మై డియర్ రోమియో - 19

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 19

 

స్వప్న కంఠంనేని

 

మిట్ట మధ్యాహ్నం.
ఎండా నిప్పులు చెరుగుతోంది.
మంచం మీద పడుకున్న ఆ పిల్లకు ఎంతకీ నిద్రపట్టడం లేదు. అటు కదులుతోంది. ఇటు కదులుతోంది.
"మంచం మీద నుంచి కిందికి దిగావంటే చంపేస్తాను''
అంతకు మునుపు తల్లి అన్న మాటలు గుర్తుకు వచ్చి ఉలిక్కిపడింది. మళ్ళీ అంతలోకే "ఆ, అమ్మ ఎప్పుడూ అట్లాగే అంటుంది'' అనుకుంటూ పెదిమల్ని విరిచింది.
కొద్దిసేపున్నాక మెల్లగా లేచి మంచం దిగింది.
అవతల మంచం మీద అన్నలిద్దరూ గాఢంగా నిద్రపోతున్నారు. తల్లి అంటే పరమ భయం వాళ్ళకు.
అడుగులో అడుగు వేసుకుంటూ పిల్ల ముందు గదిలోకి వచ్చింది. తలుపు తీయటానికి ప్రయత్నించిందిగాని గొళ్ళెం అందలేదు.
పళ్ళు బిగపట్టి ఆ దగ్గరలోనే వున్న స్టూల్ ని అతి కష్టం మీద శబ్దం చేయకుండా తలుపు వరకూ ఈడ్చుకొచ్చింది.
దాని మీద ఎక్కి నిలబడింది.
"బోల్టుని తలుపుపైన ఎందుకు పెడతారో తెలియదు. కింద వేపున ఉంచితే నాకూ అందుతుంది కదా'' గొణుక్కుంటూ బోల్టుని తీసింది.
స్టూల్ దిగి తల పైకెత్తబోతుండేసరికి స్టూల్ పక్కన చీర కుచ్చెళ్లు కనిపించాయి.
కుచ్చెళ్లు వెంటే కళ్ళను పైకి కదల్చింది. స్త్రీ తాలూకు నడుం, భుజాలు, తల .... భయంకరంగా అమ్మ!
"ఎక్కడికే, ఎండలో బయల్దేరావ్?'' ఖంగుమందామె గొంతు.
బిక్కచచ్చిపోయింది పిల్ల. గభాల్న బయటికి పరుగెత్తబోయింది.
ఆ సంగతి తనకు ముందే తెలుసన్నట్టుగా తల్లి ముందుకు దూకి ఒక్క ఉదుటున కూతుర్ని పట్టుకుని వెనక్కి లాగి తలుపు బోల్ట్ వేసింది.
"ఇప్పటి వరకో ఆడిన ఆటలు చాల్లేదా? పొద్దస్తమానం ఆటలాడ్డానికి నేకు విసుగనిపించటం లేదటే? ఏం పడుకోమనగానే అన్నయ్యలిద్దరూ పడుకోలేదూ? నీకేనా ఒళ్ళు పొగరు? చంపేస్తాను జాగ్రత్త! స్కూళ్ళకు సెలవలిచినప్పటి నుంచీ మీతో చచ్చిపోతున్నాను. వాళ్ళిద్దరూ నయంగాని నువ్వే మరీ! ఎందుకులే, ఆడపిల్ల అని కొట్టకుండా ఊరుకుంటుంటే పిచ్చి గారాలు పోతున్నావు. ఎండలో బయటికి అడుగుపెట్టావంటే ఒళ్ళు చీరేస్తాను. ఏమనుకుంటున్నావో'' అని ఎప్పటి దండకాన్ని చదువుతూ కూతురును మంచం మీద కూలేసింది!
"పడుకోవే'' అని తల్లి ఒక్క అరుపు అరిచేసరికి గభాల్న పడుకుని కళ్ళు రెంటినీ గట్టిగా మూసేసుకుంది.
దాదాపు ఓ అరగంట సేపు అలా కళ్ళు మూసుకుంది. కాని నిద్ర ఎంతకూ పట్టలేదు. అంతసేపు తనలా కదలకుండా మెదలకుండా పడుకోవాల్సి రావడం ఆ పిల్లకు నచ్చలేదు.
మెల్లగా కళ్ళు తెరిచింది.
పక్కనే కాపలాకి పడుకున్న తల్లి అప్పటికే గాఢ నిద్రలోకి జారుకుంది. ఇదే సందని పక్క దిగి వెనక వాకిట వేపు పరుగెత్తింది. అక్కడ తలుపు పక్కనే గోడనానుకుని నీళ్ళ హౌస్ ఒకటి ఉంది. గబగబా దాని మీదికెక్కి తలుపు గొళ్ళెం తీసి కిందికి గెంతి తలుపు తెరుచుకుని ఒక్క ఊరుకున బయటికి పరిగెత్తింది.
బయటపడ్డ ఆ పిల్లకు విశాలమైన ఆకాశాన్నీ, ఆరుబయలునూ, చెట్లనూ చూడగానే చెప్పరాని ఆనందం కలిగింది. తూనీగలా రెక్కలు చాపి పైకి ఎగరాలనిపించింది.
