మై డియర్ రోమియో - 21

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 21

 

స్వప్న కంఠంనేని

 

కొద్ది క్షణాల దాకా చిన్నారికి ఏం జరిగిందో అర్థం కాక అలా కట్టెలా బిగదీసుకుని నిలబడిపోయింది. నెట్టురోడుతున్న అతడి ఛాతీ గుర్తుకొచ్చి తనతన్ని అంత గట్టిగా కొరకకుండా ఉండాల్సిందనిపించింది.
బాబిగాడు మలుపులో కనుమరుగవగానే తను కూడా ఇంటివేపు పరుగుతీసింది. వెనక వాకిలి తలుపు తెరుచుకుని ఏమీ ఎరగనట్టు వెళ్ళి తన మంచం మీద పడుకుంది. కళ్ళు మూసుకుని తర్వాత జరగబోయే పరిణామం కోసం ఎదురు చూడసాగింది.
కొద్ది సేపటి తర్వాత బయటనుండి బాబిగాడి తల్లి స్వరం వినిపించింది.
"ఒసేయ్ చిన్నారీ! బయటికి రావే! నువ్వు పిల్లవా రాక్షసివా? అమ్మో అమ్మో పిల్లవాడిని ఎంతలా కొరకావే ...''
ఈ గొడవకు చినారి తల్లి గిరిజ లేచి వెళ్ళి తలుపుతీసింది.
"ఏమిటి వదినా ఏం జరిగింది?''
"ఏం జరిగిందా? ముందు మీ చిన్నారిని బయటికి రమ్మను చెబుతాను''
"ఎందుకు ఏమైంది వదినా? పిల్ల నిద్రపోతోంది''
"నిద్రపోతోందా? మా వాడినిలా చచ్చేట్టుగా కొరికింది కాక నిద్రపోయినట్టు నాటకాలేస్తోందా? అమ్మ జాణపిల్ల ...'' అంటూ ఆమె బుగ్గన వేలేసుకుంది. ఆ వెంటనే కొడుకును ఇవతలికి లాగి బాబిగాడి గుండెలను గిరిజకు చూపింది.
ఆ గాట్లను చూడగానే గిరిజ కూడా అవాక్కయింది. కూతురు తనకు టోకరా ఇచ్చి చేసిన నిర్వాకం అర్థమయింది. అయినా కన్నతల్లిగా వెనకేసుకురావటానికి, సుజాతకు సర్ది చెప్పటానికి ప్రయత్నించింది. కానీ అసలే కోపంతో వున్న సుజాత ఆమె మాటలు వినిపించుకునే స్థితిలో లేదు. నానా మాటలు అనసాగింది.
"ఏం పెంపకాలమ్మా, పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవద్దూ! అసలు ఈ చిన్నారి చేసినంత అల్లరి ఈ భూ ప్రపంచంలో ఇంకెవరూ చేయరు. అయినా ఆడపిల్లల్ని పెంచేది ఇలాగేనా ...''
ఆమెతో పోట్లాడడానికి చిన్నారి లేచి ఇవతలికి రాబోయింది.
"ఏమిటీ? ఏమిటి మా అమ్మనేదో అంటున్నావు?'' గుమ్మంలోంచే అరిచింది.
గుమ్మంలో చిన్నారిని చూడగానే సుజాత కోపం తారాస్థాయికి చేరింది. ఒక్క ఉదుటున గుమ్మంలో వున్న పిల్ల మీదకు దూకి వీపు మీద ఫెడీ ఫెడీ కొట్టసాగింది.
అప్పుడే ఆఫీసు నుంచి వస్తున్నాడు చిన్నారి తండ్రి సత్యం. కూతురంటే ప్రాణం ఆయనకు. అలాంటి కూరుటును ఆమె ఎడాపెడా బాదుతుంటే చూసి త్వరగా ముందుకువచ్చి చిన్నారిని గభాల్న వెనక్కు లాగి "ఏమిటమ్మా పసిపిల్లనట్టా కొడతావెందుకు? నీకు చేతులెట్లా వస్తున్నాయి?'' అంటూ ఆమెను అవతలికి ఒక్క నెట్టు నెట్టాడు.
ఆ తోపుకి భారీ శరీరమేమో సుజాత బాలెన్స్ నాపుకోలేక వెనక్కి వెల్లకిలా పడింది.
అప్పుడే పొలం నుంచి వచ్చి ఈ గొడవ గురించి విన్న బాబిగాడి తండ్రి రామారావు హుటాహుటిన అక్కడకు రాసాగాడు. దూరాన్నుంచి సత్యం తన భార్యను తోయటమూ, ఆమె వెనక్కు పడిపోవటమూ చూడగానే ఆయనలో కోపం కట్టలు తెంచుకుంది.
పరుగెత్తుకుంటూ వచ్చి సత్యం మీద కలబడ్డాడు. చిలికి చిలికి గాలివానలా కొద్దిసేపట్లోనే అక్కడొక రణరంగం మొదలైంది. పుట్టి పెరిగిన ఊరు కావటంతో రామారావుకీ సత్యానికీ ఊళ్ళో బంధుజనం బాగానే ఉన్నారు. ఇటువేపు వాళ్ళూ, అటువేపు వాళ్ళూ పోగై అది కాస్తా దొమ్మిలోకి మారి కర్రలు పైకి లేచాయి. కేకలు, అరుపులు, కర్రల చప్పుళ్ళు, తలలు పగలటాలూ, ఆడవాళ్ళ హాహాకారాలతో క్షణాల్లోనే అక్కడొక యుద్ధ వాతావరణం నెలకొంది.
ఆ దృశ్యాన్నంతా మొదట్లో వినోదంగా పరికించడం ప్రారంభించిన చిన్నారి కూడా కాసేపటికి బయటికి రాకుండా బిక్కచచ్చిపోయింది.
తన తండ్రి తల పగిలి నేలమీద పడడం చూడగానే కెవ్వున అరిచి బయటికి రాబోయింది. అన్నలిద్దరూ బయటికి రాకుండా గట్టిగా పట్టుకున్నారు.
అరగంట తర్వాత అక్కడి దృశ్యం మారిపోయింది.
స్మశాన నిశ్శబ్దం.
నేల మీదంతా నెత్తురు మరకలు.
దిగాలుగా ఆడవాళ్ళ మొహాలు.
అక్కడొకరు, ఇక్కడొకరుగా మనుషులు పడిపోయి ఉన్నారు.
తెల్లటి అంబులెన్స్ లోకి పడిపోయిన వాళ్ళ శరీరాలను ఎక్కిస్తున్నారు.
ఆ మధ్య వంటరిగా నిలబడి ఈ గొడవకంతకూ మూల కారణమయిన చిన్నారి చుట్టూ జరుగుతున్నా దాన్ని దిగాలుగా చూడసాగింది ...