TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
మై డియర్ రోమియో - 37
స్వప్న కంఠంనేని
డ్రెస్ చేంజ్ చేసుకుని మంచం మీద వాలిపోయింది హనిత.
"ఆహా! జీవితం నీతి బుడగ లాంటిది'' అనుకుంది.
తర్వాత తాననుకున్నదాన్లో ఏంటో తప్పున్నట్టుగా అనిపించిందామెకు.
"పోన్లే, జీవితం పేకమేడలా ఎంత అందమైనదో?'' అనుకుంది.
"లవ్ సిట్యుయేషన్ లో ఇలాంటి డైలాగ్స్ వాడకూడదేమో'' అనుకుంది మళ్ళీ.
"హు, ఎన్ని తెలుగు సినిమాలు చూసినా టైముకి ఒక్క డైలాగూ గుర్తొచ్చి చావడం లేదు'' విసుక్కుంది.
మంచం మీద నుంచే లేచి బాల్కనీలోకి నడిచింది. అప్పుడే సన్నగా చినుకులు మొదలయ్యాయి. ఉండుండి గాలి చల్లగా వొంటిని తాకుతోంది.
"రేపు తొమ్మిదెప్పుడు అవుతుందో! కాలేజీకి ఎప్పుడు వెళ్తానో? వైభవ్ నెప్పుడు చూస్తానో'' దిగులుగా అనుకుంది.
అది నూట తొమ్మిదోసారి ఆమె అలా అనుకోవటం! సడన్ గా ఆమెకొక ఆలోచన తట్టింది. గబగబా లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకుని మంచం మీద కూర్చుంది. వైభవ్ నెంబర్ కి రింగ్ చేసింది. ఫోన్ రింగవుతోంది కానీ ఎంతకీ ఎవరూ లిఫ్ట్ చేయటం లేదు. దాదాపు అర్థగంట ప్రయత్నించి విసుగు పుట్టి ఊరుకుంది. తర్వాత లేచి వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుంది. పుట్టిన తర్వాత ఆమె అదే మొదటిసారి తనను తాను పరిశీలనగా చూసుకోవటం.
"నేను ఎంత అందంగా ఉన్నానో?'' అనుకుంది.
"మరి మీనా ఏమిటబ్బా అలా అంది? నేనంతగా బాగోనంది? మీనా అబద్ధాలు చెప్పదే అనుకుంటూ మళ్ళీ సందేహంలో పడింది.
"ఎవరికీ వాళ్ళు అందంగానే కనిపిస్తారు. పైగా ప్రతి అమ్మాయీ ప్రపంచంలోకెల్లా తన అందగత్తెను అనుకుంటుంది'' అని ఎక్కడో చదివిన సూక్తి గుర్తొచ్చింది.
ఆ టైమ్ లో ఆ సూక్తి గుర్తుకు రావటం హనితకి అస్సలు నచ్చలేదు. మళ్ళీ అద్దంలోకి చూసేసరికి ఆమెకి తనలో తనకి ఎన్నో లోపాలు కనిపించసాగాయి.
"ప్చ్! నా కళ్ళు మరీ పెద్దగా ఉన్నాయి. కొంచెం చిన్నగా ఉంటే బావుండేది. ముక్కు మరీ సన్నగా ఉంది. ఇంకొంచెం లావుంటే బావుండేదాన్నేమో?'' అనుకుంది.
"ఛీ! ఇంత ఘోరంగా ఉంటే వైభవ్ ఇంక నన్నెలా ప్రేమిస్తాడూ? నా బొంద'' తనమీద తనే చిరాకు పడింది హనిత.
"ఫో! నేను బాగానే ఉన్నాను. అసలు ఈ అద్దమే సరిగ్గా లేదు. వెధవ అద్దం'' అనుకుని అద్దం ముందు నుంచి లేచి వచ్చి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసింది.
నీలిరంగులో మసక వెలుతురు గదంతా పరుచుకుంది. లతా మంగేష్కర్ పాటలు రికార్డ్ చేసి ఉన్న క్యాసెట్ టేప్ రికార్డర్ లో పెట్టి ఆన్ చేసింది.
మంచం మీద పడుకుని రగ్గు కప్పుకుంటూ "ఆ! ఇప్పుడు గుర్తొచ్చింది. జీవితం చుక్కాని లేని నావ లాంటిది'' సంబరంగా అనుకుంది.
తర్వాత సీలింగ్ కేసి చూస్తూ పడుకుంది.
కళ్ళు తెరిచింది హనిత.
నలుపు రంగు దారంతో కుట్టిన అద్దాలున్న ఎర్రటి డేరాలో గులాబీ రేకులు, మల్లెపూల గుట్ట పైన పడుకుని ఉంది తాను. కళ్ళు నులుముకుంటూ లేచింది.
తన మీదున్న లేత పసుపు రంగు పట్టుబట్టని తీసి పక్కకి విసిరేసింది.
"నేనెక్కడున్నాను?'' అనుకుంటూ అయోమయంగా లేచి డేరా బయటికి వచ్చి చూసింది. చుట్టూ మంచుకొండలు, తెల్ల శాటిన్ బట్టలాంటి మెత్తటి మంచు, పైన నీలాకాశం, నీలాకాశంలో నిండు చంద్రుడు.
