TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
మై డియర్ రోమియో - 40
స్వప్న కంఠంనేని
అప్పుడే అదే దారిన పోతున్న రాజా హనితని చూశాడు. రోడ్డుకి అడ్డాలు పడి రోడ్డు దాటుకుని వచ్చి హనిత ముందు రొప్పుతూ నిలబడ్డాడు. హనిత పక్కనే వైభవ్ ఉండటం రాజాకి నచ్చలేదు. అతని హృదయం బాధతో మూలిగింది.
"శకుంతల మంచి సింగర్. మనం రోడ్డు మీద నడుస్తాం. పక్షలుగాల్లో ఎగురుతాయి. మరిపాపం జంతువుల కెలాగో ఏమో!'' అన్నాడు బాధగా.
"మొదలెట్టావా పిచ్చి నస నువ్వెందుకూ మా మధ్యన. పానకంలో పుడకలాగా. వెళ్ళిపో, ఇక్కడనుంచీ'' అంది హనిత.
"నువ్వేళ్ళొద్దు రాజా. ఇది ఇందాకట్నుంచీ వెంటపడి నా ప్రాణం తీస్తోంది'' అన్నాడు వైభవ్.
"నా మాటనేనెందుకు వినాలి? నేనిప్పుడే వెళ్ళిపోతాను. అయినా ఏంటీ? మా హనీని పట్టుకుని అదీ, ఇదీ అంటున్నావ్. బతకాలని లేదా?'' హనిత ముడు ఫోజు కొడుతూ అన్నాడు రాజా.
"ప్చ్! చూడు రాజా. మాకూ మాకూ మధ్య సవాలక్ష గొడవలుంటాయి. అతను నన్ను తిడితే నీకెందుకూ? కొడితే నీకెందుకూ. వైభవ్, నేనూ చిన్నప్పట్నుంచీ ఫ్రెండ్స్ మీ. నువ్వు మధ్యలో వచ్చినవాడివి. ఆ సంగతి తెలుసుకో'' రాజావైపు తిరిగి అంది హనిత.
ఈలోగా వైభవ్ రోడ్డు పక్కనే ఆపి ఉన్న ఆటోలో కూర్చుని డ్రైవర్ తో చెప్పాడు.
"త్వరగా పోనీ''
రాజాతో మాట్లాడి హనిత వెనక్కు తిరిగేసరికి వైభవ్ కనిపించలేదు.
"వైభవ్ ఏడీ?'' రాజాని అడిగింది హనిత.
"నేను చెప్పను. నన్నెందుకు తిట్టావ్?'' బుంగమూతి పెట్టి అన్నాడు రాజా.
"చెప్పకపోతే ఛావు'' అని విసవిసా నడుస్తూ క్షణంలో అక్కడ్నుంచి వెళ్ళిపోయింది హనిత. రాజా హతాశుడై నిలబడిపోయాడు.
వైభవ్ కళ్ళు మూసుకుని పడుకున్నాడు. హనిత ప్రవర్తన అతనికి అంతుబట్టడం లేదు.
"ఒకసారి అమాయకంగా, మరోసారి కఠినంగా, ఇంకోసారి అసలు పట్టించుకానట్టు నిర్లక్ష్యంగా ఉంటుందెందుకో?'' అనుకున్నాడు.
"చిన్నప్పుడెంత ముద్దుగా ఉండేదో ఇప్పుడంత అందంగా అయింది'' అనుకున్నాడు.
"అయినా ఆమె ఎలా వుంటే నాకెందుకూ?'' అనుకోబోయాడు.
కానీ అతను దగ్గరకెళ్ళాడు. క్లాస్ బుక్స్ షెల్ఫ్ లో పెట్టేసి వచ్చి డైరీ తెరిచాడు. డైరీ తిరగేస్తుంటే అతనికి ఆశ్చర్యం వేసింది. కాలేజ్ లో చేరిన తర్వాత తన రాసుకున్న ప్రతి పేజీలోనూ ఒక్కసారైనా హనిత పేరు కనిపించింది.
"అసలింతకీ నాకు హనితంటే ఇష్టమా? ద్వేషమా?'' చాలా నిజాయితీగా తాను ప్రశ్నించుకున్నాడు.
"ఏమో! రెండూనేమో!'' అనుకున్నాడు.
హనిత గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తోంది.
"ఎంత చేసినా వైభవ్ సరిగ్గా మాట్లాడటం లేదు. అసలతని తలకి తగిలిన దెబ్బ తగ్గిందో లేదో కూడా నేనింకా అడగక ముందే మాయమయ్యాడు. బాగా స్టయిల్స్ కొడుతున్నాడేంటి? అసలిలా కాదు. ఇంకా తీవ్రంగా ప్రయత్నించి మాట్లాడించాలి అనుకుంది.
"కానీ ఒకోసారి ఎంత సీరియస్ గా ఉంటాడో, మాట్లాడించాలంటేనే భయం వేస్తుంది. ఎలాగబ్బా ...'' ఆలోచించసాగింది.
సడన్ గా ఆమెకేదో ఐడియా క్లిక్ అయింది.
"యురేకా!'' సంబరంగా అరిచింది.
తర్వాత తృప్తిగా పడుకుని నిద్రపోయింది.
|