మై డియర్ రోమియో - 22

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 22

 

స్వప్న కంఠంనేని

 


ఫ్లాష్ బాక్ పూర్తి అవుతూనే అప్రయత్నంగా హానిత నోట్లో నుంచి చిన్న కేక వెలువడింది.
"నువ్వు ... నువ్వు ... ఇడ్లీ కదూ?'' అంది ఆశ్చర్యంగా.
వైభవ్ స్టన్నయ్యాడు. అతనిలో కూడా జ్ఞాపకాలు కదిలాయి.
చింపిరి జుట్టు, తెల్లటి తెలుపు, గుండ్రటి మొహం, అమాయకమైన పెద్ద పెద్ద కళ్ళు. పరికిణీ, జాకెట్, వాటి మీద బురద మరకలు - చిన్నప్పటి చిన్నారి రూపం గుర్తుకు వచ్చింది.
తనను ఇడ్లీ అంటూ పిలిచేది ఒక్క చిన్నారి మాత్రమే.
"అంటే ... అంటే ... నువ్వు ... చిన్నారివీ?'' అన్నాడు ప్రశ్నార్థకంగా మొహం పెట్టి.
"ఛీ!'' అంది హానిత.
"ఛీ ఏమిటి?'' అన్నాడు వైభవ్
"లేకపోతె ఏమిటీ? ఇంకా చిన్నారి ఏమిటీ? నేనిప్పుడు పెద్దదాన్ని అయ్యాను తెలుసా?''
"తెలుస్తూనే వుంది. శరీరం పెద్దగా అయింది గాని బుద్ధి మాత్రం ఎదగలేదని'' అన్నాడు వెక్కిరిస్తున్నట్టుగా వైభవ్.
తన ఎదురుగా నిలుచున్నా అందాల ఇంతెత్తు యువకుడు తన బాల్యపు నేస్తం అని తెలిసేసరికి హానిత మనసుకు పురివిప్పి నాట్యం చేయాలనిపించింది.
కాని టీనేజ్ వయసు విచిత్రమైనది. ఆ వయసులోని అమ్మాయిలకూ, అబ్బాయిలకూ మనసులు అపరిపక్వంగా విచిత్రమైన స్థితిలో వుంటాయి. తమకు ఏం కావాలో ఏమవసరం లేదో, తాము దేన్నీ ద్వేషిస్తున్నారో, దేన్నీ ప్రమిస్తున్నారో, దేన్నీ అయిష్టపడుతున్నారో, దేన్నీ ఇష్టపడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఆ క్షణాన హుర్రే అనేవాళ్ళు మరుక్షణాన హయ్యో అనే మూడ్ లోకి వెళ్ళిపోతుంటారు.
వైభవ్ బాల్యమిత్రుడని తెలిసి సంతోషపడబోయిన ఆమె మనసుకు ఆ మరుక్షణమే పాము తోక తన వొంటిని తగలటమూ, పామునా స్థితిలో చెయిర్ కి అంటించింది వైభవేననీ గుర్తుకు వచ్చాయి.
'అంటే ఆటను తమ చిన్ననాటి పోట్లాటను మర్చిపోలేదన్నమాట. ఆ కక్షను మనసులో ఉంచుకునే అలా చేశాడన్న మాట' అనిపించింది.
అదే అతనితో అన్నది కోపంగా.
ఒక్క టీనేజ్ తాలూకు మనో అపరిపక్వతే  కాకుండా ఆ క్షణాన ఆమె వొంటిని ఆవహిచిన జ్వరం కూడా ఆమెను సక్రమంగా ఆలోచించనివ్వకుండా చేసింది.
"ఛీ! నీ మనసులో ఇంతటి పగ, ప్రతీకారం ఇన్నేళ్ళ నుంచీ దాగి ఉన్నాయని నాకు తెలీదు ఇడ్లీ!'' అంది వెక్కిరిస్తున్నట్టుగా.