ఆశ్చర్యంగా చూస్తున్న హనిత కెదురుగా ఒక గుఱ్ఱం పరుగెత్తుతూ వచ్చి ఆగింది. తెలుపు రంగులో ఉన్న ఆ గుర్ర్రం మీదంతా నలుపు రంగు మచ్చలున్నాయి. 'మచ్చాల్ని కలుపుతూ ముగ్గువేస్తె' అన్న చిలిపి ఆలోచన వచ్చింది హనితకి.
అజుకోకుండానే ఆ గుఱ్ఱం మీదెక్కి కోర్చుంది. ఆమెకెక్కడి నుంచో "హనీ! హనీ!'' అన్న పులుపు వినిపించసాగింది. ఆ గొంతు వినిపించిన వైపుకి ఆమె గుర్రాన్ని దౌడు తీయించింది. మంచుకొండల మధ్యనున్న సన్న సన్నటి దారులగుండా గుఱ్ఱం పరుగెడుతోంది. ఆశ్చర్యం ఏమిటంటే అంత మంచులోనూ ఆమెకస్సలు చలే వేయడం లేదు. అలా ఆమె దాదాపు రెండు మైళ్ళు ప్రయాణించింది. ఉన్నట్లుండి గుఱ్ఱం ఆగిపోయింది.
గుఱ్ఱం దిగి హనిత ముందుకు నడిచింది. అక్కడొక చిన్న కొలనుంది. కొలను ఒడ్డున ఒక గుల్ మొహర్ చెట్టు, చెట్టు కింద ఒక వ్యక్తి నిల్చుని ఉన్నాడు. ఆ వ్యక్తి చెట్టువేపుకి తిరిగి ఉండటంతో హనితకతని మొహం కనిపించలేదు. అతను బ్లూ షర్ట్, జీన్స్ పాంట్ వేసుకుని ఉన్నాడు.
హనిత ఆ వ్యక్తి వేపుకు అడుగులు వేయసాగింది. అతనికి పదడుగుల దూరంలోకి వచ్చింది. సడన్ గా అతను చెట్టు వెనక్కు వెళ్ళిపోయాడు. హనిత మరో రెండడుగులు వేసేసరికి చెట్టు వెనుకనుంచి ఆ వ్యక్తి ముందుకొచ్చాడు. అతను వైభవ్.
"వైభవ్! నువ్వా?' 'అంది హనిత సంతోషంగా. అతను పట్టించుకోనట్టుగా, తన చేతిలో ఉన్న పెద్ద అద్దాన్ని హనిత ముందుంచాడు. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది హనిత. అద్దంలో తను తెల్లటి చీర కట్టుకుని ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయింది.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె బాయ్ కట్ బదులుగా పెద్ద వాలుజడ వేసుకుని ఉంది.
"నేనీ డ్రస్ లో అందంగా ఉన్నాను కదూ!'' అంది.
"వట్టి అందంగా ఉండటం కాదు. అప్సరసలా ఉన్నావ్!'' అన్నాడు వైభవ్. తర్వాత అతను తన చేతిలోని అద్దాన్ని దూరంగా విసిరేశాడు. అద్దం భళ్ళున పగిలి ముక్కలైపోయింది.
అంతే! హనిత ఎగిరి వైభవ్ కి పదడుగుల దూరంలో పడింది. వైభవ్ చేతులు చాచి హనితని "హనీ! హనీ!'' అంటూ పిలవసాగాడు. హనిత వైభవ్ దగ్గరికి పరుగెత్తింది.
వైభవ్ కి దాదాపు సమీపంగా వచ్చేసింది. ఇంతలో వాళ్ళిద్దరికీ ఏదో పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. వాళ్ళ మధ్య భూమి భూకంపం వచ్చినట్టుగా నాలుగడుగుల వెడల్పుతో చీలింది. నిస్సహాయంగా చూసింది హనిత.
వైభవ్ గుల్ మొహర్ చెట్టుని పెకించి తెచ్చి ఆ చీలిన భూమి మీద వంతెనలా వేశాడు.
ఆ చెట్టు వంతెన మీద నుంచి హనిత అతికష్టం మీద నడుస్తూ అవతలి వేపుకు చేరుకుంది.
తలొంచుకొని సిగ్గుపడుతూ వైభవ్ వేపుకు నడిచింది. ఇంకొక్క అడుగువేస్తే హనిత వైభవ్ కౌగిట్లో వాలిపోతుండగా ఆమెకి "చచ్చిపోరూ! ప్లీజ్'' అన్న స్వరం వినిపించింది.
తలెత్తి చూసిన హనితకి తనకెదురుగా వైభవ్ కీ, తనకీ మధ్య నిలబడి ఉన్న మీనా కనిపించింది.
సడెన్ గా హనితకి మెలకువ వచ్చింది. "అయ్యో! ఇదంతా కలా?'' అనుకుంది తనలో తాను.
"వావ్! ఆయామ్ ఇన్ లవ్'' అనుకుంది. వెంటనే గబగబా కాలేజీకి రెడీ అయి బయల్దేరింది.
|