ఈ ప్రపంచానికి తానే మహారాణినన్నంత ధీమాగా ఠీవీగా నడుం మీద చేతులు పెట్టుకుని ఒకసారి అటూ ఇటూ కలియచూసింది.
ఆ పిల్లను ఇంట్లో అంతా ముద్దుగా 'చిన్నారి' అని పిలుస్తారు.
చింపిరి జుట్టు, తెల్లటి తెలుపు, గుండ్రటి మొహం, అమాయకమైన పెద్ద పెద్ద కళ్ళు. తెల్లటి పరికిణీ, అంతే తెలుపు జాకెట్, వాటి మీద నల్లనల్లటి మట్టిమరకలతో ఎంత ముద్దుగా, అందంగా వుందో అంత వైల్డ్ గా, పులి పిల్లలా కనిపిస్తోంది. ఈ లోకానికి తానే సార్వభౌమురాలినాన్నత ధీమా ఉందా మోహంలో.
అది పల్లెటూరు కాదు. అలాగని పట్టణమూ కాదు. ఆ ఊళ్ళో గవర్నమెంట్ హాస్పిటల్ వుంది. ఒక స్కూల్ ఉంది. బాంక్ ఉంది. పచ్చికబయళ్ళున్నాయి.
నెమ్మదిగా రోడ్డు మీదికి వచ్చి రోడ్డుకి ఇరువేపులా వున్న మామిడిచెట్ల వైపు చూసింది. ఉన్నట్లుంది సడన్ గా ఆ పిల్లలో ఉత్సాహం ఉరకలు వేసింది. 'కూ' అని పెద్దగా అరుచుకుంటూ తూనీగలా పరుగెత్తసాగింది.
పరుగెత్తుతూ వెళ్ళి ఊరి మధ్యలో ఉన్న ఒక ఇంటి ముందుకు రాగానే ఆగింది. ఆ ఇల్లు ఒక రాజమహల్ లా వుంది. ఇంటి ముందు రకరకాల పూలమొక్కలు, కూరగాయల పాదులు పచ్చగా కళకళలాడుతున్నాయి.
"ఈ బాబిగాడేం చేస్తున్నాడో'' మెట్లెక్కుతూ తనలో తాను అనుకుంది.
వరండాలో ఎదమవేపుకు నడిచి అక్కడున్న కిటికీలోంచి లోపలికి తొంగిచూసింది.
లోపల సోఫాలో పడుకుని అటూ ఇటూ దొర్లుతున్నాడొక కుర్రవాడు. అంతకుముందు ఆమె గుర్తు చేసుకున్న బాబిగాడు అతనే!
"ష్ ష్'' నెమ్మదిగా పిలిచింది.
నోరు తెరిచి కప్పువేపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్న పిల్లవాడికి ఆ పిలుపు వినిపించలేదు.
తాను ఏరుకుని తెచ్చుకున్న గులకరాళ్ళలో ఒక దానిని తీసి గురిచూసి పిల్లవాడి మీదకు విసిరింది చిన్నారి.
గులకరాయి సూటిగా వెళ్ళి తెరిచి వున్న పిల్లవాడి నోట్లో పడేసరికి ఉలిక్కిపడుతూ గాభరాగా లేచి కూర్చున్నాడు.
రాయి ఎక్కడి నుంచి వచ్చి పడిందో అర్థం కాలేదతనికి.
"రీ ఇడ్లీ, ఆడుకుందాం రారా!'' చిన్నగా కేకేసింది చిన్నారి.
కిటికీ వేపు చూసిన కుర్రవాడికి చిన్నారిని చూడగానే ఎంత ఆనందం కలిగిందో, ఆమె మాటలకు అంతక ఒపమూ వచ్చింది.
"నన్నలా ఇడ్లీ అని పిలిస్తే నేను బయటికి రాను. నీతో అసలు ఆటలే ఆడను తెలుసా?'' అన్నాడు.
"సరే పిలవన్లే ఆడుకుందాం పదరా'' గారంగా పిలిచింది.
"అమ్మో మా అమ్మ చంపేస్తుంది. ఎండలో బయటికి వెళ్లొద్దని ఇందాకే తిట్టింది.''
"అందుకే నిన్ను ఇడ్లీ అనేది. అమ్మలలాగే చెబ్తారు. మనమవన్నీ పట్టించుకో కూడదు. నువ్విట్టా భయపడుతుంటే నిన్ను ఇడ్లీ అని పిలవాల్సి వస్తుంది'' మూతిని వంకరగా తిప్పుతూ అంది.
"సరే వస్తానుండు'' అని బాబిగాడు తలుపు తీసుకుని బయటికి వచ్చాడు.
ఇంటి బయటికి రాగానే బాబిగాడి చేతిని పట్టుకుని చిన్నారి అతడిని దాదాపు లాక్కెళుతున్నట్టుగా ముందుకు పరుగు తీసింది.
ఊరి చివరి మామిడి తోట దాకా రాగానే అక్కడే ఆగిపోయి ఇద్దరూ అలుపు తీరేదాకా రొప్పారు.
ఎండ దంచేస్తోంది. గాలి ఆడడం లేదు. ఆకులు కదలడం లేదు. ఉక్క ఉక్కగా వుంది.
ఇద్దరూ ఒక చెట్టు పైకి పాకి కిందగా దగ్గర దగ్గరగా ఉన్న చెరో కొమ్మ మీద కూర్చున్నారు.
కబుర్లు చెప్పుకోసాగారు.