వైభవ్ ఆమెకు సర్దిచెప్పాలని ప్రయత్నించాడు గాని ఆమె వినిపించుకునే స్థితిలో లేదని తెలిసేసరికి అతను కూడా పెట్రేగిపోయాడు.
పైగా ఆమె తనను మాటిమాటికీ ఇడ్లీ అనటం కూడా తిక్కను రేకెత్తించింది. ఆమెను నానా మాటలు అని అక్కడి నుంచి దూసుకుపోయాడు.
"ఛీ! ఇడ్లీ!!'' అంది హానిత అతను వెళ్ళిపోయాక మళ్ళీ.
ఈ సీనంతా అయోమయంగా తిలకిస్తున్న మీనా, రాధలిద్దరూ అప్పుడు స్పృహలోకొచ్చారు.
"ఇడ్లీ ఏంటీ?'' అంది రాధ పిచ్చ్ చూపులు చూస్తూ.
"అదో పెద్ద కథలే'' దీర్ఘంగా నిట్టూర్చింది హానిత.
హనితని వెంబడించారు మీనా, రాధ.
అప్పటివరకూ మంచం మీద నుంచి లేవకుండా జ్వరంతో మూలుగుతూ పడుకున్న హానిత హడావిడిగా పరుగెత్తుకుంటూ రావటం చూసిన తల్లిదండ్రులకి నోటమాట రాలేదు. హానిత అన్నయ్యలిద్దరూ నిశ్చేష్టులయి చూడసాగారు.
ఆయాస పడుతూ వెళ్ళి తండ్రి ముందు నిలబడింది హానిత.
"డాడీ! వైభవ్ అంటే ఇడ్లీ తెలుసా? ఛీ ...'' అంది.
కూతురు మాటలకు ఖంగుతిన్నాడు సత్యం.
ఆ వెంటనే తల్లి శోకాలు తీయడం మొదలుపెట్టింది.
"దీనికి గాలి సోకిందిరా దేవుడో! నేనేం చేయనురా దేవుడో''
"వైభవ్ అంటే ఇడ్లీనా? అదేంటి?'' అన్నాడు హేమంత్.
"అవునన్నయ్యా! ఛీ!'' అంది హానిత.
తర్వాత తల్లివైపుకి తిరిగి మొహం అసహ్యంగా పెట్టి చెప్పింది.
"ఛీ! ఇల్లంతా చీదకు. నాకు చిరాకేస్తుంది''
ఠక్కున గిరిజ ఏడుపాపేసింది. మొహం మాడ్చుకుని కూర్చుంది.
"జ్వరం కదా! పైత్యం చేసినట్టుంది'' అన్నాడు తండ్రి.
"ఛీ! కాదు డాడీ! నిజంగానే వైభవ్ అంటే ఇడ్లీ''చెప్పింది హానిత.
"యూ మీన్ ఇడ్లీ'' అన్నాడు హరీష్.
"ఎస్. ఇడ్లీ ఛీ!'' చెప్పింది హానిత.
"అంటే మనం సాంబార్ కొబ్బరి పచ్చడితో తింటామే ఆ ఇడ్లీయేనా?'' అమాయకన్న్గా అడిగాడు హరీష్.
"అవునన్నయ్యా! ఛీ!''
"ఇంకొకసారి ఛీ అన్నావంటే చెప్పు తీసుక్కొడతాను జాగ్రత్త! ఇందాకట్నుంచీ చూస్తున్నాను. సంగతేంటో సరిగ్గా చెప్పకుండా ఛీ ఛీ ఏమిటి?'' సడెన్ గా జుట్టు పీక్కుంటూ కోపంగా అరిచింది మీనా.
"నేను చెప్పింది నిజం మీనా''అంది తర్వాత తండ్రివైపు తిరిగి చెప్పింది హానిత.
