TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
మై డియర్ రోమియో - 32
స్వప్న కంఠంనేని
"వాళ్ళ దుంప తెగ, వాళ్ళ చేతులు విరిగిపోను'' ఏడుస్తూ శాపనార్థాలు పెట్టసాగింది వైభవ్ తల్లి సుజాత.
వైభవ్ అన్నయ్య అనిల్ అన్నాడు "కావాలనే పాతకక్షలు మనసులో పెట్టుకొని కొట్టుంటారు. లేకపోతే వీడేమిటీ? ఆడవాళ్ళకి కాళ్ళు తగిలించడం ఏమిటి? వీడెలాంటి వాడో మనకు తెలీదూ?
"కళ్ళు తగిలించటం మాట దేవుడెరుగు. అసలేం జరిగిందో కూడా మాకర్థమయ్యే లోపే పట్టుకుని బాదేశారు'' అక్కడే ఉన్న సురేష్ అన్నాడు.
వంటినిండా గాయాలతో కట్లు కట్టించుకుని ఉన్న వైభవ్ ని చూసేసరికి మహేష్ కి జాలేసింది.
ఎప్పుడూ ముక్తసరిగా ఉండే అతను కూడా "ఇప్పుడే వాళ్ళ సంగతి తెల్చేస్తాను, నరికిపారేస్తాను వెధవల్ని'' అంటూ కోపంగా లేవబోయాడు.
తండ్రి రామారావ్ అతన్ని వారించాడు.
"నువ్విప్పుడు ఊరుకోరా! వాళ్ళ పిల్ల చేసిన తప్పుకి కూడా అప్పట్లో మననే కొట్టబోయారు వాళ్ళు. పైగా ఈసారి తప్పు మనవాడు చేసినా చేయకపోయినా తప్పు చేశాడనే నలుగుర్నీ నమ్మించారు. మనకీ అవకాశం వస్తుంది. అప్పుడు ఆ అవకాశాన్ని తీసుకుని మనం కూడా అంతు తేలుద్దాం''
హనిత చెప్పింది విన్నాక మీనా కాసేపు మౌనంగా ఊరుకుంది. తర్వాత నెమ్మదిగా అంది.
"తప్పంతా నీదేనే హనీ. నువ్వు తొందర పడ్డావనిపిస్తోంది. పాపం వైభవ్!
హనిత కూడా జాలిగా మొహం పెట్టింది.
"అవును మీనా. వైభవ్ నన్ను ఏడిపించటానికి కాళ్ళు తగిలించాడేమో అనుకున్నాను. కానీ మా వాడినాను కూడా తాకేటంత చెడ్డవాడు కాడతాను. అతను నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు కదా! అసలు మా అన్నయ్యలకు సడన్ గా అంత కోపం వస్తుందనుకోలేదు నేను''
"సరే అయిందేదో అయింది. పద కాలేజీకి టైమయింది'' అంది మీనా.
"అమ్మో! నేను రాను బాబూ. ఇంత జరిగాక ఇంకా వైభవ్ కి మొహమెలా చూపించగలను?'' తలని చేతుల్లో పెట్టుకుంటూ అంది హనిత.
"ఎందుకూ చూపించటం? నువ్వు చూపించినా అతను నిన్నసలు తలెత్తి కూడా చూడడుగా!'' కావాలనే వెటకారంగా అంది మీనా.
"వ్వాట్?'' ఆశ్చర్యపోయింది మీనా.
"వైభవ్ నా వేపు అస్సలు చూడడా?''
"చచ్చినా చూడడు'' ఖచితంగా చెప్పింది మీనా.
హనితకి మీనా అలాంటి విషయాన్ని అంత ఖచ్చితంగా చెప్పటం నచ్చలేదు. "ఎందుకలా?'' అమాయకంగా అడిగింది. మీనాకి హనితనింకా ఆట పట్టించాలని పించింది.
"ఏమో! నువ్వు నచ్చలేదేమో. అన్నట్టు నీకు తెలీని విషయం ఇంకోటుంది. వైభవ్ సుదీష్ణ అంటే పడిచస్తాడు. తెలుసా?''
"ఈజిట?''
"అవును'' పెదిమలు బిగించి నవ్వాపుకుంటూ చెప్పింది మీనా.
తర్వాత ఇద్దరూ కాలేజీకి బయలుదేరారు. దార్లో అడిగింది హనిత "కాని వైభవ్ కాలేజీలో చేరిన కొత్తలో నావేపు రెప్పవాల్చకుండా చూసేవాడే''
మీనా ఠక్కున చెప్పింది "అప్పట్లో అతనికి నువ్వు ఆడపిల్లవో, మగపిల్లాడివో అర్థం అయ్యేదికాదట''
హనితకి మీనా మీదో వైభవ్ మీదో గాని కోపం వచ్చింది. 'మా బాగా అయింది. నిన్న అన్నయ్యలు అతన్ని కొట్టి మంచిపనే చేశారు' మనసులో అనుకుంది.
కాసేపయ్యాక మళ్ళీ అంది "మీనా! నేనెలా ఉంటాను?''
"అంటే? నీ ప్రశ్న నాకర్థం కాలేదు''
"అదే చూడటానికి నేనెలా ఉంటాను?''
