మై డియర్ రోమియో - 16

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 16

 

స్వప్న కంఠంనేని

 

"వైభవ్ చూశావా నాలుగు రోజుల్నుంచి కాలేజీకి రావట్లేదు. మన దెబ్బకి అదిరిపోయుంటాడు. ఈ హనిటంటే ఏంటో ఇప్పటికి అర్థమై ఉంటుంది. కాలేజీ మానేసి కాకుల్ని తోలుకోవటానికి వాళ్ళ ఊరెళ్ళిపోయి ఉంటాడు'' గర్వంగా అంది హనిత నడుస్తూ.
మీనా కూడా సంబరంగా "నిజమే! భయపడ్డట్టే ఉన్నాడు'' అంది. అంతలో లాన్ లో కూర్చుని చదువుకుంటున్న వ్యక్తిని చూసేసరికి మీనా ఉలిక్కిపడింది.
"ఏయ్ హనీ అటు చూడు. వైభవ్!''
వైభవ్ ని చూసి అంది హనిత "గురుడికి మళ్ళీ స్ట్రాంగ్ డోస్ కావాలేమో!'' ఇద్దరూ నవ్వుకుంటూ క్లాస్ లోకి నడిచారు.
క్లాస్ లోపలికి ప్రవేశిస్తున్న హనితను చూడగానే అంతా "వావ్!'' అన్నట్లు మెచ్చుకోలుగా చూడసాగారు.
ఆ పూట ఆమె చీర కట్టుకుంది. చీర కట్టుకుని ఆమె కాలేజీకి రావటం అదే మొదటిసారి.
సన్నగా, పొడుగ్గా ఉన్న దేహం చుట్టూ అందంగా మెలికలు తిరిగిన చీరలో ఎర్రటి మొహం, బాయ్ కట్ క్రాఫ్, విప్పారిన విశాలనేత్రాలు. చురుకుగా జవజవ లాడుతూ ఆమె క్లాస్ లోకి నడుస్తోంది ఏదో అపురూప కళాఖండాన్ని చూస్తున్నట్లుగా ఎవరూ కళ్ళు తిప్పుకోలేక పోయారు. పాండ్స్ టాల్కం పౌడర్ యాడ్ యువతిలా ముద్దుగుమ్మలా ఉంది. జుట్టు ఇంకాస్త పొడుగు ఉండి బాబ్డ్ హెయిర్ అయితే ప్రియాంకా గాంధీలా ఉంటుంది చిరుతపులిలా.
ఆమె మోహంలో ఎంత అమాయకత్వం ఉందో అంత చిలిపితనమూ అంత పొగరుబోతు తనమూ కూడా కనిపిస్తుంటాయి. ఆమె ఒక మిక్స్ డ్ రాగాల మేలు కలయిక. షాంపేన్ చిలుక, కాక్ టెయిల్ కొలికి ...
తన కొత్తరూపం మిగతా వాళ్ళలో ఎలాంటి రియాక్షన్స్ ని కలగాజేస్తోందో హనితకి తెలుసు. స్త్రీ సహజసిద్ధమైన ఇన్ ట్యూజన్ ఆమెకా సంగతిని మాటిమాటికీ తట్టి చెబుతోంది. ఎవరినీ లెక్క చేయనట్లుగా వెళ్ళి తన సీట్లో కూర్చుంది హనిత.
ఆమెకు లోలోపల ఒక కోరిక పీకసాగింది. తన ఈ రూపానికి వైభవ్ ఎలా రియాక్టు అవుతున్నాడో చూడాలని. కాని ఆమెకా అవకాశం కలగలేదు. ఎందుకంటే ఆమెకు వెనక వరసలో కొంచెం పక్కగా కూర్చుని ఉన్నాడు వైభవ్!
అక్కడి నుంచి వైభవ్ కి ఆమె వెనక భాగం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె కూర్చున్న కుర్చీ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కుర్చీకి సైడ్ లో కొంచెం కింది భాగాన తను ప్లాస్టిక్ టేప్ తోనూ, డ్రాయింగ్ పిన్నులతోనూ కదలకుండా అంటించి కట్టిన పాము కనిపిస్తోంది.
పొడుగ్గా ఉన్న నీళ్ళపాము అది. బతికి ఉన్న పాము. తలనుంచి నడుందాకా కదలకుండా కుర్చీకి ప్లాస్టిక్ కొనలను అంటించి పాముకు రెండు వేపులా ఆ టేపు ముక్కలకు డ్రాయింగ్ పిన్నులను దిగగొట్టాడు.
