మై డియర్ రోమియో 26

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 26

 

స్వప్న కంఠంనేని

 

కళ్ళు తెరుస్తూనే తన ఎదురుగా కూర్చొని మొహంలోకి చూస్తోన్న మీనా కనిపించింది.
"గుడ్ గాడ్! ఇదంతా కలా?
"కలేమిటేవ్?'' ఆసక్తిగా అడిగింది మీనా.
"తర్వాత చెబుతాను గానీ నువ్విప్పుడు నాతో చచ్చిపోవా ప్లీజ్ అని అన్నావా?''
"అవును అన్నాను ఎంత లేపినా లేవకపోయేసరికి అలా అన్నాను'' సంతోషంగా చెప్పింది మీనా.
"ఒక్కసారి వెనక్కి తిరగవా మీనా?'' అంది హనిత.
"ఎందుకు హనీ?''
"ప్లీజ్. ఒక్కసారి వెనక్కి తిరిగు చెబుతాను''
"ఏంటో, ఏమో, హానితవన్నీ వింత కోరికలే'' అనుకుంటూ వెనక్కి తిరిగి నిలబడింది మీనా.
ఒక్క ఉదుటున మీనా మీదకి లంఘించి కోట శ్రీనివాసరావి బాబూమోహన్ ని తన్నినట్లుగా నడ్డి మీద కాలితో తన్నింది హనిత
ధబ్ మన్న శబ్దంతో మొదలు నరికిన చెట్టులా కూలింది మీనా.
మళ్ళీ వెంటనే లేచి నిలబడి కోపంగా అంది.
"ఎందుకు తన్నావ్ నన్నిప్పుడు?''
"తంతానా? చంపేస్తానా? బంగారం లాంటి కల పాడుచేశావ్. పాపిష్టిదానా. ఒక్క నిమిషమాగితే వైభవ్ ని తుక్కు తుక్కు కింద కొట్టేసేదాన్ని''
"ఓహో! అయితే నీకిప్పుడు వైభవ్ కలలోకి వచ్చాడన్నమాట. ఏంటి కత?'' మొహం అదోలా పెట్టి వంకరగా నవ్వింది.
"ఏం లేదు. మేమిద్దరం పోట్లాడుకుంటున్నట్టుగా కలొచ్చింది. అయితే ఏమిటట. ఎందుకలా పిచ్చి మొహం పెట్టావ్. సరిగ్గా పెట్టు మొహం. లేకపోతే చంపేస్తాను'' ఉక్రోషంగా అంది హనిత.
"అలాగా! నిజంగా పోట్లాటేనా లేక డ్యూయెట్టా?'' వ్యంగ్యంగా అంది మీనా.
మీనా తన మాటలు నమ్మకపోయేసరికి హనితకి చిర్రెత్తుకొచ్చింది. మీనా మీదకి విరుచుకుపడబోయింది. సరిగ్గా అదే సమయానికి కోపంగా మారుతున్న హనిత ముఖకవళికలు చూసి మీనా "త్వరగా రెడీ అవు హనీ. అపుడే ఎయిట్ థర్టీ అవుతోంది. మనం కాలేజీకి వెళ్లోద్దూ?'' హడావిడిగా అంటూ హానిత కోపాన్ని డైవర్ట్ చేసింది.
"అమ్మో! అప్పుడే ఎయిట్ థర్టీ అయిందా?'' కంగారుగా బ్రష్, పేస్ట్ కోసం పరుగెడుతూ జుట్టు వెనక్కు తోసుకోబోయి "ష్! అదంతా కల కదూ'' అనుకుని తనని తాను నెత్తిమీద మొట్టుకుంది.
ఎంతో హడావిడిగా ముగించినా హానిత రెడీ అయ్యేసరికి తొమ్మిదిన్నర అయిపొయింది.
కైనెటిక్ హోండా స్టార్ట్ చేస్తూ అంది హనిత.
"ఇప్పుడు తొమ్మిదిన్నర అయిపొయిందిగా మనం కాలేజ్ కి వెళ్ళేసరికి ఎంతలేదన్నా పదవుతుంది. పోనీ ఈ పూట కాలేజ్ మానేసి ఏదయినా సినిమాకెళ్దామా?''