"ఫర్లేదు. బాగానే ఉంటావు. అంటే మరీ బిలో ఎవరేజ్ కాదు. అలాగని ఎబోవ్ ఎవరేజ్ కాదు.జస్ట్ ఎవరేజ్ అన్నమాట. ఏమనుకోకు నేనిలా చెబుతున్నానని. నీతో అబద్ధాలు చెప్పటం నాకిష్టం ఉండదన్న సంగతి నీకు తెలుసు కదా!''
"నేనేమీ అనుకోనులే. మరి చాలామంది అబ్బాయిలు నాకు సైటు కొడుతుంటారు కదా!''
"మరి వాళ్లందరూ బిలో ఏవరేజ్ లుకింగ్ గాళ్ళు కదా. అయినా మగవాళ్ళు సైటు కొట్టడాన్ని బట్టి అందాన్ని కొలవకూడదు. ఎందుకంటే మగవాళ్ళు అమ్మాయి కనిపిస్తే చాలు లైనేస్తుంటారు. చివరికా అమ్మాయికి లెప్రసీ ఉందని తెలిసినా సరే'' వేదాంతిలా ఫోజు పెట్టింది మీనా.
"కానీ నీకు మాత్రం వేయరు కదా!'' కసిగా అన్నది హనిత.
క్లాస్ లోకి వెళ్ళేసరికి సుధేష్ణ, వైభవ్ లు మాట్లాడుకుంటూ కన్పించారు. సుధేష్ణ లైట్ బ్లూ కలర్ మైసూర్ సిల్క్ చీర కట్టుకుంది. ఆ రోజెందుకో ఆమె అలంకరణ ప్రత్యేకంగా ఉంది.
హనిత వాళ్ళ పక్కగా వెళుతూ అందరికీ వినిపించేట్లుగా పాట లంకించుకుంది.
"ఓ మేరీ జోహరజభీ తుజె మాలూమ్ నహీ
తూ అభీతక్ హై హసీ .. ఔర్ మై జావా''
క్లాసంతా గొల్లుమంది. వైభవ్ హనితకేసి కోపంగా చూశాడు. సుధేష్ణ పెద్దగా పట్టించుకున్నట్టుగా కనిపించలేదు. ఇంతలో సురేష్ క్లాసులోకి ప్రవేశించాడు. అతడ్ని చూడగానే సుధేష్ణ మొహం వెలిగిన లైటులా అయింది.
"ఏంటి సురేష్ ఇంత లేట్?'' అంటూ వెళ్ళి సురేష్ చేయి పట్టుకుంది.
సురేష్ చేతిలో ఒక కవర్ ఉంది. సుధేష్ణ సురేష్ ఇద్దరూ డయాస్ ఎక్కారు, సురేష్ అనౌన్స్ చేశాడు "ఫ్రెండ్స్! నెక్స్ట్ వీక్ మేమిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నాం. అనుకోకుండా మా గ్రాండ్ మదర్ కి సీరియస్ అవడంతో సడెన్ గా మా పెళ్ళి చేయాలని నిశ్చయించుకున్నారు మా వాళ్ళు ... '' చెప్తున్నాడు సురేష్.
హనిత మీనా చెవిలో గుసగుసగా అంది "కథ రివర్సయిందేమిటి? వైభవ్ ఏమవుతాడో. పాపం గుండు బాస్. ఇకపై కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ విరహగీతాలు పాడుకుంటాడు గావును. భలే భలే ప్రేమదాసూ కాస్తా దేవదాసు అయిపోయాడుగా''
"నువ్వొకసారి వైభవ్ వైపు చూడు'' అంది మీనా.
"నేనెందుకు చూడాలి? నేను చూడను. ఐ హేట్ హిమ్. అతను నావైపు కూడా చూడనప్పుడు నేను మాత్రం అతన్నెందుకు చూస్తాను?''
"చెప్పింది విను. ఒకసారతన్ని చూడు'' విసుగ్గా అంది మీనా.
హనిత వైభవ్ ని చూసింది. అతను సంతోషంగా సురేష్, సుధేష్ణలను చూస్తున్నాడు.
"యిదేమిటే వైభవ్ సంతోషంగా ఉన్నాడేమిటి?'' ఆశ్చర్యంగా మీనాని కుదిపింది హనిత.
"నేను నీతో ఇందాకలా ఊరికే చెప్పానులే కానీ అల్లరి చేయకు. నువ్విట్లాగే పెద్దగా వాగావంటే వాళ్ళంతా కలిసి నన్ను చెప్పుచ్చుకు కొడతారు''
"ఊరికే చెప్పడమెందుకు, పిచ్చెక్కిందా నీకు? వాళ్ళ గురించి లేనిపోనివి నాకు చెప్పడమేమిటి? నేనేమన్నా వైభవ్ కి లైనేస్తున్నాననుకుంటున్నావా, లేకపోతే నీకు నువ్వు చిలిపిగా ప్రవర్తిస్తున్నాననుకుంటున్నావా? ఇంకోసారిలా పిచ్చి జోకులేసావంటే కాళ్ళు విరగ్గొతాను జాగ్రత్త'' సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది హనిత.
|