తలనుంచి నడుం దాకా ఏమాత్రం కదలలేకపోతున్నా పాము తోక భాగం మాత్రం స్వేచ్చగా మెలికలు తిరుగుతూ కదులుతోంది. అక్కడి నుంచి కదలాలనే తాపత్రయంలో ఉండి ఉండి అది తన తోకను బలంగా కదుపుతోంది. ఆ ప్రయత్నంలో తోక కుర్చీ పైభాగాన టపటపా చరవటమో లేక పట్టు చిక్కించుకోవటానికి అటూ ఇటూ తాకటమో జరుగుతోంది.
అలాంటి సమయంలో ఆ కుర్చీలో కూర్చుంది హనిత. క్లాస్ మొదలైంది. అందరూ సీరియస్ గా లెక్చరర్ చెప్పేది విన్తునారు. సరిగ్గా ఆ సమయాన జరిగింది.
పాము తోక నిటారుగా లేచి ఆచ్చాదన లేకుండా ఉన్న హనిత నడుం భాగాన పడింది. తన నడుం మీద మెత్తగా గుండ్రంగా కదిలిన స్పర్శకు హనిత అసహనంగా కదిలి చేత్తో ఆ భాగాన తడుముకోబోయింది. తడుముకాబోయే సమయానికి తోక కిందికి జారిపోవడంతో ఆమెకు అదేమిటో తెలియలేదు.
కొంచెం సేపున్నాక మళ్ళీ అలాగే జరిగింది. ఈసారి కూడా ఆమె తడుముకోబోయే సరికి తోక కిందికి జారిపోయింది.
ఏమిటా అని ఆమె ఆ వేపుకు చూసింది గాని పాము కుర్చీ పక్క భాగాన కనిపించకుండా ఉండటంతో ఏమిటో అర్థం కాలేదు. సడెన్ గా ఆమెకు వైభవ్ మీద అనుమానం వచ్చింది. వెనుక నుంచి అతను దేనితోనో తన నడుమును తడుముతున్నాడనిపించి కోపంగా అతనివేపు చూసింది.
టేబుల్ మీద మోచేతిన్నానించి, అరచేతిలో మొహాన్నానుంచి అందంగా ఆమెవేపే చూస్తున్న వైభవ్ ఆమె తనవేపు చూసేసరికి మెల్లకళ్ళు పెట్టి నాలుక బయటపెట్టి 'వెవ్వెవ్వే' అంటున్నట్టు నిశ్శబ్దంగా వెక్కిరించాడు.
కోపంతో ఉడుకు మోతుతనంతో హనిత ముక్కుపుటాలదిరాయి. ఆ సమయాన పాము మళ్ళీ తన ప్రతాపాన్ని చూపించిది. ఈసారి అది తోకతో హనిత నడుం మీద చరిచింది. చివ్వున హనిత వైభవ్ వేపు చూసింది.
అతను చెక్కు చెదరని అదే చిరునవ్వుతో వేలును కిందివేపుకు చూడమన్నట్టుగా రెండుసార్లు తాతించి చూపాడు. బుసలు కొడుతూ హనిత కుర్చీవేపుకు చూసింది. ఈసారి ఆమెకు పాము కనిపించింది. కెవ్వున అరుస్తూ ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచింది.
'ఆ ... ఆ ... ఆవ్ ...'
ఆమె ఆర్తనాదం ఆఖరిభాగం అలలా కెరటంలా వణికిపోయింది. ఆ అరుపు, క్లాసురూముని దాటుకుని కాలేజీ ఆవరణ అంతటా ప్రతిధ్వనించింది.
ఒక్క క్షణం మాత్రమే ... ఆ అరుపు గాలిలో ఉండగానే ఆమె విరుచుకుని వెనక్కు పడిపోయింది.
"ఏమిటి, ఏమిటి ... ఏం జరిగింది?'' ఎవరికి వాళ్ళు పరుగులు తీసుకుంటూ వస్తున్నారు. హనిత చుట్టూ గుమికూడారు అంతా. మీనా చప్పున హనిత పక్కనే కూర్చుని స్నేహితురాలి తలను ఒళ్ళోకి తీసుకుంది.
అప్పుడు చూసిందామె హనిత కూర్చున్న కుర్చీకి దిగగొట్టబడి ఉన్న పాముని. ఆ తర్వాత ఆమె తల పైకెత్తి అందరితోపాటు తొంటి చూస్తున్న వైభవ్ కళ్ళలోకి చూసింది ....