TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
మై డియర్ రోమియో - 31
స్వప్న కంఠంనేని
"ఒరేయ్ అన్నయ్యా, నిన్న వాసంతిని కలిశాను'' అంది హనిత.
హేమంత్ కి ప్రాణం లేచి వచ్చినట్టయింది.
"కలిశావా? ఏమన్నదీ?'' అన్నాడు ఆత్రంగా.
"నన్ను సినిమాకు తీసుకెళ్ళమని నీకు చెప్పమన్నది''
"తను కూడా వస్తానన్నదా?'' ఆశగా అడిగాడు హేమంత్.
"ఏమో? ఆ సంగతి చెప్పలేదు. నువ్వు మాత్రం నన్ను సినిమాకి తీసుకెళ్ళాల్సిందే''
"ఫో, నాకింకేం పని లేదనుకున్నావా'' విసుక్కున్నాడు హేమంత్.
"అయితే ఇప్పుడు నీ సంగతంతా మమ్మీకి చెప్పేస్తాను'' బెదిరించింది హనిత.
"సరే ఛావు. నువ్వు నాకొక పెద్ద బ్లాక్ మెయిలర్ లా తయారయ్యావు. తీసుకెళ్తాలే. రెడీ అవు'' రాజీకొచ్చేశాడు హేమంత్.
'1942 - ఎ లవ్ స్టోరీ' ఫస్ట్ షోకెళ్ళారు హనిత, హేమంత్, హరీష్, రాధలు.
వాళ్ళు వెళ్ళేసరికి సినిమా మొదలయిపోయింది.
ఆ చీకట్లోనే సీట్స్ వెతుక్కుంటూ వెళ్ళి కూర్చున్నారు.
కాసేపయ్యాక హనిత వెనకనించి ఎవరో కాలు గగిలిస్తున్నట్టుగా అనిపిస్తుంది.
కోపంగా వెనక్కి తిరిగి చూసింది.
సరిగ్గా వెనకే వైభవ్, సురేష్ లు కూర్చుని ఉన్నారు.
"ఏయ్ వైభవ్! పిచ్చి పిచ్చిగా ఉందా?'' తీక్షణంగా చూస్తూ అంది హనిత.
"నేనేమన్నాను?'' అయోమయంగా అడిగాడు వైభవ్.
"అమాయకంగా నటించకు'' అని చెప్పి స్క్రీన్ వేపు చూడడం మొదలుపెట్టింటి.
"ఏమయింది హనీ?'' అని అడిగిన హరీష్, హేమంత్ లతో వద్దనుకుంటూనే చెప్పింది "ఎవరో కాలును తగిలిస్తున్నారు?''
వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వైభవ్ ని కోపంగా చూశారు.
కాసేపయ్యాక రాధ కూడా అనీజీగా కదలటం మొదలెట్టింది.
తర్వాత హరీష్ తో అంది "నన్ను కూడా ఎవరో వెనకనుంచి తాకుతున్నారండీ?''
కోపంగా లేచి నిలబడ్డాడు హరీష్, హేమంత్ లు.
"ఏరా? ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తావా?'' అంటూ హేమంత్ వైభవ్ కాలర్ పట్టుకుని ముందుకి లాగాడు.
వైభవ్ అసలేం జరిగిందో అర్థం కాలేదు.
ఈలోగానే హరీష్ వైభవ్ చెంప చెళ్ళుమనిపించాడు.
ఇంత గొడవ జరుగుతుందని అనుకొని హనిత, రాధలు స్థాణువులై చూడడం మొదలుపెట్టారు.
సురేష్ కి నోట మాట రాలేదు.
ప్రేక్షకులు అసలు సినిమా మానేసి ఇటువేపు చూడసాగారు. ఒకళ్ళిద్దరు ఈ గొడవలో జోక్యం చేసుకోవటానికి ప్రయత్నించారు.
సినిమా ఆగిపోయింది.
లైట్లువెలిగాయి.
ఈ గోల మధ్యలో రాధనీ, హనితనీ కాళ్ళు తగిలించి వేధించిన రౌడీ మూక చల్లగా బయటికి జారుకున్నారు.
అంతమంది ఒక వేపు చేరినప్పుడు ప్రతిఘటించడం తనకీ ముప్పు అనుకున్న వైభవ్ ఏమాత్రం ప్రతిఘటించలేదు. హరీష్, హేమంత్ లు ఆవేశం చల్లారేవరకూ వైభవ్ ని కొట్టి రాధ, హనితలను తీసుకుని బయటికి నడిచారు.
బాగా దెబ్బలు తిన్న వైభవ్ సురేష్ చేతి సాయం పట్టి నడిపించాడు.
ఎందుకో ఆ క్షణాన హనితకు వైభవ్ మీద జాలేసింది.
'నన్నంటే ఏడిపించటానికలా చేశాడనుకున్నాను గానీ వదినకి కూడా కాళ్ళు తగిలించడమంటే నాకు నమ్మశక్యం కావటంలేదు' తనలో తను అనుకుంది.
కానీ ఈ మాటే పైకంటే అన్నయ్యలు తనను కూడా తన్నుతారేమోననిపించి కిక్కురుమనకుండా ఊరుకుంది.
|