"డాడీ! చిన్నప్పుడు ... మన ఊళ్ళో ... రామారావ్ మామయ్యా ఉండేవాడు గుర్తుందా? వాళ్ళబ్బాయి బాబీనే ఇందాక వచ్చిన వైభవ్. చిన్నప్పుడు నేను బాబీతో ఆడుకునే దానిని. గుర్తొచ్చిందా? మేమిద్దరం పోట్లాడుకుంటే, అప్పుడు మీకు రామారావ్ మామయ్యతో దెబ్బలాట అయింది. అర్థమయిందా? హమ్మయ్య!'' అంది చివర్లో "ఛీ!'' అనబోయి మళ్ళీ మీనా వైపు చూసి నాలుక కరుచుకుని ఆపుకుంది.
"ఏమిటి? ఇందాక వచ్చిన అబ్బాయి బాబిగాడా? అయ్యో! ముందు చెప్పలేదే? నేనతనితో మాట్లాడేవాడిని కదా?'' సంబరంగా అన్నాడు సత్యం.
"ఏంటీ డాడీ! వాళ్ళ మూలంగానే కదా మనం ఊరొదిలి వచ్చేశాం'' అంది కోపంగా హానిత.
"హు! ఎప్పుడో జరిగిన సంగతుల్ని మర్చిపోవటమే మంచిదమ్మా! తవ్వుకుంటూపొతే పగలు పెరుగుతాయే గాని తగ్గవు'' చెప్పాడు సత్యం.
"అబ్బ! నువ్వలా సర్వం కోల్పోయిన సన్యాసిలా మాట్లాడకు డాడీ! నాకు తిక్కరేగుతుంది. చెప్పేది వినిపించుకోవేం. నాకు జ్వరం కూడా విభవే తెప్పించాడు తెలుసా?'' బుంగమూతి పెట్టి చెప్పింది హానిత.
"జ్వరం ఒకళ్ళు తెప్పిస్తే రాదమ్మా''
"డాడీ!'' తిక్కతిక్కగా అరిచింది.
"జ్వరం వైభవ్ తెప్పించాడంటే నా ఉద్దేశ్యం పాముని నా చెయిర్ కి కట్టేసింది వైభవే అని'' చెప్పింది.
"అవునా?'' అన్నాడు సత్యం.
"ఎంత ధైర్యం వాడికి? వాడి అంతు చూస్తాను'' విసురుగా లేచాడు హేమంత్.
"పోన్లేరా.అయిపోయిందేదో అయిపొయింది కూర్చో'' హేమంత్ ని వారించాడు హరీష్.
"అవును హనీ! నువ్వూ అతన్ని ఏదో చేసి కాల్చుకుతిని ఉంటావు. లేకపోతే అతను మాత్రం ఎందుకలా చేస్తాడు?'' అనుమానంగా చూస్తూ అంది గిరిజ.
"పైగా ఆ పిల్లవాడు చిన్నప్పుడు కూడా నిదానంగానే ఉండేవాడు'' అన్నాడు సత్యం.
అప్పుడు గుర్తొచ్చింది గిరిజకి. మాటల్లో పడి తను భర్తని సపోర్ట్ చేస్తున్నానని. "వామ్మో! ఎంతపని జరిగిపోయింది. ఇంకా నయం. మరి కాపేపయితే నెత్తినెక్కేవారీయన'' మనసులోనే అనుకుంది.
వెంటనే కూతురు వైపు చేరింది. "అయినా ఎంత కాల్చుకుతింటే మాత్రం మరీ పిల్లనింతగా భయపెడతాడా?'' అంది గిరిజ.
"అవునవును'' బార్యని సపోర్ట్ చేశాడు సత్యం.
భర్తకేసి కొరకొరా చూసింది గిరిజ.
ఇంతలో హానితకి తనకింకా జ్వరం తగ్గలేదని గుర్తొచ్చింది. ఆటోమేటిక్ గా మూలిగేసింది. అలా మూలుగుతూనే వెళ్ళే మంచమెక్కి ముసుగుతన్నింది.
మీనా, రాధలకేమీ అర్థం కాలేదు. ఒకరిమొహం ఒకళ్ళు చూసుకున్నారు.