TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
మై డియర్ రోమియో - 25
స్వప్న కంఠంనేని
మర్నాడు ప్రొద్దున హానిత కాలేజీకి రెడీ అవుతుండగా ఫోన్ మోగింది.
హానిత లిఫ్ట్ చేసి "హలో'' అంది.
అవతల్నుంచీ ఒక క్షణంపాటు నిశ్శబ్దం.
తర్వాత ఒక అమ్మాయి గొంతు వినిపించింది.
"హలో! హేమంతున్నాడా?''
హనితకి ఎగిరి గంతేయాలనిపించింది.
"వావ్! నిన్న హేమంత్ గాడితో పాటు కనిపించినమ్మాయనుకుంటా ఫోన్ చేసింది. పైకి నంగనాచిలా కనిపిస్తాడు గానీ చిన్నన్నయ్యగడు గ్రంథసాంగుడే'' అనుకుంది.
"ఈ అమ్మాయిని కాసేపు ఆటపట్టిస్తే పోలా?'' అనిపించిందామెము.
గొంతు మార్చి "హేమంతెవడు?'' అంది.
"అరె. హేమంతెవడంటావెంటి? అసలింతకీ నువ్వెవరు?''
"నేనేవరైతే నీకెందుకుగానీ ముందు నువ్వెవరో చెప్పు''
"నా పేరు వాసంతి. ఇప్పుడు చెప్పు నువ్వెవరు?''
"నా పేరు మైసమ్మ. నేను హేమంత్ వాళ్ళింట్లో ఆయాని. నీకు హేమంత్ గాడితో ఏం పని?''
"అరె! ఇందాకటి నుంచి చూస్తున్నా ఏందీ ఊకునె హేమంత్ గాడు హేమంత్ గాడు అనబట్టినవ్. హేమంత్ తోటి జెప్పాల్నా? ఆయావి. ఆయలెక్కుండు''
"చెప్పుకుంటే చెప్పుకో. చెప్పు తీసి కొట్టుకో'' వెక్కిరించింది హానిత.
"నీకసలు మంచీ మర్యాదలేవేందే గలీజ్ పోరీ. హేమంత్ తోటి జెప్పి నిన్ను తీసేపించకుంటే నా పేరు మార్చుకుంటా'' కోపంగా అంది వాసంతి.
"మార్చుకో. నీ పెర్లోంచి 'స'తీసేసి వాంతి అని పెట్ట్టుకో'' టీజింగ్ గా అంది హానిత.
అవతలనుంచి ఆ అమ్మాయి ఠక్కున ఫోన్ పెట్టేసింది.
హానిత నవ్వుకుంది.
ఆకాశం లేత నారింజ రంగులో వుంది. ఆ ప్రదేశమంతా ఆకుపచ్చటి చెట్లతో నిండి వుంది. నేలమీద మెత్తటి లేతాకు పచ్చ లాన్. చెట్లని కమ్ముకుంటూ పొదలు, చెట్ల మీదకి పాకి చెట్లని అల్లుకున్న లేత తీగలతో అద్భుతంగా ఉందా ప్రదేశం. లాన్ తో సహా చెట్లూ, పొదలూ అన్నీ రకరకాల చిన్న పువ్వులతో అలంకరించాబడి ఉన్నాయి.
"వావ్!'' ఆనందంగా అరిచింది హానిత.
లేత నీరెండ ఆమె దేహం మీద ప్రతిఫలిస్తూ ఒక విచిత్రమైన కాంతిని వేలువరిస్తోంది.
అసలే అందంగా ఉండే ఆమె మొహం ప్రకృతి పారవశ్యానికి మరింత సొగసును సంతరించుకుంది. ఒకసారి తనవేపుకి చూసుకుందామె.
లేత పసుపు రంగు చుడీదార్, అదే రంగు చున్నీ వేసుకుని ఉంది.
నడుము వరకూ కత్తిరించబడి ఉందామె జుట్టు. సెట్ చేయించినట్టుగా ఆమె జుట్టంతా ఉంగరాలు తిరిగి వుంది.
జుట్టును వదిలేసి ఉంచడంతో గాలికి మొహం మీద ఒకటి పడుతూ విసిగించసాగింది. చిరాగ్గా జుట్టుని వెనక్కి తోసుకుంది.
"నాకిక్కడ చాలా బావుంది'' తనకు తెలియకుండానే అప్రయత్నంగా అరిచింది.
చెట్టు సంబరంగా తలలూపాయి.
రంగురంగుల పూలు ఆమెపై వర్షంలా కురిశాయి.
ఆ క్షణాన ఆమెకు డాన్స్ చేయాలనిపించింది.
అటూ ఇటూ చూసింది.
ఎవ్వరూ కనిపించలేదు.
ఒక చేత్తో చున్నీ అలవోకగా పట్టుకుంది. నడుము తిప్పుతూ వయ్యారంగా ముందుకు నడిచింది.
అలా నాలుగడుగులు వేసిందో లేదో ఒక పాట వినిపించింది.