"ఒద్దు హనీ. ఇప్పటికే నీ జ్వరంతో ఒక పదిరోజులు కాలేజ్ మానేశావ్. ఒక పక్కన ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి''
"నువ్వెప్పుడూ ఇలాగే అంటావ్'' గొణుక్కుంటూ బైక్ ని కాలేజ్ వైపు మళ్ళించింది హానిత.
కాలేజ్ కి చేరుకునేసరికి గేట్ వేసేసి ఉంది.
హనిత గేట్ మోగించింది. గేట్ కీపర్ గెట్ కి, గోడకీ మధ్యనున్న సందులో నుంచి తలను బయట పెట్టాడు. హానిత మొహం కన్పించగానే గభాల్న తలను లోపలికి లాక్కున్నాడు.
హనితకి ఒళ్ళు మండిపోయింది.
గేట్ కీపర్ మొహం మీద ఒక పంచ్ ఇవ్వాలనిపించిందామెకు. మళ్ళీ ఏమనుకుందో, "వాచ్ మాన్, వాచ్ మాన్'' అంటూ ఆప్యాయంగా పిలిచింది..
"నువ్వెట్లా పిలిచినా సరే. నేను మాత్రం నీకు గేట్ తియ్యనే తియ్య'' లోపల్నించి అరిచాడువాచ్ మాన్.
"ఇప్పుడు కూడా తీయవా?'' గేట్ పక్కనున్న చిన్న సందులోంచి చేయి దూర్చి పదిరూపాయల నోటుని చూపిస్తూ అంది హనిత.
గేట్ కీపర్ ఏమీ మాట్లాడలేదు.
"ఫర్లేదులే. భయపడకు. తీసుకో. మన ప్రిన్సిపాల్ లేడూ ... మిస్టర్ సింగరేణి ... ఆయనకు నేనేం చెప్పనులే. పూర్వజన్మలో కూడా ఆయన ప్రిన్సిపాల్ గానే పుట్టి నాలాంటి స్టూడెంట్స్ ని విసిగించి ఉంటాడు. అందుకే ఈ జన్మలో ఇట్లా కాటుక రంగులో పుట్టాడు. అయినా నాతో మంచిగా ఉంటే నేనీపాటికి ఆయన రంగు విరగటానికి ఏదో ఒక సొల్యూషన్ చెప్పేదాన్ని కదా. ఊహు! ఆయనెందుకు వింటాడూ. ఒళ్ళు పొగరు ఫరెగ్జాంపుల్, నన్ను కాలేజీకి లేట్ గా అలోవ్ చేశాడనుకో అప్పుడు నేనాయనకి యూనిక్ జెంట్స్ బ్యూటీ పార్లర్ లో వైటెనింగ్ తీసుకోమని చెప్పేదాన్ని. దాంతో ఆయన తర్వాత రోజుకు ఫెయిర్ గా మరిపోయేవారు. అప్పుడిక చూస్కో ... ఫెయిర్ అండ్ లవ్లీ వాళ్ళు, వికో టర్మరిక్ వాళ్ళు వచ్చేసి ఆయనే తమ ప్రోడక్ట్స్ కి మోడల్ గా కావాలని పోటీపడేవాళ్ళు. ఆయన దశ తిరిగిపోయేది. ప్చ్! ఎందుకులే. ఆయన ఖర్మ అసలు పాముకి ఒక్క తలలొనే విషముంటుందంటారు. కానీ మన ప్రిన్సిపాల్ కి మాత్రం ఒళ్ళంతా ...''
గేట్ తెరుచుకోవడంతో హనిత వాక్ప్రవాహానికి గండిపడింది.
ఎదురుగా నిలబడి ఉన్న ప్రిన్సిపాల్ ని చూసి ఆమె పైప్రాణం పైనే పోయినట్లనిపించింది.
అనుకొని ఈ పరిణామానికి మీనా కూడా అదిరిపడింది.
ఇద్దరినీ చెడామడా తిట్టాడాయన.
చివరగా "ఇదే మీకు లాస్ట్ వార్నింగ్' అని చెప్పి హడావుడిగా బయటకు వెళ్ళిపోయాడు ప్రిన్సిపాల్.