు పోయిన వారం ఓ బ్రహ్మాస్త్రం విసిరింది సారీ – భవానీఅస్త్రం విసిరింది. ‘ఈ కాగితాల మీద సంతకం పెట్టండీ’ అని. కాగితాల్లో ఉన్న కతలేమిటో చూడకుండా సంతకాలు ఎడాపెడా పెట్టేసే అలవాటున్న నేను – ఆ రోజెందుకో కాగితాల లోపలికి తొంగి చూశాను. డాం! అవి విడాకుల పత్రాలు. “ఎన్నాళ్ళయింది మీరు మొగుడిగా, తండ్రిగా నడుచుకుని. ఇంకా ఎందుకండీ బంధాలు... అనుబంధాలు” అని భారీగా, ఆమె ఇచ్చిన అరగంట ఉపన్యాసం దెబ్బకి నేను ఎంత ఘోరమైన నిర్ణయం తీసుకున్నానో మీరు వింటే విలవిల్లాడిపోతారు. మూడు వారాలు సెలవు పెట్టాను హాస్పిటల్ కి.

కరెక్టుగా వారానికి న్యూయార్క్ నగరంలో ఉన్నాం అందరం సెలవులకని, డా. మధు మా అభ్యాగతి (మేం వారం రోజులు వేసిన సుత్తికి – మధు, వాళ్ళావిడ శిరీష పరిస్థితి అధోగతి అని వినమ్రంగా చెప్పక తప్పడం లేదు). మధు, శిరీషలు మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. మేం కూడా ఆ శక్తి మేరకు – వారిని ‘బాదరించాం.’

ఈ సెలవుల్లో – మేం చూసిన ప్రదేశాలు, వాటి గొప్పదనం గురించి మనం ముచ్చటించుకుందాం ఇక.

న్యూయార్క్ – మనకి బోంబే ఎలానో అమెరికాలో న్యూయార్క్ అలా. బిసినెస్ కాపిటల్ అన్న మాట. వాణిజ్య లావాదేవీలన్నీ ఎక్కువగా ఈ నగరంలోనే జరిగేది. న్యూయార్క్ కి చాలా ముద్దు పేర్లున్నాయి. బిగ్ ఆపిల్ అని, ‘ది సిటీ దట్ నెవర్ స్లీప్స్’ అనీ, Hudson నదీ తీరాన సుమారు నాలుగు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ నగరాన్ని ఏటా సుమారు రెండు కోట్లమంది సందర్శిస్తారని అంచనా. న్యూయార్క్ ఓడరేవుకు ఏటా 40 వేల ఓడలు వచ్చి పోతుంటాయి. వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేంజ్ ప్రపంచంలో కెల్లా పెద్దదైన వాణిజ్య లావాదేవీల మార్కెట్టు. 500 ఆర్ట్ గ్యాలరీలు, 150 మ్యూజియంలు ఉన్నాయి. ముఖ్యమైన విమానాశ్రయాలు మూడు – వీటి ద్వారా ఏటా 80 మిలియన్ల మంది ప్రయాణిస్తారు.

ఇంత గొప్ప మహా నగరం 9/11 టెర్రరిస్టుల దెబ్బకి తట్టుకుని మళ్ళీ నిలబడిన వైనం అద్వితీయం.

మొదటి రోజు న్యూయార్క్ లో మన తెలుగు వాళ్ళ అమ్మాయి ఆరం గేట్రం చేశాం. దేశం కాని దేశంలో ఎంతో శాస్త్రయుక్తంగా జరిగిన ఈ పండుగ చూసి ఆనందించాం. కళా తపస్వి విశ్వనాథ్ గారు ముఖ్య అతిధి, గంగాధర్ చక్కగా సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండోరోజు స్టాట్యూ అఫ్ లిబర్టీ చూశాం. మన దేశానికి తాజ్ మహల్ గుర్తెలాగో అమెరికాకి స్టాట్యూ అఫ్ లిబర్టీ అలాగా. ఈ విగ్రహాన్ని స్వేఛ్చ, స్వాతంత్ర్యాలకు ప్రతీకగా భావిస్తారు. ఫ్రాన్స్ కి చెందిన శిల్పి ఫ్రెడరిక్ ఆగస్ట్, ఇంజనీర్ గుస్తాప్ ఈఫిల్ కలిసి తయారు చేసిన ఈ భారీ విగ్రహం ఎత్తు 152 అడుగులు. బరువు 225 టన్నులు ఫ్రెచ్ ప్రభుత్వం, అమెరికాకు ఇచ్చిన ఈ బహుమతిని 1866లో ఆవిష్కరించారు. ఈ విగ్రహం చూడగానే హుస్సేన్ సాగర్ లో ఉన్న మన బుద్దుడి విగ్రహం గుర్తొస్తుంది. లావు, పొడుగులో మన బుద్దుడు చిన్నవాడే అయినా మనది ప్రపంచంలోకెల్లా పెద్దదయిన ఏకశిలా విగ్రహం. అలాంటి వైవిధ్యం ఉన్న విగ్రహాలు, కట్టడాలు చుట్టూ ఎంత గొప్పగా టూరిజం వృద్ది చెయ్యచ్చో మనం తెల్లోళ్ల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే.

న్యూయార్క్ లోఅన్నీ ఆకాశ హర్మ్యాలు ఉండే ప్రదేశం మన్ హట్టన్. రోడ్లన్నీ స్కేల్ పెట్టి గీసిన చదరంగపు గళ్ళలాగా ఉంటాయి. ఆకాశ హర్మ్యాలు కనీసం 50 అంతస్తులు. టెర్రరిస్టులకు బలయిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ 110 అంతస్తుల భవనం. ఇప్పుడు ఆ ఏరియాని ‘గ్రౌండ్ జీరో’ అంటారు. అక్కడ కొత్త భవనానికి రూపకల్పన జరుగుతోంది. కూలి పోయినప్పుడు ఫోటోలు, పగిలిపోయిన గ్లోబ్ బొమ్మ చూసినప్పుడు మనసు మౌనంగా మూలిగింది.

న్యూయార్క్ లో ఎక్కడయినా సరే మన తెలుగువాళ్ళు కనిపిస్తారు. ఐ.టి.లో 60శాతం మనోళ్ళేనట. ఎంతో ఆనందం, గర్వం అనిపించింది. ప్రపంచానికే తలమానికమయిన ఈ మహా నగరంలో – ఆ మహా జన సముద్రంలో – రమేష్ అని పిలిచినా, సుబ్బారావ్ అని పిలిచినా, ప్రసాద్ అని పిలిచినా ఎవరో ఒకరు స్పందించక పోరు. అదీ మన తెలుగు వాడి గొప్పతనం.