TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
మై డియర్ రోమియో - 14
స్వప్న కంఠంనేని
హనిత నిద్ర లేచేసరికి ఎదురుగా మీనా కూర్చుని వుంది.
ఆమెను చూస్తూనే హనిత కోపం నటిస్తూ ముఖాన్ని పక్కకు తిప్పుకోబోయింది.
"సారీ యార్'' హనిత గెడ్డం పట్టుకుని బతిమలాడుతూ అంది మీనా. అమాయకంగా ఉన్న మీనా మొహాన్ని చూడగానే హనితకు నవ్వొచ్చి నవ్వింది. మీనా కూడా గట్టిగా నవ్వింది.
"అంట గట్టిగా నవ్వితే! భూకంపం వచ్చిందనుకుంటారు జనం'' టీజ్ చేసింది హనిత.
ఆమె మాటల్ని పట్టించుకోకుండా "తొందరగా రెడీ అవ్వు హనీ! కాలేజీకి వెళ్ళాలిగా'' అంది మీనా.
మీనాతో కబుర్లు చెపుతూ నెమ్మదిగా బ్రష్ చేసుకుని, స్నానం చేసింది హనిత. టిఫిన్ తిని ఇద్దరూ కాలేజీకి బయల్దేరారు. వాళ్లకు కాలేజ్ గెట్ దగ్గరే ఎదురొచ్చాడు రాజ. చెట్టాపట్టాలేసుకుని నడుస్తూ వస్తున్న హనిత, మీనాలను చూసి ఖంగుతిన్నాడతను.
"మీనాతో మాట్లాడవద్దనుకున్నాం కదా! ఇప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావ్'' నిలదీశాడు హనితని.
"నేనెప్పుడు అన్నాను?'' ఆశ్చర్యాన్ని నటించింది హనిత.
"అన్లేదా?'' అమాయకంగా అన్నాడు రాజా.
"లేదే!''
"ఆర్ యు ష్యూర్?''
"ఎస్ వెరీ ష్యూర్''
"అసలీ మధ్య నాకు మతిమరుపు ఎక్కువైందనుకుంటా!'' ఇంకా ఏం తోచక బుర్రగోక్కుంటూ అన్నాడు రాజా.
"అవును. రెండు ఎలక్ట్రిక్ షాకులు తగిల్తే తిన్నగా దార్లోకొస్తావ్'' అంది మీనా.
"అదే చెయ్యాలనుకుంటా!'' నవ్వాపుకుంటూ అంది హనిత. ముగ్గురూ మాట్లాడుకుంటూ కాలేజ్ లోపలికి నడిచారు.
దారిలో తమ ఎదురుగా వస్తున్న వ్యక్తిని గమనించిన హనిత మనసులో ఒక ఆలోచన తట్టింది. అతను ఫైనలియర్ స్టూడెంట్. కాలేజ్ గూండాగా పేరు పడ్డాడు. పేరు విక్రమ్.
వెంటనే తన ప్లాన్ ని ఆమె రాజా, మీనాలకి చెప్పింది. ఆమె చెప్పిందే తడవు. మీనా గబగబా స్టేషనరీకి వెళ్ళి పింక్ కలర్ పేపర్స్ ఉన్న ఒక లెటర్ పాడ్ కొని కవర్లు కొనుక్కొచ్చింది.
లాన్ కి ఆనుకుని ఉన్న పూలమోక్కల్లో నుంచి ఎవరు చూడకుండా ఎరుపు రంగు గులాబీ పువ్వుని కోసుకొచ్చాడు రాజా.
తన హ్యాండ్ బ్యాగ్ లో నుంచి పరఫ్యూమ్ బాటిల్ ని బయటికి తీసింది హనిత. తర్వాత ముగ్గురూ వెళ్ళి ఖాళీగా వున్న కాలేజ్ ఆడిటోరియంలో కూర్చున్నారు.
హనిత డిక్టేట్ చేస్తుంటే రాజా లెటర్ ప్యాడ్ మీద రాయటం మొదలెట్టాడు.
డియర్ హరిణీ! ఇ లవ్ యూ, నీక్కూడా నేనంటే ఇష్టమైతే రేపు కాలేజ్ కి రెడ్ కలర్ శారీ కట్టుకుని రా. విక్రమ్ గాడికి భయపడకు. నీకు నేనున్నాను.
విత్ లవ్
వైభవ్ (బిఎస్సీ సెకండియర్)
ఆ లెటర్ మీద పరఫ్యూంమ్ స్ప్రే చేసింది మీనా. పేపర్ మడిచి మధ్యలో గులాబీ పువ్వుని పెట్టి, ఆ మొత్తాన్ని కవర్ లో ఉంచి అంటించాడు రాజా. కవర్ మీద 'టు హరిణి, ఫ్రమ్ వైభవ్' అని రాశారు. కవర్ ని తీసుకుని ఫైనలియర్ బిఎస్సీ క్లాస్ రూమ్ లోకి రాకెట్ లా విసిరి వచ్చింది హనిత.
తర్వాత ముగ్గురూ ఏమీ ఎరగనట్టుగా క్లాస్ లోకెళ్ళి కూర్చున్నారు. ఈ సంగతేమీ తెలియని వైభవ్ హనిత సీట్ దగ్గరకొచ్చి "సారీ హనితా!'' అనేసి తన సీట్ దగ్గరికి వెళ్ళిపోయాడు.హనితని ఏడిపించాడన్న మాటే కానీ ఇంటికి వెళ్ళాక వైభవ్ ఎంతో బాధపడ్డాడు. ఒక ఆడపిల్లని శృతిమించి టీజ్ చేశానేమోనాన్న అపరాధ భావన అతని మనస్సుని నమిలేసింది రాత్రంతా.
అతని అపాలజీకి హనిత "హు!'' అంటూ తల తిప్పుకుంది. లంచ్ అవర్ లో విక్రమ్ వీళ్ళ క్లాస్ రూంలోకి దుమారంగా దూసుకొచ్చాడు.
"ఈ క్లాస్ లో వైభవ్ అంటే ఎవడ్రా?'' క్లాస్ డోర్ దగ్గర నిలబడి అడిగాడు.
విక్రమ్ గొంతు వినగానే క్లాస్ లో వాళ్ళ గుండెలు గుభేలుమన్నాయి. అంతవరకూ చెప్పుకుంటున్న మాటలు మానేసి ఎక్కడి వాళ్ళక్కడ ఫ్రీజ్ అయిపోయినట్లు మౌనంగా నిలబడిపోయారు.
విక్రమ్ గురించి అంతగా తెలీని వైభవ్ "నేనే'' అంటూ ముందుకు వచ్చాడు.
ఒకసారి వైభవ్ వేపు పరిశీలనగా ఎగాదిగా చూశాడు విక్రమ్. "ఇట్రా'' చూపుడు వేలును ఆడిస్తూ అతడ్ని పిలిచాడు. వైభవ్ అమాయకంగా అతని దగ్గరకు నడిచాడు.
|