మై డియర్ రోమియో - 54

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 54

స్వప్న కంఠంనేని

 

వైభవ్ మర్నాడు పొద్దునే నిద్ర లేచేసరికి ఏడయింది.
హనితని కూడా లేపాడు.
"నువ్వు మా ఇంట్లో ఎలా వున్నావు వైభవ్?'' అందామె నిద్రలేస్తూనే.
"ఇది మీ ఇల్లు కాదు, మా ఇల్లు కూడా  కాదు. ఇద్దరం కలిసి వేరే వాళ్ళింట్లో వున్నాము. తొందరగా లే'' విసుక్కున్నాడు వైభవ్.
ఇంతలో పెద్దగా కేకలు వినిపించాయి.
గబగబా కేకలు వినిపించిన వైపుకి పరుగెత్తారు.
అక్కడ కనిపించిన దృశ్యానికి స్టన్ అయ్యారు.
ఒక నల్లత్రాచు పడగవిప్పి నిలబడి వుంది.
దాక్షాయణి ఆ పాముకి హారతి పడుతూ గణగణ గంట మోగిస్తోంది.
ఆవిడ భర్త నెత్తీనోరూ బాదుకుంటూ అరుస్తున్నాడు,
"నాగారాజుకి పూజలు చేస్తే చేయవచ్చే, తప్పులేదు. నేను కాదనను. నాగారాజంటే నాగుపాముకి మాత్రమే పూజ చేయాలి. కానీ ఇలా కనిపించిన ప్రతి బురదపాము దగ్గర నుంచీ రక్తపింజరి వరకూ ఎదోచ్చినా పూజలు చేయక్కర్లేదు''
ఆవిడ చేతిలో హారతి మంతలకి గంటల మాటకి భయపడ్డ పాము బుసలు కొడుతూ అక్కడే కనిపించిన కలుగులోకి దూరి బయటకు వెళ్ళిపోయింది.
ఆవిడ పాము వెంటపడి తోక పట్టుకుని "నాగరాజా! నాగరాజా!'' అని పిలవసాగింది.
కరవడం కూడా మర్చిపోయిన పాము గింజుకుని గింజుకుని కలుగులోంచి బతతికి పారిపోయింది.
"చూసారా! నాగరాజు మహిమ!'' తృప్తిగా లేస్తూ అందావిడ.
"ఇందులో నాగరాజు మహిమ ఏముంది?'' వింతగా అడిగింది హనిత.
'చాల్లే వూరుకో! నువ్వందరితోనూ ఆర్గ్యూ చేయకు. ఎవరి నమ్మకాలు వాళ్లవి'' చెప్పాడు వైభవ్.
వైభవ్, హనిత స్నానాలు చేసొచ్చి వాళ్ళకు కేటాయించిన గదిలో కూర్చున్నారు. ఇంతలో వాళ్ళకు బయట నుంచి మాటలు వినిపించాయి. బిగుసుకుపోయారు వాళ్ళు.
"ఒకబ్బాయి, ఒకమ్మాయి పారిపోయి ఇటే వచ్చారని తెలిసింది. మీ ఇంట్లోనే వున్నారట కదా వాళ్ళు.
"వాళ్ళు నిన్ననే వెళ్ళిపోయారు బాబూ. మీరు రండి. భోజనాలు చేద్దురుగాని'' దాక్షాయణి మాటలు వినిపిస్తున్నాయి.
"ఆ! భోజనమా? ఈమె మనకి భోజనం ఎందుకు పెట్టడం?'' ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు.
ఆవిడ వాళ్ళని బలవంతంగా లోపలకు ఈడ్చుకొచ్చి కూర్చోబెట్టింది.
ఈలోగా వైభవ్, హనిత ఆ గడికున్న వెనక్స్ తలుపు నుంచి శబ్దం చేయకుండా బయటకు జారుకున్నారు,
అప్పుడే దాక్షాయణి ఆ గదిలోకి వచ్చింది.
వైభవ్, హనిత కనిపించలేదావిడకు. తెరచివున్న తలుపు దగ్గరికి వచ్చి చూసింది. హనిత, వైభవ్ దూరంగా పరిగెత్తుకుంటూ కనిపించారు.
"పెద్దబాబూ, చిన్నబాబూ'' గట్టిగా అరిచిందావిడ.
వాళ్ళు వినిపించుకోకుండా పరుగెత్తసాగారు.
"ఏమిటో పాపం. ఎవరి సమస్యలు వారివి'' తనలో తనే గొణుక్కుని మళ్ళీ కొత్త అతిథులకి వంట చేయడానికి వెళ్ళి పోయిందావిడ.
"ఆవిడ మనం నిన్నే వేల్లిపోయామని ఎందుకు చెప్పిందోగానీ మనకి మాత్రం భలేగా హెల్ప్ చేసిందిలే'' అంది హనిత.
వైభవ్, హనిత ధర్మారం ఊరు దాటి పొలాల్లోకి నడుస్తున్నారు.
"పిచ్చీ! నీకింకా అర్థం కాలేదా? మనకి పెద్దబాబూ, చిన్నబాబూ అని పిలిచింది విన్నావుగా. అంటే ఆవిడ మనిద్దరం అబ్బాయిలమే అనుకుంటోంది. మనకంటే ముందు ఎవరో అమ్మాయి, అబ్బాయి వచ్చి వెళ్ళి వుంటారు. వాళ్ళ గురించే అడుగుతున్నారనుకుని అలా చెప్పి వుంటుందావిడ. నీకింకా అర్థం కాలేదా?'' అన్నాడు వైభవ్.
బుంగమూతి పెట్టింది హనిత.
"అంతే నేనావిడకి అబ్బాయిలా కనిపిస్తున్నానా?'' గొణుక్కుంది.
"అందుకే జుట్టు పొడుగ్గా పెంచుకుని చుడీదార్ లో, చీరలో ధరించు డియర్'' చెప్పాడు వైభవ్.
"చూద్దాంలే'' అంది హనిత.
వాళ్ళలా మాట్లాడుకుంటూ నడుస్తుండగానే మరో ఊళ్లోకి ప్రవేశించారు. ఎదురుగా 'కేశవనగరం' అన్న అక్షరాలు కనిపిస్తున్నాయి.