TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
మై డియర్ రోమియో - 41
స్వప్న కంఠంనేని
మర్నాడు ...
మధ్యాహ్నం పన్నెండు గంటలవుతోంది. వైభవ్ హాల్లో సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు.
"టెలిగ్రాం'' అన్నకేక వినిపించింది. గబగబా వెళ్ళి సంతకం చేసి తీసుకున్నాడు. టెలిగ్రాం పేపర్ తెరిచి చూశాడు.
"వైభవ్ యూ ఫాసినేట్ మీ హనిత'' అని ఉందందులో.
"ఎంటిన్నీ ఇలా పిచ్చి చేష్టలు చేస్తుంది. ఇంట్లో ఎవరైనా చూస్తే ఎలాగన్న ఆలోచనైనా లేదు'' అనుకున్నాడు.
ఇంతలో తల్లీ వదినలు లోపల్నుంచీ పడదోసుకుంటూ రానే వచ్చారు.
"ఏమిట్రా అది? టెలిగ్రాం అన్న కేక వినిపించింది'' అడిగింది వైభవ్ తల్లి.
"ఏం లేదులే. మనకి కాదు'' అన్నాడు వైభవ్.
"మనకి కాకపొతే నీ చేతిలో ఉన్నదేంటీ?'' దీర్ఘం తీసింది వైభవ్ పెద్ద వదిన.
"మనకి కాదంటే మీకు కాదని అర్థం. టెలిగ్రాం నాకొచ్చిందని చెప్పటం'' తడబడుతూ అన్నాడు వైభవ్.
"నీకెందుకొస్తుందిరా. ఎవరు పంపారు?'' అనుమానంగా చూస్తూ అడిగింది వైభవ్ తల్లి సుజాత.
"అదీ ... అదీ .. సురేష్ పంపాడు. ఎందుకంటే తన పెళ్ళికి తప్పకుండా రమ్మని గుర్తు చేస్తూ పంపాడన్న మాత. అదీ సంగతి'' అన్నాడు.
"ఓహో! అలాగా ...'' అని లోపలికి వెళ్ళటానికి వెనక్కి తిరిగారు వాళ్ళు.
సరిగ్గా అప్పుడే మళ్ళీ బయట్నుంచి "టెలిగ్రాం'' అన్న కేక వినిపించింది. గతుక్కుమన్నాడు వైభవ్.
లోపలికి వెళ్ళబోయిన వాళ్ళు కాస్తా ఆగి వెనక్కి తిరిగారు. ఈసారి వైభవ్ చిన్న వదిన వెళ్ళి టెలిగ్రాం అందుకోబోయింది.
కానీ వైభవ్ మెరుపులా ముందుకు కదిలి టెలిగ్రాం లాగేసుకుని సీరియస్ గా చెప్పాడు. "టెలిగ్రాం నాకని చెప్పాను కదా. మీరెళ్ళి మీ పన్లు చూసుకోండి''
వైభవ్ వదినలిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని మూతులు తిప్పుకుంటూ లోపలికెళ్ళిపోయారు.
ఇక ఆ రోజంతా పన్నెండు గంటల నుంచీ అయిదయ్యే వరకూ పది నిముషాల కొకటి చొప్పున హనిత పంపించిన టెలిగ్రాంలు వైభవ్ కి చేరుతూనే ఉన్నాయి.
ఆ టెలిగ్రాం దాడికి తట్టుకోవటం వైభవ్ కి కష్టమే అయింది.
పైగా తల్లీ వదినలు అనుమానపు చూపులు భరించాల్సి రావటం అబద్ధాలు చెప్పటం అలవాటు లేని తను ఈ టెలిగ్రామ్స్ మూలంగా రకరకాల కుంటిసాకులు చెప్పాల్సి రావటం ఇవన్నీ చాలా విసుగ్గా కూడా అనిపించాయి.
"అసలు ఈ హనిత కేదొచ్చినా పట్టలేం. రేపు కాలేజీకి వెళ్ళి వార్నింగ్ ఇవ్వాలి'' అనుకున్నాడు.
క్లాస్ లో కోస్తున్న వైభవ్ ని చూసి హనిత కళ్ళు తళుక్కుమన్నాయి.
అంతమంది స్టూడెంట్స్ ముందే వైభవ్ దగ్గరికి పరుగెత్తి "రా వైభవ్. లోపలికి రా కూర్చో'' అని సీట్ చూపెట్టింది.
నిజంగానే అంటోందో, లేకపోతే అది వ్యంగ్యమో అర్థం కాలేదు వైభవ్ కి.
ఆమె ఎప్పుడూ అతనికొక పజిల్ లా కనిపిస్తుంటుంది.
మీనాని కూడా వదిలేసి వచ్చి వైభవ్ పక్కనే కూర్చుంది హనిత. వైభవ్ లేచి వెళ్ళి మీనా పక్కన కూర్చున్నాడు. హనిత కోసం మీనా వైభవ్ పక్కనుంచి లేచి వెళ్ళి రాజా పక్కన కూర్చుంది. ఇదే సమయమనీ రాజా లేచి వెళ్ళి హనిత పక్కన కూర్చున్నాడు. హనిత అక్కడ నుంచి లేచి వెళ్ళి వైభవ్ పక్కన కూర్చుంది. కొద్దిసేపు వాళ్ళమధ్య అలా మ్యూజికల్ చెయిర్ ఆట సాగింది.
ఫాస్ట్ ఫార్వార్డ్ చేసినట్టు జరుగుతున్నా వీళ్ళ ఆటను క్లాస్ లో మిగతా వాళ్ళంతా తమ తలల్ని అదే వేగంతో అటూ ఇటూ తిప్పుతూ తమాషాగా వీక్షించసాగారు.
ఆఖరికి ఇక చేసేదేమీ లేక వైభవ్ హనిత పక్కనే కూర్చుండిపోయాడు. టెలిగ్రామ్స్ గురించి హనితని ఏమని అడగాలో, ఎలా అడగాలో వైభవ్ కి అర్థం కాలేదు. ఒకవేళ అడిగితె నేనెక్కడ పంపానని అనవచ్చు!
"పోన్లే! మళ్ళీ ఏమైనా అంటే అప్పుడు చెప్పొచ్చు'' అనుకున్నాడు.
కానీ ఆ పూటెందుకో హనీ చాలా బుద్ధిగా కూర్చుంది వైభవ్ పక్కన. అతను కూడా ఆమెను డిస్టర్బ్ చేయలేకపోయాడు.
|