"పచ్చని సేలోకి పండు యెన్నేల్లోన
నీలి సిరా గట్టి నీటు గొస్తావుంటే
వొయ్యారమోలికించు హనీ
వానలచ్చిమనిపించు హనీ''
ఎవ్వరూ లేరనుకుని తను హోయలొలికిస్తూ నడుస్తుండగా ఎవరో తనని గమనించారన్న విషయం ఆమెకు కోపాన్ని తెప్పించింది. అందులోనూ తన పేరును ఇరికించి మరీ పాట -
"ఎవడ్రా అది'' కోపంగా అరిచింది.
తిరిగి జవాబు రాకపోయేసరికి మళ్ళీ తిక్కగా అరిచింది.
"నండూరి సుబ్బారావ్ కవిత్వాన్ని చివర్లో మార్చేసి యెంకి బదులు హనీ అన్నంత మాత్రాన గొప్ప కవినయ్యాననుకుంటున్నావేమో! చంపేస్తాన్రోయ్. అయినా నేను కట్టుకున్నది నీలి చీరేం కాదురా పిచ్చోడా''
అంతలో ఒక చెట్టు చాటునుంచి వైభవ్ చిరునవ్వు నవ్వుతూ బయటికొచ్చాడు.
నలుపు రంగు మీద తెల్లటి చుక్కలున్న షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడతను. 'గీతాంజలి' సినిమాలో నాగార్జునలా జుట్టు సన్నగా వెనక్కి దువ్వుకుని ఉన్నాడు.
అతన్నక్కడ చూసి హతాశురాలైంది హానిత.
పైకి నిర్లక్ష్యంగా కనిపించే తను వయ్యారంగా నడవటాన్ని ఎవరో చూశారన్న ఆలోచనతోనే ఇంసల్టింగ్ గా ఫీలవుతుంటే తనలా నడవటాన్ని చూసింది వేరెవరో కాక వైభవ్ అని తెలియగానే తల కొట్టేసినట్లయింది. భూమి నిలువునా చీలిపోయి తనందులో కూరుకుపోతే బావుండుననిపించింది.
ఉక్రోషంగా ఆమె మొహం ఎర్రబడింది.
"నువ్విక్కడికెందుకు తగలడ్డావ్?'' అంది.
పెద్దగా నవ్వాడు వైభవ్.
నవ్వినప్పుడు అతడి మోహంలో కనిపించిన చామ్ ని చూసి స్టన్నయిన చెట్లు గాలి వీచటం ఆపేశాయి.
"నిన్నే చెప్పేది, వినిపిస్తోందా? ఇవి మా డాడీ గార్డెన్స్ తెలుసా? గెట్ లాస్ట్'' అరిచింది హానిత.
"నీ మొహం కాదూ? తింగర బుచ్చీ? ఇవి మా పొలాలు'' మొహం మీద చరిచినట్టుగా అన్నాడు వైభవ్.
హానిత కోపంతో మొహం జేవురించింది.
"నన్ను తింగరబుచ్చి అంటావా? నీ పని చెప్తానుండు'' గభాల్న ఒక చెట్టు కొమ్మ విరిచింది. దాన్ని చేతిలో పట్టుకుని వైభవ్ ని కొట్టడానికి అతని దగ్గరకి వెళ్ళింది.
వైభవ్ పరుగెత్తాడు.
హానిత అతన్ని వెంబడించింది.
ఇద్దరూ ఆ ప్రదేశాన్ని దాటి కొండలూ కోనలూ మైదానాలూ అధిగమిస్తూ ఓ ఎడారిలోకి ప్రవేశించారు.
అలుపొచ్చినట్టుగా ఒక చోట ఆగిపోయాడు వైభవ్.
"ఇంకెక్కడికి పోతావ్? ఇవ్వాళ నీ కాళ్ళు విరగొట్టకపోతే నా పేరు హానిత కాదు'' అంటూ హానిత వైభవ్ ని కొట్టడానికి తన చేతిలోని చెట్టు కొమ్మని పైకెత్తింది.
సడన్ గా ఆ ప్రాంతంలో ఇసకంతా చెల్లాచెదురవసాగింది. 'ఇసుక తుఫానేమో'' అనుకుంటూ హానిత, వైభవ్ లిద్దరూ కళ్ళు మూసుకున్నారు.
కాసేపయ్యాక వాతావరణం ప్రశాంతంగా మారింది.
ఇద్దరి మీదా పెద్ద నీడ పడింది.
ఆశ్చర్యంగా కళ్ళు తెరిచారు వైభవ్, హనితలు.
ఇద్దరి మధ్యా మీనా నిలబడి వుంది.
అమాయకంగా మొహం పెట్టి మీనా తననే చూస్తున్న హానిత, వైభవ్ లతో అంది.
"చచ్చిపోరూ ప్లీజ్!''
అదిరిపడి హానిత నిద్రలోంచి మేల్కొంది.
|